[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో బహుమతి పొందిన కథ ‘నిశ్చల భక్తి’. రచన శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల.]
“అమ్మా! ఆకలేస్తోంది. తట్టుకోలేకపోతున్నాం. అన్నం పెట్టమ్మా.. పచ్చడి మెతుకులైనా చాలు” పిల్లలు వామాక్షిని చుట్టుముట్టి దీనంగా అడిగారు.
ఆమె కళ్ళ నుంచి నీళ్ళు జలజలా చెక్కిళ్లపై జారాయి.
‘ఎంత దుస్థితి. బిడ్డల ఆకలి తీర్చలేని అమ్మ జన్మ తనది. హే భగవాన్! ఏమిటి ఈ పరీక్ష !’ అనుకుని, అంతలో తన దుఃఖం పిల్లలకు తెలియకూడదని – “ఉండండి ఓ నిముషం, కంట్లో నలక ఏదో పడినట్లుంది” అంది.
“అయ్యో! నలక పోయేందుకు కంట్లో ఊదమంటావా?” పిల్లలు ముందుకొచ్చారు.
“లేదు లేదు. ఓ నిముషం కళ్ళు మూసుకుంటే అదే పోతుంది. మీరు వెళ్ళి ఆడుకోండి” అంది వామాక్షి.
“మేం కాసేపు నిద్రిస్తాములే” పిల్లలు అక్కడినుంచి వెళ్ళిపోయారు.
‘తనెంత బుద్ధిహీనంగా మాట్లాడింది.. ఆకలితో అలమటిస్తున్న పిల్లలు ఆటలు ఏం ఆడతారు? తనకే నిస్సత్తువగా ఉంటే లేలేత పిల్లలు తిండి లేక ఇంకెంత నీరసించి ఉంటారు?’ అలా అనుకోవడం ఆలస్యం మళ్ళీ ధారాపాతంగా కన్నీళ్ళు.. ‘వీటికి కొదువలేదు’ అనుకుంటూ కన్నీళ్ళు కొంగుతో తుడుచుకోబోయింది. చిరుగుల కొంగు అందుకు కూడా సరిగా ఉపయోగపడలేదు. దీర్ఘంగా నిట్టూర్చి, ‘ముందు వీధిలో ఏ అమ్మనైనా కాసిని తిండిగింజలు అడగాలి’ అనుకుని అక్కడినుంచి కదిలింది.
***
‘హమ్మయ్య! ఆ పుణ్యవతి వల్ల ఈ రోజు పిల్లలకు లేశమాత్రమైనా ఆకలి తీర్చగలిగింది’ అనుకుంటూ భర్త కుచేలుడి వంక చూసింది వామాక్షి. కళ్ళు మూసుకుని ధ్యానంలోనే ఉన్నాడు. బక్కచిక్కిన దేహం. ఒంటిపై ఉన్నాయంటే ఉన్నాయన్నట్లు చిరుగుల పంచ, ఉత్తరీయం. ‘తిండి గురించిన ధ్యాసే ఆయనకు ఉండదు. భగవద్ధ్యానమే ఆయన శ్వాస. అమాయకత్వంలో పిల్లలు ఎంతో ఈయనా అంతే..’ అనుకుంది.
“స్వామీ!” పిలిచింది.
కుచేలుడు మెల్లిగా కళ్ళు తెరిచాడు. ఏమిటన్నట్లు చూశాడు.
“అపహార్ణం దాటిపోయింది. భోజనం చేద్దురుగాని లేవండి” అంది.
“ఎక్కడిది? పిల్లలు తిన్నారా?” అడిగాడు.
“ఓ పుణ్యవతి ఇచ్చింది. పిల్లలు తిన్నారు. మీరు రండి” అంది.
కుచేలుడు మెల్లిగా లేచాడు. వామాక్షి అన్నీ సిద్ధం చేసింది.
కుచేలుడు కాళ్ళూ చేతులు కడుక్కుని వచ్చి పీట మీద కూర్చున్నాడు. ఆపోసన పట్టాడు. కంచంలో ఉన్నవే గుప్పెడు మెతుకులు. అందులో మళ్ళీ నాలుగు మెతుకులు ముద్దగా చేసి పక్కన పెట్టాడు.
అది చూసి వామాక్షి నిట్టూర్చింది.
ఆమె భావం అర్థమై “ఉన్నంతలోనే..” అని, గుర్తొచ్చినట్లు “మరి నీకు?” అడిగాడు కుచేలుడు.
“ఉంది లెండి. ముందు మీరు కానీయండి” అంది వామాక్షి.
***
కుచేలుడు భుజించాక గిన్నెలో అడుగున ఉన్న గుప్పెడు అన్నం తాను వడ్డించుకుంది. నిజానికి పిల్లలకు కడుపు నిండా పెడితే తామిద్దరికి ఇది మిగిలేదే కాదు. పిల్లలు కూడా “నీకు, పితృదేవులకు ఉందా” అంటారు. ‘నిజంగా పిల్లలు దేవుళ్ళు’ అనుకుంటూ ముద్ద నోట్లో పెట్టుకుంది. తింటున్నదే కానీ ఆమెలో ఆలోచన ఆగలేదు. ‘అయినా ఎన్నాళ్ళిలా? ఏదీ దారి?’ అనుకుంటుంటే ఆమెకు ఏదో స్ఫురించింది. ఆమెలో ఆశ ఊపిరి పోసుకుంది. తినడం ముగించి, అన్నీ సర్దేసి చేతులు తుడుచుకుంటూ భర్త వద్దకు వెళ్ళి “స్వామీ!” పిలిచింది.
ఏమిటన్నట్లు చూశాడు కుచేలుడు.
“ఈ దుర్భర దారిద్ర్యాన్ని ఎన్నాళ్ళని భరిచంచడం.. నేను ఎలాగైనా ఓర్చుకుంటాను. కానీ పిల్లలను ఆకలి బాధకు గురిచేయడం పాపం కాదా” అంది వామాక్షి.
“అవును. నిజమే. కానీ ఏం చేస్తాం? అంతా దైవ కృప” అన్నాడు కుచేలుడు.
“ఆ..అదే చెపుతున్నా.. ఆ దైవాన్నే వేడుకోవడానికి వెళ్ళండి” అంది వామాక్షి.
అర్థం కానట్లు చూశాడు కుచేలుడు.
“మీ బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుల వారు ద్వారకలో ఉన్నారు కదా. మీరంటే వారికి ఎంతో అభిమానమని గతంలో ఓసారి చెప్పారు. వారి మహిమల గురించి ఎన్నో విన్నాము.. వింటున్నాము. మీరొక్కసారి ద్వారక వెళ్ళి మన దీనస్థితి గురించి విన్నవిస్తే ఫలితం ఉండవచ్చు. ఏదైనా మన ప్రయత్నం మనం చేయాలి కదా” అంది వామాక్షి.
శ్రీకృష్ణుడి ప్రస్తావనతో కుచేలుడి మదిలో ఆనంద తరంగం ఉవ్వెత్తున ఎగసింది. ఆ క్షణమే కృష్ణుణ్ణి చూడాలన్నంత బలమైన కోరిక కలిగింది. వెంటనే
“నువ్వు చెప్పింది చాలా మంచి విషయం. వెళ్ళి కలవాలి” ఉత్సాహంగా అని.. అంతలోనే “కానీ” సందేహంగా ఆగాడు.
“మళ్ళీ కానీ ఏమిటి? మీ సందేహం దేని గురించి?” అడిగింది వామాక్షి.
“ఇంతకాలం తర్వాత మిత్రుడిని చూడబోతూ వట్టి చేతులతో ఎలా వెళ్ళను? అందునా ఇప్పుడు చిన్నప్పటి కిష్టయ్య కాదు, ద్వారకాధీశుడు. తీసుకెళ్ళేందుకు మన వద్ద ఏమున్నాయి గనుక?” అన్నాడు కుచేలుడు.
“మీరేం చింతించకండి. ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తాను” అంటూ వామాక్షి లోపలికి వెళ్ళింది.
కుచేలుడు చింతాక్రాంతుడై అలాగే కూర్చుండిపోయాడు.
కొద్దిసేపటికి ఆమె ఓ మట్టి పాత్ర తెచ్చి చూపుతూ “మన అదృష్టం. ఇందులో కొద్దిగా అటుకులు ఉన్నాయి. ఇవి పట్టుకెళ్లండి. ఆత్మీయత ముఖ్యం కానీ ఇచ్చే వస్తువు కాదు. అయినా ఆయనకు తెలియనిదేం ఉంటుంది?” అంటూ కుచేలుడి ఉత్తరీయం కొంగున ఆ అటుకులు మూటకట్టింది.
కుచేలుడు “నువ్వు చెప్పిందీ నిజమే. అందునా మా కిష్టయ్యకు అటుకులంటే అమిత ప్రీతి” అన్నాడు.
“ఇంకేం.. ఆలస్యం అమృతం విషం అన్నారు. మీరు ద్వారకకు బయలుదేరండి” అంది వామాక్షి.
“అలాగే” అంటూ ప్రయాణానికి సన్నద్ధం అయ్యాడు కుచేలుడు.
***
బాల్య మిత్రుణ్ణి కలవబోతున్నానన్న ఆనందం కుచేలుడికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నడుస్తూనే ఉన్నాడు. మదిలో తమ కలయక గురించిన ఎడతెగని ఆలోచనలు. హఠాత్తుగా తనను చూసి కృష్ణుడు తప్పకుండా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాడు. అవునూ.. ద్వారకాపురి వైభవం అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి గొప్ప తావులో నేను.. నా రూపు.. ఊహించుకోవడమే కష్టంగా ఉంది. అక్కడి ద్వారపాలకులు దైన్యానికి ప్రతిరూపంగా ఉన్న తనను చూసి లోపలకు అనుమతించకుండా అడ్డగిస్తారేమో. ఏ బంగారు నాణెమో భటుల చేతిలో పెట్టి లోపలికి పోదామంటే తానే దరిద్రుడు.. వారికేమి ఇవ్వగలడు?
అక్కడ తన వంటివారు ఉండరా? ఎందుకు ఉంటారు? అక్కడ లక్ష్మీ సమేతుడైన శ్రీకృష్ణుడే పాలకుడై ఉండగా అందరూ సంపన్నంగా, విలాసంగా, సుఖసంతోషాలతోనే ఉంటారు. కుచేలుడు పరిపరి విధాల ఆలోచనలో వుండగానే ద్వారక రానే వచ్చింది. మణిమయ ఖచితమైన అద్భుత భవనాలు.. అంగళ్లు, పట్టు వస్త్రాల రెపరెపలతో, మిరుమిట్లు గొలిపే ఆభరణాలతో సుందరాంగనలు.. కుచేలుడు అలా నడుస్తుండగానే రాజ ప్రాసాదం వచ్చింది. లోపలకు వెళ్ళాడు. మూడు ప్రాకారాలు దాటిన తర్వాత అత్యంత మనోహర భవంతి దర్శనమిచ్చింది. అందులోనే కృష్ణుడు ఉన్నాడని గ్రహించాడు. ముందుకు వెళ్ళాడు. అక్కడ నిలుచున్న భటులతో, తాను కృష్ణుడి బాల్యస్నేహితుడనని, శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవడానికి వచ్చానని చెప్పాడు. వారు కుచేలుడి వంక అపనమ్మకంగా చూశారు. పేదరికానికి ప్రతిబింబంలా ఉన్న ఈ బక్క బ్రాహ్మణుడు శ్రీకృష్ణులవారికి బాల్య మిత్రుడా? అంతలో కృష్ణుడి మహోన్నత హృదయం వారికి గురుతుకు రావడంతో, లోపల శయ్యపై రుక్మిణితో సరస సల్లాపాలలో మునిగి ఉన్న కృష్ణుడికి వర్తమానం పంపారు. అది విన్న వెంటనే కృష్ణుడు ఒక గెంతులో పాన్పు దిగాడు. ద్వారం వైపు చూపు సారించాడు. దూరంగా తన బాల్య సఖుడు కుచేలుడు. అవధులు లేని ఆనందంతో ఎదురువెళ్లాడు. “ప్రియ కుచేలా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! ఇక్కడే ఆగిపోయావేం? లోపలికి రావలసింది కదా” అంటూ హృదయానికి హత్తుకున్నాడు.
కిష్టయ్య ఆత్మీయ పరిష్వంగంలో కుచేలుడు పరవశించిపోయాడు, అప్పటివరకు ఉన్న భయసందేహాలు మాయమయ్యాయి. ‘కిష్టయ్య మారలేదు’ అనుకున్నాడు.
కృష్ణుడు, కుచేలుడిని ఆదరంగా చేయిపట్టి తోడ్కొని వెళ్ళి తన పాన్పుపై సుఖాసీనుణ్ణి చేసి, బంగరు కలశంతో నీరు తెచ్చి అతడి పాదాలను శుభ్రంగా కడిగి, ఆ జలాన్ని తన తలపై చల్లుకుని, రుక్మిణి తలపై కూడా చల్లాడు.
ఆపై కస్తూరి, పచ్చకర్పూర సుగంధ మైపూతలను కుచేలుని శరీరానికి అలది, వింజామరతో వీచాడు. ఆపై అగరు ధూపం వేసి, మణిమయ దీప కాంతులతో హారతి ఇచ్చాడు. అక్కడితో అయిందా.. కుచేలుడు సిగలో పరిమళభరిత పుష్పాలను అలంకరించి, సుగంధద్రవ్యాలతో కూడిన తాంబూలం అందించాడు. ఇన్ని పరిచర్యలతో కుచేలుడి అలసట అంతా ఎప్పుడో ఎగిరిపోయింది. బాల్య సఖుడి ప్రేమాదరాలకు కుచేలుడు బ్రహ్మానందభరితుడయ్యాడు. ఆనందోద్వేగాలతో అతడి నయనాలు అశ్రుపురితాలయ్యాయి. అట్టి సమయంలో రుక్మిణి స్వయంగా వింజామరతో వీచసాగింది.
అక్కడున్న దాసదాసీ జనాలు అదంతా చూసి, అచ్చె రువొంది ‘ఈ నిరుపేద బ్రాహ్మణుడు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా.. శ్రీకృష్ణులవారు అతడిని స్వయంగా తోడ్కొనివచ్చి తన పాన్పుపై కూర్చుండబెట్టి .. సకల పరిచర్యలు చేయడం అంటే ఎంతటి మహద్భాగ్యం!’ అనుకున్నారు.
కుచేలుడి సరసనే కూర్చున్న కృష్ణుడు “ఎలా ఉన్నావు సఖా! నీ భార్య మంచి పండితవంశం నుంచి వచ్చినదే కదా. నీకు అనుకూలంగా ఉంటుందా? అయినా నీవు లౌకిక ఆలోచనలకు అతీతంగా కనిపిస్తున్నావు. అన్నట్లు మనం గురువు గారి వద్ద విద్య గరిపిన రోజులు గుర్తున్నాయా? వారు మనకు ఎంత జ్ఞానబోధ చేశారు! అన్నట్లు ఒకరోజు గురుపత్ని మనలను కట్టెలు తీసుకురమ్మని ఆదేశించగా మనం అడవికి వెళ్ళాం.. ఆరోజు గుర్తుందా? భీకర వర్షం.. అంతటా ఏరులై ప్రవహించే నీరు.. కొంత తడవు చెట్టెక్కి కూర్చున్నాం. సూర్యాస్తమయం అయింది. కారు చీకటిలో ఇద్దరం చేతులు పట్టుకుని ఆ నీళ్ళల్లో తెరువు గానక భయాందోళనలతో తిరుగాడాం.. అంతలో తెల్లవారింది. మనలను వెదుకుతూ గురువుగారు వచ్చారు. మన స్థితి చూసి ఎంతగానో నొచ్చుకున్నారు. గురువు రుణం తీరింది అంటూ మన ఇద్దరినీ విశేషంగా దీవించారు. నీకు గుర్తున్నదా?” అనేక విధాలుగా కృష్ణుడు గురు ప్రశంస చేయగా, కుచేలుడు తల ఊపుచూ “అవును. ఆశ్రమంలో ఉంటూ మనం ఎన్ని చిలిపి పనులు చేశామో కూడా గుర్తుంది. కానీ నీవు లోకాలకే గురువువు. నీకు వేరొకరు గురువు అనుకొనుట అది అంతయు నీ లీల మాత్రమే” అన్నాడు కుచేలుడు.
కృష్ణుడు మందస్మితం చేసి, ప్రసక్తి మార్చి “అన్నట్లు నా వద్దకు వస్తూ నాకోసం ఏం తెచ్చావో నాకివ్వనేలేదు” అన్నాడు.
ఆ మాట విని కుచేలుడు తల వంచుకున్నాడు. ఇంతటి శ్రీపతికి తాను తెచ్చిన బహుమానం అటుకులు.. ఎలా ఇవ్వడం.. క్రీగంట చిరుగుల ఉత్తరీయపు కొంగున కట్టిన అటుకులవైపు చూస్తూ ఒకింత సిగ్గుపడ్డాడు.
దేవదేవుడు దానివైపు చూడనే చూశాడు.
“ఇవి ఏమి” అంటూ చనువుగా ఆ మూటను అందుకుని తెరిచాడు. గుప్పెడు అటుకులను తీసుకుని “సమస్త లోకాలను, నన్ను తృప్తి పరచడానికి ఇవి చాలు” అంటూ హాయిగా ఆరగించాడు. అది చూసి కుచేలుడి మది ఆనందాల నదే అయింది. కృష్ణుడు మరో గుప్పెడు అటుకులు అందుకోబోయేంతలో రుక్మిణి వారిస్తూ “ఇక చాలు స్వామీ, ఇప్పుడు తిన్న గుప్పెడు అటుకులతోనే కుచేలుడికి సమస్త సంపదలు చేకూరుతాయి” అంది.
ఆ రాత్రి కృష్ణుడి ఆతిథ్యాన్ని తృప్తిగా ఆస్వాదించి, కంటినిండా సుఖంగా నిద్రించాడు కుచేలుడు. ఆ మర్నాడు కాలకృత్యాలు తీర్చుకుని, తిరుగు ప్రయాణమయ్యాడు. కృష్ణుడు ఎంతో ఆదరంగా కొంతదూరం వరకు కుచేలుడిని సాగనంపి, వీడ్కోలు పలికాడు.
కుచేలుడు నడుస్తూ మనసులో ‘ఆహా! నేనెంత పుణ్యం చేసుకున్నానో.. సర్వాంతర్యామి, పరమాత్మ, పురుషోత్తముడు అయిన శ్రీకృష్ణుని దర్శించగలిగాను. కృష్ణుడెక్కడ.. నేనెక్కడ. ఎంత మన్నన చేసినాడు. తన సోదరునిలా సంభావించి అక్కున చేర్చుకున్నాడు. తన శయ్యపై కూర్చుండబెట్టుకున్నాడు. స్వయంగా పాదాలు కడిగి, చందనమలది మర్యాదలు చేశాడు. నాది ఎంతటి భాగ్యం’ అనుకుని.. అంతలోనే తన లౌకిక స్థితి గుర్తు వచ్చింది. ‘వామాక్షి కోరినట్లుగా నేను కృష్ణుడిని సంపదలిమ్మని కోరలేదు. నిజానికి ఆ విషయము స్ఫురణకే రాలేదు. దేవదేవుని దర్శన మహాభాగ్యం ముందు ఈ సంపదలు ఏ పాటివి? నిజానికి ఆ పరంధామునికి తన విషయం తెలియదా? ఒక్క తన గురించి ఏమిటి.. సకల చరాచర జగత్తులో ప్రతిప్రాణి సంగతి ఆయనకు ఎరుకే. అసలు తనకు ఇన్ని మర్యాదలు చేసిన వాడు సంపదను మాత్రం అనుగ్రహించలేదంటే.. నాకు సంపదలిస్తే గర్వాంధకారంతో తనను సేవించనని కాబోలు..’ కుచేలుడు ఇలా పరిపరివిధాల తలపోస్తూ ఉండగానే తమ ఊరు రానే వచ్చింది. కానీ తన నిజవాసం స్థానంలో ఆశ్చర్యకరంగా అధ్భుత చలువరాతి భవనం కాంతులీనుతూ దర్శనమిచ్చింది. కుచేలుడు అనిమేషుడయ్యాడు, అవాక్కయ్యాడు. అచేతనుడయ్యాడు. అంతలో భవనం లోపల నుండి ఇద్దరు దేవకన్యల వంటి పరిచారికలు వచ్చి, కుచేలునికి దారి చూపుచు లోనికి తోడ్కొని వెళ్ళారు. భర్త రాకను తెలుసుకున్న వామాక్షి ఆనందోద్వేగాలతో ఎదురువచ్చింది.
సర్వాలంకార భూషితురాలు, సలక్షణ సంపన్నురాలైన వామాక్షిని చూశాడు కుచేలుడు. శ్రీకృష్ణుడి లీల అవగతమై అద్వితీయానందానికి లోనయ్యాడు కుచేలుడు. ఆమె కూడా “నాథా! ఇదంతా శ్రీకృష్ణుల వారి కరుణా కటాక్ష లీలే సుమా. మనకిక దారిద్ర్య బాధ లేదు” అంటూ కుచేలుడికి పరిచర్యలు చేసింది. పిల్లల వంక చూశాడు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు.. ఆనందంతో వారి ముఖాలు సరికొత్త కాంతితో తళుకులీనడం చూసి ‘నా పిల్లలే!’ అనుకుంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. వారు తండ్రికి ప్రణామాలు చేశారు. కుచేలుడు వారిని దీవించాడు.
“మీరిక ఆ జీర్ణ వస్త్రాలను వీడి, ఈ సరికొత్త వస్త్రాలు ధరించండి” అంటూ వామాక్షి, కుచేలునికి నూతన వస్త్రాలు అందించింది.
అది విని, “జీర్ణ వస్త్రాలని వీటిని చిన్నబుచ్చకు. ఇవి నాకెంతో ప్రియమైనవి.. విలువైనవి. కుచేలుడుగనే నేను కిష్టయ్య కృపకు పాత్రుడనైనాను. చేలముల గురించిన చింత ఏల? పరమాత్మ చింతనే పరమానందం.. పరమపద సాధనం” అంటూ భక్తిపరవశుడయ్యాడు కుచేలుడు.
‘నిజమే భగవద్భక్తి సంపన్నుడైన నా నాథునికి ఈ భౌతిక మెరుగులతో ఏమున్నది పని? ఇటువంటి భక్తాగ్రేసరునికి సతినగుట నా సుకృతము. నేనును ఆయనను అనుసరించి తరించవలెను’ అనుకున్నది వామాక్షి.
(సమాప్తం)
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
