ఈ నిశబ్ద వేళలో
ఈ గాలి నీ వర్ణ చిత్రాలను
ఆకాశంపై గీస్తున్నది
ఆ సంధ్య కొంగల అందెలు తొడిగినది
అడివిలో సెలయేరు
సాయంత్రపు పాటలను పాడుతూ
పరుగులు తీస్తున్నది
నీడలు చెట్లల్లో
తల్లుల చెంత పిల్లల్లా
ముడుక్కుంటున్నవి
నీ పెదాలతో నా నోరు తీపి చేసే ఈ వేళ
సూర్యుడు పశ్చిమ కొండల్లో
తేనె పువ్వులా పూస్తున్నాడు
ఇలా చెంత నిలిచి
నా గుండెల లోపల సంచరించే చీకట్లలో
దీపం వెలిగించవా
అప్పుడు ఈ ప్రాణం నువ్వు కట్టిన శాశ్వత స్వర్గం.
గూండ్ల వేంకట నారాయణ గారిది గుంటూరు జిల్లా, గరికపాడు గ్రామం. వ్యవసాయ కుటుంబం.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
2021 లో వీరి మొదటి పుస్తకం, ‘భూమి పతనం’ అనే నవల ప్రచురితం అయింది. త్వరలో కవిత్వం రాబోతుంది.