[బాలబాలికల కోసం ‘నిజమైన దానం’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.]
కాశీ వెళుతున్న సదానందుడు భువనగిరిని పాలించే గుణకీర్తి రాజసభకు వెళ్ళాడు. రాజు సాదరంగా సదానందుని ఆహ్వానించి ఆశీర్వాదం పొంది “స్వామి ఆశ్రమ ధర్మాలు తెలియజేయండి” అని అడిగాడు.
“మహరాజా బ్రహ్మచర్యం, గార్హస్ధ్యం, వానప్రస్ధం, సన్యాసం అనేవి ఆశ్రమధర్మలు.
బ్రహ్మచర్యం: బ్రహ్మచర్యాన్ని ‘సావిత్రం’ అంటారు. ఎందుకంటే గాయత్రీ మంత్రోపదేశాన్ని పొంది దాన్ని జపిస్తారు కాబట్టి. ఉపనయం అయిన తరువాత బ్రహ్మచారి మొదటి మూడురోజులు గాయత్రీ మంత్రాన్ని జపించడాన్ని ‘ప్రజాపత్యం’ అంటారు. తరువాత వేదంలో చెప్పబడిన వాటిని ఆచరించడాన్ని ‘బ్రహ్మమ’ని, వేదాన్ని సంపూర్ణంగా అధ్యాయనం చేసి అనుష్ఠానం చేయడాన్ని’నైష్ఠికమని’అంటారు.
గృహస్ధాశ్రమం: గృహస్థులు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు. పొలం పండించుకు తినేవారిని ‘వార్త’ అంటారు. యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకోవడాన్ని ‘సంచయం’ అంటారు. గృహస్థుడు ఇతరులను యాచించకుండా జీవించడాన్ని‘శాలీనం’ అంటారు. పొలంలో రాలిన గింజలు ఏరుకు తిని జీవించేవారిని ‘శిలోంఛం’ అంటారు.
వానప్రస్తం: కందమూలాలు తిని జీవించేవారిని ‘వైఖానసులు’ అంటారు. కొత్తపంట చేతికి అందగానే ఇంటఉన్న పాత ధాన్యాన్ని దానం చేసేవారిని ‘వాఖల్యులు’ అంటారు. రోజుకు ఒక దిక్కున యాచన ద్వారా జీవించేవారిని ‘ఔదుంబరులు’ అని; పండ్లను, ఆకులను భుజించి జీవనంచేసేవారిని ‘ఫేనవులు’ అంటారు.
సన్యాసులు: సొంతకుటీరంలో తగు కర్మలు ఆచరించేవారిని ‘కుటీచకులు’ అని; కుటీరం లేకుండా కర్మలు నిర్వహించకుండా సంచరించేవారిని ‘బహుదకులు’ అని; కేవలం జ్ఞానం మాత్రమే కలిగి సంచరించేవారిని ‘హంసలని’; జ్ఞానం కూడా పొందకుండా, పరబ్రహ్మ తత్వంలో లీనమయ్యేవారిని ‘పరమహంసలు’ అంటారు” అన్నాడు సదానందుడు.
“స్వామి తమ కాశీయాత్రకు దారి ఖర్చుల కింద కొంత ధనం ఇస్తాను, స్వీకరించండి” అన్నాడు రాజు.
“మహరాజా నీ దానం తగనిది. చతుర్విధ దానాలు అంటే మరణ భయంతో ఉన్నవానికి అభయం యివ్వడం, వ్వాధిగ్రస్థునకు సరియైన చికిత్స చేయించడం, విద్యాదానం, అన్నదానం. ప్రత్యుపకారం ఆశించకుండా చేసే దానాన్ని ‘సాత్విక ‘దానం అని, తిరిగి ఉపకారాన్ని ఆశించి చేసే దానాన్ని ‘రాజస’ దానం అని, తృణీకారభావంతో చేసే దానాన్ని ‘తామస’ దానం అని అంటారు. దానం చేసేవారిని మూడు రకాలుగా విభజించవచ్చు. తనకు ఉన్నదంతా దానం యిచ్చేవాడు ‘దాత’. తన వద్ద ఉన్నదంతా యిచ్చి యింకా యివ్వలేక పోయానే అని బాధపడేవారిని ‘ఉదారుడు’ అని; తన వద్ద లేకున్నా యితరులను అడిగి తెచ్చి యిచ్చేవాడిని ‘వదాన్యుడు’ అంటారు. శిబి చక్రవర్తి. బలి చక్రవర్తి. కర్ణుడు వంటి మహనీయులు మనచరిత్రలో దానమహిమ తెలియజేసారు.
‘శ్రద్దయాదేయం దానం’ శ్రద్దతో యివ్వాలి. ‘హ్రియాదేయం’ గర్వంతో కాక అణుకువతో దానం యివ్వాలి. ‘శ్రీయాదేయం’ ఈ దానం వలన నేనేమి కోల్పోను అనుకోవాలి. ‘అశ్రద్దయాదేయం’ అశ్రద్దతతో దానం చేయరాదు అని పెద్దలు చెపుతారు. రాజా దారిపొడవునా ఆలయలలోని ప్రసాదాలతో, ప్రజలు భక్తితో సమర్పించే పండ్లు ఫలహరాలే మాకు చాలు, ధనంతో మాకు పని లేదు. ఐనా ప్రజల సొమ్ము దానం చేయడం గొప్ప పని కాదు. ఇక్కడ నుండి తూర్పుదిశగా పొలిమేరల లోని కాళీ ఆలయంలో ఒక వృధ్ధుడు ఉన్నాడు. రేపు రాత్రికి అతన్ని బాటసారుల్లా వెళ్ళి కలవండి, దానం అంటే ఏమిటో తెలుస్తుంది” అని చెప్పి సదానందుడు వెళ్ళిపోయాడు.
రాజుగారు మంత్రితో కలసి మారువేషాలలో గుర్రాలపై బయలుదేరి తూర్పుదిశగా పొలిమేర చేరాడు. నాలుగు రహదారులు కలిసే చోటు ఓ పక్కగా ఉన్న కాళీమాత ఆలయం వద్ద ఉన్న ఒక చెట్టుకింద చేరారు. అదే చెట్టు కింద కూర్చొని ఉన్న వృద్దుడు తన వద్ద గంపలోని గుగ్గిళ్ళు ఆకులో పెట్టి రాజు మంత్రికి యిస్తూ రెండు ముంతల చల్లటి మంచినీరు వారికి అందించి “ఆరగించండి బాటసారులు, మీలాంటివారి ఆకలి తీర్చడం కోసమే నేను ఈ ఉచిత సేవ చేస్తున్నా” అన్నాడు. ఆకలి దాహం తీరిన రాజు “తాతా, నీవు పేదవాడిలా ఉన్నావు. యిలా దానం చేయడానికి నీకు ధనం ఎలా వస్తుంది” అన్నాడు.
“అయ్యా, మా ఉరిలో వారం వారం సంత జరుగుతుంది. అక్కడ యాచన చేయగా వచ్చిన ధనాన్ని యిలా సద్వినియోగం చేసుకూంటాను” అన్నాడు. ఆ యాచకుని దానగుణం చూసిన రాజు గర్వం అణగిపోయి రాజధానికి వస్తుండగా ఓ భిక్షగాడు తను తింటున్న అన్నాన్ని కొంత తన దగ్గరకు వచ్చిన కుక్కకు పెట్టడం చూసి రాజు “మంత్రివర్యా, కుడిచేతితో చేసే దానం ఎడమచేతికి కూడా తెలియకూడదు, దానం ఎప్పుడు మూడో వ్యక్తి తెలియకూడదు. దానం డాంబికానికి కాదు, ఒక రైతు తన పొలంలో ధాన్యం ఎక్కువ పండటంతో తన పొలంలో ఆ ధాన్యం పండటానికి కారకులైన వ్యవసాయ కూలీలు అందరికి తలా ఒక మూట ధాన్యం దానం చేస్తే అది దానం. ప్రజల సొమ్ము దానం చేస్తూ నేను దానం చేస్తున్నాను అని భ్రమపడ్డాను. ఇప్పటికి తెలిసింది ‘నిజమైన దానం’ ఏమిటో. సదానందుని సలహ మేరకు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా” అన్నాడు.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.