[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘నిజమనేదొకటి ఉందిగా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కోటేరులా నాసిక సన్నగా
పొడవైన నదిలా
అందంగా ఎంత అందం ముఖాన
నవ్వని మబ్బుల ఆకాశం
కిటికీ దర్వాజలు లేని గది
దాహం చిరునామా ఎడారి కడలి
నచ్చిన కవిత నచ్చని రాత్రి
చీకటి రోజొక్కతీరు గీసే
కవి ఆలోచనల హృదయోల్లాస సల్లాపం
కవిత్వభాషలో కవి కలం
ఆకాశంలో చక్కర్లు గిరికీలు
ఆశల పల్లకిలో కొత్త పల్లవి
ఊరేగే హద్దుల్లేని అంతర్యామి
పోలిమేరలు దాటని సత్యవంతుని కథ
విశ్వ స్వప్నం క్షణం అనువాదం రాక
కానీ
నిజమనేదొకటి ఉంది
మూసిన కిటికీ తోసుకుంటూ
టపటప శబ్దంతో
చూడు మనసు పొరల దాగి
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.