చం.
అరువది నిండె నిప్పుడిక హాయిగ నుండెద, శేషజీవితం
బురుములు మెర్పులున్ దరికి నొల్లక నుండెద నంచు నుండగా
పరిపరి చిత్తమందు నొక బాలిక, నాదు కుమార్తె, గన్పడున్
పరిణయ మెప్పుడంచు, నిదె భారముగా మది నెంతొ గాల్చెడిన్
తే. గీ.
మంచి సంబంధ మొక్కటి యంచితముగ
గన్పడెన్ గాని కాన్కలు కట్నములును
వస్త్రముల్ పొలముల్ గోరి శాస్త్రవిధిని
పెండ్లి చేయుడనిరి మగపెండ్లివారు
తే. గీ.
నే పదవిలోన గూర్చిన నిధులు పొలము
లాభరణము లన్నియు నిచ్చి వైభవముగ
పెండ్లి చేసిన నది యిది పెట్టుడనుచు
బాధ పెట్టిరి నను వారి బంధుగణము
ఉ.
విత్తము మొత్తమున్ గదిలి వియ్యపువారి గృహంబు చేరె , నా
చిత్తము నందు కోర్కె యిదె, చింతలు లేకయు శాంతి తోడ తా
నిత్తరి బిడ్డ నెమ్మదిగ నెంతయు బంధుగణంబు మధ్యలో
నెత్తుగ నిల్చుగా కట, ప్రభావము చూపుచు, తెల్వి గల్గుచున్
తే. గీ.
బిడ్డ తానుండె నచ్చట ప్రేమ మీర,
నల్వురు సమాదరించి మన్నన నిరతము
చూడ, నిశ్చింతగా నుంటి నేడు నేను,
పదుగురున్న చోటనె పాప పదిలము గద !
కం.
తమ్ముడొకడు గల డాతని
కిమ్ముగ నొక కూతురుండె, నెంతయు ప్రేమన్
తమ్మిని వలె సాకుచు నా
యమ్మను చదివించిరి పరమాద్భుత రీతిన్
కం.
పెండిలి చేయగ చూచెన్
తండిరి కూతురున కొక్క తగినట్టి వరున్,
గండి బొడిచె నామెయు లో
నుండిన కోర్కుల దెలుపుచు, నొప్పదెవరినిన్
సీ.
లక్షజీత మొకనెలకు తేగలండేని
వానిదెం డన్యుడు వలదు వలదు,
తన జీతమంతయు తనకు నాకే బెట్టు
వానిదెం డన్యుడు వలదు వలదు,
అమ్మయు నాన్నయు అక్కసెల్లెలు లేని
వానిదెం డన్యుడు వలదు వలదు,
గృహకార్యముల యందు కేలు దిరిగినట్టి
వానిదెం డన్యుడు వలదు వలదు,
తే. గీ.
నేను గీచిన దాటని వాని దెండు
వా డెవడయినన్ సరి యంచు పల్కె నామె,
పలువిధమ్ముల తమ్ముడు పరితపించి
నన్ను చేరి పల్కె నిదేమిటన్న యనుచు
శా.
ఉద్యోగంబున జేరి యామె తన యాత్మోక్తంబుగా నొక్కనిన్
సద్యః ప్రేరితయై వివాహమున నిచ్చన్ పొందె, నవ్వారు న
త్యుద్యన్మార్గము చెందిరంద రట తీక్ష్ణోత్సాహధూర్తాత్ములై
విద్యాహీనులు, మెట్టినింట సుత యే ప్రేమం గనన్ లేదయా
కం.
కష్టంబగునను భ్రమలో
నిష్టంబుగ కాపురంబు నేర్పరచిరి యే
నష్టంబు లేదటంచును
వ్యష్టిగ, కొన్నాళ్ళు గడచె నమిత సుఖముగాన్
కం.
పొరపొచ్చెములు బయల్వెడ
లె, రచ్చకెక్కి రుభయులు, తొలి సరసమయ్యెన్
విరసం, బసహన మే యెడ ,
సరిజేయన్ రాదు వారి సంసారంబున్
కం.
పెద్దలు లేరొక యింతయు
నొద్దిక గూర్చుటకు నెంతొ యోర్మిన్, తామున్
పధ్ధతి గనరెంతయు వా
రిద్దరు, మిగిలెన్ విడాకులిచ్చుటె యికపై
కం.
విత్తము పోయిన పోనీ,
సత్తువ పోయినను పోని, సమముగ తానీ
యెత్తున సమిష్టిలోనన్
ముత్తెము వలె నుండె నాదు ముద్దు దుహితయే
ఉ.
విత్తము భూమి మొత్తమును పెట్టితి నేనని యేడ్చి నాడు నా
సత్తువ నెల్ల గోల్పడితి, సర్వము నూడ్చిన నేమి, బిడ్డ తా
నుత్తమకోడలై బరఁగి యొప్పుగ లోకము మెచ్చ నుండె, నా
అత్తయు గారవించును సమాదర మేర్పడ పిల్ల నెప్పుడున్
మధ్యాక్కర.
ఓ పిల్లలార ! మీ కెపుడు నుత్తమజీవితం బమరు
మీ పెద్దవారల వాక్కు మేలనుచు చెవియొగ్గి విని
యోపిక తోడ గ్రహించి యొప్పిన, నీ జగమందు
నాపదల్ దూరమై బంధ మత్యంత బలముగ నిలుచు
కం.
పెద్దలు సూచించిన విధి
నొద్దికగ వివాహమంద నొప్పును సుఖముల్
పెద్దల మాటలె చద్దులు
పెద్దల మాటలు వినంగ విలువయు పెరుగున్
అన్నమరాజు ప్రభాకర రావు గారి తల్లిదండ్రులు శ్రీమతి రమాదేవి, కీ.శే. జనార్దనరావు గార్లు. వీరు మొదట భారతీయ వాయుసేన, తదుపరి భారతీయ జీవిత బీమా సంస్థ)లో పని చేశారు. వీరి పద్యగురువు అవధానాచార్య, కళారత్న, పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారు.
(అ) గ్రంథములు – తాండవలాస్యము(పద్యకావ్యం), శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రము (సుబోధినీవ్యాఖ్య), ముఖాముఖి-స్తుతివిలాసము(ఖండకావ్య సంపుటి) — (ఆ) సంభావన పద్యాలు / వ్యాసాలు – ప్రకాశం ప్రదీపనం, గురువందనం, శ్రీ చినజీయర్ స్వామి షష్ట్యబ్ది సంచిక, గజేంద్రమోక్షణ విలాసం (పరిశోధనాత్మక వ్యాసము) వాగ్దేవి కళాపీఠం, డా. ఆశావాది సారస్వత సమ్యగవీక్షణం, (సంకలన గ్రంథాలలో) ; స్వామి అయ్యప్ప (ఆధ్యాత్మిక), మూసీ, పద్యవారధి (సాహిత్య),మాస పత్రికలలో ముద్రిత రచనలు.
(A) తాండవలాస్యము – స్వర్ణసాహితీ సమితి సింగరాయకొండ వారిచే (2019) (B) రాష్ట్రస్థాయి పద్యరచన పోటీలు (2020) – నన్నయ భట్టారక పీఠం తణుకు వారిచే, (C) శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం – (2021) సంస్కార సుధ, వనస్థలిపురం హైదరాబాదు వారిచే పురస్కారాలు పొందారు.