[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘నేనొక పాటను..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కాలం వంతెన మీద
పసిపిల్లాడిని నిద్రపుచ్చడానికి
తల్లి పాడే జోలపాట లాంటి పాటను..!
అడవిలోని పచ్చని చెట్లకు
ఊపిరిపోసే పత్రహరితాన్నైన
వెలుగు కిరణాల లాంటి పాటను..!
మాటకు మాటకు మధ్యన
మొలకెత్తుతున్న ఆత్మీయతలకు
ఆయువు పట్టులాంటి పాటను..!
దారి పొడుగున పలకరిస్తున్న
అన్నార్తుల ఆకలిని తీర్చే
తల వంచని పొలాల వంటి పాటను..!
అలుపులేని జీవన సమరంలో
సగటు మనిషిని అక్కున చేర్చుకునే
మానవీయమైన స్పర్శలాంటి పాటను..!
చూడముచ్చటైన దృశ్యాలతో
చుట్టూ అలరారుతున్న రమణీయతతో
ఆలపిస్తున్న ప్రకృతి లాంటి పాటను..!