Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేల వాలిన నక్షత్రాలు

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘నేల వాలిన నక్షత్రాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము]

కొన్నిసార్లు నీలి ఆకాశం
చారెడు నక్షత్రాలని భూమ్మీదికి
జారవిడుస్తుంది

చుక్కలు రాలిపడేది నగరంపైనా పల్లెమీదా
ఆకాశానికి పెద్దగా పట్టింపు లేదు

కృత్రిమ కాంతుల వెలుగుల్లో
మిరుమిట్లు గొలుపుతూ మురుస్తూ
మెరుస్తున్న నగరంలో చుక్కల్ని
స్వాగతించిన వాళ్ళు లేరు
సంబరపడ్డ వాళ్ళూ లేరు

నిద్రకుపక్రమిస్తున్న పల్లెలో
ఆరుబయట నులక మంచం మీద
నడుం వాల్చిన రైతూ
సావిట్లో కూర్చుని
కష్టసుఖాల్ని పంచుకుంటున్న స్త్రీలూ
వాకిట్లోనూ పెరట్లోనూ గెంతు లేస్తున్న పిల్లలూ

భూమ్మీద రాల్తూ మిణుగురుల్లా మెరుస్తున్న
చుక్కల్ని చూసి
చుట్టాలొచ్చినట్టు సంబరపడ్డారు
ముఖాల్ని చాటంత చేసుకుని
చేతులు జాపి ఆహ్వానించారు
అలాయ్ బలాయ్ తీసుకుని
తమలో కలుపుకున్నారు

రాత్రి గడిచిపోయినంక సూర్యోదయం వేళకి
నేలవాలిన చుక్కలు సొంతగూటికి
పక్షుల్లా ఎగిరిపోయాయి

భూమి ప్రేక్షక పాత్రలోకి ఒరిగిపోయింది
ఆకాశమేమో
నిర్వికార నిర్వికల్పంగా
నీలం రంగులో
చాపలా పరుచుకునే వుంది

Exit mobile version