(జూన్ 18 2023 ఫాదర్స్ డే సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు శ్రీ విడదల సాంబశివరావు)
ఆ వేకువ చీకటిలో
నక్షత్రాల వెలుగులో
నాగలిని ఆయుధంగా మలచుకొని
కాడెద్దుల సైన్యంతో
దుక్కి దున్ని అలసిసొలసి
పొలం గట్టుపై సేద దీరిన నీ ముఖబింబం..
ఇప్పటికీ నా మదిలో కదలాడుతూనే వుంది!
ప్రచండ భానుడి కిరణాలు ప్రజ్వరిల్లి
నీ తనువును గాయం చేయగా
చిప్పిల్లిన స్వేదం ధారలను..
చిరునవ్వుతో తుడుచుకుంటూ
అమ్మ తెచ్చిన జొన్న సంకటిని
పండు మిరప పచ్చడితో కలుపుకొని
జమ్మిచెట్టు నీడలో హాయిగా తిని
పుల్ల మజ్జిగతో కడుపు నింపుకునొ
ఒకింత విశ్రమించక తిరిగి పరిశ్రమించిన
ఆ రోజులు..
నా బాల్యం మది గదిలో
జ్ఞాపకాల చిత్తరువులై
నిరంతరమూ నా కళ్ళల్లో
కాపురం చేస్తూనే వున్నాయి!
భగభగమండుతోన్న కడుపుతో
లోపలకు కుంచించుకుపోయిన డొక్కలతో
కన్నీరు ఇంకిపోయిన గాజుకళ్ళతో
భరోసా లేని భవిష్యత్తుతో
నా భావి జీవితం అస్తవ్యస్తం కాగూడదని..
అక్షరాన్ని నాకు ఆయుధంగా ఇచ్చావు!
ఆధునిక నాగరిక సామ్రాజ్యంలో
విలాసవంతమైన మనుగడను ప్రసాదించావు!
ప్రేమను పంచి ఇచ్చే ఇల్లాలు..
క్రమశిక్షణతో పెరిగిన సంతానం..
ఎండపొడ తెలియకుండా
మంచు భవనాలలో నివాసం..
జీవితం ఆనంద నందనమే అయినా
నువ్వు మాత్రం లేవుగా నాన్నా!
నీ అనుగ్రహ ప్రసాదితమైఅ
‘భిక్ష’యే కదా నా ఈ జీవితం!
తృప్తి.. సంతృప్తి.. లేని జా జీవనం
ఎడారిలో ప్రయాణమే!
మరు జన్మలోనైనా..
నా కోసం పుట్టి
నాతో కలిసి బ్రతుకుతావు కదూ!?
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.