Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆకాంక్షకీ, ఆపేక్షకీ నడుమ ప్రయాణం – ‘నేను ఎక్కడ ఉన్నాను?’

[సతీష్ చెముడు గారు రచించిన ‘నేను ఎక్కడ ఉన్నాను?’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబంలో ఒకరిపట్ల మరొకరికి ప్రేమాభిమానాలు మెండుగా ఉంటాయి. పైకి గొడవపడుతున్నట్టు కనిపించినా, లోపల అనుబంధం దాచుకుంటారు. కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు. కాలంలో వచ్చిన మార్పులు మధ్య తరగతి వర్గాన్ని కూడా ప్రభావితం చేశాయి. విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగవడంతో స్త్రీలు కూడా ఆయా రంగాల్లోకి ప్రవేశించి రాణిస్తున్నారు. చదువు నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో కొత్త ప్రదేశాలకు, దూర దేశాలకు వెళ్ళడానికి వెనుకాడడం లేదు.

మధ్యతరగతి విద్యావంతులకు అమెరికా ఓ ఆకర్షణ! ఓ ఆశ! ఓ గమ్యం! చదువుకోడానికి వెళ్ళి, చదువుకుంటూ తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుని, చివరికి మరో స్థిరమైన ఉద్యోగం చూసుకుని అక్కడే స్థిరపడడం అనేది గత కొన్నేళ్ళకు వరకూ జరిగిన సంగతే!

ప్రస్తుత కాలంలో అమెరికా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కుంటోంది.. ఒకప్పటి భూతలస్వర్గమనే నమ్మకం సడలుతోంది. అయినా అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకునే వారి సంఖ్య తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆంధ్ర ప్రదేశ్‍కి చెందిన సాఫ్ట్‌వేర్ ట్రైనర్, ఔత్సాహిక రచయిత సతీష్ చెముడు ‘నేను ఎక్కడ ఉన్నాను?’, ‘Where am I?’ అనే పేర్లతో తెలుగు, ఇంగ్లీషు భాషలలో తన తొలి నవలని ప్రచురించారు. అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుని, స్థిరపడి ఉద్యోగాలు చేయాలనుకునేవారికి – ఈ నవల ఎన్నో విషయాలు చెబుతుంది. కొందరు ఇవన్నీ మాకు తెలుసు అని అనుకోవచ్చు, కానీ, కథలో భాగంగా, ఓ పాత్రకి ఎదురైన అనుభవాలుగా, సంఘటనలుగా మలచినప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి.

ఫిభ్రవరి 2024లో ముద్రితమైన ఈ నవల, గత ఏడాది కంటే – ఇప్పుడున్న పరిస్థితులలో – అమెరికా వెళ్ళాలని ఆశపడుతున్న యువతీయువకులు – చదివి, వాస్తవ స్థితిగతులను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని చాటుతుంది.  గత ఆరు నెలలుగా అమెరికా పాలసీలలో వస్తున్న మార్పులు భారతీయ యువతని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలిసినదే. ‘ముందు వెళ్ళిపోదాం, తరువాత అక్కడే ఏదైనా చూసుకుందాం’ అనే పద్ధతి ఇప్పుడు కుదరదు. అంతకు ముందే వెళ్ళి, అక్కడే ఏదో చిన్నా చితకా ఉద్యోగాలలో ఉండి, ఇండియా రావాలంటే ఎన్నో సంశయాలు! తిరిగి ఆ గడ్డ మీద అడుగు పెట్టనిస్తారో లేదో అని! అన్ని పత్రాలు సరిగానే ఉన్నా, మళ్ళీ రానివ్వరమేననే భయంతో చాలామంది యువతీయువకులు తమ ఇండియా ట్రిప్స్ వాయిదా వేసుకుంటున్నారని వార్తలు వింటున్నాం.

ఈ నేపథ్యంలో సతీష్ గారి నవలని చదివితే, what it takes to settle in America అన్నది అర్థమవుతుంది. ఏం పొందుతాం, ఏం కోల్పోతాం అన్నది స్పష్టమవుతుంది. పొందేవి హోదా, సంపద, సౌఖ్యాలు అయితే; పోగొట్టుకునేవి బంధాలు, స్నేహాలు! అయినవారికి దూరమై, ఎండమావుల వెంట తీసే పరుగులు, ఒక్కోసారి గమ్యానికి చేర్చవచ్చు, మనం ఎదగవచ్చు, కానీ మనవారికి అందనంత దూరమైపోతాం. చాలా కుటుంబాలలో జరిగేది, జరిగింది, జరుగుతున్నది ఇదే.

***

‘నేను ఎక్కడ ఉన్నాను?’ నవలని 15 అధ్యాయాలుగా విభజించారు రచయిత. దాదాపుగా ప్రతీ అధ్యాయం సంభాషణల రూపంలోనే కథను చెబుతుంది. సన్నివేశాల చిత్రణ కూడా పేరాగ్రాఫులలో తక్కువగా, సంభాషణల రూపంలో ఎక్కువగా సాగింది.

నవల ఇతివృత్తం ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక నిరాడంబరమైన మధ్య తరగతి కుటుంబానికి చెందిన ‘ఆశ’ అనే యువతి జీవితాన్ని ప్రదర్శిస్తుంది. రాజేందర్, లలితలు – ఆశ అమ్మానాన్నలు, ఉపాధ్యాయులుగా పనిచేసే రిటైరవుతారు. సరిత వాళ్ళ పెద్ద కూతురు, ఆశకి అక్క.

తమ కూతుళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి పెంచుతారా దంపతులు. ఎంతో కష్టపడి కూతుర్లిద్దరినీ ఇంజనీరింగ్ చదివిస్తారు. చదువు సంగతి ఎలా ఉన్నా, ఇంజనీరింగ్ కాలేజీ కలిగించే ఆకర్షణల బారిన పడతారు అక్కడ చదివే అమ్మాయిలూ, అబ్బాయిలూ. సరిత, ఆశ ఇందుకు మినహాయింపు కాదు. సరిత ఓ కుర్రాడిని ఇష్టపడుతుంది, ఆపై హద్దులు దాటుతుంది. చిక్కుల్లో పడుతుంది, హెచ్.ఓ.డి. సాయంతో వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతుంది. ఆశ తన క్లాస్‍మేట్ చేతన్‍ని ఇష్టపడుతుంది, ప్రేమలో పడుతుంది. సరిత తల్లిదండ్రులని బలవంతపెట్టి అప్పులు చేయించి మరో అమెరికా వెళ్తుంది. అప్పటికి ఆశ ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉంటుంది. సరిత అమెరికా వెళ్ళిన ఏడాది తరువాత ఆశ ఫైనల్ ఇయర్‌లో ఉండగా, రాజేందర్ గుండెపోటుతో మరణిస్తాడు. సరితని ఇండియాకి రావద్దని, బాగా చదువుకుని, మంచి  ఉద్యోగ చూసుకుని కుటుంబ బాధ్యతలు చూసుకోమని మేనమామ నారాయణ నచ్చజెప్తాడు. ఆయనే అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. 11 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాకా, లలిత మామూలుగానే ఉద్యోగానికి వెళ్తుంది. ఆ సందర్భంగా ఆశ తల్లికి వేసిన ప్రశ్నలు, ఆమె చెప్పిన జవాబులు – బాధ్యతలు మోసే మనిషి దృక్పథం ఎలా ఉంటుందో చెబుతాయి.

అక్క చదువు అయిపోయి, ఉద్యోగం వస్తుందని, తమ ఆర్థిక ఇబ్బందులు కాస్త తీరుతాయని నమ్ముతున్న ఆశకి – అమెరికాలో పరిస్థితులు అనుకున్నంత గొప్పగా లేవని, ఉద్యోగం రావడం అంత సులువు కాదని చెప్పాలనుకుంటుంది సరిత, కానీ, వాళ్ళెక్కడ దిగులు చెందుతారో అని చెప్పదు. చివరకి సరితకి ఓ ఉద్యోగం దొరుకుతుంది. తన ఖర్చులకు పోనూ కొంత డబ్బుని తల్లికి పంపుతూంటుంది. ఈ లోపు చదువు పూర్తి చేసుకున్న ఆశ కూడా అమెరికా వెళ్ళాలని ఆశపడుతుంది. ఈ లోపు లలిత పెద్ద కూతురికి ఓ సంబంధం, అమెరికాలో ఉండే కుర్రాడినే చూసి పెళ్ళి చేస్తుంది. పెళ్ళయ్యాకా, సరిత నుంచే వచ్చే డబ్బు ఆగిపోతుంది. జిఆర్ఇ రాసి, మంచి ర్యాంకు తెచ్చుకుంటుంది ఆశ. సోదరుడు నారాయణ వద్దన్నా, లలిత, చిన్న కూతురుని కూడా అమెరికా పంపిస్తుంది.

యూనివర్శిటీలో ఆశకు సుష్మిత నేస్తమమవుతుంది. జీవితంలో తాను చేసిన పెద్ద పొరపాటు – నేను ఎక్కడ ఉన్నాను? – అని చూసుకోకపోవడమేనని సుష్మిత ఆశకి చెబుతుంది. అమెరికా జీవితానికి అలవాటు పడుతున్న ఆశకి, అక్కడి తెలుగులో వాళ్ళలో అధికంగా కనబడ్తున్న కులం ప్రభావం విస్తుపోయేలా చేస్తుంది. ఇక్కడ హైదరాబాదులో లలిత ఒంటరితనం అనుభవిస్తూంటుంది. సరిత గర్భం దాల్చితే, ప్రసవ సమయానికి లలితని రమ్మంటే ఆరోగ్యం బాలేక వెళ్ళలేదు. అమెరికాలోనే ఉంటున్న ఆశకి కూడా ఆ సమయంలో అక్క దగ్గరకి వెళ్ళడం కుదరదు. ఆశకి కూడా ఆర్థికంగా ఒడుదుడుకులు ఎదురవుతాయి. అసైన్‌మెంట్‌లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, గ్రాడ్యుయేషన్ తర్వాత పూర్తిస్థాయి ఉద్యోగం వెతుక్కోడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటుంది ఆశ. రెండు నెలలు సెలవు పెట్టి అమెరికా వెళ్తుంది లలిత. సరిత ఇంట్లో దిగుతుంది. అల్లుడూ కూతురు సంపాదన కోసం తెగ కష్టపడడం గమనిస్తుంది. ఆశ సపోర్ట్ పర్సన్ పై ఎంతలా ఆధారపడిందో విని లలిత ఆశ్చర్యపోతుంది. అమెరికాలో ఉండగానే లలితకి క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అవుతుంది. ఆశ జీవితం మరో మలుపు తిరుగుతుంది. తల్లిని ఇండియాకి తీసుకొచ్చి, చక్కని చికిత్స చేయిస్తుంది. కీమోథెరపీ అయ్యాకా, మేనమామ నారాయణ ఉంటున్న పల్లెటూరికి తీసుకెళ్తుంది తల్లిని. కొన్ని రోజులకి తల్లికి మళ్ళీ అనారోగ్యం తిరగబెడుతుంది. మామయ్య, బావల సాయంతో ఓ  హాస్పిటల్ లో చేరుస్తుంది. తల్లి కాస్త కోలుకున్నాకా, ఆమెని చూసుకోడానికి అన్ని ఏర్పాట్లు చేసి తిరిగి అమెరికా బయల్దేరుతుంది ఆశ.

నవలలో మరో ముఖ్యమైన పాత్ర.. ఆశ మేనమామ నారాయణ. ఆయన జీవన విధానం, జీవితం పట్ల ఆయనకున్న స్పష్టత వల్ల ఆశ కూడా ప్రభావితం అవుతుంది. బ్రతుకు పట్ల తన దృక్పథాన్ని మార్చుకుంటుంది.

విమానంలో నేను ఎక్కడ ఉన్నాను అని ఆశ ఆలోచనలలో మొదలైన నవల, మళ్ళీ విమానంలోనే, నేను ఎక్కడ ఉన్నాను అని ఆశ అనుకోవడంతో ముగుస్తుంది. అయితే రెండు సార్లు వేసుకున్న ఈ ప్రశ్న మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ‘నేను ఎక్కడ ఉన్నాను?’ అన్నది భౌతికంగా తానెక్కడుందో తెలుసుకునేందుకు వేసిన ప్రశ్నలా కాకుండా, తన ప్రస్థానంలో తానెక్కడికి చేరిందనే విషయాన్ని తెలిపే పదబంధంగా మారుతుంది.

అక్కడక్కడా అచ్చుతప్పులు ఉన్నా, వాస్తవ స్థితిగతులను వ్యాఖ్యానిస్తూ సాగుతుంది నవల. ‘నేను ఎక్కడ ఉన్నాను?’ ఆసక్తిగా చదివిస్తుంది.

ఇంజనీరింగ్ పట్టా కలిగించలేని పరిపక్వత, జీవితం నేర్పించిందనీ, ఆశ అప్పటికే వెనక్కి రాలేని ప్రయాణంలో చిక్కుకుపోయిందని వ్యాఖ్యానిస్తారు రచయిత.

ఏమిటి ఈ ప్రయాణం అని అడిగితే, ఆకాంక్షకీ, ఆపేక్షకీ నడుమ ప్రయాణం అని చెప్తాను నేను.

***

నేను ఎక్కడ ఉన్నాను?
రచన: సతీష్ చెముడు
ప్రచురణ; నోర్టన్ ప్రెస్
పేజీలు:160
వెల: ₹ 220/-
ప్రతులకు:
https://notionpress.com/read/where-am-i
https://www.amazon.in/dp/B0CTQZFVWH

Exit mobile version