[శ్రీమతి మాలా కుమార్ రచించిన ‘నేను నోచిన నోములు’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాలా కుమార్ ఇటీవల ‘నేను నోచిన నోములు’ అనే పుస్తకం వెలువరించారు. ఇందులో అందరు సులభంగా చేసుకోగలిగే నోములు, వ్రతాల గురించి వివరించారు.
‘నోములు ఎందుకు నోచానంటే’ అనే తన మాటలో తనకి బాల్యం నుంచి భక్తిభావం అలవడిందని, తాతగారు, అమ్మమ్మ, అమ్మల పూజా విధానం నుంచి తానెన్నో నేర్చుకున్నానని వెల్లడించారు రచయిత్రి. పూజలెందుకు చేయాలో, ఆలయాలకు ఎందుకు వెళ్ళాలో చెప్పారు. వ్రతాలు సరిగా చేయకోపోతే దేవతలు శాపమిస్తారనడం ఎంత వరకు సరైనదని తన మేనకోడలు ప్రశ్నిస్తే, ఆమె సందేహం తీర్చారు. తనకు పెద్దలు నేర్పిన విషయాలు, పుస్తకాలలో ఉన్న విషయాలను మేళవించి ఈ పుస్తకం రూపొందించినట్లు తెలిపారు మాలా కుమార్.
“తమకు ఉన్నదాన్నిఇతరులతో పంచుకోవటం, ఇతరులకు మంచిని మాత్రమే పంచాలని చెప్పటం, సాటివారిలో తమ ఇష్టదైవాన్ని చూడడం అలవాటు చేసుకోవటం, సహనం, క్షమ మొదలైన గుణాలు పెంపొందించటం ఈ నోములు వ్రతాల లక్ష్యంగా కనిపిస్తుంది” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు మేడికొండూరు రాజ్యలక్ష్మి గారు.
“ఈ తరం ఆడపిల్లలకి ఉపయోగపడేలా మంచి విషయాలు చెప్పారు” అని ఈ పుస్తకం గురించి ప్రముఖ రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీలగారు పేర్కొన్నారు
~
‘నోములు ఎలా పట్టాలంటే’ అనే అధ్యాయంలో వివిధ రకాల నోములను ఎలా నోచుకోవచ్చో వివరంగా తెలియజేశారు. చివర్లో, ఈ పద్ధతులన్నీ తాను చేసుకునే విధంగా చెప్పాననీ, ఎవరింటి పద్ధతి వారికి ఉంటుందని, ఆయా పద్ధతులలో నోచుకోవచ్చని తెలిపారు.
ముఖ్యమైన పూజా సామగ్రిని పేర్కొన్నారు. ఆపై లక్ష్మీ పూజా విధానం, గౌరీ పూజా విధానాలను మంత్రాలతో సహా వివరించారు.
తరువాతి పేజీలలో – 1. అంగరాగాల నోము 2. అష్టలక్ష్మీ వ్రతం 3. అక్షయ బోండాల నోము 4. కందగౌరి నోము 5. కళ్యాణ గౌరి నోము 6. కాటుక గౌరి నోము 7. కుంకుమగౌరి నోము 8. కుందేటి అమావాస్య నోము 9. కైలాసగౌరి నోము 10. గంధ తాంబులం నోము 11. గాజుల గౌరి నోము 12. గుమ్మడి గౌరినోము 13. చిట్టిబొట్టు నోము 14. దంపత్తాంబూలాల నోము 15. నిత్య గౌరి నోము 16. నిత్య తాంబూలము నోము 17. పండు తాంబూల నోము 18. పదహారు ఫలాల నోము 19. పువ్వు తాంబులము నోము 20. మూసివాయనాల నోము 21. మాఘపాదివారం వ్రతం 22. పసుపు తాంబూలము నోము 23. రథసప్తమీ వ్రతం 24. బతుకమ్మ 25. ఆంజనేయస్వామి ప్రదక్షిణలు 26. సోలా సోమవార్ వ్రత్ 27. సోలా శుక్రవార్ వ్రత్ – వంటి నోముల ఎలా చేసుకోవాలో తెలిపారు. ఆయా నోములకి సంబంధించిన ఫోటోలు అందించారు.
నోములు చేసే విధానాలు, శ్లోకాలు, వ్రత కథ, ఆ నోములకి సంబంధించిన పాటలు, నైవేద్యాలు, తాంబూలాలు, వ్రతఫలాలు, ఉద్యాపన ఉంటే చేసే విధానం తదితర అంశాలు పేర్కొన్నారు. కొన్ని నోములకి/వ్రతాలకి ఉద్యాపన లేని పక్షంలో లేదని తెలిపారు.
చివరగా, పూజలు, వ్రతాలు మన సాంప్రదాయంలో భాగమని చెబుతూ, వీలు, సమయం, స్తోమతని బట్టి ఖర్చులు తగ్గించుకున్నా తప్పు లేదని పేర్కొన్నారు. ఏ పూజ, ఏ వ్రతం చేసుకున్నా, భక్తిశ్రద్ధలతో చేసుకోవడం ముఖ్యమని వ్యాఖ్యానించారు.
మొత్తం మీద ఒక ఉపయుక్తమైన పుస్తకాన్ని అందించారు శ్రీమతి మాలా కుమార్.
***
రచన: మాలా కుమార్
ప్రచురణ: తపస్వి మనోహరం ప్రచురణలు
పేజీలు: 96
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత్రి: 9989051913
prabhatakamalam@gmail.com
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.