[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘నిరంతర మథనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నా మనసు ఓ గాలిపటం
నా చేతిలో దారం ఉన్నా ఫలితం సున్నా
దానికి అవని తప్ప అవధులు లేవు
ఎల్లలు కల్లలు ఎరగని గని అది
హిమ శిఖరాలను చుంబిస్తుంది
పాతాళాలను స్పృశిస్తుంది
దానికి వయసు లేదు వరస లేదు
ఎక్కడికైనా పోతానంటుంది
ఆ పోయింది తాను పోక
ఈ జీవున్నీ రమ్మంటోంది
అక్కడే వస్తోంది కదా సమస్య
మనసు వెళ్ళిన ప్రతీ చోటకీ
మనిషి వెళ్ళలేడు కదా
ఆ సంగతి దానికి అనవసరం
నీ కట్టుబాట్లు కట్టి పెట్టు అంటుంది
గద్దిస్తుంది పెద్ద నోరు చెస్తుంది
ఆ నస భరించడం మహ కష్టం
కాని పసిదాని లాంటి దానిని
చూస్తే భలే ఇష్టం
ఏ ఆధారం లేని ఈ గాలి పటం
ఏ కొమ్మకో చిక్కుకోకుండా
ఏ ముళ్ళ కంపనో రక్కుకోకుండా
కాపాడడమే నా నిత్య కృత్యం
అయినా ఇదొక మహ యజ్ఞం
నిరంతర మథనం
మనసు ప్రశ్నకు ఎప్పటికీ
దొరకని సమాధానం
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.