Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిశ్చల మనస్సుతో ఆత్మానుభూతి

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘నిశ్చల మనస్సుతో ఆత్మానుభూతి’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత అధ్యాయం 2, శ్లోకం 53

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా।
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి॥

ఈ శ్లోకం ద్వారా భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునికి ఓ సత్యాన్ని బోధిస్తున్నాడు:

“ఓ అర్జునా! నీ బుద్ధి శ్రుతుల ప్రకారంగా ఊగిసలాడకుండా, నిశ్చలంగా సమాధి స్థితిలో స్థిరపడినప్పుడు – అదే సమయంలో నీవు నిజమైన యోగాన్ని పొందుతావు.”

ఇది ఆత్మానుభూతికి దారితీసే మార్గాన్ని తెలియజేసే కీలకమైన ఉపదేశం.

మనస్సు అంటే ఒక నిరంతర ఆలోచనల ప్రవాహం. ఇది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో నిమగ్నంగా ఉంటుంది. రోడ్లపై ట్రాఫిక్ ఎప్పటికప్పుడు మారుతుందల్లా – కొన్నిసార్లు వేగంగా, మరికొన్నిసార్లు నెమ్మదిగా – మన ఆలోచనలు మాత్రం ఒక క్షణం కూడా ఆగవు. నిద్రలో కూడా అవి కొనసాగుతూనే వుంటాయి. మనస్సు గతాన్ని తలచుతుంది, భవిష్యత్తును ఊహిస్తుంది. ఇది దాని స్వభావం.

ఆహారం శరీరానికి అవసరమైనట్లే, సానుకూలమైన ఆలోచనలు మనస్సుకు అవసరం. చెడు ఆలోచనలు మనస్సును బలహీనపరచుతాయి. ఉదాహరణకు, అనారోగ్యకర, అపవిత్ర ఆహారం తీసుకుంటే శరీరం రోగాల బారిన పడుతుంది. అలాగే, అపవిత్ర ఆలోచనల వల్ల మనస్సు కలుషితమవుతుంది. అందువల్ల, మన మనస్సుకు స్వచ్ఛమైన, నిష్కామమైన ఆలోచనల రూపంలో ‘ఆహారం’ అవసరం. ఇది మన మనస్సును శాంతిగా, నిశ్చలంగా మార్చుతుంది. పతంజలి యోగసూత్రాలలో పేర్కొన్నట్లు, నిశ్చల మనస్సు సమాధి స్థితికి తొలి మెట్టు.

సమాధి స్థితిలో ఉండేవాడు భగవంతుని, పరమాత్మను, బ్రహ్మాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలడు. అలాంటి స్థితికి చేరదలచిన సాధకుడు, భౌతిక సుఖాలపైనా, ఇహపర లోకాల్లోకైనా ఆకాంక్షలేని స్థితిలో ఉండాలి. ఎందుకంటే, కోరికలు మనస్సును కల్లోలానికి గురిచేస్తాయి. ప్రశాంత సరస్సులో రాయి పడినట్టు, ఒక్క కోరిక మనస్సులో పడి అలజడిని సృష్టిస్తుంది. అలాంటి మనస్సులో భగవంతునికి స్థానం ఉండదు. కోరికలు పెరిగే కొద్దీ మనస్సు మరింత తల్లడిల్లుతూ, అశాంతికి లోనవుతుంది.

ఇలాంటి స్థితిని అధిగమించడానికి ధ్యానం ఒక సాధనం. అది మన మనస్సును మన నియంత్రణలోకి తీసుకురావడంలో సహాయపడుతుంది. రిమోట్ ద్వారా ఒక పరికరాన్ని ఆన్/ఆఫ్ చేయగలిగినట్టే, ధ్యానం మనస్సును శాంతంగా నిలిపే సాధనంగా మారుతుంది.

అంతిమంగా, మన నిజ స్వరూపాన్ని గ్రహించడానికి నిశ్చల మనస్సే ప్రధాన సాధనం. అటువంటి నిశ్చలతలో మాత్రమే మనం పరమానందాన్ని, శాశ్వత శాంతిని ఆస్వాదించగలము.

Exit mobile version