[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘నిరాశాధిగమనం’ అనే కవితని అందిస్తున్నాము.]
ప్రగతి పథపు అడుగుల వడి
సాధించే యత్నంలో ఆరాటపు జడి
ఎటువేపు ఉరకల పరుగుల జీవితం
నిదానం ప్రధాన సూత్రం యాది లేదా
ఆదర్శ జీవనం మాది మా కెదురేదీ
అహంభావపు మానవతత్వం అదేగా
ఆ వేగంలో ఆ వడి జడిలో ఒత్తిడిలో
ముక్కుపచ్చలారని నూనూగుమీసాల
యవ్వన ప్రాయంలో అడుగులు పెట్టే
యువతీ యువకుల మానసిక అలజడి
ఆందోళన అధిగమించే మార్గం కానరాక
ఎంచుకునే ఆలోచనేదీ ఆదర్శమేదీ
అన్నీటినీ అణిచే నిరాశ నిస్పృహలు
ఆశయాలనందుకో లేక వెనకపడి
విశ్వాస రాహిత్యమే మరణాహ్వానం
ధీరునిలా నిలవాలి భీరుడవైతే ఎలా
ప్రపంచంలో దూసుకుపోవాలి
ధైర్యమే సోపానంగా నడు విజయం నీదే
ఉన్నత విద్య నభ్యసించి ఉన్నత ప్రమాణ
జీవన సౌధాలను ఆరోహించాలనే
ఆశ తీరదనే భ్రాంతితో ధైర్యం కోల్పోయి
చివరి నిర్ణయం మరణమార్గాన్వేషణ
ఆన్వేషణేం లేదు చనిపోవడమే
మనసు మరల్చి అమ్మ మమత నాన్న
తపన గమనికలో వుంచుకున్నావా
ఆకర్షణల ప్రలోభంలో మునగక
లక్ష్యం వేపు వడిగా అడుగులు వేయి
నవ జీవన ప్రగతి పథం వేపు నడు
అంతేగాని అపజయానికి బెదరకు
ఇలా మారిందేం రేపటి పౌరుల భవిత
అరే రేపు పరీక్ష ఈ రోజు మరణాహ్వానం
పరీక్షలు ఊపిరి తీసేవి కాదు
ఎందుకిలా పరీక్ష పోతే మళ్ళా రాస్తాం
పోయిన జీవికి జీవం పోయగలమా
ఆలోచించు పునరాలోచన చేయి
మనసు నెమ్మది చేసుకో మళ్ళించు
మానసిక ప్రశాంతికి మార్గాలెన్నో
సంగీతాస్వాదన యోగామార్గం
ధ్యానం మానసిక ఏకాగ్రతకు సోపానం
చిత్రలేఖనాసక్తిపై దృష్టి సారించు
సాహిత్య పఠనం పెద్దలతో సంభాషణ
ఇష్టంగా సాధన చేయాలి కష్టంగా కాదు
ఆసక్తితో అనురక్తితో మనసు పెట్టు
ఒత్తిడి నధిగమించే ప్రయత్నం చేయి
దైవస్మరణతో దృఢత్వం ఆర్జించు
ఆత్మన్యూనత తరిమికొట్టే ప్రయత్నంతో
నిత్యాన్వేషణ పథంలోకి నడక సాగించు
గురుదేవుల సన్నిహితత్వంతో
విజ్ఞానాన్వేషణ కాదు రణం
ఉన్నత జీవన గమన తోరణం
నవ జీవనమే లక్ష్య సాధనగా
ఓ విద్యార్థీ బైటపడు నైరాశ్యం నుంచి
విదేశీ గమనమే నీ గమన మార్గమా
జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి
మన దేశపు ఔన్నత్యం తెలిసి మసలు
ప్రయత్నించు ఓటమే విజయ సాధనం
పట్టుదలకి సోపాన మార్గం అపజయం
గుర్తించు గ్రహించు అధిగమించు
సాధించు ఉన్నత పథం సుగమం
సమయ పాలనతో ముందడుగు వేయి
గెలుపు నిన్ను వరించి ఆవహిస్తుంది
విజయానందం నిను నడిపిస్తుంది
తల్లిదండ్రుల్లారా మీకిదే నా విన్నపం
మీ మదిలో ఆశలు ఆశయాలు
పిల్లలపై ప్రయోగించకండమ్మా
ఆసక్తులు నైపుణ్యాలు గమనించి
ప్రోత్సహించండమ్మా నైపుణ్య
పథమార్గం సుగమం చేయండమ్మా
బాల్యంలో చదువుల వెంట పడక
ఆటలలో పాటలలో ఆనందంచూపు
ప్రకృతిలో పక్షికూజితాలను గమనించి
విరిసే పువ్వుల అందం ఆస్వాదించి
రామాయణం కృష్ణ కథలను భారతం
మిత్ర లాభ మిత్రబేధ కథలు చెప్పి
మార్గదర్శనం చేసి ఆత్మవిశ్వాసం
అనే ఎరువు వేసి మనోధైర్యంతో
భవిత వేపు రాజ మార్గమున
పయన సంసిధ్ధులను చేయండి
దైవమిచ్చిన వరం ఈ జీవితం
సాధన అనే తెడ్డుతో జీవన
నావను నడిపి పయనిద్దాం
జీవితాన్నిఇచ్చిన పరమాత్మను
నిత్య ప్రణామాలతో స్తుతిద్దాం