Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేనింతే

[వజ్జీరు ప్రదీప్ గారి ‘నేనింతే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ట్రయిన్ కదిలి చాలా సేపైంది. ట్రయిన్ ముందుకు వెళ్తుంటే దాని పక్కనే చెట్లు, గుట్టలు వేగంగా వెనకకు పరుగెత్తుతున్నట్లుగా కనిపిస్తుంది, గాలి మాత్రం రివ్వున మొఖంపై వాలి ప్రేమగా పలకరిస్తుంది.

“బాస్ మీరెక్కడికి వెళ్థున్నారు?” గబ గబ వచ్చి గలగల నవ్వుతు పక్కన కూర్చుంటూ అంది మాధవి.

“మాధవి నువ్వా? ఎక్కడెక్కావు?” ఆశ్చర్యంగా అన్నాడు ఆదిత్య.

“మంచిర్యాల స్టేషన్లోనే ఎక్కాను, అవును నువ్వేంటి ఏదో దీర్ఘాలోచనలో పడ్డావు?” సెల్ తీసి వాట్సాప్‌లో ఎవరికో ఏదో మెసేజ్ టైప్ చేసి పంపుతూ అంది.

“ఏం లేదు” ముభావంగా అన్నాడు ఆదిత్య.

“తెలుస్తుంది లే. అవును ఈ మధ్య మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిశారా?” సెల్‌లో అతని సింగిల్ ఫోటో తీసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో పెడుతు అంది.

“ఎవరిని కలవలేదు” చిన్నగా అన్నాడు.

“ఎందుకని ఈ మధ్య నిన్ను చాలా మంది గుర్తుచేస్తుంటే నువ్వేమో తప్పించుక తిరుగుతున్నావు అంటున్నారు తెలుసా?” అంది మాధవి.

“ఎవరు ఏమనుకున్నా మౌనం ఒక్కటే నా ఆయుధం. ఎన్నో అవమానాలు, అవహేళనలు, దుఃఖం దానికి తోడైన దరిద్రం ఎప్పుడూ నా ముందు నడిచాయి, దానిని అధిగమించడానికి నేను ఒంటరిగా వుండడం అలవర్చుకున్నాను” ట్రయిన్ కిటికిలో నుండి బయటకు చూస్తూ అన్నాడు ఆదిత్య.

“ఈ భూమిపై అన్నింటికన్న భయంకరమైనది ఒంటరితనమని నీకు తెలియదా?” మాధవి బ్యాగులోని వాటర్ బాటిల్ మూత తీస్తూ అంది.

“ఇది వినడానికి కటువుగా ఉన్న అది చాలా మందికి మేలు చేస్తుంది, మీరంతా నమ్ముతారో నమ్మరో గాని నిజం. అలా ఉన్నాను కాబట్టే ఈ సమాజం నన్ను పట్టించుకోకుండా వుంది లేకుంటే ఈ జనారణ్యంలోని రాక్షసుల మధ్య బతకడం ఎంతకష్టమయ్యేది” పాలిపోయిన మొఖంలో నవ్వును పులుముకుని అన్నాడు ఆదిత్య.

“ఒక లెక్చరర్ మాట్లాడే మాటలేనా? ఇంకా నయం ఈ మాటలు క్లాసులో పిల్లల ముందు అని వుంటే ఎంత నవ్విపోయెటోళ్ళు” గలగల నవ్వుతు అంది మాధవి.

“నిజమే! మనసు అనేది ఎప్పుడు ఒకేలా వుండదు గదా? నేను మనిషినే పైగా నీకు తెలిసిందే నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో” బాదగా అన్నాడు ఆదిత్య.

“లైఫ్‌లో కష్టాలు, సుఖాలు ఎప్పుడు ఎవరికి శాశ్వతంగా ఉండవు. అమావాస్య పౌర్ణమిలా ఉంటాయని చాలాసార్లు ఓ మహానుభావుడు చెప్పినట్టు గుర్తు మీకు జ్ఞాపకం రాలేదా స్వామి? అది మీరేనండి సర్” కిటికీలో నుండి వచ్చే గాలికి కురులు మొఖంపై పడుతుంటే సవరించుకొని అంది మాధవి.

“మనం జీవితంలో ఎన్నో కలలు కంటాం కాని ఆ కల కొందరికే సాకారమౌతుంది. ఎందుకో” బాధగా అన్నాడు ఆదిత్య.

“అటు కాలేజీలోను ఇటు యూట్యూబ్‌లో క్లాసులు చెబుతు బాగానే సంపాదిస్తున్నట్టు ఉన్నావు గదా? మళ్ళీ ఈ నిరాశ నిస్పృహలు ఎక్కడ నుండి ఆవహించాయి బాబు?” బ్యాగు ఓపెన్ చేస్తూ అంది.

“ఒక్కటి అరా అని చెప్పనా? ఎక్కడకెళ్ళినా ఇవే బాధలు. ఈ మనుషులకు నిలువెల్లా విషమే ఉంటుంది, నోటితో మాట్లాడుతు నొసటితో వెక్కిరిస్తారు, అందుకే పులి లాంటి ఈ సమాజం అంటే ఎందుకో ఈ మధ్య కాస్త భయం వేస్తుంది” చేతిలోని మ్యాగజేన్ గుండ్రంగా చుడుతూ అన్నాడు ఆదిత్య.

“అదేంటి ఆదిత్యా, ఈ సమాజం భయపడితే ఇంకా పరుగులు పెట్టిస్తోందని మన బ్యాచ్లో అందరికి చెప్పేవాడివి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు?”

“అందుకే నేను నా జీవనశైతిని కొత్తగా అల్లుకోడానికి భయలుదేరాను”

“ఎక్కడికి గురూ, తీర్థయాత్రలకా?” మళ్ళీ  గల గల నవ్వుతు అంది.

ఆదిత్య మౌనంగా చుశాడేగాని ఈ సారి నోరు తెరువలేదు.

‘గురుడు ఎక్కడో బాగానే దెబ్బతిన్నట్టున్నాడు మెల్లగా సెట్ చేయాలి’ మనసులో అనుకుంటునే “వాటర్ తాగుతావా?” నవ్వుతు అంది మాధవి.

ఆదిత్య ఆమె వైపు ఓ విధంగా చుశాడు.

“బాబు నేను క్యాజువల్ గానే అడిగాను నువ్ ఏం డౌటుగా చూడకు మహానుభావా?” రెండు చేతులు జోడించి అంది.

“మనం కలసి చాలా కాలమైంది, ఇంతకు మీ ఆయన, పిల్లలు ఎక్కడా?” మనసులో ఎక్కడో ఓ మూల చిన్న ఆనందాన్ని దాచుకుని బాటిల్ తీసుకుంటూ అన్నాడు ఆదిత్య.

ఇంతలో “టీ.. కాఫీ.. టీ.. కాఫీ” అంటూ వచ్చాడు టీ అమ్మే అతను.

ఆదిత్య అడిగే ప్రశ్నను దాటవేస్తూ అతన్ని ఆపి “నువ్వు టీ తాగుతావా కాఫీనా?” అతని కండ్లలోకి చూస్తూ అంది.

ఆదిత్య ఏం చెప్పకుండా స్టేషన్ భయటకు చుశాడు.

“మేడం! ఈ స్టేషన్ లో టీ బాగుంటుంది తీసుకోండి” టీ అమ్మే అతను రిక్వెస్టుగా అన్నాడు.

“హలో! సార్. ఈ స్టేషన్ లో టీ బాగుంటుందటా, తీసుకుంటున్నాను” గట్టిగా చెవిలో అరిచి టీ కప్పు తీసుకుని ఆదిత్య చేతికిచ్చింది.

“థాంక్యూ” అన్నాడు.

“వెల్‌కమ్”

“ఇంతకు నా ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు?” టీ సిప్ చేస్తూ అన్నాడు ఆదిత్య.

అతని మాటలను విని విననట్టుగానే “ఎక్కడి కెళ్ళారండి బాసరకేనా? బాబుకు అక్షరాభ్యాసం చేయించారా ఏంటీ” నవ్వుతు అప్పటి వరకు అటుగా చెవులు రిక్కించి విందేమో పక్క సీట్ వాళ్ళ పాపను దగ్గరకు తీసుకుంటూ అంది.

మాధవి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందన్న ఆలోచనలో పడ్డాడు ఆదిత్య.

“అవునండీ ఇంతకు మీరెక్కడకు వెళ్ళాలి” కలుపుగోలుగా అంది పాపవాళ్ళ అమ్మ.

“ఏమో! అంతా మా గురుదేవుల ఇష్టం. తానెక్కడ కెళ్థే నేను అక్కడికే” శూన్యంలోకి చూస్తూ అంది.

ఆమె సమాధానానికి విస్తుపోయాడు ఆదిత్య.

“అవును మిమ్ములను ఎక్కడో చూసినట్టుగా వుందండి” ఎదురు సీట్లో కూర్చున్నతను మాధవిని పరిశీలించి చూస్తూ అన్నాడు.

“నన్నా చాన్సేలేదు? ఎందుకంటే నేనో పల్లెటూరిదాన్ని. పచ్చని మా ఊరు, పొలాలు, పాడి గేదెలే నా ప్రపంచం. ఇప్పుడిప్పుడే ఓ మహానుభావుడిపై గాలిమర్లి నేను ఇలా భయటకు వచ్చాను” గల గల నవ్వుతూ అంది మాధవి.

ఒక్క క్షణం గుర్తు చేసుకుంటున్నట్టుగా చూశాడు. వాళ్ళావిడ ఏదో అతని చెవిలో గొణిగింది.

“యస్, ఈ మధ్య వైరల్ అయిన ఓ వీడియోలో అమ్మాయివి నువ్వే గదు?” అన్నారు భార్యాభర్తలిద్దరు.

‘గుర్తు పట్టి చచ్చారే’ అనుకుంటూ మాధవి ఆదిత్య ఒళ్ళో వున్న మ్యాగజైన్ తీసుకుని మొఖానికి అడ్డు పెట్టుకుంది.

“ఏం చేశావు మాధవీ? ఇంతకు నీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటీ?”ఆదిత్య మ్యాగజైన్ కాస్త కిందికని ఆమె మొఖంలోకి చూస్తూ అన్నాడు.

“అయినా ఫేమస్ కావడానికి ఈ మధ్య అందరు దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారేంటో” ఒకావిడా మరి గుచ్చి గుచ్చి చూస్తూ వెటకారంగా అంది.

“అసలు ఆ వీడియోలు ఏంటీ మాధవి?” భృకుటి ముడివేస్తూ అన్నాడు ఆదిత్య.

“అయినా ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని బనాయిస్తున్నారు, అసలు మీరు ఆ వీడియోలు చుశారా? చక్కగా ఈ సమాజానికి అవసరమై ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తుంది” పెద్దావిడా అందరిని ఉద్దేశించి అంది.

“అయిన కృష్ణా రామా అనుకుంటూ ఏ రామాయణమో, మహాభారతం, భగవద్గీత  పారాయణం చేసుకోకుండా మీకెందుకు అత్తయ్య ఆ విషయాలు” పెద్దావిడను ఉద్దేశించి అంది కోపంగా వాళ్ళ కోడలు.

“తప్పేముందండి? ఎవరికైన ఈ ప్రపంచం ఎలా ముందుకు వెళ్థుందో తెలుసుకోవాలని ఉంటుంది,దానికి వయసుతో పనేముంది” పెద్దావిడ వాళ్ళ కోడలిను ఉద్దేశించి అన్నాడు ఆదిత్య.

“నిజమే సర్ చూసి ఊరుకుంటుందా ఆ పక్కింటావిడకు, ఈ పక్కింటావిడకు చెప్పడమే గాక ఆ యూట్యూబర్స్ వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ఇది ఇలా ఎందుకు చేశావు? అది అలా చేసుంటే బాగుండేది గదా? అంటూ వాళ్ళను ఇంటి మీదకు గొడవకు తీసుకవచ్చే వరకు ఊరుకోదు.” అన్నాడు వాళ్ళ అబ్బాయి.

‘అబ్బో చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టరే’ అనుకున్నాడు ఆదిత్య.

“మొన్నీ మధ్య ఈ అమ్మాయి భూమి దుఃఖం అని ఓ వీడియో చేసింది. గుర్తచ్చిందా అండీ?” భర్త వైపు చూస్తు అంది పక్కసీటావిడ.

“అవునండి మిమ్మల్ని అభినందించడానికి మీ ఇల్లు వెతుక్కుంటు వచ్చింది కాని అడ్రస్ దొరకక పోవడంతో తిరిగచ్చింది” అన్నాడు వాళ్ళ అబ్బాయి.

“అదే వీడియోలో ఎవరో వ్యంగ్యంగా కామెంట్ పెట్టారని వాడి అడ్రస్ పట్టుకుని వాళ్ళ ఊరిదాకా పోదామని కూడా చూసింది. మేం కనుక్కున్నాం కాబట్టి సరిపోయింది. లేకుంటే ఏం చేసేదో గుర్తుకు వస్తేనే భయంవేస్తుంది.” అంది వాళ్ళ కోడలు.

“ఒరేయ్! శరత్ ఆ అమ్మాయి మంచి విషయాలు చెబితే తప్పేముంది? మనం పడుతున్న బాధలు మనకు తెలుసు. కాని ఈ భూమి పడుతున్న బాధేంటో మనం ఎలా గుర్తించాలో చెట్ల పెంపకం, రసాయనాల వాడకం వల్ల దుష్ప్రభావాలు దానిని ఎలా అధిగమించవచ్చో చెప్పింది” పెద్దావిడా మాధవిని చూస్తూ తన చేతులతో ప్రేమగా నొసలుకు వెళ్ళను నొక్కుకుంది.

“మాధవి చాలా మంచి పనిచేస్తున్నావు కంగ్రాట్స్” అన్నాడు ఆదిత్య.

“థాంక్యూ” అంది మాధవి.

“అవును అమ్మాయి నేను నీ ఛానల్ సబ్‌స్కైబ్ చేసుకున్నాను, మరి నువ్ నా ఛానల్ సబ్‌స్కైబ్ చేసుకున్నావా లేదా?” ఓ చేతిలో పల్లీల పొట్లం పట్టుకుని తింటూనే పక్కసీట్లో కూర్చున్న పెద్దావిడ ఎదురు సీట్లోకి వచ్చి సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తూ అంది.

వాళ్ళ కోడలు దిగ్గున ఉలికిపడి చూసింది వాటర్ తాగుతున్న వాళ్ళ కొడుకు శరత్‌కి గొంతులో వెలిక్కాయ అడ్డుపడ్డట్టైంది.

“అదేంటి మీరెప్పుడు యూట్యూబర్ గా మారిపోయారు?” సందేహం వ్యక్తం చేస్తూ అన్నారు వాళ్ళు.

ఆదిత్యను చూసి మాధవి కనుబొమ్మలతో సైగ చేసింది, అతను మెల్లగా తల తిప్పుకుని బయట ప్రకృతిని చూస్తూ నవ్వుకున్నాడు.

“చూశారా అన్నయ్య ఇది ఇవిడ వాలకం ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాదు. ఎవరైన మంచి సైకియాట్రిస్టు డాక్టర్ కన్నా చూపించాలి” ఆదిత్యను పిలుస్తూ అంది వాళ్ళ కోడలు.

పెద్దావిడ వైపు అనునయంగా చూశాడు ఆదిత్య.

ఆవిడా ముసి ముసి నవ్వులతో కండ్లు పెద్దవి చేసి చూసింది.

“ఈ అమ్మాయి ఓ వీడియోలో వృద్దాప్యమైన, వైకల్యమైన మన శరీరానికే గాని మనసుకు గాదు, ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఆనందంగా ఉండాలని చెప్పింది.” అంది పెద్దావిడ.

“అయితే ఏంటి?” వాళ్ళ కూతురు సమోసలతనికి డబ్బులిస్తూనే పెద్దావిడ వైపు కోపంతో బుస్సుమని లేచి అంది.

“అదేంటో ముసలి వాళ్ళన్నా, వికలాంగులన్నా అందరికి చులకనే నాతో ఎవరు ఎలాగు మాట్లాడరు అందుకే నా ఆనందాన్ని నేను వెతుక్కున్నాను తప్పేముంది బాబు?” తన బాధను వ్యక్తం చేసింది పెద్దావిడ.

“ఆ..ఆ.. నీకేం అలానే అంటావు, ఆ మధ్య వీధిన పోయే పిలగాడొకరు సరదాకి బామ్మ నువ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావాలంటే ఇలా చేయాలనగానే ఓ గోడమీద నుండి జంప్ చేస్తూ వీడియో షూట్ చేయించుకుంది అన్నయ్యా, పండ్లూడి తలకు బొప్పికట్టి మోకాళ్ళు కొట్టుకపోయి నెల రోజులు ఆసుపత్రిలో మంచాన పడ్డది, మాకర్మ కాకపోతే అవిడకేమన్నైతే ప్రాబ్లం మాకే కదా.” తల కొట్టుకుంటు మాధవి మాటలకే తను అలా మారిందేమోనని కోపంగా చూస్తూ అంది.

“అమ్మా! ఇకనైన మీరు ఈ వయసులో నీకు స్కిట్స్ ఫైట్స్ చేయడం అవసరమా? వాడు మాత్రం ఎంతని బరిస్తాడు? అసలే అంతంత మాత్రం జీతంతో నెట్టుకస్తున్నాడు” వాళ్ళ కూతురు రేగుపండ్ల ప్యాకేట్ ఇస్తూ అంది.

“నేను వాడిని భరిస్తేనే ఇంతటి వాడు అయ్యాడు ఏ నువ్ చూడలేదా? వాడి చదువు కోసం, ఆరోగ్యం కోసం నేను ఎక్కని గడపలేదు, మొక్కని దేవుడు లేడు.ఇప్పుడు జాబ్ రాగానే పెళ్ళాం బెల్లం నేను అల్లమయ్యాను” రుస రుసలాడుతు పెద్దావిడా కూతురును చూస్తూ అంది.

‘నిజమే కదా! మనుషులు తమ సంతోషాలను తాము వెతుక్కోవడంలో తప్పేముంది, ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు బతికే స్వేచ్ఛ ఉంది. తనతో వాళ్ళెవరు గడపరు, టైంపాస్ కోసం తనకు ఓ వ్యాపకం కావాలి కదా కాలంతో పాటు జనరేషన్ మారుతుంది, వయసుతో పని లేకుండా మనుషులలో కూడా కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తుతున్నాయి పైగా బాగా చదువుకున్నదానిలానే వుంది’, మనసులో అనుకున్నాడు ఆదిత్య.

“అమ్మా! నేను చేసిన వీడియో చూసి నువ్ యూట్యూబ్ స్టార్ట్ చేశానంటున్నావు నీకో విషయం చెప్పనా?” అవ్వ పక్కకెళ్ళి కూర్చుని అంది మాధవి.

“చెప్పు బిడ్డా!” అంటుంటే ఆ పెద్దావిడ కండ్లలో ఏదో తెలియని ఆనందం గమనించాడు ఆదిత్య,

“నువ్ నీ జీవిత కాలంలో అనేక మంది జీవితాలను, జ్ఞాపకాలను మూటకట్టుకున్నదానివి, ఈ ప్రపంచంలో నేటి యువత చిన్న చిన్నవాటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకు నీ అనుభవాలు కావాలి, అందులో నుండి వాళ్ళు బతకడానికి ధైర్యం వెతుక్కోవాలి, ఇప్పటి మనుషులకు పిల్లలను ఎలా సాకాలో తెలియదు వాళ్ళను ఎలా పెంచి సరిదిద్దాలో చెప్పు సరేనా” పెద్దావిడను నొప్పించకుండా ప్రేమగా అంది మాధవి.

మాధవి చెప్పే విషయాలు విన్న ఆదిత్య చేతిలోని బుక్ బ్యాగులో పెడుతు “బామ్మ ఇంకో విషయం చెప్పనా ఆ కాలంలో అవలంబించిన ఆరోగ్య పద్దతులు ఇప్పటికి సరిగా ఎవరికి తెలియదు, ఇవన్ని నువ్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, నీకు తెలిసిన వంటలు తెలియజేయవచ్చు. నీకు ఓ పని ఉంటది చూసేవాళ్ళకు ఇంట్రెస్ట్ కలుగుతది, ఇలాంటి వీడియోలే ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చేస్తున్నారు. అయినా నీ నుండి ఏమైన ఈ సమాజానికి కొత్త విషయాలు తెలియవచ్చేమో” అన్నాడు ఆదిత్య.

“నువ్వు వీళ్ళ మాటలేవి పట్టించుకొని బాదపడకు” పెద్దావిడ భుజాలచుట్టూ చేతులు వేసి అనునయంగా అంది మాధవి.

ఆదిత్య మాధవి కండ్లలోకి ప్రేమగా చుశాడు.

“నిజమే బిడ్డా! గా డాన్సులు స్కిట్లు – జంపింగులు నా నుంచి అయితలేవు, మంచి ఆలోచన చెప్పినవ్, ఇక నుండి నువు చెప్పినట్లే అలాంటి వీడియోలే చేస్తాను” అంటూ బ్యాగులోని కవర్ తీసి అందులో వున్న స్వీట్ నోట్లో పెట్టింది పెద్దావిడా.

ఆదిత్య చప్పట్లు కొడుతుంటే అక్కడ ఆమె మాటలు విన్నవాళ్ళంతా సంతోషంగా అభినందించారు.

వాళ్ళ కొడుకు, కోడలు ఇంకా కోపంగా చుశారు.

“చూడండి ఈ పిల్లలు చెప్పినట్టు ఇప్పటి నుండి నేను సమాజానికి మంచి చేయడానికే వీడియోలు చేస్తాను, మీరు చూడుండ్లి చూడకపోండ్లి నాకు ఫ్యాన్స్  వున్నారు, నేనింతే నేను మారను” తెగేసి ఖరాకండిగా చిటికెలు వేస్తూ కొడుకు కోడలుతో అంది పెద్దావిడ.

“శబాష్! నువ్ మారద్దు పెద్దమ్మా నువ్వు నీ లాగనే వుండు, నువ్వే కాదు ఎదుటి వ్యక్తులను  కించపరచకుండా బతికినంత వరకు తమ ఆలోచనలను ఎవరు మార్చుకోవలసిన అవసరం లేదు” అన్నాడు ఆదిత్య.

“ఇంతకు మీరిద్దరు భార్యభర్తలేనా” అని ప్రశ్నార్ధకంగా చూస్తూ పెద్దావిడా అంది.

“ఊహూ..” పెద్దావిడకచ్చిన అనుమానం నివృత్తి చేస్తూ ఇద్దరు ముక్తసరిగా అన్నారు.

“మరి?” కాస్త తన తల మాధవి చెవి దగ్గరకు ఆనించి అంది.

“నిన్నటి వరకు క్లాస్‌మేట్స్‌మే. రేపటికి ఆ దేవుడు ఏం నిర్ణయించితే అదే మేము గురుడు కోసం నేనస్తే నాకు మ్యారేజ్ అయిందని భ్రమ పడుతున్నాడు” నవ్వుతు పెద్దమ్మ చెవిలో అంది మాధవి.

“మరి చెప్పకపోయావా?”

“బామ్మ నా యువరాజు కాస్త మోహమాటస్తుడు అందుకే నాలుగేండ్ల నుండి నన్ను ప్రేమిస్తూ నాకు చెప్పాడా? వన్ సైడ్ లవ్, నేనే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఇదిగో ఇలా వచ్చాను” వాట్సాప్‌లో అతని ఫ్రెండ్స్ చేసిన మెసేజ్ లు చూపిస్తూ మొఖంలో సిగ్గును పులుముకుంటూ అంది.

“త్వరగా చెప్పేయ్ లేకుంటే మల్లేవరైన కాంపిటీషన్‌కు వస్తారు జాగ్రత్తా?” పెద్దావిడా చెవి మెలిపెట్టి మరీ అంది.

“హమ్మో! బామ్మా ఇంకా ఊరుకుంటానా త్వరలో నీకు మిఠాయి తినిపిస్తాలే” చెవిలో అంది.

“అమ్మా స్టేషన్ వచ్చింది దిగుదాం పదా” అన్నాడు వాళ్ళబ్బాయి శరత్.

“అమ్మా నేనింతే! వాళ్ళంతే ఇవేం పట్టించుకోకండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి సలహాలు ఇస్తుండండి ఆ…అన్నట్టు ఓ లైక్, ఓ కామెంట్, షేర్ చేయడం మరిచిపోకండి. తెలిసినవాళ్ళకు సబ్‌స్క్రైబ్ చేయమనండి ఉంటాను.” అంటూ పెద్దావిడా నవ్వుతు దిగింది.

ఈ వయసులో కూడా ఆ పెద్దావిడా ఈ సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడుతు తన ఆనందాన్ని తాను వెతుక్కుంటుంది. మాధవి తనకు తోచింది చేస్తుంది మరి నేను కూడా ఈ బోధనా వృత్తే కాకుండా ఇంకా ఏమేం చేయాలో మనసులో అనుకుంటూనే రేపటి కోసం ప్రణాళిక అల్లుకుంటూ నిల్చున్నాడు ఆదిత్య.

“ఒక్క నిమిషం ఇటు చూడు” అంటూ ఇద్దరిని కలిపి ఓ సెల్ఫీ తీసి మళ్ళీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో పెట్టింది.

అంతే అందరు బెస్టాఫ్ లక్ చెబుతుంటే తనలో తాను మురిసిపోతు ఆదిత్య కండ్లలోకి తన్మయత్వంగా చూస్తుంది.

మాధవి ట్రయిన్ ఎక్కక ముందే ఆదిత్యకు అతని ఫ్రెండ్ బాబి – ఆమె వస్తున్నట్టు చెప్పాడు. అయినా ఏమి తెలియని వాడిలా మౌనంగా వున్నాడు.

ఆమె అంతరార్థం గమనిస్తునే మనసులో ఆనందపడుతు సరదాగా “మరి నువ్వు?”  బ్యాగు తీసుకుంటూ సందేహం నటిస్తూ అన్నాడు ఆదిత్య.

“అయ్యో! మహానుభావా మీ వెంటే నేను. అర్థం చేసుకోరూ” తేరుకుని బుంగమూతి పెడుతు మనసులో భావాన్ని ఒకే వాక్యంలో చెబుతూ గబ గబ అతని అడుగులో అడుగేస్తూ ముందుకు నడిచింది మాధవి.

Exit mobile version