[‘నిజం’ అనే పిల్లల కథ అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ఒక గొర్రెల కాపరి వద్ద చాలా గొర్రెలు మేకలు ఉండేవి. వాటిని మేపుకుంటూ జీవనం సాగించేవాడు. మేకలు, గొర్రెలు మందలుగా ఉండేవి. మేకలను పాల కోసం, మాంసం కోసం పెంచేవాడు. గొర్రెలను మాత్రం మాంసం కోసం కాకుండా ఉన్ని కోసం పెంచుకునేవాడు.
పెద్ద ఖాళీ స్థలంలో చుట్టూ దడి కట్టి మధ్యల మేకలను, గొర్రెలను వదిలి పెట్టేవాడు. పగటి పూటు మేకల మందనూ, గొర్రెల మందనూ తోలుకోని పొలానికి వెళ్ళేవాడు. కొండల మధ్య బాగా గడ్డి దొరుకుతుందని చెప్తే అక్కడికి తోలుకెళ్ళేవాడు. సాయంత్రం దాకా వాటి కడుపు నింపి ఇంటికి తీసుకువచ్చేవాడు.
ఒక రోజు పట్నం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ఇక్కడ ఉన్న గొర్రెల ఉన్ని తీసుకుని వెళతాడు. ఆ రోజు కూడా అలాగే కాపరి దగ్గరున్న గొర్రెలకున్న ఉన్నిని కత్తిరించేవాడు. ఒంటి మీద ఒక్క వెంట్రుకా లేకుండా నున్నగా గొరిగేశాడు. ఆ రాత్రికి అన్ని పడుకుని మాట్లాడుకుంటున్నాయి.
“ఇది చలి కాలం కదా! మనకు చలి నుంచి రక్షణ కల్పించేందుకే కదా ఉన్ని ఉన్నది. మరి ఇలా మన యజమాని ఉన్నిని అమ్మేసుకుంటుంటే ఎలా! ఇప్పుడు చూడు ఎంత చలిగాం ఉన్నదో?” అని ఒక గొర్రె అన్నది. మిగతా గొర్రెలు కూడా తలాడిస్తూ “అవును మనం రాత్రంతా చలికి వణుకుతూనే ఉండాలి ఈ చలి కాలమంతా ఎలా బతకాలో ఏమో!” వణుక్కుంటూ అన్నాయి.
“ఈ మేకల పనే హయిగా ఉన్నది. వాటి శరీరానికి ఉన్ని లేదు. ఎవరూ వచ్చి కత్తిరించరు. ఉన్ని లేకపోయినా చలికి తట్టుకునే శక్తి వాటికున్నది” అన్నదొక గొర్రె. చలికి గజగజా వణుకుతున్న ఒక గొర్రె “నిజం చెప్పావు మన యజమాని మేకల పట్ల దయను చూపిస్తున్నాడు మన పట్ల కఠినంగా ఉంటున్నాడు” అన్నది. “నిజం చెప్పావు మిత్రమా మన యజమాని పక్షపాతబుద్ధి కలిగినవాడు. మేకల్ని ఒకలా, మనల్ని ఒకలా చూడటం బాగాలేదు” అన్నది మరో గోర్రె.
ఆ గుంపులో ఉన్న ముసలి గొర్రె వీళ్ళ సంభాషణ అంతా వింటున్నది. చివరగా పైకి లేచి “అరే మొద్దు బుర్రల్లారా, నిజాన్ని అర్థం చేసుకోరా. అందుకే మనల్ని తెవివితక్కువ వాళ్లనేది. యజమాని మనకు కేవలం ఉన్నినే తీసివేస్తున్నాడు. మనల్నేప్పుడైనా మాంసం కోసం సాయిబు కొట్టుకు అమ్మేశాడా! లేదు కదా! ఆదే మేకల్ని ఎప్పుడైనా గమనించావా వాటిని మాంసం కోరకే అమ్ముతాడు. మనం కేవలం చలికి వణికాము. మేకలు ప్రాణాలే పోగొట్టుకుంటున్నాయి. ఏం చేయగలం. కాబట్టి నిజాలు అర్థం చేసుకోండి పోయి పడుకోండి!” అన్నది ముసలి గొర్రె.
‘నిజమే’ అన్నట్లుగా గొర్రెలన్ని తల ఊపాయి.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.