Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిరతాన్నదాత డొక్కా సీతమ్మ

[‘నిరతాన్నదాత డొక్కా సీతమ్మ’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

తూర్పు గోదావరి జిల్లాలో గల మండపేట గ్రామంలో 1841వ సంవత్సరం అక్టోబరు నెలలో అనుపిండి భవాని శంకరం, నరసమ్మ దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమే భవిష్యత్తులో ఉభయ గోదావరి జిల్లాలలో నిరతాన్నదాతగా, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు పొందిన డొక్కా సీతమ్మ గారు. చిన్నతనంలోనే తల్లి మరణించింది. ప్రాచీన సాంప్రదాయాలతో ఆ రోజులలో ఆడపిల్లలని బయటకు పంపి విద్య నేర్పించటం అనేది లేదు. భవానిశంకరంగారే కూతురు సీతమ్మకి కథలు, గాథలు, పద్యాలు, పాటలు నేర్పారు. తండ్రి వద్ద పెద్దబాలశిక్ష నేర్చుకున్నది. లోకానుభవంతో ఎంతో నేర్చుకున్నది. ఆ రోజుల్లో పంచ కావ్యాలు చేత పట్టుకొని, పెద్ద బాలశిక్ష చదివితే మహా పండితులు అనేవారు. తండ్రి శిక్షణలో ఆమె ఎంతగానో చదివింది.

భవానిశంకరం గారు అడిగిన వారికి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆయనను అందరూ బువ్వన్న అని పిలిచేవారుట. సార్థక నామధేయుడు బువ్వన్నగారు. తండ్రి అన్నదానం చేయటం చూసి ఆమె ఎంతగానో ఆనందించేది. అదే తండ్రినుంచి ఆమె నేర్చుకున్నది. ఆరు సంవత్సరాల వయస్సులోనే ఆమె అన్నం వండి తండ్రి అన్నదానానికి ఆహారాన్ని సమకూర్చేది. వశిష్ఠ వైనతేయ గోదావరి నది పాయలలో లంకల గన్నవరం అనే గ్రామం ఉన్నది. ఒకసారి అక్కడి నుంచి డొక్కా జోగన్న పంతులు అను పేరుగల ఆయన వచ్చారు. ఆయన ధనవంతుడే కాక వేదపండితుడు, సద్బ్రాహ్మణుడు కూడా. వారు ఒకసారి పండిత సభకు వెళ్లి వస్తూ అపరాహ్నానికి మండపేటకు చేరుకున్నారు. బువ్వన్నగారి ఆహ్వానంతో వారి ఇంటికి భోజనానికి వెళ్లారు. అక్కడ పిన్నవయస్కురాలయిన సీతమ్మ గారి ఆదరణ, ఆతిథ్యాలను చూసిన ఆయన ముగ్ధుడైపోయారు.

జోగన్నగారు సీతమ్మగారిని వివాహం చేసుకోవటానికి బువ్వన్నగారి అనుమతిని కోరాడు. ఆయన కోరికను మన్నించిన భవాని శంకరం గారు జోగన్న గారితో సీతమ్మకు వివాహము జరిపించారు. నాటి నుండి ఆమె డొక్కా సీతమ్మగా ప్రసిద్ధి చెందారు. అప్పటికి ఆమె వయస్సు తొమ్మిది సంవత్సరాలు. లంకల గన్నవరం గోదావరికి మధ్యలో ఉన్నందువల్ల ప్రయాణికులు అలసి ఆకలితో వచ్చేవారు. అంతేకాక ఆ గ్రామానికి వరదల తాకిడి కూడా ఎక్కువే. దానితో ఏర్పడే కరువు కాటకాల వలన ఆకలి బాధతో వచ్చేవారికి భర్తతో కలిసి అన్నపానాదులను సమకూర్చేది సీతమ్మగారు. భర్త అండదండలతో ఆమె ఏ లోటు కలగకుండా నిరంతరం అన్నదానాన్ని చేయసాగింది. ఎవరు ఏ వేళలో వచ్చినా ఆకలి అన్నారంటే లేదనిగాని, తరువాత రా అనే పదాలు ఆ ఇంట వినబడేవి కావు. ఆకలితో ‘అన్నమో రామచంద్రా’ అన్నవారికి అన్నం పెట్టడమే ఆమె వ్రతం. అదే ఆమె భగవంతుడికి చేసే పూజ. అంతటి మహా ఇల్లాలు డొక్కా సీతమ్మ గారు.

ఆమె అన్నదానాన్ని గురించి అందరూ కథలు కథలుగా ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ‘అన్నంపరబ్రహ్మ స్వరూపం’ అంటారు కదా. అంతేకాదు ‘దానాలన్నింటి లో అన్నదానం గొప్పద’ని మన పూర్వీకుల వాక్కు. అలాంటి అన్నదానం చేసి చేసి చివరకు వారికే తినడానికి తిండి లేకుండా పోయింది. అయినా ఆమె లేదు అనలేదు. ఆమె అన్నదానం ఆగలేదు.

అప్పుడు బువ్వన్న గారు “సీతమ్మా! ఇంకా ఏమి పెడతాము. వద్దంటే వినవు కదా! ఎవరైనా తలుపు తడతారు అంటే భయంగా ఉన్నది” అన్నారు. అపుడామె “నేను మనుషులకు కాదు ఆహారం పెడుతున్నది. సాక్షాత్తు ఆ నారాయణమూర్తికే పెడుతున్నానని అనుకుంటున్నాను. అయినా ఆయనే ఇస్తాడు” అన్నది. ఆమె అన్నట్లుగానే ఒకసారి బువ్వన్నగారు పొలం దున్నటానికి వెళ్లారు. పొలం పదును చేస్తున్న సమయంలో బువ్వన్నగారి పలుగుకు ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అది అని చూస్తే అక్కడ ఒక బిందె కనిపించింది. దానినిండా బంగారు నాణేలు ఉన్నాయి. అప్పుడు ఆమె “చూశారా భగవంతుణ్ణి నమ్మితే మోసం చేయడం అనేది ఉండదు” అన్నారు. అని మరలా సీతమ్మగారు యధావిధిగా తన అన్నదానాన్ని కొనసాగించారు.

ఒకసారి సీతమ్మగారు అంతర్వేది నరసింహస్వామిని చూడటానికి అంతర్వేదికి పల్లకిలో బయలుదేరారు. అలిసిన బోయీలు ఆమె ఎక్కిన పల్లకిని ఒక వంతెన మీద దింపారు. అక్కడ కొందరు పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు. అప్పుడు ఆ సమూహంలోని వారు “ఇంకెంతో దూరం లేదమ్మా ఇంకాస్త నడిచామంటే డొక్కా సీతమ్మ గారి ఇంటి వద్దకు వెళతాము. అక్కడ ఆ అన్నపూర్ణమ్మ మనకు అన్నం పెడుతుంది. అక్కడ అన్నం తిని ఆకలి తీర్చుకోవచ్చు” అని చెబుతున్నారా పిల్లలకు. అప్పుడు వెంటనే ఆమె బోయీలతో పల్లకిని వెనక్కి ఇంటికి పోనివ్వమన్నది. అలా ఆమె వారికన్నా ముందుగా ఇంటికి చేరి అన్నం వండి వారి ఆకలిని తీర్చింది. భగవంతుని చూడటం కన్నా మనుషులలో దేవుడ్ని చూడాలి. మానవసేవే మాధవసేవ అన్నది ఆమె మతం.

ఒకసారి గోదావరి వరదల్లో చిక్కుకున్న ఒక వ్యక్తి ప్రవాహానికి భయపడి “అమ్మా సీతమ్మ తల్లీ ఆకలి తీర్చమ్మా” అని అరిచాడు. అప్పుడు అర్ధరాత్రి. వర్షం కురుస్తున్నది. ఆమె “ఎవరో ఆకలితో బాధపడుతున్నారు” అన్నారు భర్తతో. “బయట వాన కురుస్తున్నది. వరద. ఎలా వెళతాము. ఎలా ఆకలి తీరుస్తాము?” అన్నారు. ఆమె వెంటనే కొన్ని రగ్గులు, అన్నం, గొడుగు అన్నీ తీసుకొని అక్కడకు బయలుదేరారు. ఇక చేసేదేమీ లేక బువ్వన్న గారు కూడా పడవ వాళ్ళని పిలిచి వారి ఆకలిని తీర్చి వారిని ఇంటికి తీసుకొని వచ్చారు.

ఇలాంటి సంగతులే ఆమె గురించి ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఆమె చేతి అన్నం తింటే సంతానం కలుగుతుంది అని చాలామంది ఆమె దగ్గరకు వచ్చి భోజనం చేసి వెళ్లేవారు. అందరూ ఆమెను సాక్షాత్తు అన్నపూర్ణగా, ఆమె పెట్టేది ప్రసాదంగా భావించేవారు.

ఒకసారి బ్రిటిష్ చక్రవర్తి కింగ్ ఎడ్వర్డ్ VII పట్టభిషేక వార్షికోత్సవానికి డొక్కా సీతమ్మ గారి ఫోటో ఒకటి పంపమని ఆ జిల్లా కలెక్టర్‌ను అడిగారు. అతడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఫోటో ఒకటి కావాలి అని అడిగితే సీతమ్మగారు “నా ఫోటో ఎందుకు. నేను ఎవరి కోసమో కాదు ఈ అన్నదానం చేస్తుంది. నా తృప్తి కోసం మాత్రమే” అని చెప్పారు. “నాకు ఎటువంటి కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు” అన్నారు. కానీ కలెక్టర్ గారు “అమ్మా ఇది చక్రవర్తి గారి ఆజ్ఞ. మేము దానిని మన్నించకపోతే నా ఉద్యోగం పోయి నాకు నా బిడ్డలకు తిండి ఉండదు” అంటాడు. వెంటనే ఆమె “అయితే మీకు మీ పిల్లలకు అన్నం ఉండదని నువ్వు బాధపడుతున్నావు కనుక నేను ఒప్పుకుంటున్నాను” అని ఆమె ఫోటో తీసుకోవడానికి అంగీకరించారు. ఆ ఫోటోని బ్రిటీషు చక్రవర్తి తన పట్టాభిషేకం సమయంలో సోఫాలో ఆమె ఫొటో పెట్టి ముందుగా ఆమెకు నమస్కరించి ఆ తరువాత పట్టాభిషేకం చేసుకున్నారు. అదీ ఆమె గొప్పతనం.

గోదావరి జిల్లాలు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోనే కాక పాశ్చాత్యదేశాలలో కూడా అన్నపూర్ణగా ఆమె ఖ్యాతి పొందింది. డొక్కా సీతమ్మ గారు భారతదేశానికి గల అన్నపూర్ణ పేరు సార్థకం చేసింది. దేశ దేశాలలో దేశఖ్యాతిని ఇనుమడింపజేసిన నిరతాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. ఆమె గౌరవానికి గుర్తుగా ప్రభుత్వం గోదావరి ఆక్వెడిట్టుకు ఆమె పేరు పెట్టడం జరిగింది.

అంతేకాక ఇపుడు పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి ‘డొక్కా సీతమ్మ భోజన పథకం’ అని పేరు పెట్టడం ఆమెకిచ్చిన గౌరవం.

కాశీక్షేత్రంలో గల అన్నపూర్ణాదేవి విగ్రహం వలె చేతిలో అన్నం గరిటె పట్టుకున్న ఆమె విగ్రహం మనకు కాకినాడ వివేకానంద పార్కులో కనిపిస్తున్నదంటే అది ఆమెకిచ్చిన గౌరవానికి నిదర్శనం. మాతృమూర్తి, అన్నదాత, ప్రేమమూర్తి డొక్కా సీతమ్మగారిని రోజూ మనం అన్నం తినేటప్పుడు ఒక్కసారి ఆమెను తలుచుకోవడం అనేది జరిగితే మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆమెకు చేసే నమస్కారము అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ తల్లికి చేసినట్లే. ప్రభుత్వము ఆమె ఇంటిని దర్శనీయ స్థలంగా మార్చింది. ఆమెను చూడలేకపోయినా ఆమె తిరుగాడిన ఇంటిని చూడగలగటం మన అదృష్టం.

Exit mobile version