నా కనులతో పని ఏముంది?
నేనే నీ కనుపాప అయినప్పుడు
నా స్వరం తో పని ఏముంది?
నా పదమే నీ గళం అయినప్పుడు
నా హృదయం తో పని ఏముంది?
నీ శ్వాసే నాది అయినప్పుడు…
నీ హృదయ వీణ పై
నేనో మోహన రాగమై పలకనీ
నీ సుమధుర గళంలో
నేనో సుందర శబ్దాన్ని అవనీ
నీ మాటల మాధుర్యం లో
నేను మకరందం నింపనీ
నీ హృదయపు కోవెలలో
నేనో అఖండ జ్యోతి గా వెలగనీ
నీ మౌన రాగ పద సవ్వడి లో
నేనో శృతి లయనవనీ
నీపై ఏలనో ఈ మమకారం
నీపై ఈ అనురాగ ఝరి కి ఎప్పుడు… ఎలా
జరిగిందో శ్రీకారం??
లక్ష్మి పద్మజ దుగ్గరాజు గారి పుట్టినింటా… మెట్టినింటా సాహిత్య వాతావరణం పుష్కలంగా ఉండటం చేతా, బాల్యంలో నాగార్జున సాగర్ వాతావరణం పుస్తక పఠనం పట్ల మెండుగా ఆసక్తి కలిగించడం వల్ల… పుస్తక పఠనంతో పాటు వారికి రచనా వ్యాసంగం కూడా అబ్బింది. పుస్తకాలు చదవటమే కాకుండా… వాటిని సమీక్షిస్తుంటారు. వీరికి కవిత్వం రాయడం మొదటి నుండీ ఇష్టం. “ప్రేమతత్వం నా ప్రధాన లక్షణం కాబట్టి, అదే నా కవిత్వ తత్త్వంగా రూపు దిద్దుకుంది” అంటారు.