Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేటి తరం తాతా-మనవడు

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘నేటి తరం తాతా-మనవడు’ అనే కథని అందిస్తున్నాము.]

రో తరగతి చదువుతున్న చందు తన తాతయ్య చలపతి రావుకి ఫోన్ చేస్తున్న సందర్భం!

“తాతయ్య బాగున్నావా?”

“మనవడా బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు?”

“ఐ యాం ఫైన్ తాతయ్య” అని చెప్పి, “తాతయ్య నాయనమ్మ ఏం చేస్తుంది?” అని అడిగాడు చందు.

“నాయనమ్మ.. తోటలో వుందిరా. తనెప్పుడూ మొక్కల సంరక్షణలో ఉంటుంది. తెలిసిన సంగతే కదా. ఉదయం తను పెంచుతున్న గులాబి మొక్క కొత్తగా మొగ్గ తొడిగిందట సంబరంగా నన్ను అక్కడికి తీసుకు వెళ్లి చూపించింది.”

“వాహ్! అలాగా. అయినా నాయనమ్మ చేతిలో ఏ మొక్కైనా ఆనందంగా, అందంగా పెరుగుతుంది. మొన్న మా మేడం చెప్పింది మొక్కలు పెంచడం మంచి అలవాటంట. నేను మా మేడంకి చెప్పాను మా నాయనమ్మ మొక్కల్ని ఇష్టంగా పెంచుతుందని. నాయనమ్మ పెంచుకున్న ఒకనాటి చిన్న మొక్కే కదా నేటి మామిడి వృక్షం. కమ్మటి మామిడి ఫ్రూట్స్ అందించే ఆ చెట్టంటే నాకు చాలా ఇష్టం. ఇక వేప చెట్టెక్కి ఫ్రెండ్స్ అందరం వేసవి సెలవల్లో కోతి కొమ్మచ్చి కూడా ఆడుకునే వాళ్ళం. నువ్వప్పుడు మాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పేవాడివి. నీకో నిజం చెప్పనా నాకు భయం లేదు.(కొద్ది క్షణాలు ఆగి) ఎందుకో చెప్పు, చూద్దాం” అన్నాడు చందు.

“ఎందుకో..?” అన్నాడు చలపతి రావు.

“చెట్టేక్కినప్పుడే కానీ, కొమ్మలపై నడుస్తున్నప్పుడే కానీ, నువ్వు కట్టిన ఉయ్యాలపై పెద్దగా ఊగుతున్నప్పుడే కాదు మరెప్పుడైనా నాకు భయం లేదు. ఎందుకంటే నేను నీ మనవడిని!”

నవ్వుకున్నాడు చలపతిరావు. “నా మనవడు రియల్ హీరో! ఒప్పుకున్నాను” అన్నాడు.

“నేను ఆటలు ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతానని టీచర్ కోప్పడింది. నేనిప్పుడు హైస్కూల్‌కి వచ్చానని అల్లరి, ఆటలు ఆపేసి కేవలం చదువుకు మాత్రమే సమయం కేటాయించాలని చెప్పింది. నాకేమో ఆటలంటే చాలా.. అంటే చాలా ఇష్టం. అదేమైనా తప్పా తాతయ్యా? నేను బాగానే చదువుతాను కదా?”

“చందూ ఆటలు పిల్లలకు అవసరం. కానీ హైస్కూల్‍కి వచ్చాక సిలబస్ పెరుగుతుంది కదా. అందుకే చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని మేడం చెప్పింది.”

“సిలబస్ పెరిగింది నిజమే. మరి నేను పెద్దవాడిని అవుతున్నాను కదా. అంటే మెమరీ కూడా పెరుగుతుంది కదా?”

“నువ్వు చెప్పింది నిజమే చందు. చదువుకునే సమయంలో ఇతర విషయాలపైకి ఆలోచనలు పోకుండా చదివినంత సేపు శ్రద్ధగా చదువు. ఇంకో ముఖ్య విషయం క్లాస్‌లో టీచర్ చెప్పే పాఠాన్ని ఇష్టంగా విను. అక్కడే నీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత నువ్వు కాస్త రీవైజ్ చేసినా సరిపోతుంది. ముందు వినడం అలవాటు చేసుకో. అది ఎంతో ముఖ్యం.”

“అలాగే తాతయ్య”

“మరో మాట జాగ్రత్తగా విను. నువ్వు ఈ మధ్య ఏదో ఒక వంకతో స్కూల్ ఎగ్గొడుతున్నావట. నిజమేనా?”

ఓ క్షణం చందు మాట్లాడలేదు. “ఆ..” అన్నాడు.

“స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్ళాలి. అప్పుడే సిలబస్ మిస్ అవకుండా ఉంటావు. నీకు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. సరేనా?”

“ఓ అలాగే, తాతయ్యా!”

“ఆటలు దేహదారుఢ్యాన్ని పెంచుతాయి. బాడీ ఫిట్‌గా ఉండేలా చేస్తాయి. చదువు విజ్ఞానాన్ని అందిస్తుంది. రెండూ అవసరమే. మీ అమ్మ, నాన్న, టీచర్ వాళ్ళు పై క్లాస్‌లకి వస్తున్నావు కదా ఆటలు తగ్గించి బాగా చదువుకోమంటున్నారు కదా.. ఎందుకంటే ఈ కాంపిటీషన్ రోజుల్లో నెగ్గాలంటే ఉన్నత చదువు ఎంతో అవసరం అర్థమవుతుందా?”

“సరే.. సరే!” అసంకల్పితంగా అనేశాడు చందు.

“తాతయ్య మీరు ఎప్పుడు సిటీకి మా దగ్గరికి వస్తారు?” అడిగాడు.

“ఏం? మేము వచ్చి రెండు నెలలే కదా అయింది?” అన్నాడు చలపతి రావు.

“ఏం లేదు. నాయనమ్మ చేసే సున్నుండలు అంటే నాకు చాలా ఇష్టం. మీరు రావడం ఓ ఆనందమైతే.. సున్నుండలు తినడం డబుల్ ఆనందం.”

“సరేలే! అలాగే జంతికలు, బొబ్బట్లు కూడా నాయనమ్మతో చేయించుకుని తీసుకు వస్తాను.”

అటుగా వచ్చిన మహేంద్ర కొడుకు చందూతో, “ఏరా నాని! మీ తాతయ్యతో కబుర్లు ఆగవా? అన్ని సంగతులు ఎప్పటికప్పుడు మాట్లాడాల్సిందేనా?” అన్నాడు.

“వన్ మినట్ తాతయ్య అంటూ” .. ఫోన్ కాస్త దూరంగా ఉంచి..

“అవును డాడీ!” అన్నాడు చందు సంబరంగా.

నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహేంద్ర.

తాతా మనవడు మళ్ళీ కబుర్లలో పడ్డారు.

***

రెండు సంవత్సరాల తరువాత..

ఓ రోజు చలపతి రావు సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్‌కి వెళ్ళాడు.

“బాబూ! ఈ ఫోన్ పని చేస్తోందా, కాస్త చూడవా?”

షాప్ అబ్బాయి ఆ ఫోన్‌ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూస్తూ.. “సార్! ఎందుకు సందేహం వచ్చింది?” అని అడిగాడు.

“ఏంటో బాబూ! గతంలో తరచుగా కాల్స్ వచ్చే ఈ ఫోన్‌కి ఈ మధ్య కాల్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఫోన్లో ఫాల్టా? లేదు సిగ్నల్ ప్రాబ్లమా? అర్థం కావడం లేదు” అన్నాడు చలపతి రావు.

“సార్ అంతా ఓ.కే. ఫోన్లో కానీ, సిగ్నల్ రిసీవింగ్‌లో కానీ ఎటువంటి సమస్య లేదు” అని చెప్పి ఫోన్ తిరిగిచ్చేశాడు షాప్ అబ్బాయి.

చలపతి రావు మనవడికి కాల్ చేశాడు.

అవతల నుండి కోడలి సమాధానం.

“మామయ్యా! చందు కంప్యూటర్ పై వున్నాడు. ఆన్‌లైన్ క్లాస్ వింటున్నాడు. కరోనా కష్ట కాలం తర్వాత వీళ్ళ చదువులన్నీ కంప్యూటర్ పైనే ఎక్కువయ్యాయి. ఎప్పుడైనా సమయం దొరికితే వీడియో గేములు కూడా దానిపైనే.. మీరు చెబితే నమ్మరు కానీ అన్నం తింటూ కూడా వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. వీడ్నెలా మార్చాలో అర్థం కావడం లేదు..” అని వాపోతున్న కోడలి మాటలు వింటున్నాడు.

‘అంటే ఇదివరకు నా కొడుకు, కోడలు తాతయ్యతో మాట్లాడమని మాత్రమే చందుకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేవాళ్ళన్నమాట. మరి నేడు ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమాని పిల్లల వెంటబడి పెద్దవాళ్ళు నిరంతరం కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. హతవిధీ!’ తనలో తనే అనుకుంటున్నాడు చలపతిరావు.

ఈ మధ్య భర్త ఎందుకు అలా నిస్సత్తువగా ఉంటున్నాడో అర్థం అవ్వడం లేదు చలపతిరావు గారి భార్య జానకమ్మకి!

జరుగుతున్న వైనాన్ని చిరునవ్వులతో వీక్షిస్తున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.

Exit mobile version