[తాటికోల పద్మావతి గారు రచించిన ‘నిత్య మృత్యుంజయుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చెట్టుమీద ఆకులు పండి రాలిపోయి
నవజాత శిశువుకు జన్మనిచ్చినట్లు
కొత్త చిగుళ్ళు తొడుగుతాయి.
వాటి జీవితం ముగిసిపోయాక రాలిపోతాయి
మనిషి బతుకు మీద ఆశలు కోల్పోకుండా
నిత్య చైతన్యంతో తొనిగిసలాడటమే
జీవన మార్గమని తెలుసుకో!
మరణ భయం వెంటాడుతూనే ఉంటుంది.
ఏదో ఒక రోజు పండుటాకులా
రాలిపోవలసిందే.
సంపాదించిందంతా ఎలా కాపాడుకోవాలని తపనతో
సుఖ సంతోషాలకు దూరమై
ఐశ్వర్యాన్ని చూసుకుంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ
రోగాలను చేరదీయక తప్పదులే.
జీవితంలో తేనెజల్లుల కురిసిన చోటే
వడగళ్ల వానలు కురుస్తాయి.
నీతి, న్యాయం ధర్మాన్ని తప్పి
అవినీతి సంపాదనతో ఎంతకాలం
సుఖభోగాలను అనుభవించాలనుకుంటావు.
ఐశ్వర్యం పెరిగినా ఆయుర్దాయం పెరగదు.
ఈ దేహం శాశ్వత నిద్రలోకి జారకముందే
వృథాగా మట్టిలో కలిసిపోయే బదులు
ఖాళీ బూడిద కాకముందే
మరో నలుగురికి దాతవై
దైవ స్వరూపంగా నిలబడు.
మరొకరి దేహంలో చిగురులు వేసి
ప్రాణం నిలబడితే
మనసుకు ప్రక్షాళన చేసుకున్నట్లు ఉంటుంది.
శ్వాస ఆగిపోయే లోగా ఆలోచించుకో.
అస్తమించిన కట్టెల్లో కాల్చేయ బదులు
అవయవ దానం కొరకు అభాగ్యుల పాలిట
చిరు ప్రయత్నం సఫలీకృతం చేసుకో.
పరుల సుఖదుఃఖాల్లో పాలుపంచుకుంటే
దడిచి దేహంలో పరోపకారమై కైంకర్యం చేయాలి.
ఇంతకు మించిన పరమార్థం ఉన్నదా?
దైవ పూజ కన్నా అవయవదానం ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
ఎలా బతికావ్ అన్నది కాదు.
ఎలా మరణించావు అన్నది కావాలి.
నలుగురి కోసం నీ దేహం దేవాలయం చేయాలి.
మరణించిన నిత్య మృత్యుంజయడవు కావాలి.
మనిషన్నాక ఏదో ఒక ఆశయం ఉండాలి.
సూర్యుడు అస్తమించిన చంద్రోదయం కాక ఆగదు.
జీవితం ఆశావహం రేపటి కోసం తాపత్రయం.
ఇప్పుడే ఈ క్షణమే శాశ్వతం.