Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిత్య కృషీవలుడు

[శ్రీ సూరిబాబు కోమాకుల రచించిన ‘నిత్య కృషీవలుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మెతుకు కోసం బతుకు బలి చేసినవాడు
ఎండనక వాననక తెగ తిరిగేవాడు
అరిగిన చెప్పులతో అప్పులతో సతమత మయ్యేవాడు
భార్యాబిడ్డల బాగోగులపై సోయి లేనివాడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

సుఖమెరుగని కష్టజీవి
కన్నీరుకు జంకని కారుణ్యమూర్తి
చుక్క కోసం మేఘాల వంక లెక్క లేనన్ని సార్లు ఎక్కి చూసేవాడు
వాన చినుకును ఒడిసిపట్టి బంగారు తొట్టెలో దాచేవాడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

పట్టెడు ఆశతో పొలంలో కళ్ళెం తిప్పేవాడు
బంక మట్టిలో కాలు వేసి కదం తొక్కే వాడు
అరికె పట్టి నాగలిని చదును పెట్టి దూడలను కట్టి
దుక్కి దున్ని తన సంతోషాన్ని ఎగసి పట్టేవాడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

బక్క. చిక్కిన వన్నెకాడు
బక్కపలచనీ చక్కనోడు
చుక్కలొంక తొంగి చూసి
చక్కనైన ఆశలు జూడ గట్టెటోడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

పొలం గట్టు మీద కునుకు తీసువాడు
హలం లేక పోతే జలం లేకపోతే
బలం లేక జాలు వారేవాడు
జలం కోసం పాకులాడేవాడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

ఆరుగాలం పుడమి మీద బ్రతికే బిడ్డ
పరుల ఆశని నమ్మని ఇల్లు అతని అడ్డ
ఒరుల నీతిని నమ్మి పరుల రీతికి దొడ్డ
కరుణ కలిగిన బిడ్డ మన ముందు గడ్డ
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

కలిగినంత వరకు కలిమి పెట్టువాడు
బలిమి నైనా కూడా చేయి చాచనివాడు
ఓరుల పంచని బ్రతుకు నేర్వనివాడు
ఉన్నప్పుడు తిని లేనినాడు కాలం గడిపేవాడు
ఎవడు వాడు.. ఇంకెవవడు మన రైతు బిడ్డ

కరువు కాటకాలకు ఎదురీదువాడు
కష్ట నష్టముల కోర్చి కుదురుకొనేవాడు
వరుణ దేవుని గూర్చి అంగలార్చేవాడు
వాన రాకను చూసి గెంతులేసేవాడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

కంటికి కునుకు లేనివాడు
ఒంటికి బట్ట లేనివాడు
ఇంటికి పదును లేనివాడు
బ్రతుకుకు బ్రతుకే లేనివాడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

కాని పనులు చేయని వాడు
కన్న వాళ్లను కంటికి కాచువాడు
వేష భాషలు తెలియనివాడు
వెర్రి వేషాలు వేయనివాడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

ఉన్నంతలో తినేవాడు
లేనంత పస్తులుండేవాడు
ఉన్నప్పుడు ఉరికురికి
లేనప్పుడు గుంజువాడు కాదు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

చెలిమి కోరే చెలికాడు
బలిమి నైనా బతుకుచెడ నొడు
దారి తప్పని బాటసారుడు
మడమ తిప్పని మనవోడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

కటిక నేల వాడికి కల్ప తరువు
కన్న తల్లి వాడికి పొలం ఒడి
బిడ్డనైనా వదులు పొలం పనికి
పొలం లోనే వాడికి బలం చేరు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ.

ఎడ్ల బండి మీద పరుగు తీసే వాడు
వడ్ల బండి నెక్కి పదం తీసే వాడు
పరుగు పరుగున ఇంటి దారి తీసే వాడు
ధాన్య సంపద చూపి ఇంటిల్లి పాది సంతసించు వాడు
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

భరత మాతకు ముద్దుబిడ్డ వాడు
భారతావనికి జాతి రత్నము వాడు
వాడు లేని బ్రతుకే లేదు మానవ జాతికి
భారత రత్న ఇవ్వాలి వాడికే
ఎవడు వాడు.. ఇంకెవడు మన రైతు బిడ్డ

Exit mobile version