[శ్రీ సూరిబాబు కోమాకుల రచించిన ‘ఓ శ్రామికా.. నీకు వందనం’ అనే దీర్ఘ కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎండనకా వాననకా.. పగలనకా రేయనకా..
కొండలెక్కి బండ రాళ్లను పట్టి పిండి చేయు
నీ హస్త కమలములు మా రిక్త హస్తములు
చూచు వారలకు నీవు చూపరుడవు
ఓ శ్రామికా.. నీకు వందనములు
పగటి తొలకరి వెన్నంటి వేళ
పనికి పరిగెత్తమని పలకరించే వేళ
గుట్ట గుట్టల మీద రాళ్లను పగల గొట్టే వేళ
చిందించు నీ చెమట మా బ్రతుకు నిలవు
ఓ శ్రామికా.. నీకు వందనములు
పూరి గుడిసె లోన నీ కాపురమ్ము
ఆలుబిడ్డల నడుమ అలుసు దీరి
రోజు కూలీ నీకు సరిపోదు ఒకరోజు
పూట దొర్లిందంటే ఆశలే చిరుజల్లు
ఓ శ్రామికా.. నీకు వందనములు
పిలగాళ్ల చదువులకు ఆశలే లేవు..
ఒళ్లు సుఖము ల్లేక ఉంటాయి తిప్పలు
ధూళి, రాళ్ల పొగల్లో ఊపిరాడని వేళలో
నిన్నెవడు చూస్తాడు.. నీకెవడు దిక్కు
ఓ శ్రామికా.. నీకు వందనములు
కనీస వేతనం లేదు.. కరువు భత్యం లేదు
కనికరించే వారు కనుచూపు కనరాడు
కాలగర్భం లోన కలిసి పోయే నీవు
నీ ఉనికి నీ కెరుక.. నీవెవరికెరుక..
ఓ శ్రామికా.. నీకు వందనములు..
మా కోసం నీవు రాళ్లలో శ్రమిస్తావు..
నీ కోసం జీవితాన్ని మలిచే వారు లేరు.
నీ రక్త బిందువులు మాకు చేయు సందడులు
ఎవరు చూసేరు నీ కన్నీళ్ల వెనక గోస
ఓ.. శ్రామికా.. నీకు వందనములు
భానుడి భాస్వరం మండుతుంటే
ఉక్కిరి బిక్కిరి చేసే వేడి క్రింద సెగలు కక్కి
చేతులు బొబ్బలెక్కి గాయాలు తాకుతూ
శ్రమించడం నీకు ఆనవాయితీ..
ఓ శ్రామికా.. నీకు వందనములు
వేడి గాలులు నీకు వెచ్చగా తగులును
యంత్ర ఘోషల మధ్య వెను దిరిగి చూడవు
చల్ల గాలుల శీతలత్వం నీవెరుగవు..
సదుపాయాలు పొందలేని సాహసివి నీవు.
ఓ శ్రామికా.. నీకు వందనములు
విశ్రాంత మెరుగని విశ్వ జీవివి నీవు
ఆరోగ్య భద్రతకు అవకాశమే లేదు
అలసి సొలసిన నీకు ఉపశమనమే లేదు
నీ రాత తలరాత చూసే దిక్కెవరు
ఓ శ్రామికా.. నీకు వందనములు
భూగర్భ గనులను తొలిచి మలి చేస్తావు
బొగ్గు మసి తోటి నీకు ఆటలు పాటలు
గాలి కనుమరుగై కంటికి నిద్ర కరువై
ఆలు బిడ్డల నొదిలి ఆనంద పడతావు
ఓ.. శ్రామికా.. నీకు వందనములు
ఇటుక బట్టీ నీకు ఆలవాలము
మట్టి మట్టికి నీవు చుట్టానివై
కండలు కరుగగా నీవు బండలా బ్రతికేవు
అండ లేదు నీకు ఆలుగాలము
అనుకోని భవిత నీ జీవితం రీతి
ఓ.. శ్రామికా.. నీకు వందనములు
గోడ లిక్కి మిద్దెలెక్కి, సాహస పనుల సారథివి నీవు
వేసవి లేదు, శీతలం లేదు, వర్షం లేదు, వేడి లేదు
ఆరోగ్య సమస్యలకు అనువైన తీరే లేదు
శారీరక, ఆర్థిక, మానసిక కష్టాలు నీకు ఇష్టాలు
ఓ.. శ్రామికా.. నీకు వందనములు
స్థిరమైన ఆదాయం నీకు కరువు
రోజు కూలీ మాత్రమే నీకు నెరవు
పనిలేని రోజున నీకు పస్తులే బరువు
తెలవారితే అడ్డా మీదకు నీ పరుగు
ఓ.. శ్రామికా.. నీకు వందనములు.
ఇటుక ఇటుక నెట్టి మేడలే కట్టేవు
మట్టి వాసన నీకు మలయ మారుతం
మెట్టు మెట్టూ నెక్కి చక్కగా మలచేవు
పట్టుమని పరుగిడువానికి నీ ఊసు లేదేమీ
ఓ శ్రామికా.. నీకు వందనములు
పురములు, పట్టణములు, భవనములు భవంతులు
నీ చేతి చేతి చెమట చలువ చల్లగా చుట్టి
మందార మకరంద మాధుర్యమున తేలు మా లాంటి వాళ్లకు
దివ్యానుభూతులు అందించగా.. నిన్ను తలవని మా ఊహ
వ్యర్థము గాక.. మరేమిటి..
ఓ శ్రామికా.. నీకు వందనములు..
శ్రీ సూరిబాబు కోమాకుల విశ్రాంత పాఠశాల విద్యా సహాయ సంచాలకులు