‘విజ్ఞానాన్ని, యుక్తిని మేళవించి రచించిన బాలసాహిత్యకర్త – ఆర్.సి.కృష్ణస్వామి రాజు’ – డా॥ నెమిలేటి కిట్టన్న
విజ్ఞానాన్ని, యుక్తిని మేళవించి బాలసాహిత్యాన్ని సృష్టించిన మేటిరచయిత ఆర్.సి.కృష్ణస్వామి రాజు అని విశ్రాంత తెలుగు పండితులు డా॥ నెమిలేటి కిట్టన్న (తిరుపతి) అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా 27/7/2025 బ్రౌన్శాస్త్రి సమావేశ మందిరంలో 145వ సదస్సు నిర్వహింపబడిరది.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ ఆర్.సి.కృష్ణస్వామి రాజు రచనలు చిత్తూరు జిల్లా మాండలికంలో, జనం మాట్లాడుకొనే భాషలో ఉంటాయని, అదేవిధంగా అక్కడి ప్రాంతాలే ఆయన కథాకేంద్రాలుగా ఉంటాయన్నారు.
ఆ తర్వాత ‘ఆర్.సి.కృష్ణస్వామి రాజు బాలసాహిత్యం’ అనే అంశంపై విశ్రాంత తెలుగు పండితులు డా॥ నెమిలేటి కిట్టన్న ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ కథాసాహిత్యానికి వన్నె తెచ్చిన కథకుల్లో ఆర్.సి. కృష్ణస్వామి రాజు ఒకరని, బాలసాహిత్యకర్తగా కూడా ఆయన గురుతరమైన బాధ్యతను నిర్వర్విస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఆయనవి చిన్నాపెద్దా కథలు 650 దాకా వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయని, వీటిలో 150 పిల్లల కథలు ఉండడం విశేషమన్నారు. ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు తిరుపతి జిల్లా పుత్తూరు శల్య వైద్య కుటుంబానికి చెందినవారన్నారు. ఆయన మొదట కార్వేటి నగరం డైట్లో అధ్యాపక ట్రైనింగ్ పూర్తిచేశారని, ఆ తర్వాత తిరుపతి ఎల్.ఐ.సి కార్యాలయంలో 35 ఏళ్ళ పాటు డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి పదవీ విరమణ చేశారన్నారు. ఆయన ఇప్పటి దాకా భిన్న వర్గాలకు చెందిన 18 కథా సంపుటాలను, 2 నవలలను వెలువరించారన్నారు. బాల సాహిత్య సృష్టిలో భాగంగా ఆయన‘ రాజు గారి కథలు, రాణి గారి కథలు, కార్వేటినగరం కథలు, నాన్నారం కథలు’ అనే కథాసంపుటాలను, ‘మేకల బండ, మునికిష్టడి మాణిక్యం’ అనే నవలలను రాశారన్నారు. ఈ రచనల్లో ఆయన వాడిన తెలుగు జాతీయాలను, సామెతలను, నుడికారాలను ఉదాహరణలతో వివరించారు. మానవీయ సంబంధాలు, విలువలు కృష్ణస్వామి రాజు బాలసాహిత్యంలో ఎలా చిత్రింపబడిరది విశ్లేషణాత్మకంగా తెలియజేశారు. కార్యక్రమాన్ని డా॥ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, డా॥ చింతకుంట శివారెడ్డి సమన్వయం చేశారు.
కార్యక్రమం అనంతరం వక్త డా॥ నెమిలేటి కిట్టన్నను సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, యోగి వేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా॥ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, డా॥ చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్రావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది, పాఠకులు కలసి శాలువతో సత్కరించారు.
కార్యక్రమంలో అహ్మద్ బాషా, పళ్ళె విజయ్, కుమార్, కొత్తపల్లె రామాంజనేయులు, శ్యామసుందర్ రెడ్డి, రమణమూర్తి, వెంకట రమణ, విజయ కుమార్, సుబ్బరాయుడు, బాలరాజేశ్వర రెడ్డి, నల్లపరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
డా. పి. సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాల విభాగం
యోగి వేమన విశ్వవిద్యాలయం