కొండకోనల తిరిగెటోడు
కల్లాకపటం ఎరగనోడు
వేటలోన ధీటుగాడు
రోజు నీతో మంతనాలు
పల్లెలకె రాజు వాడు
పట్టు తేనేలు పట్టెవాడు
పచ్చి మాంసం నైవేద్యం
బుగ్గల నీటి అభిషేకం
కనుల రక్తం ఆగదంట
కలవరపాటే చెందద్దంటూ
కాలి గుర్తు నెత్తిన మోపి
కన్నులు పెరికి పెట్టినాడా
వాడి భక్తికి నువ్వు మెచ్చి
కన్నప్ప బిరుదునిచ్చి
మోక్షమిచ్చి కొండనెట్టి
కింద నువ్వు కొలువున్నవా
నీ లీల నీకే తెలుసు
ఓ కాళహస్తి వాస
విస్సాప్రగడ వేంకట కృష్ణ సాయి స్వస్థలం ఏలూరు. సర్ సి అర్ అర్ కాలేజ్ లో పట్టభద్రులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొద్ది కాలం పనిచేసి, 1997 లో అమెరికా వలస వెళ్లి బోస్టన్ పరిసర ప్రాంతంలో స్థిరపడ్డారు. వృత్తి రీత్యా సమాచార సాంకేతిక (IT) రంగంలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. కాలేజీ రోజుల నుంచి కవితా సాహిత్యం పై మక్కువ. ఏవో చిన్న చిన్న పద కవితలు వ్రాసుకుని బంధువర్గం తోను మిత్రుల తోను పంచుకుని సంతోషపడేవారు. ప్రముఖుల రచనలు చదవడం ఇష్టం. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం మరియు న్యూ ఇంగ్లాండ్ షిరిడి సాయి పరివార్ దేవాలయంలో స్వచ్ఛంద స్వేచ్ఛా శ్రమదానం చేయడం ఇష్టపడతారు.