[సిహెచ్. కళావతి గారు రచించిన ‘నిప్పు కణిక’ అనే కవితని అందిస్తున్నాము.]
అమ్మా.. అమ్మా..
ఎక్కడున్నావమ్మా.. ఎక్కడికి వెళ్తున్నావమ్మా
నన్ను చూడడమే నీకు ఇష్టం లేదా?
నా పిలుసే నీవు భరించలేవా అమ్మా
నన్ను కని పురిటిలోనే పుడమిని విడిచావంట
నన్ను పెంచి పెద్దచేసే బాధ్యతను విస్కరించావా
పురిటిలోనే అమ్మను మింగిన ఆడదని
అందరూ నన్ను నిందిస్తుంటే
వినడానికే బాధగా ఉందమ్మా
అమ్మా నేనే నిన్ను చంపుకొన్నానా
నా జన్మ నీ జన్మను అంతం చేస్తుందని
ముందే నాకు తెలిసి ఉంటే
నిన్ను చంపే ఈ జన్మ నాకు వద్దని
గట్టిగా అరిచే దాన్నమ్మా!
నీ కన్నవారింట్లో నీకు కష్టాలేనంట ఆడపిల్లవని
అత్తారింట్లో నీకు ఆరళ్ళేనంట
ఇన్ని కష్టాలు పెదవి విప్పకుండా
ఎలా భరించావమ్మా
ప్రశ్నించే తత్త్వాన్ని, ధిక్కరించే స్పరాన్ని
ఎందుకు విన్పించలేదమ్మా
నా పుట్టుకకు ముందే వీళ్ళు నిన్ను చంపేశారు గదమ్మా
జీవచ్ఛవంగా బతుకీడుస్తున్న
నా తల్లిని నేను మళ్ళీ చంపుకొంటానా?
ఎదురించని సంప్రదాయ సంస్కృతి చట్రంలో బందీవై
సహనానికి మారు పేరుగా నిలచిన నీకు
ఈ సమాజం నీకు ఏం సత్కారం చేసిందమ్మా
అమ్మా నేను నీ కూతురిని
నీ మరణం నుండి పుట్టిన నీ మరో జన్మని
నీవు పొందిన వేదన రోదన
మరే స్త్రీ జీవితంలో తొంగి చూడకుండా
పిడికిలి బిగించి ఉద్యమ శంఖారావం మ్రోగించి
స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి, చైతన్య స్ఫూర్తి అని చాటుతూ
లింగ వివక్ష రూపుమాపే ప్రయత్నంలో
నా ప్రాణాలైనా అర్పిస్తా
సహనానికి మారుపేరుగా నిలిచే స్త్రీ
అవసరమైతే నిప్పుకణిక అవుతుందని నిరూపిస్తా
స్త్రీ జాతి ఉద్ధరణకు నీవు
నన్ను వెలిగించిన జ్యోతి అని
ఋజువు చేస్తానమ్మా.. ఋజువు చేస్తాను.