Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. చిత్తర్వు మధు గారికి 2023 కీర్తి పురస్కారం ప్రదానం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2023వ సంవత్సరానికి, వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన 48 మంది ప్రముఖులను కీర్తి పురస్కారాలతో సత్కరించింది. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. ప్రముఖ రచయిత డా. చిత్తర్వు మధు గారికి ‘జనరంజక విజ్ఞానం’ విభాగంలో 2023 కీర్తి పురస్కారం లభించింది.

2 సెప్టెంబర్ 2025న జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా డా. చిత్తర్వు మధు గారి సంక్షిప్త పరిచయాన్ని అందిస్తున్నాము.

డాక్టర్ చిత్తర్వు మధు వృత్తి రీత్యా వైద్యులు. గత మూడున్నర దశాబ్దాలుగా అంటే 1987 నుంచి హైదరాబాద్‌లో కన్సల్టంట్ ఫిజీషియన్ డయబిటాలజిస్ట్ కార్డియాలజిస్ట్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. ఇదికాక, హైద్రాబాద్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌లో మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా వున్నారు. వివిధ మెడికల్ అసోసియేషన్లకి API, RSSDI, Hyderabad Chapters కి  ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. మెడిసిన్‌లో FICP ఫెలో షిప్ పొందారు.

డాక్టర్ చిత్తర్వు మధు విద్యార్థి దశ నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు. 1950, మే నెలలో 10 లో తేదీన మామిడి కోళ్ళ గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. విద్యాభ్యాసం హయ్యర్ సెకండరీ వరకు మచిలీపట్నం హిందూ హైస్కూల్లో జరిగింది. ఆ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో ఎంబిబిఎస్, ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో ఎండి మెడిసిన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అల్జీరియాలో మెడికల్ స్పెషలిస్ట్‌గా 1987 వరకు పనిచేశారు.

విద్యార్థి దశ నుంచి కథలు, నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతూనే ఉన్నాయి. అప్పుడు రాసిన కథలు డాక్టర్ చిత్తర్వు మధు కథలు సంకలనంగా వెలువడ్డాయి. ఆ తర్వాత మెడికల్ సైన్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నవలలు, ఐసిసియు, బై! బై! పొలోనియా, ఎపిడెమిక్ నవలలు ఒక నవలా త్రయంగా రాసారు. ఇవి ఆంధ్రప్రభ వారపత్రికలోనూ, నవ్య వారపత్రికలోనూ సీరియల్‌గా వచ్చాయి. స్పేస్ ఓపెరా అనబడే ఒక సైన్స్ ఫిక్షన్ ప్రక్రియలో ‘కుజుడి కోసం’ అనే నవల రచన మాసపత్రికలో సీరియల్‌గా ప్రచురితం అయింది. ఇది రచయిత స్వయంగా ఇంగ్లీష్‌లో రాసిన War for Mars అనే నవలకి స్వయంగా చేసిన అనువాదం. దానికి కొనసాగింపు ‘నీలీ ఆకుపచ్చ’ కినిగె జాల పత్రిక‌లో సీరియల్‌గా వచ్చింది. గ్రహాంతర ప్రయాణాలు, సామ్రాజ్యాల  మధ్య యుద్ధాలు, ప్రేమలు భవిష్యత్తులో జరిగినట్లు కథనం స్పేస్ ఒపేరా లక్షణాలు. ఈ రెండు నవలలు ఆంగ్లంలో మొదటగా  ప్రచురించబడ్డాయి. నీలీ ఆకుపచ్చ, భూమి నుంచి ప్లూటో దాకా నవలలని రచయిత తెలుగు లోకి శ్రీ కొల్లూరి సోమశంకర్ సహకారంతో అనువాదం చేశారు. ఆఖరి నవల ‘భూమి నుంచి ప్లూటో దాకా’ సంచిక జాల పత్రికలో సీరియల్‌గా వచ్చింది. దానితో పాటు 2020లో Z సైన్స్ ఫిక్షన్ కథా సంకలనం ప్రచురించారు. దీనిలో 19 కథలున్నాయి. 2023లో 16 కథలతో అల్గోరిథమ్ అనే కథా సంపుటిని, 2024లో ‘నగరంలో మరమానవి’ అనే నవల, అదే సంవత్సరం ఇంగ్లీష్‌లో The Last City After the AI Apocalypse అనే నవలా ప్రచురణ అయ్యాయి.

ఇవి కాకుండా పూర్వం – ఔనా, సాలెగూడు www.utopia.com అనే నవలలు రాశారు. వివిధ పత్రికల్లో అనేక  వైద్య వ్యాసాలు రాశారు. ‘మధుమేహంపై విజయపథం’ అనే డయాబెటిస్ వైద్య విజ్ఞానం మీద పుస్తకం రాశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సైన్స్ ఫిక్షన్ ఇతర సాహిత్య సమావేశాల్లో పాల్గొన్నారు.

భవిష్యత్ నాలుగో సహస్రాబ్దిలో సాగే కథనం జరగబోయే శాస్త్రీయ పురోగతిని వర్ణిస్తూ హనీ ఆమ్రపాలి అనే హీరో భూమికి కుజుడి నుంచి తిరిగి వచ్చినాక జరిగిన కథ నీలీ ఆకుపచ్చ, అంతకు ముందు ‘కుజుడి కోసం’ అనే నవలలో వర్ణించబడింది. కుజుడి వర్ణం అరుణం అయితే ప్రాణవాయువు పత్రహరితం నిండిన భూమి వర్ణాలు నీలీ ఆకుపచ్చ. అంతరిక్షం నుంచి చూస్తే కన్పించే రంగులు అవే. ఉత్కంఠ కలిగించే ఈ నవలలకు సీక్వెల్ ’భూమి నుంచి ప్లూటో దాక” నవల. ఇది తెలుగు లో మొదటి స్పేస్ ఓపెరా నవలా త్రయం అని చెప్పవచ్చు. ఇది సంచికలో వచ్చింది. ‘నగరంలో మరమానవి’ అనే రోబోట్ల విప్లవం గురించి రాసిన వెబ్ సిరీస్ లాంటి నవల కూడా సంచికలో ప్రచురితం అయ్యింది.

గత పది సంవత్సరాలుగా పర్యావరణ సాహిత్యం, రోబోలు, కృత్రిమ మేధ, డ్రైవర్‌లెస్ కార్లు, కాల ప్రయాణం, టైం లూప్, స్మార్ట్ సిటీలు, బటర్‌ఫ్లై ఎఫెక్ట్ లాంటి సైన్స్ విషయాల మీద కథలు ఎక్కువగా సంచిక అంతర్జాల పత్రిక లోనూ, సారంగ, మధురవాణి, ఈమాట, ఆంథ్రజ్యోతి ఆదివారం, జాగృతి, లాంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

సైన్స్ ఫిక్షన్ ఒక ఉద్యమంలా చేస్తున్న డా. చిత్తర్వు మధు ప్రతి నెలా ఒక సైన్స్ ఫిక్షన్ కథ రాయాలనే అనే లక్ష్యంతో రాస్తున్నారు.

~

 డాక్టర్ చిత్తర్వు మధు రచనలు

  1. డాక్టర్ చిత్తర్వు మధు కథలు (వాహిని పబ్లిషర్స్ )
  2. ఐ.సి.సి.యు (తెలుగు ) (వాహినీ పబ్లిషర్స్. రచన )
  3. బై !బై! పొలోనియా ( వాహినీ)
  4. ఎపిడెమిక్ (వాహినీ)
  5. ఔనా.. ! (వాహినీ)
  6. సాలెగూడు (వాహినీ)
  7. కుజుడి కోసం. (వాహినీ)
  8. నీలీ ఆకుపచ్చ (జెవీ పబ్లిషర్స్)
  9. భూమి నుంచి ప్లూటో దాకా( సాహితీ ప్రచురణలు విజయవాడ)
  10. Z సైన్స్ ఫిక్షన్ మరికొన్ని కధలు (జెవీ పబ్లిషర్స్)
  11. War for Mars: A story of Fourth Millennium (Sampark publishers Kolkata and Amazon)
  12. Blue and Green: Return to Earth (Sampark publishers and Amazon)
  13. Dark Outposts :Final Revenge(Amazon)
  14. మధు మేహం పై విజయపథం (A complete health education book on Diabetes.Vahini publishers.)
  15. ఆల్గోరిథమ్ సైన్స్ ఫిక్షన్ కథల సంపుటి (అన్వీక్షికి పబ్లిషర్స్)
  16. నగరంలో మరమానవి నవల (అమెజాన్, కవిత ప్రచురణలు)
  17. The Last City : After the AI Apocalypse (Notion Press publication) Amazon.in Logili.com, Navodaya.

ఐ.సి.సి.యు., బై! బై! పోలోనియా, ఎపిడెమిక్ – మెడికల్ సైన్స్‌ఫిక్షన్ త్రయం.

కుజుడి కోసం, నీలీ ఆకుపచ్చ, భూమి నుంచి ప్లూటో దాకా – స్పేస్ ఫిక్షన్ త్రయం.

Exit mobile version