Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేను.. ఓ మనిషినే

[వాణి వేమవరపు గారు రచించిన ‘నేను.. ఓ మనిషినే’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

విశాల విశ్వంలో
ఒక బిందువునే నేను,
పసిప్రాయాన మురిపాలు పొందిన
తల్లితండ్రుల ముద్దుల భరిణనే నేను,
అరవిరిసిన పుష్ప సోయగాల మధ్య
ఓ కుసుమాన్నే నేను,
బంధాలు, బాధ్యతలతో అల్లుకున్న
వృక్షాన ఓ కొమ్మనే నేను,
తరిమే సమస్యల
ధీటు సమాధానాన్నే నేను,
మదిని గాయపరిచే మనుషులకు
సుదూర బంధువునే నేను,
వ్యథలను వెనుక ఉంచి
ముందుకు నడిచే
ఓ బ్రతుకు బండినే నేను,
అనంతమైన ఈ ప్రపంచంలో
ఓ సాధారణ మనిషినే నేను,
నేను.. ఓ మనిషినే.

Exit mobile version