[శ్రీ సాగర్ శ్రీరామకవచం రచించిన ‘నిర్వేదం’ అనే నవలని సమీక్షిస్తున్నారు శ్రీ అవధానుల మణిబాబు.]
ప్రతి వ్యక్తికీ ఒక లక్ష్యం, అది సాధించేందుకో నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. అపుడు అతడి ప్రతి అడుగుకూ ఒక స్పష్టమైన దిశ దశ ఉంటాయ్. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ అడుగులలో తడబాటు, నిర్ణయాలలో పొరబాటు ఎదురై అతడి ప్రయత్నాన్ని ప్రపంచం వైఫల్యాల జాబితాలో చేర్చేస్తుంది.
వైద్యునిగా తన వర్తమానస్థితితో ఇమడలేక, తన కూతురిని వైద్యంతో కాపాడుకోలేక, పరిశోధన వైపు మళ్ళి అందుకు అవసరమైన మూలపదార్థాన్ని తనంతట తాను సంపాదించలేక; ఆ ఉనికి తెలిసిన వెంకటయ్య అన్నేళ్ళ స్నేహంలోనూ ఆ విషయాన్నీ రహస్యంగా ఉంచినపుడు – ఇటు కుటుంబ జీవితం, అటు వైద్యవృత్తి, వ్యసనంగా మారిన పరిశోధన మూడింటా ఓడిపోయి; పరిస్థితులనుండి సుదూరంగా పారిపోవాలనుకుని, సంచారిగా మారి, అక్కడా ఎదురుదెబ్బలు తిని, తిరిగి తిరిగి మొదలు పెట్టిన చోటుకే చేరిన డా. శేషాచలపతి ఈ నవలలో నాయకుడు.
ప్రతి దశలో పరాజయమే ఐనా, చిత్రంగా ఎందరో అతడికి సహకరిస్తారు. సాహచర్యం విడిచిపెట్టినా పరిశోధనకు లోటురాకుండా భార్య డా.స్వరాజ్యం ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంది. మిత్రుడు ‘దొంగ జగ్గడు’ ఎపుడూ అండగానే ఉన్నాడు. గుట్టు చెప్పకపోయినా వెంకటయ్య కావలసిన ప్రతిసారీ ముడిసరుకును సరఫరా చేస్తూనే ఉన్నాడు. విసిగి వేసారి సంచారిగా మారిపోయినా తిరిగి వచ్చేవరకూ ప్రయోగశాల బాగోగులు చూసుకోవడానికి విశాలాక్షి ఉంది. ఆ బైరాగి జీవితంలోనూ అడవిలో ‘చుక్కమ్మ’ తోడు దొరికింది. అతడికున్న లోటు ఏమీ లేదు, తనకి ఏం కావాలో తనకే స్పష్టత లేకపోవడం తప్ప.
ఇంతకీ ఏమిటి తనకి కావలసినది? వెంకటయ్య చెప్పనిదీ? ‘స్పైరూలినా’ దొరికే చోటు. ఈ సముద్రపు నీటిలో పెరిగే నాచుజాతికి చెందిన మొక్క ఎక్కడ దొరుకుతుందో శతాధిక వృద్ధుడు వెంకటయ్యకు ఒక్కడికే తెలుసు. అది అతని పూర్వులకు మరెవ్వరికీ చెప్పనని ఒట్టేసి తాను తెలుసుకున్నది. అతని భార్య నూటఎనిమిది సంవత్సరాల వయస్సులో జబ్బుపడి ఆ మొక్క తిన్నాక కాస్త కోలుకున్నా, తన చిన్నతనం నుండీ తాను తింటున్నా ఆ స్పైరూలినా ఒక ఆహారపదార్థంగా తప్ప ఇన్నేళ్ళుగా తమ కుటుంబ ఆరోగ్యరహస్యమని వెంకటయ్యకి తెలీదు. కానీ అది ఎంత దివ్యఔషధమో డాక్టరుకు మాత్రమే తెలుసు. డాక్టరు పరిశోధనలకు సహకారం అందిస్తూ, మరోవైపు వెంకటయ్యను మచ్చిక చేసుకుని కృత్రిమ వాతావరణంలో స్పైరూలినాను తయారుచేసి వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడం ఎలాగో దొంగజగ్గడికి తెలుసు. నాణ్యత పరంగా, ప్రభావం పరంగా సముద్రంలో దొరికే సహజమైన స్పైరూలినాతో తాము తయారుచేస్తున్నది ఏమాత్రం పోటీపడలేదన్నది డాక్టరుకు దొంగజగ్గడికీ ఇద్దరికీ తెలుసు.
ఆ మొక్కపై పూర్తిస్థాయి పరిశోధన చేసి మానవాళికి మహోపకారం చేయాలనే అన్వేషణలో ఉన్న డా. శేషాచలపతి, అతడి భార్య డా.స్వరాజ్యం, సహాయకురాలు విశాలాక్షి, ఆమె భర్త, కూతురు; సంచార జీవితంలో పరిచయమైన బైరాగులు, చుక్కమ్మ; స్వామీజీ, భైరవకోన ప్రయాణంలో కలిసిన వైద్యవిద్యలో సహాధ్యాయులు; ఒకనాటి తన కాంపౌండర్ ఇపుడు మెడికల్ ప్రాక్టీసుతో పాటు అవయవాల వ్యాపారం చేస్తున్న జమ్మయ్య దంపతులు, తండ్రికి ఎదురుతిరిగిన వెంకటయ్య కొడుకు.. వీరంతా నవలలో పాత్రలు. కానీ నాచుమొక్క స్పైరూలినాయే ఈ నిర్వేదానికి ప్రధానపాత్ర అనక తప్పదు.
విశాలాక్షి కూతురు యమున ‘బట్టల మూటల’ పిచ్చిదానిగా ఎందుకు మారింది? జమ్మయ్య భార్య తమకు ఒకనాటి గురువు, ప్రస్తుతం ప్రజలు పిచ్చివాడుగా చూస్తున్న బైరాగి డా. శేషాచలపతిని ఎందుకు కోరుకుంది? వీటి కారణాల వెనుక సున్నిత మనస్కులకు కాస్త ఇబ్బందిగా అనిపించే విషయాలున్నా అవి సమాజంలో జరుగుతున్నవే, మనం రోజూ వింటున్నవే. అవి అవాంఛనీయాలే గానీ అసంభావాలు అనలేం. బైరాగుల ప్రవర్తన, గంజాయి, మానవ అవయవాల వ్యాపారం, ఓ పరిశోధనతో మానవాళికి గొప్ప ఔషధాన్ని అందించాలనే తపనకు ఎదురైన అడ్డంకులు – కథను వేగంగా నడుపుతూనే ఇవన్నీ సాగర్ సమర్థవంతంగా చర్చించారు. డా. శేషాచలం విభిన్న చిత్తవృత్తులు, భ్రమలు, కలో నిజమో తెలీని సన్నీవేశాలు కొన్నిసార్లు మనల్ని కొంత సంభ్రమానికి గురిచేస్తాయ్. పుస్తకం వెనుక బ్లర్బ్‌లో కలిమిశ్రీ అన్నట్లు “సాగర్ మనలని ఎక్కడికో లాక్కుపోతాడు. కొత్త లోకం చూపిస్తాడు. ఈ సాగరయానం సామాన్యమైనది కాదు”.
నవలంతా తీవ్రమైన అంతర్మథనం. శేషాచలపతి వైద్యుడిగా వెలుగుతున్న తాను ఎందుకు ఇలా ఐపోయాడో చాలాసార్లు తలచుకుని సిగ్గుపడిన సన్నివేశాలున్నాయ్. పరిస్థితులతో ఇమడలేక పారిపోయే పలాయన వాదం ఉంది. అన్నీ విడిచిపెట్టినా ‘అయోష్కా’ బ్రాందీ తాగాలనిపించినపుడు బారులోనే హస్తసాముద్రికం బోర్డుపెట్టి కావలసినంతా సంపాదించి మరలా సంచారం మొదలుపెట్టగలిగే వైరాగ్యం(?) ఉంది. భార్య స్వరాజ్యం కోసమో, తనపై పిచ్చివాడనే ముద్ర వేసిన వారికోసమో తన వైఖరిని మార్చుకోని ఉదాసీనత ఉంది. అందుకే, ఎలా చూసినా ఈ నవలకు ‘నిర్వేదం’ అనే పేరు అందంగా అమరిపోయింది.
మరోవైపు నవల అంతా ఎడతెగని ప్రయాణం. స్పైరూలినా కోసం సముద్రంలో. ప్రశాంతత కోసం విరాగంతో బైరాగులతో కొండకోనలు, అడవుల్లో. తీరిక దొరికినపుడల్లా తానెందుకు ఇలా చేస్తున్నాను అని తనలోనికి. ఓచోట అనుకుంటాడు – “అన్నీ వదులుకుని, అన్నీ వదిలించుకుని, విదిలించుకొని, దులిపేసుకుని, త్యజించుకొని గౌతమ బుద్ధిడిలా సమస్తాన్నీ పరిత్యజించి, పరిత్యాగిలా, చెట్లు కూలుతున్న దృశ్యాల వెంట అగచాట్లు తప్పించుకుని చావుని ఆహ్వానిస్తా..” ఇన్నీ చెప్పి “ఏమిటీ ఆలోచనల కందిరీగలు” అంటాడు. నిజానికి చదివేప్పుడు పాఠకుడు అనుకునే మాటలు ఇవి. అంటే పాఠకుడి కన్ఫ్యూజన్ రచయితకు తెలుస్తోందా? లేదా పాత్రలోని కన్ఫ్యూజన్ పాఠకుడికి అంటుకుందా? నాకయితే పాత్రలతో మనలని తాదాత్మ్యం చెందించి తాను వేడుక చూడడమెలగో తెలిసిన రచయిత స్పష్టత కనిపించింది.
మరో సన్నివేశంలో తనను పిచ్చివాడు అంటున్నవారితో చుక్కమ్మ గొడవ పడుతుంటే “వూరుకో చుక్కమ్మా! నలుగురూ నాలుగు అనుకుంటారు! వాళ్ళని వారించగలమా? కోట్లు సంపాదించాల్సిన నేను ఇలా సంచరిగా తిరగటం పిచ్చిగాక మరేమనుకుంటారు. చుక్కమ్మ మాటలు పట్టించుకోకు జమ్మయ్యా! కాని ఈడ మర్రిచెట్టు, ఆడ బెత్తంస్వామి ఆశ్రమం మేము చూసినమాట వాస్తవం! ఇదంతా అబ్సర్డ్ రియలిజం అనుకొని సరిపెట్టుకుందాము” అంటాడు డాక్టర్. ఇది డాక్టరుగారు వాళ్లకు చెప్పడం కాదు. ఇవన్నీ ఎలా అర్థం చేసుకుని సరిపెట్టుకోవాలో రచయిత మనకు చేసిన సూచన కావచ్చు.
స్పైరూలినా కోసం డాక్టర్ శేషాచలపతి పరిశోధన చదువుతున్నపుడు ఎప్పుడో చూసిన ‘వేమన’ సినిమాలో అభిరాముడితో కలిసి బంగారం తయారుచేయడానికి వేమన పడిన తపనంతా కనిపించింది. రంగు, మెరుపు, తూకం ఒకటి వస్తే ఒకటి రాక ప్రయోగమంతా విఫలమై, ఎప్పటికో అది సిద్ధించినా అప్పటికే ఆ లోలత్వంలో పడి ఉన్నవన్నీ కోల్పోయి, ఇల్లువిడిచి అప్పుడు జీవన తాత్త్వికతను తానెరిగి జగద్విదితం చేసిన వేమన మన డాక్టరు గారిలో కనిపిస్తాడు. ఐతే, లక్ష్యాలు వేరు. కాలాలు వేరు, కారణాలూ వేరు.
అధ్యాయాల విభజన, వాటి శీర్షికలు గమ్మత్తుగా ఉంటాయ్. ఈ శీర్షికల క్రమంలోనే నవల నడక దాగి ఉంది. “మహా నిర్వేదం, ఆ తర్వాత, వెలితి, సమయపాలన గతం, నిర్వేదం డిమాండ్ మేరకు బైరాగిగా సంచారిగా, నా మరపడవలో సముద్ర యాతనా యాతన, రజ్జు సర్ప భ్రాంతి, మంగళకర ఆక్రందన” ఇవి పదకొండు అధ్యాయాలలో కొన్నిటి పేరు. ఇందులో సమయపాలన గతం అంటే ఏమిటో తెలీక కాసేపు శీర్షిక దగ్గరే ఆగిపోయాను. కథలోకి వెళ్ళాక తెలిసింది, విశాలాక్షి భర్త పేరు ‘సమయపాలన’. సాగర్ ఇతర నవలలు చదివిన వారికి ఈ పేరు పరిచయమే. బైరాగిగా సంచారిగా గడిపిన కాలమంతా ఒకే సుదీర్ఘ అధ్యాయంగా అదే పేరుతో నడిపించారు. పెద్ద అధ్యాయమే అయినా – మాయలు, భ్రాంతి, స్త్రీ సాంగత్యం వీటన్నిటితో డాక్టర్ గారు రోజుకోలా గడుపుతూ మనకి విసుగు రాకుండా చేస్తారు.
సాగర్ అధ్యాయాలను పదకొండుగా కావాలని విభజించారో, అలాగే కుదిరిందో మనకు తెలీదు గానీ “eleven is the most intuitive of all numbers. It represents illumination, a channel to the subconscious, insight without rational thought, sensitivity, nervous energy, shyness and impracticality” అంటారు సంఖ్యా శాస్త్రవేత్తలు. అచ్చం ఈ (అవ)లక్షణాలన్నీ డాక్టరు పాత్రలో ఉన్నాయ్. అన్ని ఉన్నవాడిని కథానాయకుడిగా ఎన్నుకుని వాడిని పాఠకుడి చేత ఒప్పించి చదివించేలా నవల వ్రాయడం అంటే అంత తేలికైన సంగతి కాదు. రచయితకు తన పాత్రల పట్ల అపరిమితమైన ప్రేమ ఉండాలి. అవి తానే కల్పించినవి అయినా వాటి బాధల పట్ల తానూ దుఃఖితుడు కావాలి. ఆ పాత్ర తాలూకు ఉద్వేగాలు, ఉన్మాదాల పట్ల రచయిత సహానుభూతి పొందాలి. ఇవన్నీ ఉన్నవారు సాగర్ శ్రీరామకవచం. అందుకే ముందుమాటలో తాడి ప్రకాష్ ‘ప్రేమ దుఃఖోన్మాద కవి’ అన్నారీయన్ని.
ఇంతకుమించి ఇదీ కథ అని చెప్పడం అంత సులువు కాదు. నిజానికి కవిత అయినా, వచనమైనా సాగర రచనల విషయంలో అలా చెబుదామనుకోవడమూ అత్యాశే అవుతుంది. ఎందుకంటే, “వస్తువు అనేకానేక సంఘటనల రూపసారమని, దానికి శిల్పం రసస్ఫూర్తి నిస్తుందని; ఆ వస్తు శిల్పాల ఘర్షణలో ఏర్పడిన శూన్యతని నింపే ప్రయత్నంలోనే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు రచయిత ప్రజ్ఞని మించిపోయే పాత్ర వహిస్తాయని” తాను మనసారా నమ్మి ఓ సిద్ధాంతగ్రంథంగా అందించిన వారు సాగర్. ప్రస్తుత నవల ‘నిర్వేదం’ నిస్సందేహంగా పై ప్రతిపాదనల చట్రంలో ఇమిడిపోయేదే.
‘ఓ శూన్యంలోకి అనంత పయనం’ అనే శీర్షికతో నవల ముగిసినా, డా. శేషాచలపతి పయనం గమనం కాదు భ్రమణం అనీ, అది అనంత పయనం తర్వాత అతడిని ఆదిబిందువు వద్దకే చేర్చిందనీ అనిపిస్తుంది. అలా అని మనకేమీ అసంతృప్తి ఉండదు. ఆయనకూ ఉన్నట్టు అనిపించదు. అదే, అనంత పథ పథికుడి లక్షణం.
***
రచన: సాగర్ శ్రీరామకవచం
ప్రచురణ: నవమల్లెతీగ ముద్రణలు, విజయవాడ
పేజీలు: 167
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత: 98854 73934
అవధానుల మణిబాబు కవి, విశ్లేషకులు, వ్యాసకర్త.
1982 జనవరి 29న పుట్టిన మణిబాబు ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం), బి.ఇడి., పూర్తి చేశారు. 2004 నుంచీ రహదారులు మరియు భవనముల శాఖలో పనిచేస్తున్నారు. కాకినాడలో నివాసం.
బాటే తన బ్రతుకంతా.. (కవితా సంపుటి, 2013), అన్నవి.. అనుకొన్నవి.. (సాహిత్య వ్యాసాలు, 2015), అందినంత చందమామ (డా. ఆవంత్స సోమసుందర్ సాహిత్యంపై సమీక్షా వ్యాసాల సంపుటి, 2016), స్ఫురణ.. స్మరణ.. (సాహిత్య వ్యాసాలు, 2017), నాన్న.. పాప.. (కవితా సంపుటి, 2018), నేనిలా.. తానలా.. (దీర్ఘ కవిత, 2019), పరమమ్ (మధునాపంతుల పరమయ్యగారి సాహిత్యజీవితంపై దీర్ఘవ్యాసం, 2020), లోనారసి (సాహిత్య వ్యాసాలు, 2022), నింగికి దూరంగా… నేలకు దగ్గరగా (కవితా సంపుటి, 2023) వంటి పుస్తకాలు ప్రచురించారు. ‘మధుశ్రీలు చదివాకా’ వీరి తాజా పుస్తకం.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ (పిఠాపురం) పురస్కారం, అద్దేపల్లి రామ్మోహనరావు కవితా పురస్కారం (విజయవాడ), సోమనాథ కళాపీఠం (పాలకుర్తి, తెలంగాణ) పురస్కారం, డా. ఎన్. రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం (ప్రొద్దుటూరు), దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం (బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ – విశిష్ట సాహిత్య పురస్కారం (2024) అందుకున్నారు.