Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిర్ణయం

[శ్రీ సుస్మితా రమణమూర్తి రచించిన ‘నిర్ణయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

దవ క్లాసు పరీక్షలు ముగిసాయి. విద్యార్థులు ఏడాదంతా కష్టపడి చదివిన చదువుకి కొలమానం మార్కులే! పరీక్షా కేంద్రాలకు పిల్లలను సమయానికి తీసుకుపోయే శ్రమ పెద్దలకు తప్పింది.

అందరి ఆలోచనలు ఇంటరులో గ్రూపుల ఎంపిక గురించే!

“ఏరా శ్రీనూ! నీవే గ్రూపురా?”

“ఎమ్.ఈ.సి రా! నాకు సైన్సంటే బోరింగ్!”

“ఏమే వనజా! నీవే గ్రూపు?”

“డాడీ ఎమ్.పి.సి, మమ్మీ బైపీసీ అంటున్నారు. నాకు మాత్రం ఎమ్.ఈ.సే బెటర్!”

అవి విద్యార్థుల ఇష్టాలు! పెద్దల అభీష్టాలు!

***

“ఏరా గోపాలం! అమ్మాయి పరీక్షలు బాగా రాసిందన్నావు. ఏ గ్రూపులో జాయిను చేస్తున్నావు?”

మిత్రునికి నవ్వుతూ చెప్పాడు గోపాలం – “డాక్టరుని చేస్తానురా!”

“నిర్ణయం మంచిదేరా! అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నావా?”

“అవసరం లేదురా! గ్రూపు సెలెక్షన్ మనకు తెలియదనా?”

అది ఓ తండ్రి చిరకాల వాంఛ! కూతురు ద్వారా కోరిక తీర్చుకోవాలన్న తపన!

***

“డాడీ! రేపు మీరు ఈ కాలేజీకి వెళ్ళి, బైపీసి సీటు కోసం ఫస్ట్ టెర్మ్ ఫీజు కట్టేయండి. వారితో అన్ని విషయాలు మాట్లాడేను. మూడ్రోజులు ఆఫీసు మీటింగులతో చాలా బిజీ నేను. సునందను తోడుగా తీసుకెళ్ళండి”

కొడుకు చెప్పిందానికి “అలాగే” అన్నాడు తండ్రి.

“ఈ బ్రోచరులో అడ్రసుంది” అంటూ బ్రోచరులో డబ్బు పెట్టి ఇచ్చాడు కొడుకు.

“రేపు తాతగారితో వెళ్ళమ్మా! ఆ కాలేజీలో బైపీసీ గ్రూపులో చేరు! అప్లికేషన్ ఫారం తీసుకెళ్ళడం మరచిపోకు”

అయిష్టంగానే తలూపింది అమ్మాయి.

“డాడీ! మీరెందుకు ముభావంగా ఉన్నారో నాకు తెలుసు. మనలో ఎవరూ డాక్టరు అయిన వారు లేరు. సునంద డాక్టరైతే బంధువర్గాలలో మనకెంత గౌరవమో ఆలోచించండి. అందుకే మన హైదరాబాదులో ద బెస్ట్ కాలేజీలో చేర్పించడం”

“ఇంటరు చదివేది ఎవర్రా?” తండ్రి ప్రశ్నకు విసుగ్గా చూసాడు కొడుకు.

“చదివే అమ్మాయి నచ్చిన గ్రూపు తీసుకుంటే, ఇష్టంగా చదువుతుంది. లేకుంటే ఆశించిన ఫలితం రాదు”

తండ్రి మాటలు కొడుక్కి నచ్చలేదు.

“నిన్ను ఆ రోజుల్లో ఇంజినీరింగు చేయమంటే కాదన్నావు. బియస్సీ కంప్యూటర్ సైన్సన్నావు. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ కౕంప్యూటర్ సైన్సెస్ చేసావు. అంతా నీ ఇష్ట ప్రకారమే చదివావు. నేనేనాడూ నీ ఇష్టాన్ని కాదనలేదు గుర్తుందా?”

తండ్రి మాటలకు కొడుకు నిర్విణ్ణుడయాడు.

“దానికి నచ్చిన గ్రూపు తీసుకోనివ్వడం మంచిదిరా! నా నిర్ణయం ప్రకారం డాక్టరే అవ్వాలనడం మూర్ఖత్వం. అలా బంధించడం ఒక రకమైన మానసిక రుగ్మత లక్షణం రా!”

కొడుకు తండ్రి మాటలకు కోపంతో ఊగిపోయాడు.

“అంటే నేను మానసిక రోగినా డాడీ!?”

“నా మాటలకు అర్థం అది కాదురా! అలా ప్రవర్తించడం మంచిది కాదంటున్నాను”

“మీరు రేపు నేను చెప్పినట్లు చేస్తారా లేదా?”

“తప్పకుండా చేస్తారా! అయితే ఒక్క విషయం తెలుసుకో. మన నిర్ణయం మన వాళ్ళకే నచ్చనప్పుడు, ఇంటి వాతావరణంలో అశాంతి చోటుచేసుకుంటుంది. మనశ్శాంతి కొరవడుతుతుంది” అంటూ తండ్రి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

***

“తాతా! యంపీసీ గ్రూపుకి డబ్బు కట్టావేంటి!?..”

“ఇది నా నిర్ణయం! నీ అభీష్టం! ఈపాటికి నామాటల ప్రభావంతో వాడిలో మార్పు వచ్చే వుంటుంది. రాకుంటే మీ అమ్మమ్మ లెక్చరర్‌గా పనిచేస్తున్న వరంగల్ కాలేజీలో చేర్పిస్తానురా! తనకింకా నాలుగేళ్ళు సర్వీసుంది. అక్కడే నీవు ఇంటరు చదువు, ఇంజినీరింగులో చేరవచ్చు”

ఆ అభయహస్తంకి మనవరాలి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇష్టమైన చదువు చదువుకోవచ్చన్న ఆనందంలో తాతగారిని వాటేసుకుంది.

(సమాప్తం)

Exit mobile version