[శ్రీమతి బి. కళాగోపాల్ రచించిన రచించిన ‘నువ్వు.. నేను మరియు వాళ్ళు!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
గుండె గూడును నొక్కి పట్టిన
బాధ నేదో చెప్పుకోవాలని
దోసిలిలో ముఖాన్నుంచి
ఒక కన్నీటి గోసనేదో వరదలా పారించాలని
దైహిక ప్రపంచంలో మాంస ఖండాల
నెత్తుటి ముద్దలం కాదని
మనసు గదిని ఊరడించే వాక్యం కొరకు
ఎదురుచూసే అజ్ఞాత వ్యక్తులం మేమని
వాళ్లు.. అక్కడ వాలుతున్న పొద్దులా పోగయ్యారు!
వారసత్వ ఫలాల వృద్ధికై చేతనైనంత కష్టం చేసి
కాయలు గాచి అరిగిపోయిన అరచేతిలో
భవిష్యత్ రేఖలు కానరాక
మసకబారిన చూపుల్తో కూడలిలో
దిక్కు తెలియని ఒంటరి బాటసారుల్లా..
ఒక ఆత్మీయ స్పర్శకై పడిగాపులు గాస్తున్న
మందభాగ్యులం మేమని
వాళ్లు.. గూటికి చేరుకుంటున్న
పక్షుల కిలకిలలకు
తమ కన్నీటి సడినేదో విన్పిస్తున్నారు!
ఎకసెక్కెపు మాటల
ఎగతాళి ధ్వనులను వింటున్న చెవులు
గొణుగుడు సణుగుడు మాటలకర్థాలు వెదకలేక
బిక్క మొహంతో అమాయకంగా..
మేమేం అనామకులం కాదని
కరిగిన యవ్వనానికి ప్రతినిధులమని
వాళ్లు.. చెమ్మ ఇంకిన కళ్లలో జ్ఞాపకాలను చేదుకుంటున్నారు!/
ట్రంకు పెట్టె అడుగున దాచిన
అపురూప ఛాయాచిత్రాల ప్రియనేస్తాలకు
మరణించి అదృష్టవంతులన్న
బిరుదును తగిలిస్తూ..
మనసును వడిపెడుతున్న వ్యథలకు
జ్ఞాపక చిహ్నాలు నిర్మిస్తూ
వాళ్ళు.. ఒకరి బతుకు ముల్లెను
మరొకరి ముందు దించుకుంటున్నారు!
దిగులు గుహలాంటి ఇంట్లో
నిద్రలేని రాత్రుల సహవాసంలో
సునామీల సమ్మెట పోట్లను
స్టంట్ కుట్లతో అతికించలేక
ఒరుసుకు పోయిన గాయాల
బతుకును ఎలా పొద్దుపుచ్చాలో తెలియక
వాళ్ళు.. ఆరిపోతున్న దీపాల వెలుగులో
రవ్వంత తడి కొరకు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు!
ప్రతీ మైలురాయి దగ్గర
విజయ పతాకాన్ని ఎగుర వేసి
నాటకం చివరి అంకంలో ఏకాకిగా..
నలుగుతున్న మౌనాన్ని ఆశ్రయించి
తీరని మనసు అవస్థను ఎడారి కలగా
మిగిలిన జీవితంలో చిగురించని వసంతంలా..
సొట్టలు పడ్డ బతుకు నాణేనికి మరోవైపుగా మేమని
వాళ్లు.. జవాబు లేని ప్రశ్నలెన్నింటినో మూగగా భరిస్తూ..
పోరాడి ఓడేందుకై కొన్ని
బాధామయ సందర్భాలకు!
జీవన వ్యాకరణాన్ని రచిస్తున్నారు!
వాళ్ళంతా..
నెరసిన తలలతో, ముసిరిన ఆలోచనలతో..
గుండె బరువును దిటవు పర్చుకునేందుకు
కలబోత కబుర్లతో
ఏదో ఒక సంకేత స్థలానికి ఒగరుస్తూ
చేరుకుంటున్న ముడుతల దేహాలు!
పొద్దు పోని కాలపు ముళ్ళను
కదిలించడానికి
తెరలు తెరలుగా ఉబికి వచ్చే
గోస బతుకును దిగమింగుకోవడానికి..
ఒకరి కొకరుగా సముదాయిస్తూ..
మాటల బంధంతో ఏకమవుతున్న ఆత్మలు
ఐనా వాళ్ళు.. ఈ లోకాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉంటారు!
ఒక రసమయ ప్రేమస్పర్శకు వారధి నిర్మిస్తూ..
జీవన వైఫల్యాలను చిరునవ్వుతో
సాఫల్యత చెందించుకుంటారు!
ప్రతి మజిలీలోనూ ఎవరో ఒకరు మనలాగా..
మనతోనే ఉంటారన్న ఊరడింపు మాటలను నెమరేసుకుంటూ
వాలుతున్న రేపటి పొద్దులో..
వాళ్ళలో దాగిన మనం..
మనలో ఎదురుపడనున్న
ఒక నువ్వు నేను మరియు వాళ్ళు..!!
శ్రీమతి బి. కళగోపాల్ గత దశాబ్ద కాలంగా కవితలు కథల్ని రాస్తున్నారు. పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీషు, బిఎడ్ చేసిన వీరు ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఇంతవరకు వీరివి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. కవితా సంపుటి ‘మళ్లీ చిగురించనీ..’ 2015లో 74 కవితలతో ప్రచురించారు. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం.లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. వీరి కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులను పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందారు.