ఆకాశం మేఘావృతమైంది అంతులేని దిగులుతో ఆదిత్యునికి
తన మొగము చూపలేక దిగులెందుకు చెప్పు ఓ మేఘమాల!
సూర్య కిరణాలూ సోకనిదే… కమలం విరియదు
లోకం మసక వెలుతురులో బద్ధకంగా కదులుతుంది!
ఉరకలువేసే ఉత్సాహం చల్లారిపోతుంది ప్రకృతి మౌనం వహిస్తుంది
మేఘమా నీకు వాయువు తోడై ప్రచండమైన గాలి విజృంభిస్తుంది.
సకల జీవులను భయానికి లోనుచేస్తుంది పట్ట పగ్గాలు
లేకుండా చెట్లను ఇళ్లను కూల్చి జీవరాశులను నిరాశ్రయులను చేస్తుంది .
నీ దిగులంతా వానగా కురిపించి యెదలో భారాన్ని దింపుకొని
స్వచ్ఛమైన తెల్లని దూది పింజలుగా మారి తేలిపోయావు.
మేఘాలు తొలగి దినకరుడు వెలుగుతూ నీకు వీడుకోలు చెప్పగా
రాజీ పడి బిడియంతో దూర దేశాలకు తరలిపోయావు.
పంచభూతాలు వాటి కర్తవ్యాన్ని నెరవేర్చిన్నప్పుడే మనుగడ సాధ్యం
దిగులును దిగమింగినపుడే ధైర్యం ఊపిరి పోసుకుంటుంది.
ప్రకృతి నెరవేర్చు ధర్మాలు మానవ కోటి మనుగడకు సోపానాలు
మానవులు వాటిని కాపాడుకున్నప్పుడే జగతిపై నిల్చు శాశ్వత అందాలు.
సహజసిద్ధమైన వనరులతో అలరారు ప్రపంచం మనకు అద్భుత వరం
మానవుడు సక్రమంగా వినియోగించుకుంటే మరో సృష్టికి అంకురార్పణం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.