[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
‘స్థిరపడిన విప్లవం’ శీర్షికన రెవరెండ్ ఎడ్వర్డ్స్ ఈ విధంగా రాశారు:
“నల్గొండలో పలు ప్రాంతాలు కమ్యూనిస్టుల నియంత్రణలో ఉన్నాయి. ఆ ప్రాంతాలలో ఇలాంటి (అరాచక హింసాత్మక పరిస్థితులు) నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల కన్నా ముందు హింసాత్మక యుద్ధం జరిగింది. అందులో అసంఖ్యాకులు తమ ఆస్తులు, ఇళ్ళు, ప్రాణాలను కోల్పోయారు.
ఈ పరిస్థితి ఇటీవల పోలీసుల జోక్యంతో మరింత దిగజారింది. ఓ పోలీసు వాహనం ఫణిగిరి దారి పై ప్రయాణిస్తోంది. దారి పక్కన వారికి ఆరుగురు మనుషులు నడుస్తూ కనిపించారు. ఎలాంటి ప్రశ్నలు వేయకుండా, వారెవరో కూడా కనుక్కోకుండా పోలీసులు ఆ ఆరుగురిని కాల్చి చంపారు. రోడ్డు పక్కనే వారి శవాలను కాల్చివేశారు. ఈ శవాలను కమ్యూనిస్టులు, రోడ్డు పక్కనే పాతిపెట్టారు. వారి సమాధులపై ఎర్రజండాలు పాతారు. ఈ సంఘటనకు ఉద్రిక్తులయిన ప్రజలు కమ్యూనిస్టులకు మద్దతు తెలపటం ప్రారంభించారు. రోడ్డును కొన్ని మైళ్ల వరకు ధ్వంసం చేశారు. చెట్లను నరికి దారికి అడ్డంగా పారేశారు. ప్రభుత్వం పట్ల ప్రజల విధేయత ఇలాంటి సంఘటనల వల్ల సన్నగిల్లుతోంది. పోలీసు దళాలు గ్రామాలపై దాడులు చేసి, జరిపే దమనకాండ, లూటీల వల్ల గ్రామ ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావనలు స్థిరపడుతున్నాయి. వారిలో విప్లవ భావనలు పెంచుతున్నాయి.
రాష్ట్రంలో పలు ప్రాంతాలు రజాకార్ల నియంత్రణలో ఉన్నాయి. ప్రజల నుండి రక్షణ ధనాన్ని వారు వసూలు చేస్తారు. ఎవరైనా ధనం ఇచ్చేందుకు నిరాకరిస్తే వారిపై దాడులు చేస్తారు, దోపిడీ చేస్తారు. ఇల్లు తగలబెడతారు. మేము గమనించినంత వరకూ ఈ దాడులు ధనవంతులపై జరుగుతాయి. పశ్చిమ మెదక్ ప్రాంతంలో రజాకార్లు పెద్ద సంఖ్యలో అణగారిన వర్గాల వారిని తమలో చేర్చుకున్నారు. రాత్రి పూట పద్ధతి ప్రకారం లూటీలు, దోపిడీలు, ఇళ్ళు కాల్చి వేయటాలు, హత్యలు సాగుతాయి.”
నేను ఈ నివేదిక ఒక ప్రతిని భారతదేశంలో యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధికి అందించేందుకు భారత రాష్ట్ర మంత్రిత్వ శాఖకు పంపించాను.
నిజామ్ సైన్యానికి పరోక్ష కమాండర్-ఇన్-చీఫ్, నిజామ్ పెద్ద కొడుకు, బేరర్ రాజకుమారుడు. గతంలో ఎన్నడూ లేని విధంగా, హఠాత్తుగా నిద్ర నుండి మేల్కొన్నట్టు ఆయన సైన్య కేంద్ర కార్యాలయానికి రావటం ఆరంభించాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన ఏమీ పట్టించుకునేవాడు కాదు. అగస్టు 3న, ఆయన ఎల్ ఎద్రూస్‌ను కలసి హైదరాబాదులో సైన్యం పరిస్థితి తెలుసుకోవాలని ఉంది కాబట్టి, మిలిటరీ ప్రణాళికల కాపీ కావాలని కోరాడు.
జనరల్ ఎద్రూస్ ఆశ్చర్యపోయాడు. కొద్ది రోజులలో మిలిటరీ ప్రణాళికను అందిస్తానని రాకుమారుడికి చెప్పాడు. తిన్నగా లాయక్ అలీ దగ్గరకు వెళ్లి ఏం చేయాలో సూచించమన్నాడు. రాజకుమారుడికి సైనిక ప్రణాళికల గురించి తెలపవద్దని లాయక్ అలీ అన్నాడు.
దాంతో ఆగ్రహంతో ప్రిన్స్ లాయక్ అలీకి ఓ ఉత్తరం రాశాడు. తనకు మిలిటరీ ప్రణాళికలు అందచేయక పోవటం సైనిక క్రమశిక్షణ రాహిత్యం అవుతుందన్నాడు. జనరల్ ఎద్రూస్ తన ఆజ్ఞలను పాటించకపోతే ఎద్రూస్ క్రింది అధికారులనన్నా సైన్యం నుంచి తొలగించాలి లేకపోతే ఎద్రూస్ సైన్యాన్ని వదిలివేయాలని అన్నాడు.
ఈ విషయం గురించి తెలిసిన వెంటనే నాలుగవ తారీఖున ఎద్రూస్ తన రాజీనామాను ప్రధానికి సమర్పించాడు. ఇది కూడా ప్రిన్స్‌కు ఆగ్రహం కలిగించింది. తనకు కాకుండా ప్రధానికి ఎద్రూస్ రాజీనామాను సమర్పించటం పట్ల ఆగ్రహం వ్యక్తపరిచాడు. రాజీనామాను తనకు సమర్పించాలని అన్నాడు. దాంతో జనరల్ ఎద్రూస్ తన రాజీనామా పత్రాన్ని ప్రిన్స్‌కు పంపించాడు. కానీ ఎద్రూస్ లేకపోతే గడవదని లాయక్ అలీ ప్రిన్స్‌కు చెప్పాడు.
ఇంతలో నిజామ్ ‘ప్రిన్స్ ఆఫ్ బేరర్’కు ఓ వర్తమానం పంపించాడు. సైనిక వ్యవహారాలలో ప్రిన్స్ తల దూర్చకూడదని హెచ్చరించాడు. దాంతో ప్రిన్స్ తన రాజీనామాను సమర్పించాడు. లాయక్ అలీ నిజామ్తో చర్చించిన తరువాత ఈ వ్యవహారం బహిర్గతమవకుండా అణచివేశాడు.
అయితే, అర్ధరాత్రి సమాచారంతో ఆల్ ఇండియా రేడియో ఈ రాజీనామా వ్యవహారాన్ని ప్రకటించింది! ఇది లాయక్ అలీకి ఆగ్రహం కలిగించటమే కాదు, హైదరాబాదులో నిరాశను కలిగించింది.
ఆగస్టు నెలలో, నిజామ్ చివరి సంతానం, నిజామ్కు అత్యంత ప్రియమైన పుత్రుడు మూఅజ్జమ్ ఝా – నిజామ్కు ఓ లేఖ రాశాడు. హైదరాబాద్‌ను వినాశనం వైపు నడిపిస్తున్నాడు నిజామ్ అని ఆ లేఖలో ఆరోపించాడు. తనకు వాగ్దానం చేసిన విధంగా నిజామ్ అయిదు కోట్ల రూపాయలు తనకు ఇస్తే, తాను భారతదేశంలో హాయిగా, భద్రంగా బ్రతుకుతానని ఆ లేఖలో రాశాడు. ఆయన రాసిన ఉత్తరంలో కొన్ని విషయాలు దయనీయంగా ఉంటాయి.
“మాంక్టన్ మన శ్రేయోభిలాషి. ఆయన అసహ్యపడి మనల్ని వదిలి వెళ్ళాడు. హైదరాబాదుకు అతి గొప్ప మిత్రుడు మౌంట్‌బాటెన్. ఆయనతో శత్రుత్వం వహించి ఆయనను తరిమి వేశాం. మనకు స్నేహితుడిలా ఇక్కడికి వచ్చాడు మున్షీ. సర్ అక్బరీ హైదర్ కాలం నుంచి మున్షీ నాకు తెలుసు. ఆయన మనకు ఎంతో ఉపయోగపడేవాడు. అతడితో మనం శత్రువులా వ్యవహరించాం. మీరు భారతదేశంతో శాంతిపూర్వకంగా వ్యవహరిస్తే, హైదరాబాద్ ప్రజలు సంతోషిస్తారు.. హైదరాబాదును రక్షించినట్టు అవుతుంది.. అసిఫియా వంశం కొనసాగుతుంది.”
తనకు విశ్రాంతి అవసరం అని, ఉప ప్రధాని పింగళి వెంకట్రామ రెడ్డి బెంగుళూరు వెళ్లిపోయాడు..
ఇప్పుడు రజాకర్ల ముందున్న పెద్ద లక్ష్యం ఏమిటంటే, నిజామ్, ఎట్టి పరిస్థితులలో లాయక్ అలీ మంత్రివర్గాన్ని తొలగించకుండా కాపాడటం.
లార్డ్ మౌంట్‌బాటెన్ వెళ్లిపోవటం, వాల్టర్ మాంక్టన్ అందుబాటులో లేకపోవటం వల్ల తానున్న ప్రమాదకర పరిస్థితి నిజామ్కు అర్థమయింది. దాంతో తన చుట్టూ తాను నిర్మించుకున్న బంధనాలను తెంచుకోవాలని నిజామ్ చివరి ప్రయత్నం చేశాడు. మొదటగా ‘హోష్’ తో నిర్మొహమాటమైన సంభాషణ జరిపాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ సంభాషణలో హోష్ నిజామ్కు కొన్ని సలహాలు ఇచ్చాడు. నిజామ్ నన్ను కలవాలి. మంత్రివర్గాన్ని మార్చాలి. భారత్‌లో విలీనమవ్వాలి. అవసరమైతే భారత సైన్య సహాయంతో రజాకార్లను అణచి వేయాలి. ఈ సంభాషణతో నిజామ్లో భయం వెుదలయింది.
జరుగుతున్న పరిణామాల గురిచి హోష్ యార్ జంగ్, మీర్జా ఇస్మాయెల్‌కు చెప్తూనే ఉన్నాడు. హైదరాబాద్ వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి వరకూ తీసుకుకెళ్ల వద్దని మీర్జా ఇస్మాయెల్ నిజామ్కు సలహా ఇచ్చాడు. రాజకీయ అజ్ఞాతవాసంలోకి వెళ్లిన అలీ యావర్ జంగ్‌ను నిజామ్ పిలిపించాడు. ఐక్యరాజ్యసమితిలో హైదరాబాదుకు మద్దతు సాధించమన్న నిజామ్ కోరికను అలీ యావర్ జంగ్ తిరస్కరించాడు. హైదరాబాదులో అమలులో ఉన్న రాచరికం, రజాకార్ల అరాచకాలతో తాను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందు నిలవలేనని అన్నాడు.
ఈ సమయంలో అలీ యావర్ జంగ్ పంపినట్టుగా నాకో సమాచారం అందింది. నిజామ్తో ఆయన సంభాషించాడు. నిజామ్ మంత్రివర్గాన్ని మార్చాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంతో చర్చలు జరపటానికి భారత్ సుముఖంగా లేదని ఓ ప్రకటనను భారత ప్రభుత్వం విడుదల చేస్తుందా? ఇప్పటికే పండిట్జీ, సృష్టంగా చెప్పారు, లాయక్ అలీ మంత్రివర్గంతో భారత ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని. మళ్లీ ప్రత్యేకంగా ప్రకటన ఇవ్వాల్సి పని లేదని అన్నాను.
భారత్, హైదరాబాదుల నడుమ యుద్ధం తప్పని పరిస్థితులు నెలకొనటంతో, ఏడుగురు ధైర్యవంతులైన ముస్లింలు, రజాకార్ల చర్యలను ఖండిస్తూ, భారత్‌లో విలీనమవటాన్ని సమర్థిస్తూ ప్రకటనను ప్రచురించారు. ఇది పెద్ద తుఫానును సృష్టించింది. పలువురు ఈ ప్రకటనను విమర్శించారు. ఈ ప్రకటన వెనక ఉన్న ఉద్దేశాన్ని పలువురు ప్రశ్నించారు. కొందరు ఇంకా ఓ అడుగు ముందుకు వెళ్ళి, ఈ ప్రకటన ఇచ్చిన వారిలో ఒకరి తండ్రి పేరు మీర్ జాఫర్ అని ప్రచురించారు. ఈ విషయాన్ని ‘హైదరాబాద్ ఇన్ రిట్రాస్పెక్ట్’ అన్న పుస్తకంలో అలీ యావర్ రాశాడు.
ఈ ధిక్కారాన్ని లాయక్ అలీ, ఇత్తెహాద్లు తీవ్రంగా పరిగణించాయి. ఈ ప్రకటన నిచ్చిన ఏడుగురు పెన్షనర్లు కావడంతో వారి పెన్షన్‌ను నిలిపి వేయమని ప్రభుత్వం సూచించింది. వారిని క్షమించమని నిజామ్ అభ్యర్థించాడు. దాంతో ఈ ప్రకటన వెనుక నిజామ్ హస్తముందని ఇత్తెహాద్ అనుమానించింది.
లాయక్ అలీ అనుమతితో సహాయానికి నిజామ్ మీర్జా ఇస్మాయెల్‌కు ఆహ్వానం పంపటంతో ఈ అనుమానం బలపడింది. సర్ మీర్జా ఢిల్లీ వెళ్ళాడు, అప్పటి భారత గవర్నర్ జనరల్ రాజగోపాలచారికి అతిథిగా. న్యూ ఢిల్లీలో హైదరాబాద్ పట్ల అభిప్రాయం స్థిరపడిందని కనుగొన్నాడు. ఇప్పుడు చర్చలకు సంబంధించిన సంపూర్ణ నిర్ణయం సర్దార్ చేతిలో ఉందనీ, ఎట్టి పరిస్థితులలోనూ మౌంట్‌బాటెన్ ప్రతిపాదనల ఆధారంగా సర్దార్ చర్చించే ప్రసక్తి లేదని గ్రహించాడు.
ప్రమాదకరమైన పరిస్థితిని మీర్జా అర్థం చేసుకున్నాడు. నిజామ్కు అసలైన శ్రేయోభిలాషి అతను. అందుకని, మంత్రివర్గాలతో సంప్రదించకుండా, మౌంట్‌బాటెన్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపమన్నాడు. అవసరమైతే తన ప్రభుత్వం నుంచీ, రజాకార్ల నుంచీ రక్షణ కల్పించేందుకు భారత్ సైన్యాన్ని ఆహ్వానించవచ్చని సూచించాడు.
ఈ లేఖను నిజామ్కు అందించింది నవాబ్ జైన్ యార్ జంగ్. అతడిని గద్దార్ (మోసగాడు) గా గుర్తించి చంపేయాలని ఇత్తెహాద్ ఎప్పుడో నిర్ణయించింది.
జూలై 29న మీర్జా ఇస్మాయిల్ మరోసారి నిజామ్కు టెలిగ్రామ్ ఇచ్చాడు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, లాయక్ అలీని ఢిల్లీకి పంపితే, విషయాన్ని పరిష్కరించవచ్చని కోరాడు. లాయల్ అలీని ప్రధానిగా తొలగిస్తారని హోష్ నమ్మకంగా ఉన్నాడు.
ఇత్తెహాద్లలో ఆందోళన పెరిగింది. వాళ్ళకు హోష్ అన్నా, మీర్జా అన్నా, జైన్ యార్ జంగ్ అన్నా, అమితమైన ద్వేషం. మౌంట్‌బాటెన్ ప్రతిపాదనల ఆధారంగా సమస్య పరిష్కారానికి వారు ప్రయత్నిస్తున్నారని ఇత్తెహాద్లకు అనుమానం. లాయక్ అలీ మంత్రివర్గాన్ని మార్చాలనీ, నిజామ్ అందుకు సుముఖంగా ఉన్నాడనీ వారికి తెలుసు.
ఇత్తెహాద్ వెంటనే ఎదురు దాడికి దిగింది. నిజామ్ తుఫానులో చిక్కుకున్నాడు. ఇత్తెహాద్ పత్రిక ‘పర్చమ్’ నిజామ్ తన మంత్రివర్గంపైనే కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించింది. భావనలు తీవ్రమయ్యాయి. రజాకార్లు కత్తులు ఝుళిపించారు. నిజామ్ కనుక భారత సైన్యాన్ని సహాయం కోసం అర్థించాడో, భారత్ సైన్యం రక్షించేందుకు నిజామ్ మిగలడని రజాకార్లు దీన్ యార్ జంగ్‌ను హెచ్చరించారు.
ఆగస్టు 2న హైదరాబాద్ చట్టసభలో మాట్లాడుతూ, లాయక్ అలీ భారత్‌కు సవాలు విసిరాడు.
“మేము ఎంతో ఆలోచించిన తరువాత, మానవ రక్తం ఏరులై పారకుండా ఉండేందుకు, నష్టం జరగకుండా ఉండేందుకు ఓ నిర్ణయానికి వచ్చాము. హైదరాబాద్ సమస్యను ఐక్యరాజ్యసమితి ముందుంచాలని నిశ్చయించాము. ఆ సంస్థ మన సమస్యకు శాంతియుత పరిష్కారం కనుక్కుంటుందని ఆశిద్దాం.”
ఆ తరువాత ఆయన ఐక్యరాజ్యసమితికి వెళ్ళే బృందాన్ని ప్రకటించాడు. గత నాలుగు నెలలుగా అనుభవించిన ఉద్విగ్నతలను, ఒత్తిళ్లను ప్రస్తావించాడు. ఈ ఉపన్యాసంలో భారత ప్రభుత్వం గురించి ఈ రకంగా అన్నాడు.
“వాళ్లు మనల్ని ఒప్పించాలని ప్రయత్నించవచ్చు. మనల్ని ఎలాంటి కష్టాలకయినా గురి చేయవచ్చు. వాళ్ల సైన్య శక్తితో మనల్ని గెలవవచ్చు. కానీ మనం మన పట్టుదలను సడలించం. మన స్వతంత్రాన్ని త్యాగం చేయం. అనేకానేక చేదు అనుభవాల నుంచి హైదరాబాద్ మరింత ఆశతో, మరింత స్వయం శక్తితో, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత శక్తివంతమై నిలుస్తోంది. నైతిక విలువల పరంగా, భౌతిక శక్తిపరంగా హైదరాబాదు మరింత శక్తివంతమయింది. గతంలో కన్నా అధికంగా భవిష్యత్తు వైపు ఆశావహమైన దృష్టి ప్రసరిస్తోంది.”
ఇది భారత్ వ్యతిరేకత కాదు, నిజామ్కు వ్యతిరేకంగా ఇత్తెహాద్ పలికిన పలుకులు. నిజామ్ రేడియో, మీర్జాను, జైన్ యార్ జంగ్‌ను ద్రోహులని ప్రకటించింది. ఇత్తెహాద్లు ఈ ఇద్దరినీ విమర్శిస్తూ ప్రకటన జారీ చేశారు.
హైదరాబాద్ వ్యవహారంలో మీర్జా జోక్యాన్ని నిజామ్ రేడియో ఖండించింది. నిజామ్ ప్రోద్బలంతో మీర్జా ఢిల్లీ వెళ్ళిన వార్తలను రేడియో ఖండించింది. గౌరవప్రదమైన రీతిలో ఒప్పందాలు జరుగుతాయన్న వాగ్దానం భారత ప్రభుత్వం చేస్తే లాయక్ అలీ ఢిల్లీ వెళ్తాడని ప్రకటించింది.
లాయక్ అలీ ఉపన్యాసం గుంచి, మీర్జాను ఆయన విమర్శించటం గురించి తెలుసుకున్న నిజామ్ ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. కొత్త మంత్రివర్గ ఏర్పాటు గురించి హోష్తో చర్చించాడు. మీర్జాకు ఆయన రెండు ఉత్తరాలు రాశాడు. ఒకటి అధికారికంగా, రెండవది వ్యక్తిగతంగా. మీర్జాను హైదరాబాదుకు రమ్మని ఓ ఉత్తరంలో నిజామ్ అభ్యర్థించాడు.
ఈ విషయంలో నా సలహాను అడిగాడు మీర్జా. నిజామ్ తన మంత్రివర్గాన్ని మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన హైదరాబాదు రావటం మంచిదే. అతడిని నేను హైదరాబాద్ రమ్మన్నాను. కానీ సాయంత్రం కల్లా, మీర్జాను హైదరాబాద్ రావద్దన్నానని, హైదరాబాద్ వస్తే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని హెచ్చరించానని హోష్ నాకు తెలిపాడు.
ఇప్పటికే ఇత్తెహాద్లు భయంతో రగిలిపోతున్నారు. నిజామ్ మౌంట్‌బాటెన్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు నిశ్చయించాడనీ, లాయక్ అలీ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తున్నాడనీ వారు నమ్మారు. ఈ చర్యను వ్యతిరేకించే విధానంపై చర్చలు జరిగాయి. బీదర్‌లో ఓ సమాంతర ప్రభుత్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన గురించి చర్చించారు. కానీ ఇత్తెహాద్లను నిరాశ అవహించింది.
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ప్రసాదం
బతుకు విలువ
కోయిల
నారద భక్తి సూత్రాలు-7
జానేదేవ్-17
అద్వైత్ ఇండియా-16
రా అక్కా, రాఖీ కట్టు!
ఉమ్మడి పాలమూరు జిల్లా కవులకు, కళాకారులకు ఉగాది పురస్కారాలు 2024 – వార్త
సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-5
సిరివెన్నెల పాట – నా మాట -1..ఈ పాట.. అసామాన్య దార్శనికుడి గొప్ప మార్గదర్శనం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®