[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన గొర్తి వాణి శ్రీనివాస్ గారి ‘నిశ్శబ్ద యుద్ధం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
నిర్మలమైన ప్రశాంతతను ఆవాహన చేసుకున్న దట్టమైన అడవి, చంద్రకాంతుల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ నిశ్శబ్ద ధ్యానంలో మునిగిన ఆ రాత్రి వేళలో..
టప్ టప్ మని ఆకులు రాలుతున్న శబ్దం అడవికి జోలపాడుతున్నట్టుంది.
మంద్రంగా వేస్తున్న గాలి చెట్ల తనువుల్ని వుయాలలోపుతున్నట్టుంది. ఇంకా తెల్లారదేమని అప్పుడప్పుడూ అరుస్తున్న పక్షులు. మౌనమునిలా వున్న అడవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిశ్శబ్దాన్ని ఛేసిస్తూ కట్ కట్ మని గొడ్డలి శబ్దం అడవిని ఉలిక్కి పడేలా చేసింది. పక్షులన్నీ చెట్లమీద నుంచి లేచి అరుస్తూ గోల చేశాయి.
అడవి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ ఎవరిదో కరుకు గొంతు “త్వరగా కానీయండి. తెల్లారిపోకుండా ఇక్కడినుంచి మనం వెళ్ళిపోవాలి” అనగానే
కట్ కట్ శబ్దం మరింత పెరిగింది. చెట్ల దేహాలపై గొడ్డళ్లు నిర్దాక్షిణ్యంగా వీర విహారం చేశాయి. మహా వృక్షాలన్నీ ఒక్క ఉదుటన పటపటమని విరుగుతూ నేలకొరిగాయి. చీకటి చాటున జరిగిన వృక్షమేధానికి
పంచభూతాలు మౌన సాక్షులుగా నిలిలాయి. ఎంతో శక్తిసంపన్నమైన జగత్తు కూడా కాలం అధీనం కావడంవల్ల సమయం వచ్చేదాకా వేచి వుండాలనే సందేశాన్ని అడవికి పంపింది. చెట్ల దుఃఖాన్ని ధరిత్రి ఒడిసిపట్టింది.
తెలతెలవారుతుండగా దుంగలతో నిండిన లారీలు ఊరు దాటాయి. అడవి ఆవేదన గ్రహించిన ఆదిత్యుడు బరువెక్కిన హృదయంతో తీక్షణంగా ఉదయించాడు.
***
ఒడిశాలోని నయాగర్ పట్టణం నుంచి 35 కిలోమీటర్ల లోపలికి దాసపల్లా రేంజ్ విమరా గ్రామం. జూన్ మాసం. బసు మాత (భూమాత) పండుగరోజు.
ఆ ఊరి ఆడపిల్ల సుభద్ర పిఠాలు (పిండివంటలు) చేయడానికి తల్లి బబితకు సహాయం చేస్తోంది.
ఆ గ్రామంలోని ఆడపిల్లలు కొత్తబట్టలు కట్టుకుని వుయ్యాలలు ఉగుతుంటే సుభద్ర తల్లి చేసిన పీఠాలను, వాళ్ళ ఆచారం ప్రకారం అందరికీ పంచిపెట్టింది. వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళల్లో చేసినవి తీసుకొచ్చి ఇచ్చారు.
భూమాతకు ఆయుధాలు అప్పజెప్పే రోజు. పురుషులంతా సంప్రదాయ దుస్తులు ధరించి తలపై పక్షుల ఈకలు పెట్టుకుని, డప్పులు వాయిస్తూ సామూహికంగా వెళ్లి భూమాతకు కొడవలి, గొడ్డళ్లు పెట్టి పూజలు జరిపారు. పురుషులందరూ సాల్ చెట్ల కింద విప్పసారా తాగుతూ సంబరాలు చేసుకున్నారు. పన్నెండు రోజుల్లో పదమూడు పండుగలు జరుపుకుంటారు వాళ్ళు. బసు మాత మొదటి రోజు పండుగ ‘పహిల రాజా’ రెండవరోజు, ‘సహీ రాజా’, మూడవరోజు ‘బసి రాజా’ మూడు రోజుల పండుగగా పిలుచుకునే భూదేవి పండగ మూడవ రోజున సుభద్ర తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటోంది. సుభద్ర వయసు పంతొమ్మిదేళ్ళు. ఇంకా మనువు చేయట్లేదని ఎంతమంది అన్నా బబిత దంపతులకు ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా చూసుకుంటారు. చిన్న పిల్లే కదా. వచ్చేఏడాదికి చేస్తానని చెప్తాడు సుభద్ర తండ్రి కేశి.
సుభద్ర స్నేహితురాళ్ళు ఆడుకునేందుకు దగ్గర్లో వున్న అడవి దగ్గరకు వెళ్లారు. “ఈ అడవి ఒకప్పుడు మా ఇంటి ముందు వుండేదని మా అమ్మ చెప్పింది. నరికివేయడం వలన చాలా దూరంగా వెళ్ళిపోయింది” అని చెప్పింది సుభద్ర.
“అవును మేమూ విన్నాం” అన్నారు స్నేహితురాళ్ళు.
వాళ్లకి ఆ అడవి ఆటస్థలం. చిన్నప్పటినుంచీ అడవితో అనుబంధం వుండటంవల్ల భయం లేకుండా అక్కడికి వచ్చిపోతుంటారు.
సుభద్రకు కళ్లగంతలు కట్టి చెట్ల వెనక దాక్కుని చప్పట్లు కొట్టి పిలుస్తూ అల్లరి చేస్తూ ఆటపట్టిస్తున్నారు. సుభద్ర చేతులు చాచి తడుముతూ వాళ్ళని వెతుకుతూ స్నేహితురాలు అనుకుని ఒక పెద్ద చెట్టు కాండాన్ని కౌగలించుకుంది. ఆ క్షణంలో ఆమెకు విచిత్రమైన అనుభూతి కలిగింది. చెట్టుని రెండు చేతులతో పెనవేసి పట్టుకొని కాండానికి చెవి అన్చింది.
వృక్షం అంతరంగం కల్లోలానికి గురైనట్లుగా వింతగా తోచింది. తమ ప్రాణాలకు రక్షణ లేదన్న భయంతో బిక్క చచ్చిపోయిన చెట్ల మనోఘోష ఆమెకు మాత్రమే వినపడటం ఆశ్చర్యం కలిగించింది. కళ్ళగంతలు తీసేసి చుట్టూ చూసింది. తనకు ఎంతో పరిచయం ఉన్న చెట్లే తనకు అత్యంత ఆప్తులైన మిత్రులే. తను రాగానే ఎప్పుడూ పులకరిస్తూ పలకరించే ఆ చెట్లలో కాంతి లేదు. జీవం లేదు. జీవధారను కోల్పోయిన నిస్తేజం నిండినట్టుగా అనిపించింది
ఇలా ఎందుకు అయిందని తన స్నేహితులను అడిగింది. వాళ్లు కూడా అడవిలో నడుస్తూ ఎందుకో తేడాగా ఉంది ఈరోజు అని చెప్పారు .
అందరూ కలిసి కొంత దూరం వెళ్లి చూస్తే అక్కడ నరకబడిన చెట్ల మోడులు, అడవి నిస్సహాయతకు ఆనవాళ్ళుగా కనిపించాయి.
“రాత్రివేళల్లో ఎవరో వచ్చి చెట్లను నరుక్కుని వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఈ అడవంతా నరుక్కుంటూ పోతే, ఇక మనకి వంట చెరకు, పశుగ్రాసం కూడా దొరకదు. వాళ్లెవరో మనం కనిపెట్టాలి. అడవిని ఈ రకంగా నరికేస్తే ప్రాణుల వునికికే ప్రమాదం. ఇందులో నివసించే పక్షులు, జంతువులకు చోటులేక గ్రామాల్లోకి వచ్చేస్తాయి.” సుభద్ర మాటలకు ఆమె స్నేహితురాళ్ళు కూడా అవునన్నారు.
“మనం ఉండాల్సిన చోట అవి, అవి ఉండాల్సిన చోట మనం జీవవైవిధ్యం దెబ్బతింటుంది కదా. మనం ఏదో ఒకటి చేయాలి. రాత్రిపూట దొంగల్లా వచ్చి ఇన్ని చెట్లు నరుక్కుపోయారంటే వాళ్ళు సామాన్యులు గారు. మన ఊర్లోకి వెళ్లి అందరికీ చెబుదాం పదండి” అంటూ స్నేహితురాళ్లతో కలిసి ఊళ్లోకి వచ్చిన సుభద్ర అడవిలో జరిగిన విషయం అందరికీ చెప్పింది.
కానీ ఏ ఒక్కరిలో బాధ కానీ, చలనం గానీ లేవు. “అడవి ఫారెస్ట్ వాళ్ళ అధీనంలో ఉంటుంది. దాని సంగతి వాళ్ళు చూసుకుంటారు. మనకెందుకు ఊరుకో నువ్వు ఇకనుంచి అడవికి వెళ్లకు” అని చెప్పాడు సుభద్ర తండ్రి.
స్నేహితురాళ్ళంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.
సుభద్రకి మాత్రం అడవి ఆక్రందన చెవుల్లో మారుమోగుతోంది. చెట్టును కౌగిలించుకున్నప్పుడు వాటి గుండె ఘోష తన మనసుకు వినబడింది. అవి రక్షించమంటూ ఎంత వేడుకుంటున్నాయో. కనీసం మానవత్వం లేకుండా వాటిని ఇష్టానుసారం నరికేస్తుంటే ఎవరూ పట్టించుకోకపోతే ఎలా? ఎలాగైనా ఈ రాత్రికి అడవికి వెళ్ళాలి. ఎవరు నరికేస్తున్నారో చూడాలి. వాళ్ళని ఫారెస్టు ఆఫీసర్లకి పట్టివ్వాలి అనుకుంటూ రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూ గడిపింది సుభద్ర.
ఆమె అనుకున్నట్టుగానే ఆ రోజు సూర్యుడు త్వరగా అస్తమించాడు. చంద్రకాంతలు మెల్లిమెల్లిగా గ్రామం పై విస్తరిస్తున్నాయి.
తల్లి పెట్టిన భోజనం తిని త్వరగా పడుకుంటానని చెప్పి వెళ్లి మంచం మీద పడుకుంది. ఆమె దృష్టి అంతా అడవి మీదే ఉంది.
బయటికి చూస్తే ఆకాశంలో చుక్కలు దిక్కులను మెరిపిస్తున్నాయి. సుభద్ర మెల్లిగా లేచి దొడ్డి తలుపు తీసుకుని అడవి వైపు నడక సారించింది. చుక్కల వెలుగు ఎంత ఉన్నా చెట్ల నీడలు చిక్కటి చీకటిని స్వాగతిస్తున్నాయి. సుభద్ర నడక వేగం పెంచి అడవి వైపు కదిలింది. అడ్డుగా ఉన్న కంపలను ముళ్ళను దాటుకుంటూ అడవి మధ్యలోకి వెళ్ళేసరికి అక్కడ ఏదో శబ్దం వినబడటంతో ఆగి ఒక చెట్టు చాటున నిలబడింది. దూరంగా పెట్రో బాక్స్ లైట్లు వెలుగు.
కొందరు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. బీడి కాలుస్తూ కొందరు వ్యక్తులు వున్నారు. పొగాకు వాసన గుప్పుమని వ్యాపిస్తుంది. సుభద్ర ముక్కు మూసుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. కాల్చిన బీడీలు ఆర్పకుండానే విసిరేసి గొడ్డలి తీసుకుని చెట్లు నరకడం మొదలుపెట్టారు వాళ్ళు.
దూరంగా ఆగిన లారీలు సుభద్ర అనుమానానికి సమాధానాలుగా నిలబడి ఉన్నాయి.
ఇప్పుడు వెంటనే వెళ్లి ఊళ్లో వాళ్ళని తీసుకురావాలి అని అనుకుంటూ ఉండంగా ఆమె భుజంపై ఒక చేయి పడింది
ఆమెక కెవ్వున అరవబోయేంతలో ఒక చెయ్యి ఆమె నోరు మూసి వెనక్కి లాగింది. ఆమె కళ్ళు పెద్దవి చేసి తిరిగి చూసి అక్కడ కనిపించిన వ్యక్తిని రామూ అని మెల్లిగా పిలిచింది.
“ఈ వేళప్పుడు ఇంత అడవిలోకి ఎందుకు వచ్చావు? ఎంత ప్రమాదమో తెలుసా? ఈరోజు నువ్వు ఊళ్లో చేసిన హడావిడిని బట్టి ఇలాంటి పనేదో చేస్తావని ఊహించే నేను మెలకువగా ఉన్నాను. అనుకున్నట్టే నువ్వు అడవి వైపు రావడం చూసి నిన్ను వెంబడిస్తూ వచ్చాను. పద పోదాం” అన్నాడు రాము సుభద్ర చేతిని పట్టుకుని వడివడిగా ముందుకు నడుస్తూ. ఆమె కూడా అతన్ని అనుసరిస్తూనే
“రామూ, చూసావా వాళ్ళు ఏం చేస్తున్నారో?! అడవిని అక్రమంగా నరికేస్తున్నారు. ఊళ్లో వాళ్ళని పిలుచుకొచ్చి సాక్ష్యం చూపిద్దాం” అంది అతని వేగానికి తగ్గట్టుగా నడవలేక ఆయాస పడుతూ.
“సరే, ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. వాళ్లు మనల్ని పసిగట్టారంటే ఇక అంతే మన పని” అంటూ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమెను అడవిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఇంటి వైపుకి వడివడిగా అడుగులు వేశారు.
రాము ఆ గ్రామంలో యువకుడు .
సుభద్ర ఇంటి దగ్గరే ఉండే ఒక పాతికేళ్ల కుర్రాడు. అతను పక్క గ్రామంలో ఉండే దేవాలయంలో పూజలు చేయడంతో పాటు తనకున్న రెండు ఎకరాల పొలాన్ని దున్నుకుని, వ్యవసాయం చేస్తూ ఉంటాడు. చిన్నప్పటినుంచే కలిసి పెరగటం వల్ల అతనికి సుభద్ర అంటే ఎంతో ఇష్టం.
“రామూ, మనం ఈ విషయం అందరితో చెబుదాం. అందరినీ నిద్ర లేపుదాం పద” అంది సుభద్ర.
“అలా ఏం వద్దు. నువ్వు ముందు మీ ఇంటికి వెళ్ళు. ఇంకెప్పుడూ ఇలా ఒంటరిగా బయటికి రాకు”
అని చెప్పి ఆమెని ఇంట్లోకి పంపించాడు. ఇంట్లోకి వెళ్లిన ఆమె అడవి వైపే చూస్తోంది. తల్లిదండ్రులు గాఢనిద్రలో వున్నారు. ఆమె చూస్తున్న అడవి నుంచి మంటలు వ్యాపించి ఆకాశం ఎర్రటి రంగు పులుముకుంది. సుభద్ర మనసులో ఆందోళన నిండిపోయింది. అడవికి వచ్చిన కష్టాన్ని తలుచుకుని దుఃఖించింది. ఎర్రటి మంటల చితిలో చిట్ చిట్ మనీ పచ్చిగా ఉన్న చెట్లు కాలిపోతున్నాయి. బీడీలు తాగి ఎండుటాకుల మీద విసిరేయడం వల్ల చెట్లు తగలబడి పోతున్నాయి.
ఏం మనుషుల వీళ్ళు?! మానవత్వం కూడా లేదా. కనీసం గ్రామస్థులైనా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఆ రాత్రంతా సరిగా నిద్రపోలేదు సుభద్ర.
మర్నాడు స్నేహితురాళ్ళతో కూర్చుని రాత్రి జరిగిన విషయం అంతా చెప్పింది..
“నువ్వు చెప్పింది వింటే మాకు చాలా బాధగా ఉంది కానీ మనం ఏం చేయగలం. చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి లారీలలో వేసుకుని పట్టుకు పోతుంటే ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో. మనం వాళ్ళని ఎదిరించేటంతటి పెద్ద వాళ్ళం కాదు. అంత శక్తి మనకు లేదు. కనీసం సరైన తిండికి కూడా సరిగా నోచుకోని పేదవాళ్ళం.
మన ఊళ్లో మగవాళ్ళందరూ తాగుడికి బానిసలు అయిపోయారు. దీన్ని ఆపటం ఎవరి తరం కాదు. అందుకే మనం కూడా ఇక మీదట ఆ వైపుకు వెళ్లొద్దు.” స్నేహితురాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగానే రాము అక్కడికి వచ్చాడు.
“రామూ, రాత్రి నువ్వు కూడా నాతోనే ఉన్నావు కదా అక్కడ జరిగిందంతా చూసావు కదా. దీన్ని ఆపే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు?” ఆమె మాటలకు రాము నిట్టూర్చాడు.
“ఆ చెట్లు నరికే వాళ్లంతా ఎవరనుకున్నావు? మన గ్రామంలో ఉండే సుంకు బాబాయ్, చందు తాతయ్య, తురూ అన్నయ్య. ఇలా వీళ్లంతా మనవాళ్ళే. కలప కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బుకు ఆశపడి రాత్రిపూట చెట్లు నరికే పని చేస్తున్నారు కంచే చేను మేస్తుంటే ఇక ఎవరికి చెప్తావ్?
ఫారెస్ట్ ఆఫీసర్ల అండదండలు ఆ కాంట్రాక్టర్లకు ఉన్నాయి. వాళ్ళ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. అంత పెద్ద వాళ్ళని ఎదిరించడం మన వల్ల ఏమవుతుంది?” అతను చెప్పిందంతా నిజమే అనిపించింది. అయినా ఏదోటి చేసే అడవి సంపదను రక్షించాలని పట్టుదలగా ఉంది సుభద్ర.
“ఇదంతా తెలిసికూడా వూరుకుంటే ఎలా? మన గ్రామంలో అందరికీ చెప్పి వాళ్ళని కట్టడి చేయాలి. ప్రతి ఒక్క ఇంటికీ వెళ్లి ఈ విషయం చెబుదాం. మనతో వచ్చేవాళ్ళు వస్తారు. గ్రామంలో అందర్నీ కూడగట్టుకుని వెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్లతో చెబుదాం” అన్న సుభద్ర మాటలను అందరూ అదేమోదించారు.
అందరూ కలిసి గ్రామంలోకి వెళ్లారు. ఇంటింటికీ వెళ్లి చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకో పోవడం వాళ్ళని ఆశ్చర్యపరిచింది.
ఇది ఇలా ఉంటే ఫారెస్ ఆఫీసర్ల దృష్టి మొత్తం వంట చెరుకు తీసుకెళుతున్న వాళ్లపై పడింది.
గ్రామంలో వాళ్ళెవరూ పర్మిషన్ లేకుండా వంటచెరకు తీసుకువెళ్ళడానికి, అటవీ సంపదను అమ్ముకోడానికి వీల్లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మహిళలు వంట చెరుకు కోసం ఆ అడవిపై ఆధారపడ్డ కారణంగా వాళ్ళని ఎదిరిస్తే ఈ మాత్రం పట్టు కూడా తమకి అడవిపై వుండదని భావించారు.
అమ్ముకునేందుకు అడవి ఉత్పత్తులైన విస్తళ్ళు, విప్ప సారా, కొండతేనె, పశుగ్రాసం కూడా దొరకవని భయపడ్డారు.
సుభద్ర ఎంత ప్రయత్నించినా గ్రామస్థుల మద్దతు దొరకలేదు సరికదా ఆ వూరి ఆడపిల్లల్ని సుభద్రతో కలిసి తిరగొద్దని గట్టిగా మందలించారు.
అప్పటివరకూ ఆమెతో వున్న ఆడపిల్లలు బయటకు రావడానికి జంకారు.
సుభద్ర నిరుత్సాహపడకుండా తన స్నేహితురాళ్ళకి అడవి ప్రాముఖ్యత, అవి నాశనమైతే జరిగే ముప్పు గురించి అనేకసార్లు వివరించి చెప్పడంతో వాళ్ళలో కొంత చైతన్యం వచ్చింది.
మనం ఒంటరిగా అడవికి వెళ్ళటం ప్రమాదం అని తెలుసుకున్న ఆడపిల్లలంతా విల్లు, బాణాలు పట్టుకుని అడవికి గస్తీ కాయటం మొదలుపెట్టారు. వాళ్లకి దూరం నుంచి గురిచూసి బాణం వేయడం రాము నేర్పించాడు. అతని సహాయంతో అడవంతా కలియదిరుగుతూ కావలి కాస్తున్న సమయంలో గొడ్డలితో చెట్లని నరుకుతున్న చప్పుడు వినపడింది. అందరూ ఆ ప్రాంతానికి చేరుకుని మెల్లగా చెట్లపైకి ఎక్కి కూర్చున్నారు. చెట్లు నరుకుతున్న ఇద్దరు వ్యక్తులపై వరుసగా బాణాల వర్షం కురిపించారు. వాళ్ళు గొడ్డళ్లు అక్కడే వదిలేసి అడవినుంచి బయటకు పారిపోయారు. సుభద్ర అది వాళ్ళ మొదటి విజయంగా ప్రకటించి సంబరపడింది.
రోజంతా అడవిలో వుండటం వలన ఇంట్లో పనులు చేయట్లేదని తల్లి దండ్రులు కొప్పడటంతో సుభద్ర వాళ్ళకి ఒక ఉపాయం చెప్పింది.
“మనం నాలుగు బృందాలుగా ఏర్పడి అడవిని కాపలా కాద్దాం.” అని చెప్పింది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఈ నాలుగు కాలాల్లో ఏ బృందం ఎప్పుడు వెళ్లి గస్తీకాయాలో చెప్పి వాళ్ళని ఆయా సమయాల్లో అడవి కాపలాకి పంపింది. ఆ గ్రామంలో వాళ్ళు కేశి ఇంటిమీదకి పోట్లాటలు వచ్చారు. “నీ కూతురు మా పిల్లల్ని వెంట తిప్పుకుని చెడకొడుతోంది. రాత్రిళ్ళు ఆడపిల్లలు అడవికి వెళ్ళటం ఏంటి? నీ కూతుర్ని నువ్వు అదుపులో పెట్టుకోపోతే మేమే బుద్ధిచెప్పాల్సి వుంటుంది” హెచ్చరించి వెళ్లారు.
తన కూతుర్ని వూరివాళ్ళు అన్నీ మాటలు అనడం కేశిని బాధించింది.
“ఇదంతా నీకెందుకమ్మా. నామీద గౌరవం వుంటే అంతా మానేసి ఇంట్లో వుండు. లేకపోతే ముద్దుగా పెంచుకున్న ఈ చేత్తోనే నిన్ను శిక్షించాల్సిస్తుంది” అని కఠినంగా హెచ్చరించాడు కేశి.
తండ్రి బాధ ఓ పక్క, అడవి బాధ ఓ పక్కన. సతమతమైపోయింది సుభద్ర. రాము దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది.
“ఏం చేస్తాం?! ఇంట్లో వాళ్ళు ఒప్పుకోన్నప్పుడు మనం ఏమీ చేయలేము. అందరిలాగే మనం కూడా సామాన్యులమే. సంఘానికి వెరవాల్సిందే. ఊరి బహిష్కరణకు గురికావద్దు మనం. ఇక ఇలాంటివేం వద్దు” అని చెప్పాడు రాము. కానీ సుభద్ర అలా చేతులు ముడుచుకుని కూర్చోవాలనుకోలేదు. తన నాలుగు బృందాలను ఒకచోట చేర్చి వాళ్లతో ఎన్ని చెట్లు నరికారో మనం అన్ని చెట్లు నాటుదాం అది ఒక ఉద్యమంగా తీసుకువద్దాం. ముందు ఆ పని చేయాలి” అని చెప్పింది. వాళ్ళు అందుకు సమ్మతించి అడవిలోకి వెళ్లి చెట్లను నాటడం ప్రారంభించారు. ప్రకృతి హర్షించి కురిపించిన వర్షానికి చెట్లు చాలా త్వర త్వరగా ఎదిగాయి. కొత్త చిగురులతో తలలూపుతూ తమ సంతోషాన్ని తెలిపాయి.
ఆ ఊరికి ఫారెస్ట్ ఆఫీసర్ ధనుంజయ్ కొత్తగా వచ్చాడు అని తెలిసి అతన్ని కలిసేందుకు వెళ్లారు సుభద్ర బృందం. అతనితో అక్కడ జరుగుతున్నదంతా వివరంగా చెప్పారు. వాళ్లు అడవిని సంరక్షించేందుకు పడుతున్న శ్రమను ప్రశంసించి, అడవిలో తిరిగి మొక్కలు నాటుతున్న విధానం చూసి ఎంతో మెచ్చుకున్నాడు.
అక్రమంగా కలప తరలించుకుపోతున్న వారిపై ఉక్కు పాదం మోపి అడవిని రక్షిస్తానని మాటిచ్చాడు.
ధనుంజయ్ బృందంతో పాటు, సుభద్ర బృందం కూడా కలిసి అడవికి వెళ్లారు. నాలుగు రోజులపాటు వాళ్ళు తెచ్చుకున్న భోజనాలతో అక్కడే కాలం గడిపారు. అక్కడికి చెట్లు కొట్టే వాళ్ళు ఎవరూ రాకపోవడం వాళ్లకి సంతోషం కలిగించింది. ఇక ఈ దరిదాపులకు కూడా ఎవరూ రారని సంతోషించి ఒక్కొక్క బృందాన్ని ఉపసంహరించుకుంటూ వచ్చారు.
కానీ వీళ్లు అప్రమత్తంగా లేని సమయం కోసం వేచి ఉన్నాడు కలప కాంట్రాక్టర్ సిద్ధు. ఆరోజు అడవిలో విజృంభించి చెట్లను సమూలంగా నరికి, ఒకేసారి పది లారీల్లో తీసుకువెళ్లిపోవాలనే పట్టుదలతో అక్కడికి వచ్చాడు.
సిద్ధు తో పాటు 100 మంది సిబ్బందిని కలప నరికేందుకు తీసుకువచ్చాడు. మిషన్ల సాయంతో అవలీలగా ఎన్ని చెట్లనయినా నరికేవచ్చని అతని ఉద్దేశం.
వాళ్లు అక్కడకి చేరుకునేసరికి ఏ ఒక్క బృందము అడవికి కాపలాగా లేదు. అదే అదనుగా సిద్ధు తెగబడ్డాడు.
“ఈ సిద్ధు ని చాలా తక్కువగా అంచనా వేశారు. ఇన్నాళ్లు రాకపోవడంతో అంతా సర్దుకుంది అనుకున్నారు. ఇందుకోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను” అని విజయ గర్వంతో నవ్వాడు.
పక్షులు, జంతువులు అతని దుశ్చర్యలకు భయపడి వింతగా అరిస్తూ కకావికలం అయ్యాయి. చెట్లను నరకమని వాళ్ళ బృందాన్ని ప్రేరేపించాడు సిద్ధు.
వాళ్లకు మందు పోయించాడు. పూటుగా తాగి బీడీలు కాల్చి విసిరేసి మిషన్లు తీసుకుని చెట్లను నరికడానికి వచ్చారు. అదే సమయానికి పిడుగులా విరుచుకుపడింది సుభద్ర. చీర వెనక్కి దోపుకుని, సిగ ముడి బిగించి, నుదుటున పొడవుగా ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకుని, తలకు అడ్డంగా కాషాయం రంగు తువాలు కట్టుకుని రౌద్రంగా అరుస్తూ చెట్టు మించి కిందకి దూకింది. అనూహ్యంగా కాళికలా విరుచుకుపడ్డ ఆమెను చూసి క్షణ కాలంపాటు విస్తుపోయారు వాళ్లంతా. తేరుకునేలోపు ఆమె గట్టిగా అరుస్తూ వాళ్లపై రెండేసి బాణాల చొప్పున వేసి ఇద్దర్ని నేల కూల్చింది.
వెంటనే తేరుకున్న సిద్ధు తనతో దగ్గర ఉన్న గన్ బయటికి తీసి ఆమె వైపు గురిపెట్టి కాల్చబోయేంతలో రాము వెనకనుంచి వచ్చి అతని గొంతు పట్టుకుని చేతిని బలంగా పైకి ఎత్తాడు. పిస్టల్ గాల్లో పేలి పెద్ద శబ్దం వచ్చింది.
ఆ శబ్దానికి ఆ పక్కన ఉన్న ఊరంతా మేల్కొంది అందరూ వేగంగా అడవిలోకి పరిగెత్తుకు వచ్చారు. ఆ చుట్టుపక్కలే మకాం వేసిన ఫారెస్ట్ ఆఫీసర్ ధనుంజయ్ కూడా తన సిబ్బందిని తీసుకుని వెంటనే అక్కడికి చేరుకున్నాడు.
వాళ్లు వచ్చేలోగా రాము సుభద్ర కలిసి సిద్ధుని, అతని బృందాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. సుభద్ర తన శక్తిని అంతా కూడ తీసుకుని వాళ్లతో పోరాటం చేసింది. ఆమె జుట్టు పట్టుకుని తలను చెట్టుకు కొట్టేందుకు ప్రయత్నించాడు వాళ్ళలో ఒకడు.
అప్పుడే ఒక లేత చెట్టుకొమ్మ విరిగి ఆమె తలకు చెట్టు మానుకు మధ్య అడ్డంగా నిలిచింది. అది చూసిన సుభద్ర ఆశ్చర్యంతో చెట్టు తనకు మేలు చేసినందుకు కృతజ్ఞతగా ఆ చెట్టుని ప్రేమగా కౌగిలించుకుంది.
ఇంతలో గన్‌లు పట్టుకుని వచ్చిన ధనుంజయ్ బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సిద్ధుతో సహా అందర్నీ పట్టుకుని అరెస్టు చేశారు. పారిపోయే అవకాశం చూసిన సిద్ధు ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. చివరికి పోలీసులకి లొంగిపోక తప్పలేదు.
తనంతటి ఆరడుగుల మోటు మనిషిని ఎదిరించిన సుభద్ర ధైర్యానికి విస్తుపోయాడు సిద్ధు.
బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చనిపోతుందని వినటమే కానీ ఈ సుభద్ర రూపంలో ఆ చలి చీమ తనను జయిస్తుందని ఊహించలేకపోనని అనుకున్నాడు.
ధనుంజయ్ పత్రికా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగినదంతా మీడియాతో చెప్పాడు.
అడవిని రక్షించిన సుభద్రకు పర్యావరణ సమితి ‘వన రాణి’ అనే బిరుదుతో సత్కరించింది.
ఆమె ఏర్పరిచిన బృందాన్ని సమాజానికి పరిచయం చేశాయి వివిధ వార్తా పత్రికలు, మీడియా.
జాతీయ వన సంరక్షణా సమితి ఆధ్వ్యంలో అడవి రక్షణకై తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక సదస్సు ఏర్పాటయింది. దానిలో కీలక సభ్యురాలిగా ఎన్నిక కాబడింది సుభద్ర.
“చెట్లు లేకపోతే సృష్టి లేదు. జీవజాతి అంతరించిపోతుంది. మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది. అందుకే సహజ వనరుల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రతి వూళ్ళో చెట్లను విరివిగా నాటండి. చెట్లు నరికే వాళ్ళని ఏ మాత్రం ప్రోత్సహించకండి” అని గ్రామగ్రామాలకూ తిరిగి పిలుపునిచ్చింది.
ఉత్సాహవంతులైన యువత ఆమె అడుగు జాడల్లో నడుస్తామని ముందుకు వచ్చారు. వృక్ష పరిరక్షణా దక్షులమవుతామని ప్రతిజ్ఞ చేశారు. ఆమెతో కలిసి ప్రతి అడవికీ వెళ్లి చెట్ల కాండాలమీద ‘ ప్రేమ స్పర్శకై’ అనే నినాదాన్ని రాశారు. వృక్షాలకు ప్రేమ స్పర్శ మాత్రమే ఇవ్వాలని, గొడ్డలి వేటుతో బాధించవద్దని ముమ్మరంగా ప్రచారం చేసారు.
అనుకోకుండా ఆనాడు అడవిలో ఆడుకుంటున్న తనకు వృక్షాలు చేసిన ఆక్రందనలు యాదృచ్ఛికం అయినప్పటికీ, వాటిని రక్షించేందుకు తననే ఎంచుకున్నాయని భావించి సంతోషించింది సుభద్ర.
అదే అడవికి మళ్ళీ వెళ్లి చెట్టు కాండాన్ని కౌగిలించుకుని వృక్షభాషను ఆలకించింది.
ఆ నిశ్శబ్దంలో నుంచి ఆత్మానందం పొందుతున్న వినూత్నమైన భావ శబ్దం ఆమె హృదయానికి అర్థమయింది. వృక్ష భాషను గుర్తించిన సుభద్ర రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ వాటి సంరక్షణకు తీవ్రమైన కృషి చేసి ఎన్నో ప్రశంసలు అవార్డులు పొందింది. ఇంకా కృషి చేస్తూనే ఉంది. ఆమెకి తోడుగా ఎంతోమంది కదిలి రావడం భవిష్యత్తు తరాల మనుగడను పదిల పరిచేందుకు బాటలు వేసింది.
గొర్తి వాణీశ్రీనివాస్ సాహిత్యం మీద ఇష్టంతో గత ఐదేళ్లుగా రచనలు చేస్తున్నారు. 500 పైగా కవితలు రాశారు. 150 కథలకు పైగా వివిధ వార,మాస, పక్ష పత్రికలలో ప్రచురణ అయ్యాయి. 100 కథలకు బహుమతులు వచ్చాయి. స్వాతి అనుబంధ నవలలుగా ‘అరణ్య కాండ’, ‘బ్రేక్ ది సైలెన్స్’ ప్రచురణ అయ్యాయి. స్వాతిలో ఇప్పటికి 6 కథలకు బహుమతులు వచ్చాయి.
తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా 1. “వెన్నెల ధార” నవల 2. “నాతి చరామి” కథా సంపుటి. 3. “వినిపించని రాగాలు” ధారావాహిక ప్రచురితమయ్యాయి.
మన తెలుగు కథలు. కామ్ వారిచే రవీంద్ర భారతి వేదికగా ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు.
“కథలు ఆనందాన్ని పంచి, అలుపు తీర్చాలి. ఆలోచనను పెంచి, బతుకు మలుపు తిప్పాలి.” అనే ఉద్దేశ్యాలతో ఎంతో ఇష్టంగా రచనలు చేస్తున్నారు.