రాలిపోయిన పూవు వికసించునా
వాడిన చెట్టు చిగురించునేమో కానీ
గడచిన కాలం మరలి వచ్చునా!!
నీరు ఆవిరై మరుక్షణం మేఘమై
పిల్లతెమ్మెర స్పర్శకే వర్షించును తిరిగి నీరై
కానీ మరలిపోయిన గతాన్ని పునర్దర్శించగలమా!!
విత్తిన నమ్మకం మానై వటవృక్షమై
రెమ్మలకి పూలై పండి తిరిగి విత్తనమై
భవిష్యత్తున నీ దొసిటిని నింపునేమో కానీ
నిరర్థకమున పండు కాయవునా..?
గాలివానకి దూరమైన మట్టి రేణువులు
మరలి వచ్చి తుఫానుగా మారి ఏకమై
సుడిగాలిలా చుట్టి జీవితాన్ని కుదిపేయగలవు
కానీ విడిపోవునా కుటుంబంలోని ప్రేమానుబందాలు..
చిగురించగలవు కూలిన వృక్షపు కాండాలు కూడా!!
డా. హేమావతి బొబ్బు తిరుపతి వాసి.
వీరి ప్రాథమిక విద్య తిరుమలలో, ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఆర్ జి యు కె టి ఇడుపులపాయలో అధ్యాపకురాలిగా పనిచేసారు.