Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నోరుంటే బ్రతకరా కొడకా!

[బాలబాలికల కోసం ‘నోరుంటే బ్రతకరా కొడకా!’ అనే పిల్లల కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]

శోక్ మాస్టారు జీవశాస్త్ర ఉపాధ్యాయులు. చక్కని ఉదాహరణలతో పిల్లల మనసుకు హత్తుకునేలా పాఠాన్ని బోధించడం ఆయన ప్రత్యేకత. అందుకే అతని పాఠమంటే పిల్లలు చెవికోసుకుంటారు.

ఒకరోజు ఆరవ తరగతి పిల్లలకు నోటి శుభ్రత, దంతధావనం గురించి తెలియచేస్తూ “మనం ఎప్పుడూ పళ్ళ మధ్య నాలుకలా ఉంటేనే ఆనందంగా జీవించగలం. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది, నోరుంటే ఎంచక్కా బతికెయ్యొచ్చు” అని చెప్పారు అశోక్ మాష్టారు.

“అందరికీ నోరు ఉంటుంది కదా!” అని సందేహం వెలిబుచ్చాడు జున్ను బాబు.

“నిజమే.. భాషణమే భూషణం.. నేర్పుగా కూర్పుగా మాట్లాడి అందరి మనసుల్లో స్థానం సంపాదించి ఉన్నత స్థానంలో ఉన్నవారు కొందరైతే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అభాసుపాలైన వారు కొందరు. అందుకే ఆచి తూచి, మాట్లాడితే మనం చక్కగా మనుగడ సాగించవచ్చు. ఇందుకు ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను వినండి.” అంటూ చెప్పడం మొదలుపెట్టారు.

***

పూర్వం అవంతీపుర రాజ్యాన్ని రాజశేఖరుడు పరిపాలించేవాడు. అతడికి జామపండ్లు అంటే మహా ప్రీతి. వివిధ రాజ్యాల నుంచి రకరకాల జామమొక్కలను తెప్పించి పెంచేవాడు. ఆ తోటలోని జామకాయలు, పళ్ళు అత్యంత మధురంగా ఉండేవి. ఆ తోటలోకి ఎవ్వరూ వెళ్ళకుండా కాపలాదారు ఉండేవాడు. పొరపాటున ఎవరైనా ఆ తోటలోకి వెళ్ళి జామకాయ కోస్తే వారిని రాజు శిక్షించేవాడు.

ఆ తోటలోని జామకాయలు తియ్యగా ఉంటాయన్న సంగతి ఆ నోట ఈ నోట మంత్రి కొడుకు మార్కండేయునికి తెలిసింది. ఎలాగైనా రాజుగారి తోటలోని జామకాయ తినాలి అనుకున్నాడు. ఒకరోజు ఉదయాన్నే ఎవరూ చూడకుండా రాజుగారి తోటలోకి వెళ్ళాడు. ఒక జామకాయ ఏరుకుని తిన్నాడు. చాలా తియ్యగా ఉండడంతో మరో నాలుగు కాయలు ఏరుకుని గుడ్డలో కట్టి ఇంటిదారి పట్టాడు. రాజభటులు మార్కండేయుడిని బంధించి రాజు ముందు హాజరుపరిచారు.

“మహారాజా! ఇతడు మంత్రి కొడుకు. తమరి జామతోటలో జామకాయలు దొంగతనం చేశాడు” అని ఫిర్యాదు చేశారు భటులు.

“మంత్రి గారిని ప్రవేశపెట్టండి!” అన్నాడు రాజు.

సరేనని మంత్రిని ప్రవేశపెట్టారు భటులు.

“మంత్రిగారూ కంచే చేనును మేస్తే ఎలా?” అని కోపంగా మంత్రి వైపు చూసాడు రాజు.

“అయ్యా! పసివాడు ఏదో తెలియక తప్పుచేశాడు. మొదటి తప్పుగా క్షమించి విడిచిపెట్టండి.” అని ప్రాధేయపడ్డాడు మంత్రి.

“తప్పు తప్పే. శిక్ష ఎవరికైనా ఒకటే. చట్టం, న్యాయం అందరికీ సమానమే” అన్నాడు రాజు.

కొడుక్కి శిక్ష తప్పదన్న బాధతో కొడుకు వైపు చూస్తూ “నోరుంటే బ్రతకరా కొడకా” అన్నాడు మంత్రి ఏడుస్తూ.

తండ్రి మాటలోని అంతరార్థం ఏమిటా అని ఆలోచించాడు మార్కండేయుడు.

విచారణ ప్రారంభమయ్యింది. రాజు భటులను పిలిచి “ఈ కుర్రాడు దొంగతనం చేశాడు అనడానికి సాక్ష్యం ఏమిటి?” అని ప్రశ్నించాడు రాజు.

“మహారాజా అతడి దగ్గర ఉన్న జామకాయలు మీ తోట లోనివే” అని అతడి దగ్గర గుడ్డలో ఉన్న జామకాయలు చూపించారు.

మహారాజు ఆ కుర్రాడి వైపు చూసి “బాలకా వారు చెప్పింది నిజమేనా?” అని అడిగాడు.

“నిజమే! ఇవి మీ తోటలోని జామకాయలే, కానీ నేను కోయలేదు” అన్నాడు మార్కండేయుడు వినయంగా.

“మరి నీ దగ్గరికి ఆ జామకాయలు ఎలా వచ్చాయి?” అని అడిగాడు మహారాజు.

“మహారాజా తిప్ప తీగ కోసం అడవికి వెళ్తున్నాను. దారిలో జామచెట్టు మీద కోతి కనిపించింది. దాని చేతిలో కొన్ని జామకాయలు ఉన్నాయి. ఆకలిగా ఉండడంతో జామకాయ తినాలి అనిపించింది. ఆలోచించి, నాలుగు గులక రాళ్ళను తీసుకుని ఒక్కొక్కటి కోతికి ఎదురుగా విసిరాను. అది చూసిన కోతి చేతిలో ఉన్న జామకాయలు విసిరింది. వాటిలో ఒక కాయ తిని, మిగిలినవి గుడ్డలో కట్టుకుని ఇంటికి బయలుదేరాను. ఇంతలో రాజభటులు నన్ను బంధించారు” అని వివరించాడు మార్కండేయుడు.

“ఈ బాలుడు చెప్పింది నిజమేనా?” అని అడిగాడు రాజు.

సరియైన ఆధారం లేకపోవడంతో మౌనం దాల్చారు రాజభటులు.

“శెభాష్ బాలకా నీ తెలివి అమోఘం. నువ్వు నిర్దోషివి, ఇక మీదట ఆ తోటవైపు వెళ్ళకు” అని చెప్పి మార్కండేయుడిని విడిచిపెట్టాడు రాజు.

“అలాగే మహారాజా!” అని నమస్కరించి సంతోషంగా తండ్రి వద్దకు చేరాడు మార్కండేయుడు. కొడుకు తెలివితేటలకు, సమయస్ఫూర్తికి ఎంతగానో పొంగిపోయాడు మంత్రి.

***

“ఇదీ కథ. మార్కండేయుడు తెలివిగా మాట్లాడి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అలా ఆనాటి నుంచి ‘నోరుంటే బ్రతకరా కొడకా!’ అనే సామెత వాడుకలోకి వచ్చింది” అని కథ ముగించారు అశోక్ మాష్టారు.

Exit mobile version