[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పాణ్యం దత్తశర్మ గారి ‘నిజంగా మాది ప్రేమే!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
రాత్రి తొమ్మిదయింది. దమయంతి తన బ్యాగ్ తీసుకుని, మేనేజరుకు చెప్పి షోరూంలో నుంచి బయటకు వచ్చింది. కస్టమర్లు ఎవరూ లేరు. ‘మరో అరగంటలో మూసేస్తారు’ అనుకుంటూ వెనక్కు తిరిగి చూసింది. ‘రాయల్ ఓక్’ అన్న అక్షరాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మూడంతస్తుల భవనం అది. అన్ని ఫ్లోర్‍లలో అత్యంత ఆధునికమైన ఫర్నిచర్ అందంగా అమర్చబడి, అమ్మకానికి సిద్ధంగా ఉంది.
దమయంతి ఆ షాపులో పనిచేస్తూంది. వచ్చిన కస్టమర్లకు కావలసిన ఫర్నిచర్ లోని రకాలు చూపడం, ధరలు, నాణ్యత, ప్రస్తుతం నడుస్తున్న రిబేటు వగైరాలను వివరించడం ఆమె పని. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం, అదే, రాత్రి 9 గంటల వరకు ఆమె పనిగంటలు. వాళ్ల యిల్లు యన్.టి.ఆర్ నగర్‍లో ఉంది. షోరూం నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం.
ఆ టైమ్‌లో సిటీ బస్సుల ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. విజయవాడ హైవే అది. కోస్తా జిల్లాల వైపు వెళ్ళే వోల్వో బస్సులు, ఆర్.టి.సి. గరుడలు, వెన్నెలలు, అమరావతులు, స్లీపర్లు, సెమీ స్లీపర్లతో అటు వైపు రోడ్ రద్దీగా ఉంది.
హయత్ నగర్ నుంచి వస్తున్న టాటా ఏస్ మ్యాజిక్ వాహనాన్ని చూసిందామె. అవి ఎల్.బి.నగర్ వరకు వెళతాయి. చౌటుప్పల్ వరకు సర్వీసు చేస్తారు. ఒక వ్యాన్ అది. దాదాపు పదిహేను మంది పడతారు. కానీ అవి ఎక్కడంటే అక్కడ ఆపరు. అలా ఆపేవి సెవెన్ సీటర్లు. అవి సరూర్‌నగర్ కమాన్‌కు హయత్‌నగర్‌కు మధ్య తిరుగుతూ ఉంటాయి.
చేయి ముందుకు చాచింది దమయంతి. ఆపడేమో అనుకుంది. కానీ ఆపాడు. వ్యాన్‍లో ఇద్దరే ఉన్నారు. “కహా జానా?” అనడిగాడు డ్రయివింగ్ సీట్‌లోని యువకుడు.
“యన్. టి. ఆర్ నగర్”
“బీస్ రూపయే”
“ఎందుకు? పదిహేనే కదా?”
“యే గాడీ సెవెన్ సీటర్ ఆటో నహీ. ఆనే తో జల్దీ చఢో”
టైమ్ మించి పోతుందని ఎక్కేసింది. ఆ ఇద్దరూ కూడ సుష్మ థియేటర్ దగ్గర దిగిపోయారు. ఒకర్ని ఎల్.బి.నగర్‌కు ఎక్కించుకున్నాడు.
తన స్టాప్ దగ్గర దిగిపోయి వంద రూపాయల నోటు పర్సులోంచి తీసి ఇచ్చింది.
“చిల్లర లేదు” అన్నాడు డ్రయివర్ నిర్లక్షంగా. లైటు వేశాడు.
“నా దగ్గరా లేదు మరి”
స్టీరింగ్ క్రింద ఉన్న సొరుగులో చూశాడు. దమయంతి వైపు చూసి నవ్వాడు. “హయతనగర్‌ల ఒక అంకుల్ దిగిపోయిండు. ఐదువందల నోటు ఇచ్చిండు. మొత్తం చిల్లరంతా ఊడ్చియిచ్చిన. పెద్దాయన గద. పరీశాన్ చేయడమెందుకన్నట్లు.”
“అయితే నన్ను పరేశాన్ చేయొచ్చా మల్ల” అన్నది దమయంతి. ఆమె గొంతులో సీరియస్‌నెస్ లేదు. లైటు వెలుగులో డ్రైవర్‍ను చూసింది. జీన్స్ ప్యాంటు మీద కాకీ రంగు టీ షర్టు వేసుకున్నాడు. తెల్లగా ఉన్నాడు. నల్లని ఉంగరాల జుట్టు. ఒత్తైన మీసకట్టు. ఉదయం నించి సర్వీసు చేసి ఉన్నాడేమో ముఖం బడలికగా ఉంది. పాతికేళ్ళు ఉంటాయి. పైలాపచ్చీస్!
‘బాగున్నాడు’ అనుకుంది దమయంతి. “మరి గీ పంచాయితీ తేలేదెట్ల?” అన్నది.
ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు. ఇరవై రెండేళ్ళుంటాయి. చామనఛాయకు ఒక ఛాయ ఎక్కువ. లేతపసుపు రంగు చుడీదార్ వేసుకుని ఉంది. పైన ఎరుపు రంగు చున్నీ. కళైన ముఖం. పెద్ద పెద్ద కళ్ళు. ముక్కు చెక్కినట్లుంది. బుగ్గలు నునుపుదేరి ఉన్నాయి.
ముఖం తిప్పుకుని అన్నాడు “పోనీలే. లేనప్పుడు నువ్వేం చేస్తావ్?” అంటూ వ్యాన్ స్టార్ట్ చేశాడు.
“అయ్యో! అట్ల వద్దు” అన్నదా అమ్మాయి.
“ఈసారి ఎక్కినపుడు ఇద్దువుగాని” అంటూ ముందుకు పోనిచ్చాడు. అతని మాటలు వ్యాను ఇంజన్ సౌండ్‌లో కలిసిపోయాయి.
అలాగే నిలబడిపోయింది దమయంతి కాసేపు. తర్వాత తన ఇంటివైపు నడవసాగింది. ఎందుకో అతని ముఖమే మాటి మాటికీ గుర్తుకురాసాగింది.
దమయంతి హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సి.ఇ.సి.తో పూర్తి చేసింది. పై చదువులు చదివే స్తోమత లేక ఆపేసింది. రాయల్ ఓక్‍లో చేరి సంవత్సరమైంది. నెలకు పదివేలు ఇస్తారు. సేల్స్ మీద ఇన్‌సెంటివ్స్ కూడా సంవత్సరానికి మూడు నాలుగు వేలు వస్తాయి. సాయంత్రం టీ, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తారు. ఉదయం పదిగంటల కల్లా అన్నం తినేసి, బాక్స్‌లో ఒక ఐటం పెట్టుకుని వచ్చేస్తుంది. తండ్రి యాదయ్య హయత్‌నగర్-2 ఆర్టిసి డిపోలో డ్రైవరు. పర్మనెంటు కాదు. కాంట్రాక్ట్ బేసిస్. తల్లి మైసమ్మ బి.ఎన్.రెడ్డి లోని ఒక కార్పొరేట్ స్కూల్లో ఆయా. ఆమె జీతం అరువేలు. తమ్ముడు నర్సిమ్మ తొమ్మిది చదువుతున్నాడు, వనస్థలిపురం గవర్నమెంట్ హైస్కూల్‌లో.
***
నాలుగు రోజుల తర్వాత సెవెన్ సీటర్ కోసం ఉదయం స్టాప్‌లో ఎదురుచూస్తూంది దమయంతి. ఆ టైమ్‌లో రద్దీగా ఉంటాయి. ఇంతలో అటువైపు ఆగి ఉన్న నీలిరంగు టాటా ఏస్‌ను చూసిండి. డ్రైవర్‌ను గుర్తుపట్టింది. అతనికి ఇరవై రూపాయి అవ్వాలన్న విషయం చటుక్కున గుర్తొచ్చింది. వెంటనే రోడ్ క్రాస్ చేసి, మధ్యలోని డివైడర్‌ను ఎక్కి దిగి, “ఏయ్! నిన్నే! ఆగు” అని అరుస్తూ, అటువైపు రోడ్ కూడ దాటి వ్యాన్‌ని చేరుకుంది. అతడు ఆమెను చూశాడు. కదిలించిన వ్యాన్ ఆపాడు. అతని దగ్గరకు వెళ్లి, పర్సులోంచి రెండు పది రూపాయల నోట్లు తీసి అతనికిచ్చింది. “అంత రిస్కు తీసుకుని రోడ్ దాటి రాకపోతేనేం? ఎంత ట్రాఫిక్ ఉంది చూడు!” అన్నాడు అభిమానంగా చూస్తూ.
“సరేలే. మనం కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది!” అన్నది. ఆ మాట అతని మనసుకు తాకింది. కృతజ్ఞతగా చూసి వ్యాన్ ముందుకు పోనిచ్చాడు.
ఒక ఆదివారం. తమ్ముడితో పాటు ‘విష్ణు’ థియేటర్‌లో సినిమాకు వచ్చింది. అఖండ! బాలకృష్ణ సినిమా. బాల్కనీ కాకుండా డ్రస్ సర్కిల్‍లో కూర్చున్నారు. తమ్ముడు రెండు పాప్ కార్న్ పాకెట్లు, రెండు వాటర్ పాకెట్లు తెచ్చాడు ఇంటర్వల్‌లో. ఇంకా సినిమా వెయ్యలేదు. ఫ్రెండ్‌తోబాటు సినిమాకు వచ్చిన వ్యాన్ డ్రయివర్ తమ సీట్లకు వెళుతూ దమయంతిని చూశాడు. అతని కళ్ళల్లో వెలుగు. ఆమె అతన్ని చూడలేదు. ఒక్క క్షణం తటపటాయించి, వెళ్లి ఆమెను పలకరించాడు.
“బాగున్నావా? తమ్ముడా? సినిమాకు వచ్చారా?”
కిలకిల నవ్వింది! “అదేం ప్రశ్న? సినిమా హాల్లోనే కదా ఉన్నాం” అన్నది. నవ్వు తాలూకు కాంతి ఆమె ముఖంలో ఇంకా సజీవంగానే ఉంది. అతను కూడ నవ్వి “నిజమే! అర్థం లేని ప్రశ్న!” అన్నాడు. తన ఫ్రెండ్‌ని పరిచయం చేశాడు.
“ఇంతకీ నీ పేరు..”
“దమయంతి. ఆటోనగర్ లోని రాయల్ ఓక్‌లో పని చేస్తా. నీ పేరు?”
“నజీర్. నజీర్ అహమ్మద్. మేం ఈడే ప్రశాంత్ నగర్ల ఉంటాం. చూసినవ్ గద వ్యాన్ సర్వీస్ చేస్తా.”
లైట్లు ఆర్పి సినిమా వేశారు. “సరే కలుస్తా మల్ల” అనుకుంటూ వెళ్లిపోయాడు. అతను ముస్లిం అని తెలియగానే ఎందుకో అతని మీద ఆసక్తి పోయింది.
ఒక ఆదివారం ‘బాటసింగారం’లో ఉన్న మేనత్త యింటికి బయలుదేరింది దమయంతి. బస్ కోసం చూస్తూంటే నీలిరంగు వ్యాన్ వచ్చి ఆగింది. డ్రైవర్ సీట్లో నజీర్. నవ్వుతూ పలకరించాడు. “ఎక్కడికి” అని అడిగి ఎక్కించుకున్నాడు. పెద్ద అంబర్‌పేట్‍లో ముందు సీట్ లోని ఇద్దరు దిగిపోయారు. వెనక్కు చూసి, “ముందుకు రావొచ్చు గద!” అన్నాడు.
అప్రయత్నంగానే దిగి ముందు సీటులో కూర్చుంది. ఆ రోజు చీరలో ఉంది. నల్లని బార్డరున్న బిస్కట్ రంగు చీర. నల్లని గళ్ల జాకెట్టు. తలంటు పోసుకుందేమో నల్లని ముంగురులు గాలికి విసురుగా కదులుతున్నాయి. “బాటసింగారంల ఏం పని? రిస్తెదార్లున్నారా?” అని అడిగాడు.
“ఔ. మా మేనత్త వాండ్లున్నరు. చూసి వద్దామని..”
పక్కనే ఉన్న పడుచును చూసి నజీర్ హృదయం లయ తప్పింది. మాట మాటికీ తలతిప్పి ఆమెను చూస్తూంటే వెనక ఉన్న ముసలాయన అన్నాడు – “ముందుకు చూసి తోలు కొడుకా. పోరిని చూస్తూ తోలితె ప్రమాదం”. ఆటో లోని అందరూ నవ్వారు! దమయంతి కూడ నవ్వింది.
“నీవు నవ్వితె శానా బాగుంటవు” అన్నాడు మెల్లగా. ఆమెకు వినబడింది. కోపగించుకోలేదు. మళ్లీ చిరునవ్వు రువ్వింది.
***
ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి, మొగ్గ తొడిగి, పుష్పించడానికి మూడు నెలలు పట్టింది. దానికి వారి మతాలు అడ్డం రాలేదు. ఇద్దరూ దిగువ మధ్య తరగతి వర్గానికి చెందినవారే. నజీర్‌కి తండ్రి లేడు. తల్లి ఉంది. ప్రశాంత్‌నగర్‍లో వాళ్ళది కిరాయి ఇల్లే.
ఒక రోజు పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు నజీర్. “దమీ! మనం పెళ్లి చేసుకుందాం. దీనికని మనం మన మతాలు మారాల్సిన పనిలేదు. ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ హాయిగా ఉందాం. మా అమ్మకు మన విషయం చెప్పిన. ఆమెకేం ఫికరు లేదు. నీవు సరేనంటే మీ వాళ్లతో మాట్లాడత.”
కొద్దిరోజులు ఆగుదామంది దమయంతి. సమయం చూసుకుని తానే తన వాళ్లకు చెబుతానంది.
ఒకరోజు యాదయ్య డ్యూటీ దిగి ఇంటికి వస్తున్నాడు. అతనికి పిస్తా హౌస్ ముందు నిలబడి ఇరానీ చాయ్ తాగుతున్న కూతురు కనబడింది. పక్కన ఎవరో అందమైన యువకుడు ఉన్నాడు. అతనితో, నవ్వుతూ చాలా సన్నిహితంగా మెలుగుతూ, మాట్లాడుతోంది. వాళ్లసలు వేరే లోకంలో ఉన్నా రు. యాదయ్య కనుబొమలు ముడిపడినాయి!
ఇంటికి వెళ్లి భార్యతో తాను చూసిన విషయం చెప్పాడు. ఆమె ఆలోచనలో పడింది. ఇంటికి వచ్చిన కూతుర్ని నిలదీసి అడిగారు. దమయంతి తొట్రుపాటు పడలేదు. నిబ్బరంగా బదులిచ్చింది.
“ఔ నాయన! మేమిద్దరం ప్యార్‌ల ఉన్నం. పెండ్లి గూడా చేసుకోవాలనుకుంటున్నాం. నేనే చెబుదామనుకున్న. ఈ లోపట మీకే తెలిసింది.”
“ఎవరా పోరగాడు?”
“పేరు నజీర్ అహ్మద్. యల్ బి నగర్ – చౌటుప్పల్ మధ్య టాటా వ్యాన్ తోలతాడు. చానా మంచోడు నాయన. వ్యాన్ సొంతందే. ఫైనాన్స్ ఉంది. రెండేళ్లలో తీరిపోతుంది. లోను, డీజిలు, ఖర్చులు పోను రోజు ఎనిమిది వందలకు తక్కువ కమాయించడు.”
అమ్మానాన్నా నిశ్చేష్టులైనారు. “సాయిబులా? వాండ్లతో మనకు ఎట్ల కుదురుతాది?” అని తిట్టారు. “అవన్నీ నడవవు” అని హెచ్చరించారు. దమయంతి మౌనంగా అన్నీ విన్నది. ఎదురు వాదన చేయలేదు
మర్నాడు యాదయ్యకు జెబిఎస్ 290 నం. బస్సు డ్యూటీ పడింది. కండక్టర్ శ్రీశైల గౌడ్ అతనికి మంచి మిత్రుడే. ట్రిప్పు గ్యాప్‌లో టీ తాగుతూ స్నేహితునికి విషయం చెప్పి బాధపడ్డాడు. గౌడ్ అలర్ట్ అయినాడు. ఇలా అన్నాడు –
“ఇయ్యాల్రేపు లవ్ జీహాద్ అని నడుస్తున్నది. టీవీలో చూస్తలేవా? సాయిబుల పిల్లలు మన ఆడపిల్లలను మాయమాటలు చెప్పి ప్రేమలో దింపుతున్రు. వాండ్ల మతంలోకి మార్చి నిక్క జేస్కుంటరు. తర్వాత వాండ్లతోని గలీజ్ పనులు జీషిస్తారు. కొందరు పోరిలయితే పెండ్లయినంక కనబడకుండా పోతున్నరంట. మనం వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ల కంప్లెయింట్ ఇయ్యాల – ‘ఇట్లా మా పోరిని పరేషాన్ చేస్తుండు, జరంత సూడుండ్రి,సార్’ అని చెప్పుకుంటె వాండ్లే చూసుకుంటరు.”
మర్నాడు సెలవు పెట్టి భార్యను తీసుకొని స్టేషన్‌కి వెళ్లాడు యాదయ్య. సి.ఐ. పెదబాబును కలిసి విషయం చెప్పారు. విషయం ఏమిటో తెలుసుకుందామని, ఇద్దరు కానిస్టేబిల్స్‌ని పంపి, నజీర్‌ను తీసుకురమ్మన్నాడు. అమ్మకు జ్వరంగా ఉందని నజీర్ ఆ రోజు వ్యాన్ తీయలేదు. “సి.ఐ. సారు రమ్మంటుండు” అని వీళ్ళు చెప్పగానే విషయం అర్థమైంది అతనికి. తల్లిని కూడా తీసుకుని స్టేషన్‌కు వెళ్లాడు.
సి.ఐ.గారికి, యాదయ్యకు అతని భార్యకు నమస్కారం పెట్టాడు నజీర్. తల్లిని పరిచయం చేశాడు.
“ఏం రా, నకరాల్ జేస్తున్నవా? వాండ్ల పోరిని ప్యార్ అని పరేశాన్ చేస్తున్నవంట! బొక్కలిరగ దీస్త కొడకా! నీ మతమేంది వాండ్ల మతమేం బే? మీ లవ్ జీహద్ ముచ్చట నాకెరిక లేదనుకొన్నవా బాడ్‌ఖావ్!” అని కేకలు వేశాడు సి.ఐ.
నజీర్ బెదరలేదు. దారిలో దమయంతికి ఫోన్ చేసి స్టేషనుకు రమ్మన్నాడు. సి.ఐ.తో ఇట్లా అన్నాడు –
“సాబ్! మీరు నన్ను గలత్ సమజ్ చేసుకున్నారు. లవ్ జీహాద్ గురించి నేను విన్నాను. కాని మతాంతర ప్రేమలన్నీ లవ్ జీహాద్‌లు కాదు సార్. నేనూ వీండ్ల పోరి దిలేసే ప్రేమించుకున్నాం. ఎవరి మతాన్ని వాండ్లు పాటిస్తూ బతుకుతాం. ఏదైనా తేడా వస్తే మీరున్నారు గద సాబ్!”
నజీర్ తల్లి అన్నది “బీటా పోలీసాయనా, అట్లాంటిదేం లేదు నాయనా! నా కొడుకు మోతీ లాంటోడు. నాకూ ఈ నికా ఇష్టమే. ఆ పిల్లను నా సొంత బిడ్డ లెక్క జూస్కుంట. మదద్ జేయుండి కొడుకా!”
నజీర్ వినయం, పెద్దామె వేడుకోలు సి.ఐ.ని ఆలోచింపచేశాయి. ఇంతలో దమయంతి వచ్చింది. సి.ఐ.గారికి నమస్కరించి ఇలా అన్నది –
“సార్, మేమిద్దరం నిజంగా ప్రేమించుకున్నాం. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేం. ఈ లవ్ జీహాద్ గురించి వినడమే గాని మా ఇద్దరికీ అదేందో తెలియదు. నజీర్ శానా డీసెంట్ సార్. ఏ రోజు నాతో లిమిట్ దాటి ప్రవర్తించలేదు. అతడు నా మతం మార్చుకోమంటే గద మీరు అనుమానించాల? ఇద్దరం మేజర్లం. ఏ మతం ప్రకారం కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. మీరు కోపరేట్ చేయుండ్రి.”
సి.ఐ. – యాదయ్యతో, అతని భార్యతో అన్నాడు “వీండ్లది నిజమైన ప్రేమే అని నేను నమ్ముతున్నా. పోరడు మంచోని లెక్కగొడుతున్నడు. ఏం సోచాయించొద్దు. పెండ్లి చేసేయండి. అంతవరకొస్తే నేనున్న గద!”
పిల్లవాని నిజాయితీ ఆ దంపతులను కదిలించింది. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. పిల్లల ఉల్లంలో మల్లెలు విరిశాయి. ఇక యాదగిరి నర్సన్న, అల్లా వాండ్లను ఆశీర్వదించడమే బాకీ!
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.