Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిన్నా మొన్నటి ముచ్చట

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పెనుమాక నాగేశ్వరరావు గారి ‘నిన్నా మొన్నటి ముచ్చట’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“అబ్బాబ్బా స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారో.. వీళ్ళ గోల భరించలేకపోతున్నాం” విసుగ్గా అన్నది వసుంధర

“పదవ తరగతి పిల్లల్నే పరీక్షలు లేకుండా పాస్ చేసేస్తున్నారు.. ఇక నాలుగవ తరగతి, ఆరో తరగతి చదువుతున్న నీ పిల్లల చదువులు ఎవడికి పట్టే?” వేళాకోళంగా అన్నాడు భర్త ప్రభాకర్.

“ఆ ఆన్‌లైన్ క్లాసులన్నా మొదలుపెడితే కానీ వీళ్ళ ఆగం ఆగదు. ఇల్లు పీకి పందిరేస్తున్నారు.”

“అమ్మా ఆకలేస్తుందే.. ఏమన్నా పెట్టు మాకు తినటానికి” ఏడుపు నటిస్తూ అడిగింది తొమ్మిదేళ్ల చైత్ర. చెల్లికి వంత పాడుతూ వెనకనే తనూ అందుకున్నాడు అనుదీప్.

“నన్ను పీక్కుతినండిరా.. ఇప్పుడేగా చెరో యాపిల్ తిన్నారు. పొద్దస్తమానం తింటూ వుండాలంటే ఎట్లా? ఏం పెట్టేది?” పిల్లలిద్దర్నీ వెనక్కి తోస్తూ విసుగ్గా అన్నది వసుంధర

“ఒసే అమ్మలూ నువ్వూ అన్నా ఇటు రండి.. నేను మీకో కొత్త తాయం చేసి పెడతా” చేతులు ముందుకు చాచి అన్నది వాళ్ళ నాయనమ్మ దుర్గాంబ.

పిల్లలిద్దరూ ఆమె దగ్గరకు పరుగుతీశారు. ఆమె పక్కనే పుస్తకం చదువుకుంటూ కూర్చున్న తాతగారు ఒరకంట పిల్లల్ని గమనిస్తూ మూసిముసిగా నవ్వుకున్నారు

‘ఒకప్పుడు పిల్లలకి రెండే సమస్యలుండేవి. ఆకలి, ఆటలు. ఆకలయితే అన్నం పెట్టమని గోల చేసేవాళ్ళు. తోచకపోతే ఆడుకోవటానికి బయటకు వెళతామని గొడవ చేసే వాళ్ళు. ఇప్పుడలాకాదే! పిల్లలకెన్ని సమస్యలు! ఒకటా రెండా? లెక్కే లేదు. పెద్దవాళ్లకన్నా ముందే నిద్ర లేవాలి. అది రోజులో మొదటి సమస్య. గబగబా స్నానాదికాలు పూర్తిచేసుకోవాలి. ఆకలయినా, కాకపోయినా, సహించినా లేకపోయినా వీలయినంత త్వరగా పెట్టినది తినేయాలి, కాదు కాదు మింగేయాలి.. బడి బస్సు వచ్చేసరికి వేషం వేసుకుని మోయలేని సంచీనీ భుజాన వేసుకుని రోడ్డుమీదికి వచ్చి నుంచోవాలి. నిద్రమత్తు వదలని ముఖాల్తో అమ్మానాన్నలకు బై చెప్పి బస్సెక్కాలి.’

‘రాత్రి అమ్మానాన్నలతో కలసి టీ.వీ చూస్తూ పూర్తి చేయటం మర్చిపోయిన హోం వర్క్ గుర్తుకువచ్చి టీచర్ కొడుతుందో, తిడుతుందో అని మనసులో మథనపడాలి. బస్సులో కూర్చుని వీలయితే కునికిపాట్లు పడాలి, కుదిరితే బస్సులోనే హోం వర్క్ పూర్తిచేసుకోవాలి. ప్రాజెక్ట్ అనే మాట వ్రాయడం కూడా తెలియని పసిగుడ్డుకు ప్రాజెక్ట్ వర్క్. బొమ్మలతో సహా తయారుచేసి టీచరుకు చూపించాలి. మీ అన్నంటే ఎందుకని ఇష్టమో, ఇడ్లీ అంటే ఎందుకని ఇష్టం వుండదో ఆంగ్లంలో వ్యాసం వ్రాసేయాలి. ఇవి వ్రాయాల్సిన బిడ్డకు నిండా ఏడేళ్లే!’

మనసులో ముసురుతున్న ఆలోచనలతో పుస్తకం మూసి మనవడు, మనవరాలు నాయనమ్మతో ఏం మాట్లాడతారో అని ఆసక్తిగా వినసాగాడు తాతగారు, సుందరరామయ్య గారు.

“మీకు సున్ని వుండలు చేసి పెడతాను సరేనా” బామ్మ మాట పూర్తి కాకుండానే ఇద్దరూ కాళ్ళు నేలకేసి కొడుతూ, తలలు అడ్డంగా వూపారు.

“వాళ్ళకి అలాంటివి నచ్చవు అత్తయ్య గారూ ఇప్పుడు నేను పిజ్జానో, మసాలా బజ్జీనో చేసి పెట్టాలి. రెండు రోజులబట్టీ అదే గొడవ” అంటూ వంటగదిలోకి నడిచింది వసుంధర.

హుషారుగా చప్పట్లు కొడుతూ తల్లి వెనకాలే వంటగదిలోకి పరుగెత్తారు పిల్లలు ఇద్దరూ.

పిజ్జా మర్నాడు చేస్తానని మాట ఇచ్చి వాళ్ళని సమాధానపరచి, అప్పటికి వాళ్ళకి ఇష్టమైన నూడిల్స్ తినటానికి సరే అనిపించి చేయటం మొదలుపెట్టింది వసుంధర.

‘చదువులలోని సారమెల్ల చదివితి తండ్రి అని ఏనాడో ప్రహ్లాదుడు తండ్రితో చెప్పాడని విన్నాం, చదివాం. ఇప్పుడు చదువు పేరుతో పిల్లల సారాన్ని పీల్చి వాళ్ళని పిప్పిగా మారుస్తున్నారు. ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారు. బడి అంటే ఎలా వుండాలో అలా వుండటం లేదు. చదువు ఎలా వుండాలో అలా వుండటం లేదు. ఇలా చెప్పిన వాళ్ళని మీవి వానా కాలం చదువులంటూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ ప్రబుద్ధులకి మీవి ఏ కాలం చదువులో చెప్పగలరాఅని ప్రశ్న వేస్తే సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు.’

‘పిల్లలకి ఆడుకోవటం తెలియటం లేదు. ఆడుకోవటానికి తీరిక లేదు. పండుగ వచ్చినా వూరు వెళ్ళినా హోం వర్క్ బాధ పీడిస్తూనే వుంటున్నది. నిద్ర పోనీయటం లేదు. అమ్మమ్మా, తాతయ్యల దగ్గర వుండే అవకాశం లేదు. వాళ్ళు కధలు చెప్బుతుంటే వినే అవకాశమూ లేదు. పొద్దస్తమానం చదువే. కాస్తంత తీరిక దొరికితే అమ్మదో, నాన్నదో సెల్ ఫోనుతో (వాళ్ళు దయదలిచి ఇస్తే) కాలక్షేపం చేయటం తప్ప మరో మార్గం లేదు. ఆరుబయట పడకలు లేవు. ఆకాశంలో చుక్కలూ లేవు.’

‘పిల్లల సంచీ బరువులు తగ్గించడం ఎలా అనే విషయం మీద చర్చలు జరిపి నివేదిక ఇమ్మని కమిటీ వేసారట పాలకులు. నివేదిక ఇంకా రాని కారణంగా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రభువుల ఉవాచ. పాఠాలు చెప్పే వారికీ అంతుపట్టని, బడికి పంపే అమ్మానాన్నలకూ అంతుపట్టని ఈ గడ్డు సమస్యని పిల్లలలా మోస్తూ వున్నారు పాపం.’

“అనుదీప్.. ఇలా రారా. నువ్వు కూడా రా ఛైత్రా” ఇద్దర్నీ పిలిచారు సుందరరామయ్య గారు.

“ఏంటి తాతా”

“రేపటి నుంచి మీ ఇద్దరూ ఉదయం ఓ గంటన్నర, సాయంత్రం ఓ గంట నా దగ్గర చదువు చెప్పించుకోండి. మధ్యాహ్నం పూట నేను ఇచ్చిన హోం వర్క్ పూర్తిచేయాలి. మీరలా చేస్తే మీకు ఏ రోజు ఏం తినాలనిపిస్తే అది మీ అమ్మ చేత నేను చేయిస్తాను సరేనా” పిల్లలిద్దరితో ఒప్పందం కుదుర్చుకున్నారాయన.

ఇద్దరూ తాతగారి మాటకు సరే అన్నారు. వంట గదిలో నుంచి వస్తున్న మసాలా వాసనలకు ఇక అక్కడ నిలబడలేక గబగబా వంటింట్లోకి వెళ్ళి పళ్ళాల్లో నూడిల్స్ తెచ్చుకుని తినసాగారు

వాళ్ళతో పాటే ప్రభాకర్‌కి కూడా ఓ ప్లేటు అందించింది వసుంధర. అత్తగారికి, మామగారికి కాఫీ ఇచ్చి, తానూ ఓ కప్పు చేతపట్టుకుని భర్త పక్కనే సోఫాలో కూర్చుంది.

కరోనా పుణ్యమా అని పెద్దవాళ్ళిద్దరూ అనుకోకుండా కొడుకు దగ్గరకు వచ్చి అక్కడే వుండిపోవలసి వచ్చింది. లాక్ డవున్ కారణంగా. ప్రయాణాలు లేవు. కొడుక్కి, కోడలికి ఆఫీసుల్లేవ్, ఇద్దరికీ వర్క్ ఫ్రం హొమే. పిల్లలకి బడుల్లేవ్. ఎవ్వరూ ఇంటినుంచి బయటకు వెళ్ళే వీలు లేదు. అన్నీ ఆంక్షలే.

మొదట్లో మొదట్లో బడుల్లేవంటే పిల్లలకి ఆనందంగానే వుంది కానీ, రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి ఇంట్లోనే వుండాలంటే కష్టంగా వుంటున్నది. బడికి వెళ్లాలనిపిస్తున్నది. స్నేహితుల్ని కలవాలని, స్కూల్లో టీచర్లని చూడాలని, వాళ్ళ స్కూల్ని, తరగతి గదుల్ని చూడాలని ఆరాటం మొదలయ్యింది.

కానీ కరోనా ప్రభావం తీవ్రం కావటంతో లాక్ డవున్ పొడిగించటం, స్కూళ్ళకి సెలవలు ప్రకటించటంతో పిల్లలకి తోచుబాటు కాకుండా తయారయ్యింది పరిస్థితి.

అన్నాలు తిని మాటలు చెప్పుకుంటూ పడుకున్న పిల్లలు నిద్రపోయారు.

“అమ్మాయ్.. వసుంధరా.. ఒక్క నిముషం” కోడల్ని పిలిచింది దుర్గాంబ.

“చెప్పండి అతయ్యా” అంటూ వచ్చి కూర్చుంది వసుంధర

“నేనో మాట చెబుతాను. నువ్వు కాదనకుండా ఒప్పుకోవాలి” కోడలి కళ్ళల్లోకి చూస్తూ అన్నదామే

“అలాగే.. చెప్పండి ఏమిటో”

“రోజూ ఇంట్లో వంట, ఆఫీసులో చాకిరీ వీటితోనే విసిగిపోయి వుంటావు. కరోనా పుణ్యమా అని మేమూ ఇక్కడే వున్నాం కదా. నేనున్నన్ని రోజులూ నేనే వంట చేస్తాను. నీ అంతా బాగా కాకపోయినా నేనూ కొంచం పరవాలేదులే బానే చేస్తాను”అని నవ్వింది దుర్గాంబ

“నీకెందుకమ్మా.. వసు చేస్తుందిగా.. నువ్వు రెస్టు తీసుకో” తాను కల్పించుకుంటూ అన్నాడు ప్రభాకర్

“అది కాదురా.. నాకు మాత్రం బోర్‌గా వుండదూ.. అదీకాక మీకు పిల్లలకీ చేసి పెట్టే అవకాశం ఉపయోగించుకోవాలని వుంది. వాళ్ళకి కావలసిన చిరుతిండ్లు మాత్రం నువ్వే చేసుకో. అన్నం వగైరాలు నాకు వదిలిపెట్టామ్మా.. నీకు పుణ్యం వుంటుంది. పని చేసే ప్రాణానికి వూరికే కూర్చోవాలంటే విసుగ్గా వుంటుంది” చెప్పింది పెద్దామె.

 ‘ఆకలికి రుచి తెలియదు అన్నారు. ఇప్పుడు పిల్లలకి కూడా రుచి తెలియటం లేదు. పాపం పెట్టింది తిని మూసుకుపోయే కళ్ళతోనే టీ.వీ. చూస్తూ తినడం పూర్తిచేసుకుని మంచం ఎక్కుతున్నారు. పొద్దున తీసుకువెళ్లిన క్యారేజీలు నిండుకునేది సగం రోజులే, మిగిలిన సగం రోజులూ నిండుగానే ఇల్లు చేరతాయి.’ పిల్లల తిండ్ల గురించి ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నారు పెద్దలు

రోటి పచ్చళ్లు, పాతకాలం వంటలు చేసి పిల్లలకి కొత్త రుచులు చూపసాగింది దుర్గాంబ. నిజానికి వసుంధరకి కూడా అత్తగారి వంటలు బాగా నచ్చుతున్నై. పిల్లలకి చదువు చెప్పటం మొదలుపెట్టారు తాతగారు.

‘అర్థం లేని చదువులు, అక్కరలేని వైద్యాలు, తీయదనం లేని బంధుత్వాలు, స్వార్ధంతో కూడుకున్న అవసరాలు, కాలుష్యంతో కూడుకున్న పరిసరాలు, ..ఇవీ పెద్దలనబడేవారు పిల్లకిస్తున్న వరాలు. పేరు చెప్పటం చేతగాని పసిబిడ్డకు పేరాలకు పేరాలు వ్యాసాలు. వయసుకు మించిన భారాలు, మార్కులు, ర్యాంకులు తప్ప మరేమీ అక్కరలేని అధమస్తపు వ్యవస్థలో పిల్లలు పడుతున్న అవస్థలు ఒకటా రెండా…!’ విద్యా వ్యవస్థ పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలున్న సుందరరామయ్య గారిలో అనేక ఆలోచనలు.

‘కడుపునిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, పొట్టపోడిస్తే అక్షరం లేదు (పొడవకపోయినా లేదు) క్షణం తీరికలేదు. అక్షరం ముక్క రాదు. అయిదో ఎక్కం రాదు. తెలుగులో అచ్చులేవో హల్లులేవో తెలీదు. ఆంగ్లంలో అక్షరాలెన్నో తెలీదు.. అయితేనేం అన్నీ కలుపుకుంటే ఆరువందలకి అయిదు వందల తోభై పైనే మార్కులోస్తై. ఆ పది రాలేదని అమ్మానాన్న ఏడుస్తారు. వాళ్ళని, బడిలో టీచర్లనీ కూడా ఏడిపిస్తారు. ఎందుకొచ్చిన ఏడుపు లెమ్మని వచ్చే పరీక్షల్లో ఆ పదీ కూడా వేసి పదమంటారు పంతుళ్ళు (పంతులమ్మలూ). లేకపోతే వచ్చే ఏడాది మళ్ళీ వాడు వీళ్ళ బడికే రావద్దూ?’ ఇలా సాగిపోతుంటై సుందరరామయ్య ఆలోచనలు.

పిల్లలకి చదువు చెబుతుంటే ఆయనకు బోలెడంత తృప్తి కలుగుతున్నది. కొడుకు, కోడలు పిల్లలు తన వంట మెచ్చుకుంటూ తృప్తిగా తింటుంటే దుర్గాంబ కడుపు నిండుతున్నది.

ఉన్నట్లుండి ఓ రాత్రివేళ వసుంధరకు జ్వరం వచ్చింది. ఇంట్లో అందరూ భయపడ్డారు. కరోనా కారణంగా జ్వరం వస్తేనూ, జలుబు చేస్తెనూ వణికిపోసాగారు ఏ ఇంట్లో అయినా. భయం లేదంటూ ధైర్యం చెప్పి తనకు తెలిసిన చిట్కా వైద్యం చేస్తూ కోడలికి రెండు రోజుల్లో జ్వరం తగ్గించింది దుర్గాంబ.

అత్తగారి మాటల వల్ల, ఇంటిపని ఆమే చూసుకోవడం వల్లా త్వరగా కోలుకుంది వసుంధర. ఇబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు వుంటే ఎంత ధైర్యంగా వుంటుందో ప్రభాకర్‌కి వసుంధరకి అనుభవంలోకి వచ్చింది. ఇంట్లో నాయనమ్మ, తాతయ్య వుంటే ఎంత సందడిగా వుంటుందో, అమ్మానాన్నలకి కోపం వస్తే వాళ్ళు తమని ఎలా దగ్గరకు పిలుచుకుని గారాబం చేస్తారో అనుభవించారు పిల్లలు.

స్కూళ్ళల్లో ఆన్‌లైన్ క్లాసులు మొదలుపెట్టారు. కానీ ప్రభాకర్, వసుంధరా ఆరాటపడినా వాళ్ళకి అడ్డు చెప్పారు సుందరరామయ్య గారు. వాళ్ళకి ఒక ఏడాది చదువు లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదని, స్కూలు వాళ్ళు ఫీజుల కోసం వెంపర్లాడుతున్నారని గట్టిగా చెప్పి ఒప్పించాడు కొడుకుని, కోడల్ని.

“బడిలో టీచర్లకి పిల్లలకి చదువు చెప్పటం మాత్రమే పని కాదు. సెలవల్లో విద్యార్ధుల్ని పోగేయ్యాలి. వాళ్ళు ఉద్యోగం చేసే బడిలో చేర్పించాలి. వేసవి సెలవుల్లో గడపగడపకీ తిరిగి తల్లి తండ్రుల్ని బ్రతిమాలి వాళ్ళ బళ్ళో చేర్పించుకోవటానికి అవిరళ కృషి చేయాలి. లేకపోతే ఉద్యోగం వూడిపోతుంది. అయ్యవారికి చాలు అయిదు వరహాలు అని పాడుకుంటూ రోడ్లవెంట వెళ్ళే రోజులు పోయి అయ్యవారికి చాలు అయిదు సీట్లు(కనీసం) దగ్గరకు వచ్చాం. సంతలో పశువుల్లా తొలుకు వస్తుంటారు.. పాపం పిల్లల్ని..

చదువు కొనలేక పెద్దలు, చదువుకోలేక పిల్లలు ఈ ర్యాంకుల వలయంలో పడి జీవితాల్నే ముగించుకుంటున్న మూగ మనసుల్ని ఎలా కాపాడుకోవాలో మనుషులమైనవాళ్లం అందరం ఆలోచిద్దాం. అమెరికా పంపి డాలర్లు సంపాయించుకు రావటానికే పిల్లల్ని చదివించే ఆలోచన మానుకుందాం. అభ్యాసము కూసు విద్య.. వాళ్ళకు ప్రేమని నేర్పే ప్రయత్నం మొదలుపెడదాం. ప్రేమను అందించి మళ్ళీ వాళ్ళ దగ్గర్నుంచి ఆశించటం సమంజసమేమో, కొంచం ఆలోచిద్దాం. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పిల్లల్ని నలిపెయ్యటం ఆపేద్దాం.

అయినా మీ పిల్లలకి చదువు చెబుతున్నాను కదా. కరోనా కాలంలో వాళ్ళిద్దరూ ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ తప్పుల్లేకుండా మాట్లాడేటట్లు తయారుచేస్తాను. మీరు దిగులు పడకండి” అంటూ హితబోధ చేశారాయన.

“బామ్మా, తాతయ్యా మీరిద్దరూ మా దగ్గరే వుంటామని చెప్పండి. అప్పుడే మేం అన్నం తింటాం” అంటూ పిల్లలిద్దరూ మారాం చేశారు.

“అవును మీరు ఇక మాతోనే వుండాలి. అందరం కలసి వుంటే హాయిగా వుంటుందని కరోనా మనకి నేర్పింది” కొడుకు మాటలకు కోడలు వత్తాసు పలికింది.

లాక్ డవున్ అయిపోగానే అమ్మానాన్నలతో వూరెళ్లి సామానుతో తిరిగి వచ్చారు వారానికల్లా. పిల్లల ముఖాలతో పాటు పెద్దల ముఖాలు కూడా సంతోషంతో వెలిగిపోతున్నై. ఆ ఇంట్లో అందరికీ పండుగలా వుంది. కలిసిన మనసులు, కలివిడిగా మనుషులు. పండుగేగా మరి.

Exit mobile version