నేను పంచ భూతాల్లో ఒక భూతాన్ని.
భూతమంటే భూతముకాదు దెయ్యాన్ని కాదు.
మారు పేరు ప్రాణవాయువుని.
నేను లేనిదే జీవి లేదు. జీవే నేను
నేనే జీవి.
నేను అనంత విశ్వంలోంచి
అప్పుడే పుట్టే దేహాల ఊపిరితిత్తులలో చేరి
దేహానికి ప్రాణప్రదం చేస్తూవుంటాను .
జీవుల మనుగడకు సహకరిస్తుంటాను.
నేను జీవి ఊపిరితిత్తులలో
ఆడుకుంటాను. ఊపిరితిత్తులలోనించి
బైటకి లోపలకి ప్రయాణిస్తూ ఆడుకుంటాను.
నా ఆట భలేగా సాగుతూ ఉంటుంది.
కానీ ఈ ఆట యెంత కాలం సాగుంతుందో
నాకే తెలియదు.
నా ప్రయాణం సుదీర్ఘమూ కావచ్చు
లేక హ్రస్వమూ కావచ్చు.
కాలుని దయా దాక్షిణ్యాలమీద
ఆధారపడి ఉంటుంది.
కాలునికి కోపమొస్తే నన్ను
వెంటనే జీవి నుండి వెడలమని
ఆదేశిస్తే నా ఆట కట్టినట్టే.
కాలునికి కోపమొచ్చిననాడు
నన్ను జీవి నుండి వెడలమని
ఆదేశిస్తే నేను నా ఆటను కట్టి పెట్టి
కాలుని ఆజ్ఞ మేరకు
అనంత విశ్వంలో కలసి పోవలసిందే.
ఊపిరి లో ఊపిరినై
ఆడుకుంటుంటే
నన్ను ఈ విధంగా
ఆటలు చాలించి జీవిని విడిచి వెళ్ళమని
జీవాన్ని నిర్జీవిని చేయుటకై
కాలుడు ఆదేశించటం
న్యాయమేనా ?
నా ఆట అంతటితో ఆగదులే
నేను ఊరుకుంటానా మరలా
వేరొక దేహంలో చేరి పుట్టుకొస్తాను
మరలా మరలా
ఆడుకుంటానే వుంటాను
సృష్టి వున్నంతవరకు.
ప్రాణాల్ని నిలపటమే కాదు.
విధ్యంసం సృష్టించడమూ నా పనే
నేను అతి త్వరగా అమెరికా వెళ్ళాలి.
నేను టోర్నిడోగా మారి విధ్యంసం సృష్టించాలి.
మారణ హోమం చేయాలి.
నేను యెంత ఉపకారినో అంతే అపకారినికూడా.
ఎప్పుడు ఏ విధంగా మారుతానో
నాకే తెలియదు.
నాకు కోపమొస్తే విలయ తాండవం చేస్తాను
మరి వుంటా అనను దేశ దిమ్మరిని కదా
టా టా ఇక వెళ్తా.
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.