Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నర్స్

[మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాజేశ్వరి దివాకర్ల శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారు రచించిన ‘నర్స్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

యా ప్రవృత్తిని ధ్యానం చేసింది.
స్వార్థానికి త్యాగ పరమార్థాల పాఠం నేర్పింది.
చల్లని చూపుల చెలిమిని చేసింది.
సహజాత సోదరిగా
సిస్టర్ అనిపించుకుంది.

చీకటి వేళల కిటికీ ఊచల నీడలకు
లాంతరు వెలుగు నిచ్చింది.
వేడి కన్నీటి ఆవిరులనన్నింటిని
మెత్తని కరుణల
దూది మొత్తాలతో అద్దింది.

వేదనా రుజల
హృదయ భిత్తికలకు
శుశ్రూషా పటిమల
చిత్రపటమై హత్తుకుంది.

ప్రస వేదనల
ప్రాణగండాలకు
బొడ్డు తీర్చిన ప్రేమ పొత్తిళ్ళను పరచింది.
పండంటి బిడ్డను చేతికందించి
పునర్జన్మల తల్లి తీర్చుకోలేని ఋణాలను
తేలిక చిరునవ్వులతో తేల్చి వేసింది.
తీపి సంగతుల జ్ఞాపకాల నన్నింటిని
కృతజ్ఞతల లెక్కకు సరి తూచుకుంది.

నాడిని పట్టి చూసింది.
మచ్చిక మాటలాడి
నాటినట్టు తెలియకనే
వాడిగ సూదిమందు లిచ్చింది.
దాడి నిరాశల రేపు మాపులకు
తోడి తెచ్చిన బ్రతుకు ఆశల ధైర్యమిచ్చింది.

రాతిరి జాగరణలలో
కనురెప్పలను వాల్చని అశ్విని,
కనిపెట్టి చూసుకుంటున్న,
గాయాల మనసులకు
మృదు వచన లేపనాలతో
మంచి నిదుర పట్టిందా అని
మేలిమి మేల్కొలుపుల నాడింది.

ఓర్పు సహనాలతో
మానవతా పీఠమెక్కింది.
భాషలకు అందని సేవా నిరతి లో
అమ్మకు సాటి ‘నర్స్’ నర్సమ్మగా
గౌరవ వందనాలను అందుకుంది.

Exit mobile version