[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఓ రామయ తండ్రి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
జయదేవ్ రామ మందిరంలో కూర్చున్నాడు. ఎదురుగా సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారు చిరునవ్వుల వదనంతో అగుపిస్తున్నారు.
తన మదిలోని కోరిక స్వామివారికి తెలుసో లేదో అర్థం కావడం లేదు అతడికి. ఈ కష్టం నుండి తనను గట్టెక్కించమని పదే పదే వేడుకుంటున్నాడు.
జయదేవ్ తాను పనిచేస్తున్న ఆఫీస్ నుండి నేరుగా ఇక్కడికే వచ్చాడు. ఎప్పుడైనా తనకు’కష్టం వచ్చినప్పుడు అతడు వచ్చి కూర్చునే చోటది.
వరంగల్ పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరది. తనకి ఊహ తెలిసినప్పటి నుండి ఇక్కడే పెరిగాడు.’తల్లెవరో తండ్రెవరో తెలియదు.. అనాథనని మాత్రం తెలుసు!
అయినా తాను అనాధను అనుకోవడం తప్పనిపిస్తుంటుంది. తన తల్లి తండ్రి ఈ సీతారాములే కదా!! ఈ ఊరి జనమంతా తన బంధువులే కదా.. అలా అనుకుంటున్నప్పుడు ఓ సంతృప్తి!
పద్దెనిమిదేళ్ళ జయదేవ్ ఇటీవలే ఇంటర్మీడియట్ చదువుకుని ఓ ఆఫీస్లో క్లర్క్‌గా చేరాడు. పట్టణానికి ఈ ఊరి నుండి వెళ్లి వస్తున్నాడు పది రోజులుగా!
ఇప్పటి వరకు ఎవరో ఒకరి ఇంట్లో భోజనం చేస్తూ.. ఊరి మధ్యలో ఉన్న ఓ చిన్న పూరిపాకలో జీవనం చేస్తున్నాడు!
చిన్నప్పటి నుండి స్నేహితులు తక్కువే.. దొరికిన పనిచేస్తూ రోజులు గడుపుకుంటూ.. చదివినంత వరకు చాలనుకుంటూ.. ఓ ఆఫీస్లో క్లర్క్‌గా చేరాడు.
స్థిరమైన సంపాదన ఇక నుండి లభిస్తుందనుకుంటూ సంబరంగా వెళ్ళివస్తుంటే.. అనుకోని అవాంతరం.. ‘దొంగ’ అనే ముద్ర.
తాను పనిచేస్తున్న ఫైనాన్స్ కంపెనీలో రాత్రి యాభై వేలు పోయాయట. ఉదయం తాను వెళుతూనే అక్కడ వాతావరణం గొడవ గొడవగా ఉంది.
“తాళం వేసింది నువ్వే కదా?” యజమాని గద్దిస్తున్నట్లుగా అడుగుతున్నాడు.’
“అవును సార్?”
“మరి యాభైవేలు ఏమయ్యాయి రా?” కాలర్ పట్టుకుని అడుగుతున్న యజమానితో..
“నేనే తప్పు చేయలేదు సార్!” వినయంగా సమాధానం చెప్పాడు జయదేవ్.
“ఇట్లా కాదురా నీ సంగతి.. పోలీసులని పిలుస్తాము అప్పుడు వాళ్ళే తేలుస్తారు. అసలేం జరిగిందో”
“నేనే తప్పు చేయలేదు సార్, నిన్న డబ్బులన్నీ లెక్క చూసుకుని ఆఫీసర్ గారికి అందించాను. ఆయన వెళ్లిన కొద్ది సేపటికే నేను బయలుదేరాను.”
“మరి ఆయనే కంప్లైంట్ చేసారు, నిన్న సరిగ్గా ఉన్న అమౌంట్ నేడు తక్కువైందని.. ఎందుకు?”
ఆఫీసర్ జనార్ధన్ అక్కడి వచ్చి..’
“రేయ్! నిన్న ఇద్దరం కలిసే లెక్కేశాము కదా, మరి ఉదయానికి డబ్బు ఏమైనట్లు? యాబై వేలు ఎందుకు తగ్గాయి. వేసిన తాళం వేసినట్లే ఉంది. నాకు అర్థం కావడం లేదు. నువ్వు తీశావేమో అన్నది మా అనుమానం.
అయినా ఈ రోజు ఆఫీస్‍కి ఆలస్యంగా ఎందుకు వచ్చావు?”ఆలోచనగా అడిగాడు జనార్ధన్.
“సార్! రెండు రోజుల్లో శ్రీరామనవమి పండుగ ఉంది కదా.. మా ఊరిలో శ్రీరామనవమి ఘనంగా చేస్తారు.ఆ పనుల్లో నిమగ్నమై ఆలస్యంగా వచ్చాను అంతే కానీ మరో కారణమేమి లేదు.”
అప్పుడే అక్కడికి వచ్చిన ఇన్‌స్పెక్టర్ శ్రీకర్.. “రేయ్! ఇట్రా?” అంటూ పిలిచాడు. “ఏ ఊరు?” అడిగాడు,
ప్రశ్నిస్తున్న శ్రీకర్ వైపు భయంగా చూస్తూ.. ఊరి పేరు చెప్పాడు.
పరిశీలనగా చూసిన శ్రీకర్ అతడి చేతి వేళ్ళ గుర్తులు తీసుకున్నాడు.
వణుకుతున్న చేతులతో.. వాళ్ళు చెప్పినట్లు చేశాడు.
***
తన భుజంపై ఎవరో చేయి వేసినట్లుగా అనిపించి తలెత్తి చూశాడు.
తనకు ఎన్నో ఏండ్లుగా పరిచయం ఉన్న వ్యక్తి.. ఆలయ పూజారి.
సాయంత్రం చల్లని గాలులు రివ్వున వీస్తున్నాయి. సూర్యాస్తమయ సమయం.. సూర్యభగవానుడు పడమటి కొండల్లోకి జారుకుంటున్నాడు. కొద్ది కొద్దిగా చీకట్లు అలుముకుంటున్నాయి.
అప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన పంతులుగారు రామానుజాచార్యులు గారు విశ్రాంతిగా ఆలయంలో ఉన్న ఓ చిన్న గట్టుపై కూర్చున్నారు.
దిగాలుగా ఉన్న జయదేవ్‌ని పలకరించే ప్రయత్నం చేస్తున్నాడు.
అతడు మాత్రం మౌనంగా మాట్లాడడానికి ఇష్టం లేనట్లుగా తలొంచుకుని కూర్చున్నాడు.
“డబ్బు ఎందుకు దొంగతనం చేశావు రా?” సూటిగా తననే ప్రశ్నిస్తున్న రామానుజాచార్యుల వైపు అదురుతున్న గుండెలతో చూస్తున్నాడు.
రెండు కళ్ళలో నిలిచిన కన్నీటి బొట్లు టపటపా నేలరాలాయి. ‘ఈ పెద్దాయనకి ఎలా తెలుసు?’ అనుకున్నాడు.
“మాట్లాడవేరా..”
“….”
“అడిగేది నిన్నే”
‘నేను దొంగతనం చేయలేదు’ అందామనుకున్నాడు.. మనస్సు ఒప్పుకోలేదు. రెండు చేతుల్లో తల ఉంచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.
ప్రశాంత వదనంతో ఉన్న రామానుజాచార్యులు గారు.. “ఇంతకాలం ఈ ఊరిలో మంచి పేరుతో బ్రతికావు కదరా?ఎందుకు వచ్చిందీ పాడు ఆలోచన?” అన్నారు.
“ఓ మాటడుగుతాను.. నేనే దొంగతనం చేశానని మీకు ఎలా తెలుసు?” అడిగాడు ఆయన్ని.
“అటువైపు చూడు” అన్నారాయన.
దూరంగా రామయ తండ్రి.
“ఆయనే చెప్పాడు రా?”
“అర్థం కాలేదు”
“ఇవిగో యాభైవేలు. నువ్వు ఎప్పుడూ కూర్చునే సిమెంట్ బెంచ్ కింద భాగంలో ఉన్నాయి.”
“….”
“ఇంతకాలం ఈ ఊరిలో మంచితనంగా బ్రతికావు కదరా. ఎందుకు వచ్చిందీ పాడు ఆలోచన. తినడానికి లేనప్పుడు పస్తులు పడుకున్నావు. గుళ్ళోని ప్రసాదాన్ని తిని సరిపెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదరా. నువ్వు ఇప్పుడు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా?నువ్వు భవిష్యత్తులో ఎక్కడా పని చేయడానికి వీలు లేకుండా తలవంపు తెచ్చుకున్నావు.’ఊర్లోని వాళ్ళందరూ నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. వింటుంటే బాధగా అనిపించింది.”‘
“…”
బాధ నిండిన నయనాలతో తన వైపు దీనంగా చూస్తున్న జయదేవ్‌ని పరిశీలనగా చూసారు రామానుజాచార్యులు.
“సార్! అదీ..”
“నువ్వేమీ మాట్లాడవద్దు. నా బైక్ ఎక్కు. ఇన్‌స్పెక్టర్ గారి ఇంటికి వెళదాం. తప్పు ఒప్పుకో. కనికరిస్తాడాయన. అతడు నాకు స్నేహితుడు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయనని మాట ఇవ్వు. మిగతాదంతా నేను చూసుకుంటాను”
“మిమ్మల్నో మాట అడగాలి?”
“నాకు ఈ డబ్బు సంగతి ఎలా తెలుసనా? రామయ్య తండ్రే నాకు తెలియజేశాడు”
“నాకు మాత్రమే అన్యాయం చేసిన ఈ స్వామి మీ అందరికీ మాత్రం గొప్పోడు.”‘
“తప్పు చేసింది నువ్వు. స్వామిని నిందిస్తావేంట్రా?తప్పు చెంప లేసుకో”
“నేనో మాట చెబుతా.. ఆలకిస్తారా? తర్వాత ఎవరికీ చెప్పనని ఒట్టేయండి.”
“అలాగే. కానీ ఓ షరతు.. ముందు ఈ డబ్బులు పోలీస్ స్టేషన్ లో అప్పగించాక.”
“…”
“మాట్లాడవేరా?”
“సారు! మీకు ఫైనాన్స్ ఆఫీస్‌లో పనిచేసే గురునాథం తెలుసా? ఆయన మీకు తెలుసో లేదో ఇప్పుడెందుకు లే. గురునాథం ఆటో మరియు డైలీ ఫైనాన్స్ అంటే నేను పనిచేసే తాన పని చేసే అటెండర్. ఆ ఆఫీస్‌ని, తన యజమానిని నమ్ముకుని పాతికేండ్లుగా అక్కడ పని చేస్తున్నాడు. అతడి కొడుకు బైక్ డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్‌లో చేర్చారు. ఓ పదివేలు గురునాథం హాస్పిటల్‌లో కట్టాడు. మిగతా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే కూతురి పెళ్ళి చేసిన అతడి వద్ద మరేమీ డబ్బులు లేవు. నాతో ఏడుస్తుంటూ చెబితే విన్నాను. యజమానిని అడిగితే లేవన్నారట. ఇటీవలే లోన్ తీసుకున్నవు కదా ఇంకా డబ్బేంటని కోప్పడ్డారట. అతడి అవసరం తీరాలి కదా, నేనే ఈ పని చేశాను. డబ్బు సంపాదించే ఎంతో మంది పెద్దవాళ్ళు,రాజకీయ నాయకులు గుళ్ళు గోపురాలంటూ తిరుగుతారే కానీ సాటి మనుషులకి సాయం చేయరు. మా యజమాని దగ్గర విపరీతమైన మనీ ఉంది. రాజకీయ నాయకులకి అడగకుండానే డబ్బు ఇస్తాడు. నాలుగైదు తరాలకు సరిపడా ఆదాయం ఉంది. మొన్న ఓ వ్యక్తి తన భార్య హాస్పిటల్‌లో గర్భిణిగా ఉన్నది, ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం ఈ నెల కిస్తీ కట్టలేనంటే బలవంతంగా ఆటో తెచ్చుకున్న దుర్మార్గుడు. అతని ఇల్లెలా గడుస్తుంది? సమాజంలో అతి కొద్దిమంది మాత్రమే తమ ఆదాయంలో కనీసం కొద్ది భాగాన్నైనా సమాజ శ్రేయస్సుకు వినియోగిస్తుంటారు. వాళ్ళు దైవ స్వరూపులు. ఈ యజమాని దగ్గర అతి కొద్ది కాలం మాత్రమే పనిచేస్తాను. దోపిడీకి మారుపేరితను.. ఇలాంటి వాడికి నేను చేసిన పనేమీ తప్పు కాదు. నేను ఇప్పుడు చేసిన ఈ దొంగతనాన్ని ఎవరూ కనిపెట్టలేరు. అదంతే.”
“….”
“ఏంటి సారు మాట్లాడరు. మీరే ఈ యాభై వేలు చూడకపోతే మీకు ఎప్పటికీ తెలియదు. అలాగని నన్ను దొంగగా భావించకండి. గురునాథం గారి కొడుకు కాలేజ్ చదువుతున్న వాడు బ్రతకాలని, సాటి మనిషికి సాయం చేయాలని మాత్రమే ఇదంతా చేశాను. తప్పు చేసింది నేను కాదని అనడం లేదు. ఈ న్యాయ అన్యాయాల సంగతి నాకు తెలియదు. నా కోరిక ఆ పిల్లాడు బ్రతకాలి. రేపు ఉదయమే ఈ డబ్బు గురునాథానికి ఇస్తున్నాను. ఈ మాట గురునాథానికి ముందే చెప్పాను కూడా. అతడు వద్దన్నాడు. నేను చేస్తున్నది తప్పు కాదనుకున్నాను. నేను, మీరు నమ్మే రామయ్య తండ్రే ఇదంతా చేయిస్తున్నాడనుకుంటున్నాను.”
ఇంకేమీ మాట్లాడలేదు జయదేవ్.
***
పోలీస్ స్టేషన్‌లో నిలబడ్డాడు జయదేవ్ రామానుజాచార్యులతో కలిసి.
ఇన్‌స్పెక్టర్ శ్రీకర్ తన సీట్లో నుండి లేచాడు.
రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం తాలూకు ఇన్వెస్టిగేషన్ కోసం తనని పిలిచాడనుకుంటున్నాడు జయదేవ్.’
కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు ఇన్‌స్పెక్టర్ శ్రీకర్. అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది.
“ఇతడు మీ ఊళ్ళో ఎంతకాలంగా ఉంటున్నాడు”
“దాదాపు పన్నెండేళ్ళ పైమాటే..” రామానుజాచార్యుల స్వరం గద్గదంగా పలికింది.
“జయదేవ్ !స్టువర్ట్‌పురం పేరు ఎప్పుడైనా విన్నావా?”
“లేదు సార్” వినయంగా సమాధానం చెప్పాడు.
“నేను ఆ ఊళ్ళో పదిహేనేళ్ళ క్రితం పని చేశాను. సరిగ్గా నీ పోలికలతో ఉన్న వ్యక్తిని చూశాను. అతడి వివరాలు ఇవిగో.. వెళ్ళు అతడే నీ తండ్రి.. మీ అమ్మ కూడా అక్కడే ఉంది. ఒకప్పుడు వాళ్ళు దొంగతనాలు చేస్తూ బ్రతికే వాళ్ళు. తర్వాత అవన్నీ మానేసి వ్యవసాయ పనులు చేస్తున్నట్లు గా తెలిసింది. వివరాలన్నీ సేకరించాను.”
“రేపు మాత్రం వెళ్ళలేను”
“ఎందుకు?”
“మా ఊళ్ళో రామయ్య తండ్రికి సీతమ్మ వారితో కళ్యాణం. ఏర్పాట్లన్నీ ఎప్పుడూ నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఊళ్ళోని వాళ్లందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం ఖర్చు పెట్టడం..అన్నీ లెక్కలు రూపాయి తో సహా రాసి మా రామానుజాచార్యులు గారికే ఇస్తాను, ఈ సారి కూడా అలాగే చేస్తున్నాము. రేపు మీరు తప్పకుండా మా ఊరికి రండి. మొదట రామయతండ్రి, తరువాతే మా అమ్మానాన్నలు” ఉద్యేగంగా చెబుతున్నాడు జయదేవ్.
ఓ ప్రక్క ఆనందం..
తాను పుట్టిన తర్వాత ఊహ వచ్చాక.. తొలిసారిగా తల్లిదండ్రులని కలవబోతున్నాడు. రెట్టింపు ఆనందానికి కారణం హృదయమంతా నిండిన రామయ్య కళ్యాణం.
రేపు ఊళ్ళో అత్యంత వైభవంగా జరగబోతుంది. రామానుజాచార్యుల రూపంలో ఆ శ్రీరాముడే తనని ఎల్లవేళలా కాపాడుతున్నాడా అన్నట్లుగా తన ప్రతి సమస్యను తీరుస్తూ పూజారిగారు.
ఇప్పుడు మాత్రం తాను ఆ పెద్దాయన్ని ఎప్పటికీ..
తన ఊపిరి ఉన్నంతవరకు మరువలేనంత గొప్ప సహాయం చేయడం జరిగింది.
తాను నిర్దోషిగా గుర్తించబడడం.. ఏం చేశారో కానీ అదంతా రామానుజాచార్యుల గారి చలవే!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
