Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘నిజాం పాలన చివరి రోజులు’ పుస్తకావిష్కరణ సభ – నివేదిక

శ్రీ కె. ఎం. మున్షీ గారి The End of an Era – Hyderabad Memories అనే అంగ్ల పుస్తకం తెలుగు అనువాదం ‘నిజాం పాలన చివరి రోజులు – నా హైదరాబాద్ జ్ఞాపకాలు’ ది 17 సెప్టెంబర్ 2025 నాడు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో జరిగిన సభలో హైదరాబాద్ కాచీగుడా లోని బద్రుకా కాలేజీ సెమినార్ హాల్‍లో ఆవిష్కృతమయింది.

శ్రీ బి.ఎస్. శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనానంతరం శ్రీమతి పద్మజ ప్రార్థనా గీతం ఆలపించారు.

సభకి అధ్యక్షత వహించిన ప్రజ్ఞాభారతి తెలంగాణా అధ్యక్షులు శ్రీ వి. శ్రీనివాస్ గారు తమ సంస్థ గురించి క్లుప్తంగా వివరించారు.

అనంతరం ప్రజ్ఞాభారతి ఛైర్మన్ శ్రీ టి. హనుమాన్ చౌదరి గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు.

శ్రీ టి. హనుమాన్ చౌదరి గారు ప్రసంగిస్తూ, 17 సెప్టెంబర్  తేదీకి ఉన్న ప్రాముఖ్యతని తెలుపుతూ, అది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి జన్మదినం కావడం విశేషమని అన్నారు. 17 సెప్టెంబర్ విలీన దినమా, విమోచన దినమా అనే విషయంలో ఉన్న సంశయాలని తొలగించారు. 17 సెప్టెంబర్ విమోచన దినం ఎందుకవుతుందో వివరించారు. హైదరాబాద్ సంస్థానంలో భారతదేశంలో విలీనమవడంలో, హైదరాబాద్ లో భారత ప్రతినిధిగా  వ్యవహరించిన కె. ఎం. మున్షీ పాత్ర గొప్పదని తెలిపారు. నిజాం పాలనలోని రజాకార్ల అకృత్యాలను ప్రస్తావించారు. నిజాం పాలన ముగిసాకా, హైదరాబాదులో కొన్నాళ్ళ పాటు సాగిన సైనిక పాలన సమయంలో కమ్యూనిస్టులు భారత ప్రభుత్వంతో చేసిన పోరాటం గురించి వివరించి, తుదకు ఇక్కడి కమ్యూనిస్టు నేతల బృందం రష్యా వెళ్ళి స్టాలిన్‌ని కలిసి ఆయన సలహాపై సాయుధ పోరాటాన్ని విడిచి, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలలో పాల్గొనాలని నిర్ణయించిన వైనాన్ని ఉదహరించారు. నిజాం భారత సైన్యానికి లొంగిపోయిన వెంటనే మున్షీని హైదరాబాద్ నుంచి ఎందుకు వెనక్కి పిలిపించారో, తదుపరి చర్యలలో ఆయనకు భాగం లేకుండా ఎందుకు చేశారో తెలిపారు. మున్షీ గారితో వ్యక్తిగతంగా తనకున్న అనుబంధాన్ని వివరించారు. మున్షీ గారి The End of an Era, అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోవడం, అలభ్యం కావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఇన్నాళ్ళకి ఆ పుస్తకం తెలుగు అనువాదం అందుబాటులోకి రావడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. అనువాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణకు అబినందనలు తెలిపారు.

అనంతరం ప్రముఖ జర్నలిస్టు శ్రీ రాకా సుధాకర్ రావు ప్రసంగించారు. నిజామ్ పాలనలో దమనకాండని ప్రస్తావించారు. నిజామ్ ద్వంద్వ వైఖరిని ఉదాహరణల ద్వారా వివరించారు. దేశంలోని ఇతరులకు 17 సెప్టెంబర్ విలీన దినం కావచ్చేమో గానీ, రజాకార్ల అకృత్యాలకు బలైన వేలాది హిందూ కుటుంబాలకు 17 సెప్టెంబర్ విమోచన దినమేనని అన్నారు. హైదారాబాద్ సంస్థానంలో ఏం జరిగిందనేదన్ని ఎప్పుడూ వక్రీకరిస్తునే ఉన్నారనీ, వాస్తవాలను వెలుగు చూడనివ్వడం లేదని వ్యాఖ్యానించారు. 2012 నుంచి హైదరాబాద్ సంస్థానంపై పాకిస్తాన్ అనుకూల దృక్పథాన్ని కలిగిన ఉన్న పుస్తకాలు లెక్కలేనన్ని వెలువడగా, భారతీయ దృక్పథంతో ఒక పుస్తకం రావడానికి ఇన్నేళ్ళ  సమయం పట్టిందని అన్నారు. హైదరాబాద్ సంస్థానంలో అసలేం జరిగిందనేదాన్ని తెలిపే కొన్ని పుస్తకాలను ప్రస్తావించారు. హైదరాబాద్ విమోచనంలో ఆర్యసమాజ్ పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు. ‘నిజాం పాలన చివరి రోజులు – నా హైదరాబాద్ జ్ఞాపకాలు’ పుస్తకం ఎందుకు అవసరమో తెలిపారు. అనువాదకుడిని అభినందించారు.

ప్రధాన వక్తగా హాజరైన సిబిఐ విశ్రాంత జాయింట్ డైరక్టర్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు ప్రసంగిస్తూ, చరిత్ర ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ చరిత్రని ఎందుకు అవగహాన చేసుకోవాలో తెలిపారు. చరిత్ర పునరావృతమవుతుంటూంది కాబట్టి, గతంలో చేసిన పొరపాట్లను మళ్ళీ జరగకుండా చూసుకునేందుకు చరిత్రని అధ్యయనం చేయాలన్నారు. సాధారణ చరిత్రలానే నేరచరిత్ర కూడా పునరావృతమవుతుందనీ, సమాజంలో అవినీతి ఏ రకంగా ఉంటుందో చాణక్యుడు వివరించాడనీ, ప్రస్తుత కాలంలో జరుగుతున్న అవినీతి పద్ధతులను పరిశీలిస్తే, చాణక్యుడు చెప్పిన పద్ధతులలోనే జరుగుతున్నట్టు అనిపిస్తుందని అన్నారు. చరిత్ర పునరావృతం కాకుండా చరిత్రని పునర్ముద్రించుకోవాలని అన్నారు. చరిత్ర వక్రీకరణకి గురువతున్న నేటి కాలంలో మున్షీ గారి ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం వెలువడడం అత్యంత అవసరమనీ, ఈ పుస్తకాన్ని అనువదించడంతో, అనువాదకుడి బాధ్యత అయిపోయిందనీ, ఇక ఈ పుస్తకాన్ని ఆదరించి, ఇందులోని అంశాలను పలువురికి చేర్చాల్సిన బాధ్యత పాఠకులదేనని అన్నారు. ఈ పుస్తకం పరిచయ సభలు అన్ని ఊర్లలో ఏర్పాటు చేయాలని ప్రజ్ఞాభారతి సంస్థను కోరారు.

చివరగా అనువాదకులు కస్తూరి మురళీకృష్ణ తమ స్పందనని తెలిపారు. తాను వ్యక్తిగతంగా కె. ఎం. మున్షీ అభిమానిని అనీ, వేదాలు, భారతీయ ధర్మం ప్రాముఖ్యత పట్ల తనకు మున్షీ గారి పుస్తకాల వల్ల అవగాహన కలిగిందని తెలిపారు. మున్షీ గారి The End of an Era – Hyderabad Memories అనే అంగ్ల పుస్తకాన్ని తెలుగులో అనువదించడానికి అనుమతి కోరినప్పుడు తొలుత సంచిక వెబ్ పత్రికలో ధారావాహికంగా ప్రచురించడానికి మాత్రమే అనుమతించారానీ, పుస్తక రూపంలో ప్రచురిద్దామని అనుమతి కోరితే స్పందించలేదని తెలిపారు. రెండేళ్ళ పాటు ప్రయత్నిస్తున్నాననీ, సెప్టెంబర్ 2025లో రాకా సుధాకర్ రావు గారితో ఈ విషయం ప్రస్తావనకు రాగా, ఆయన శర్మ గారిని పరిచయం చేశారనీ, శర్మ గారి ద్వారా హనుమాన్ చౌదరి గారితోను, లక్ష్మీ నారాయణ గారితోనూ పరిచయం కలిగి వారి ద్వారా అనుమతి సాధించడం వీలయిందని తెలిపారు. అనుమతి లభించిన రెండు రోజుల్లో డిటిపి పూర్తి చేసి, కవర్ పేజీ డిజైన్ చేయించామని, మరో పది రోజుల్లో పుస్తకం సిద్ధమైందని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరుగున పడుతున్న అసలైన చరిత్రను వెలికితీసి ప్రజల ముందు ఉంచే ప్రయత్నాలలో భాగంగా మిత్రులు కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘కల్లోల భారతం’ పుస్తకం కూడా ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో త్వరలో ఆవిష్కృతం కానున్నదనీ, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందామని అన్నారు.

అనంతరం శ్రీ రమేష్ బృందం సభ్యులు ‘బండెనక బండి కట్టి’ పాట పాడి సభకి ఉత్సాహం కలిగించారు. శర్మగారు వందన సమర్పణ చేశారు. పద్మజగారు జాతీయ గీతం ఆలపించాకా, సభ ముగిసింది.

సభలో విశేషమేమిటంటే, పుస్తకాలు కొన్న పాఠకులు రచయితతో సంతకానికి బారులు తీరటం. సభలో అమ్మకానికి తెచ్చిన పుస్తకాలన్నీ అయిపోయాయనీ, పుస్తకాలు దొరకక నిరాశతో వెనుతిరిగేవారికి, తెల్లారికల్లా పుస్తకాలను సభలో అమ్మిన ధరకే, అంటే,  రూ.250/- విలువగల పుస్తకాన్ని ఒక వారంపాటూ  రూ.200/- కే అందచేస్తామనీ, సాహిత్య నికేతన్ ప్రతినిథి హామీ ఇచ్చారు. ఈ సౌకర్యాన్ని పాఠకులు పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్న ప్రజ్ఞాభారతి కార్యకర్తలు

Exit mobile version