[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘నిశ్చల భక్తి ప్రాశస్త్యము’ అనే రచనని అందిస్తున్నాము.]


భగవద్గీత 12వ అధ్యాయం (భక్తియోగం) 16వ శ్లోకం.
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః।
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః॥
ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్యాంతరములలో, ఆలోచనలలో, చిత్తంలో పవిత్రంగా ఉండి, కార్యదక్షతతో కలతలు లేకుండా, మరియు అన్ని వ్యవహారములలో స్వార్థచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు అని శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడు.
ఈ శ్లోకాన్ని భగవద్గీతలో ఒక ముఖ్యమైన శ్లోకంలా ఆధ్యాత్మికవేత్తలు పరిగణిస్తారు. భగవంతుడికి ఎటువంటి లక్షణాలు వున్న భక్తులు అత్యంత ఆప్తులో భగవంతుడు స్వయంగా చెప్పాడు.
బాహ్యముగా (అంతే బయటకు అంటే శారీరకంగా) మరియు ఆంతరములో స్వచ్ఛముగా ఉండుట, వారి యొక్క మనస్సులు నిరంతరం పరమ-పవిత్రమైన భగవానుని యందు నిమగ్నమై ఉండుట వలన భక్తులు అంతర్గతంగా కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, అహంకారము వంటి దోషముల నుండి పరిశుద్ధి చేయబడుతారు. అటువంటి భక్తులకు బాహ్యాడంబరాలపై వ్యామోహం వుందదు. వారి హృదయాలు స్పటిక వలే స్వచ్ఛంగా, నిర్మలంగా వుంటాయి. వారి మనసులలో ఎటువంటి కల్మషాలకు చోటు వుండదు. వారు నిత్య సంతృపులై, అనుక్షణం భగవచ్చింతనతో గడుపుతూ వుంటారు.
సర్వప్రాణులందు ద్వేషం లేనివాడై, స్నేహం, దయను కలిగి, దేహేంద్రియాల పైన మమకారం లేని వాడై, సుఖదుఃఖాలు లేనివాడై, ఓర్పు కలిగి, నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును, బుద్ధిని నా యందు నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు. లోకాన్ని భయపెట్టక, తాను లోకానికి భయపడక, ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైనవాడు నాకు ఇష్టుడు. కోరికలు లేక, పరిశుద్ధుడై, సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మఫలితాల పైన ఆశలేనివాడు నాకు ఇష్టుడు. నాకు ఆడంబరమైన పూజల కంటే నాకోసం ఒక స్వచ్చమైన కన్నీటి చుక్క విడిచే భక్తుడే ఆప్తుడు. అటువంటి భక్తులంటే నాకెంతో ఇష్టం అని భగవానుడు స్పష్టం చేసాడు.
భగవంతుడు తన విభూతులను గుణ గానం చేసేవారిని, తన పట్ల నిర్మలమైన, స్వచ్ఛమైన ప్రేమ కనబరిచేవారి హృదయాలలో నివసించి వారి చేత సత్కర్మలు చేయిస్తాడు. వారికి సర్వదా తన అనుపలభ్యమైన అనుగ్రహా కవచం ప్రసాదిస్తాడు. భగవంతును కృప వలన వారిలో నిశ్చలభక్తి ఏర్పడుతుంది. భక్తి వలన సత్త్వగుణం ప్రకాశిస్తుంది. రజోగుణం, తమోగుణం కారణంగా పుట్టే కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం తొలగిపోయి చిత్తం నిర్మలమవుతుంది. అటువంటి మనిషి రాగద్వేషాలనే బంధనాలనుంచి విముక్తుడవుతాడు. అతనికి తత్వజ్ఞానం సిద్ధిస్తుంది. భగవత్సాక్షాత్కారం లభిస్తుంది. అదే విధంగా సాధన కొనసాగిస్తే తుదకు ఆత్మ సాక్షాత్కారంతో పాటు అతి దుర్లభమైన ముక్తి కూడా లభిస్తుంది.