Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేను నేనే..

లేఖిని అంతర్జాతీయ మహిళాదినోత్సవ కథానికల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ. రచన: జి.యస్. లక్ష్మి.

సాయంత్రం అయిదయింది. ‘వీణా ఎంటర్‌ప్రైజెస్..’ వ్యవస్థాపకురాలు సునీత చూస్తున్న అకౌంట్స్ పూర్తిచేసి, అప్పటికే రాసి వుంచిన ఒక చెక్‌ని అక్కడే వున్న కవరులో పెట్టి, బెల్ నొక్కింది. అటెండెంట్ రాగానే కార్ తియ్యమని డ్రైవర్‌కి చెప్పమని చెప్పి, నెమ్మదిగా కిటికీ కర్టెన్ పక్కకి తొలగించి చూసింది.

‘వీణా ఎంటర్‌ప్రైజెస్..’ బిల్డింగ్ గేటు దగ్గర పేవ్‌మెంట్ మీద కూర్చుని కనిపించిన రామనాథాన్ని చూడగానే ఒంటిమీద తేళ్ళూజెర్రులూ పడ్డట్టయింది. హూ… అతని సంగతి తనకి తెలీదా! అప్పుడే యేడాదినుంచీ తన వెనకాల పడుతున్నాడు. తను ఇంట్లోకి రానివ్వలేదని బంధువులూ, స్నేహితుల ద్వారా రాయబారాలు పంపించేడు. అదీ ఖాతరు చెయ్యలేదని నాల్రోజుల్నించీ ఆఫీసుగేటు పట్టుకుని వేళ్ళాడేడు. అది కూడా కుదరకపోతే ఆఖరికి యిలా వచ్చేడన్నమాట.

రామనాథం.. అబ్బా… ఆ పేరు చెవుల్లో పడితే చాలు తన మనసంతా అల్లకల్లోలమైపోతుంది. ఇంక ఆ మనిషి యెదుట పడ్డాడంటే తనని తను సంబాళించుకోవడం చాలా కష్టం. ఇవాళా నిన్నానా.. ఇప్పటికి యిరవై సంవత్సరాలనుంచి ఈ బాధ మౌనంగా భరిస్తోంది. అది బడబానలంలా తనని లోపల యెలా కాల్చేస్తోందో తనకీ, వీణకీ మాత్రమే తెలుసు.

ఇరవై సంవత్సరాలక్రితం పుట్టింటినుంచి  అతనడిగిన లక్ష తేలేదని తననీ, నెలల పిల్ల వీణనీ భార్యా, కూతురూ అనైనా చూడకుండా యింట్లోంచి బయటకి వెళ్ళగొట్టిన ఆ రామనాథం కళ్ళముందుకొచ్చేడు. ముగ్గురు ఆడపిల్లలకి కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేసిన అమ్మావాళ్ళూ అంత డబ్బు యిచ్చుకునే స్థితిలో లేరు. తను రామనాథాన్ని కాళ్ళు పట్టుకుని బతిమాలింది. దాసీదానిలా పడివుంటానంది. ఆ పొగరుబోతు దేనికీ ఒప్పుకోలేదు. లక్ష తెస్తే తప్ప యింట్లో అడుగు పెట్టొధ్దన్నాడు. కనీసం కూతురు మొహమైనా చూడమని మొరపెట్టుకుంది. “అదసలు నా కూతురేనా!” అన్నాడు. అంతే ఒక్కసారి తనకి భూమిలోకి కుంగిపోవాలనిపించింది. దేనితోనైనా పొడుచుకు చచ్చిపోవాలనిపించింది. ఆ మాటకి సునీత అన్న మనిషి అక్కడి కక్కడే చచ్చిపోయింది. ఆ పైన అంతా వీణకి తల్లిలాగే మిగిలింది.

కన్నకూతుర్ని తండ్రి వదుల్చుకున్నంత తేలిగ్గా తల్లి వదలలేదు కదా! కాని బతకడమెలా! ఉద్యోగం చేసుకునేంత చదువులేదు. అంత మాట పడ్డాక యింక అమ్మానాన్నలకి కూడా భారం కాదల్చుకోలేదు. ఒక రకమైన మొండితనం తనని ఆవహించింది. అందుకే మొగుడే వద్దన్నాక యింక ఆ మొగుడు కట్టిన పుస్తెలు మటుకు తనకి యెందుకనుకుంటూ అవి అమ్మేసి, ఫేషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. చిన్న చిన్నగా ఆర్డర్లు తీసుకుని, తన తెలివితేటలతో రోజుకి యిరవైగంటలు కష్టపడి, యిన్నేళ్ళకి ఈ వీణా ఎంటర్‌ప్రైజెస్‌కి ఒక గుర్తింపు తీసుకొచ్చింది. వీణా బుటెక్ కు ఒక బ్రాండ్ సృష్టించింది. ఇప్పుడు తనను కలవడానికి వస్తాడా..

అవును…యెందుకు రాడూ! అతనికున్న దుర్వ్యసనాలకి  ఉద్యోగం పోయింది. ఆరోగ్యం పాడయింది. ఇప్పుడొచ్చి తన కాళ్ళ దగ్గర పడుంటానంటూ రాయబారాలు మొదలెట్టేడు. కట్టుకున్న మొగుడుని కాదనుకోవద్దని చుట్టపక్కాలందరూ తనకి హితబోధలు కూడానూ. ఇన్నేళ్ళూ ఈ హితబోధలు వాడి కెందుకు చెయ్యలేదో.. కడుపుడికిపోతోంది సునీతకి.

ముఖంలో భావాలేమీ కన్పించకుండా సీరియస్‌గా ఆఫీసు బైటకొచ్చి కారెక్కబోతుంటే తనవైపు పరిగెత్తుకొస్తున్న రామనాథం కన్పించేడు. కార్ డోర్ తీసి పట్టుకు నిలబడిన వాచ్మేన్ చేతిలో కవర్ పెట్టేసి, రామనాథాని కిమ్మని, కారెక్కి మళ్ళీ యిటువైపు చూడకుండా వెళ్ళిపోయింది సునీత.

రాత్రి భోజనం చేస్తూ ఈ సంగతి చెప్పిన సునీతని చూసి వీణ నవ్వింది.

“ఎందుకు నవ్వుతావ్!”

“నీకింకా అతను పాపం భర్తనే భావం పోలేదు కదా.. అందుకే ఆ కవర్లో డబ్బు యిచ్చుంటావ్..”

“ఊహు.. డబ్బివ్వలేదు. వికాస్ ఓల్డేజ్ హోమ్‌లో అతనుండడానికి డబ్బు కట్టిన రసీదు మాత్రమేవుందా కవర్లో..”

“అదికూడా మొగుడనే సాఫ్ట్ కార్నర్ తోనేగా.”

“ఊహు కాదు. ఆ రోజు అతనలా రోడ్డు మీదకి తోసెయ్యకపోతే ఎప్పటికీ నాలోవున్న ఈ ప్రతిభ బయటకిరాకుండా యిప్పటికీ అతని మడుగులకి మడుగులొత్తుతూ వుండేదాన్నేమో. ఆ ఉపకారం చేసినందుకు ఈ పని చేసానంతే..” అని ఆత్మవిశ్వాసంతో అంటున్న తల్లిని ఆరాధనగా చూసింది వీణ..

Exit mobile version