Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిశ్శబ్దం నిష్క్రమించింది

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘నిశ్శబ్దం నిష్క్రమించింది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

రోగ్యం సెలవడిగేసిందనో
అలసట వద్దన్నా వినకుండా
ఒంటిని ఆక్రమించుకుందనో
మరెందుకో అలిగిన ఆ పెద్దరికం

అక్షరాన్ని దాచేసి
మాట గొంతు గట్టిగా నొక్కేసి
పరిచయాల బంధాలను
కొద్దికొద్దిగా కోసేసి.. దూరంగా తోసేసి
రాకపోకలకు
దారులు మూసేసిన ఆ గోప్యత
పిలుపులకు పలుకరింపులకూ
తలుపులు గట్టిగా బిగించిన ఆ నిశ్శబ్దం

వీడ్కోలేది చెప్పకుండా
నిష్క్రమించేసింది నిశ్చింతగా
గతపు తలపుల మంజూషను
తాళమేదీ వేయకుండా వదిలేసి

నెమ్మదిగా తెరిచి చూస్తే
కుదురుగా కనబడుతున్నాయి
పచ్చిగా ఉన్న జ్ఞాపకాలెన్నో
వెచ్చగా శ్వాసిస్తోన్న ఊసులెన్నో

విప్పుకుని వరుసగా
ఒకరితో ఒకరం చెప్పుకుంటుంటే
కొద్దికొద్దిగా గుండె బరువెక్కిపోతోంది
వద్దన్నా వినకుండా
కళ్ళు చెమ్మగిల్లిపోతున్నాయి

అవును, ఆ నిశ్శబ్దం
నిజంగానే నిష్క్రమించింది
తన జ్ఞాపకాలనన్నింటినీ ఇక్కడే వదిలేసి
మన కోసం, వారసత్వపు ఆస్తిగా వదిలేసి

Exit mobile version