Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీలిగుచ్ఛం

ఆక్టేవియా పాజ్ (మెక్సికో) రచించిన ‘ది బ్లూ బొకే’ కథను తెలుగులో ‘నీలిగుచ్ఛం’ పేరుతో అందిస్తున్నారు శ్రీ ఎ.యం.అయోధ్యారెడ్డి.

వరో తట్టిలేపినట్టు ఉలికిపడి మేలుకున్నా. ఏదో కల… పీడ కల. వొంటిమీద చెమటలు కారిపోతున్నయి. ఆ ఇరుగ్గదిలో భరించలేనంత ఉక్క. వేడిసెగలు కక్కుతూ సోమరిగా కదిలే గాలి. మట్టితో కట్టిన గది గోడలు. కింద చురుక్కుమనే బండలు. మురికిపట్టిన జీరోవాల్ట్ బల్బు దీర్ఘరోగిలా బిక్కుబిక్కుమని వెలుగుతున్నది. రంగేదో పోల్చుకోలేని ఏదో పురుగు రెక్కల్ని ఆడిస్తూ గుడ్డి వెలుగు పట్ల సమ్మోహితమైనట్టు పచ్చలైటు చుట్టూ చక్కర్లు కొడుతున్నది.

ఒక్క ఉదుటున మంచం దిగాను. చతురస్రాకారంలో నాలుగు గోడలు అడ్డుతప్ప నివాసయోగ్యమైన ఆనవాలు ఒక్కటికూడా లేని ఆ గదిలో కొన్ని సంకోచాల వల్ల నేను ఉత్తకాళ్లతో నేలమీద నడిచేందుకు భయపడ్డాను. బయట పెరడుకూ, గదిలోపలి ప్రదేశానికీ పెద్ద తేడాలేదు. పాతగోడలకున్న పగుళ్ళ నుంచో, నేల మూలల్లోని కలుగుల నుంచో వాహ్యాళికొచ్చి తిరిగే తేలుమీదో, బొద్దింక మీదో అడుగు వెయ్యకుండా జాగ్రత్తగా ఆచితూచి నడిచాను.

గదికున్నది ఒకే కిటికీ. తలొంచి కూడా చూడలేనంత చిన్నదైన కిటికీలోంచి కొద్దిక్షణాలు బయటి స్వచ్చమైన గాలిని పీల్చుకున్నాను. అవతల చీకటిగానూ నిశ్శబ్దంగానూ ఉన్నది. ఆ నిశీధి భారంగా ఊపిరి తీస్తున్నట్టు అనిపించింది. ప్రకృతిమాత మౌనం దాల్చిన స్త్రీమూర్తిలా నుంచుని వెలుతురు కోసం ఎదురుచూస్తున్నది.

గది మధ్యకొచ్చి నిలబడ్డాను. మొహం మీద కొంచెం నీళ్ళు చల్లుకున్నా. జగ్గుతో మరిన్ని నీళ్ళు తీసుకొని తడిపిన టవల్తో వొళ్ళు తుడుచుకున్నా. తడి ఆరిపోయేదాక కొద్దిసేపు అట్లా నిలబడ్డాను. కొయ్యకున్న పాంటు షర్టు తీసి పలుమార్లు గట్టిగా దులిపాను. మడతల్లో ఏ విషకీటకమో దాగివుండి నా చర్మాన్ని పట్టుకొని పీకకుండా జాగ్రత్తపడ్డాను. తర్వాత మెట్లుదిగి కిందికి పోయాను.

పురాతనమైన లాడ్జి అది. వాస్తవానికి అదో పెంకుటిల్లు. కట్టి ఎంతకాలమైందో తెలియదు. అసలు దాన్ని అవసరాల కోసం నిర్మించారో లేక పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిందా అన్నది ఒక పట్టాన తేలే విషయం కాదు. కానీ ఒకందుకు నిర్మించిన ఆ కొంపను మరొకందుకు ఉపయోగిస్తున్నారు.

లాడ్జిలో మనుషులు ఉండేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేవు. అసలు ఉనికి పోగొట్టుకోలేకా, పట్టణానికి ఎదగలేకా సంధి దశలో కొట్టుమిట్టాడుతున్న ఊరది. నేను కొత్తగా వచ్చాను. అంచేత ఊరు తన కడుపులో ఏ చరిత్రను దాచుకొనివుందో తెలియదు. ఉద్యోగరీత్యా వారం రోజుల కోసం వొచ్చినవాణ్ని గనుక నాకవన్నీ అవసరం లేదు.

మెయిన్ డోరు పక్కనే పొడవాటి బెంచీ మీద కూర్చొని వున్నాడు లాడ్జి ఓనర్ కమ్ మేనేజర్. నేను దూకుడుగా మెట్లు దిగి అతని ముందు నుంచి వెళ్లబోయాను. అతనికి రెండు కళ్ళూ మెల్ల కళ్లే. ఎప్పుడు ఎటు చూస్తాడో తెలియదు. చూపులు అతని బాడీ లాంగ్వేజికి అనుగుణంగా ఎప్పుడూ వుండవు. కళ్లు సగం తెరిచి “ఎక్కడికి బయలుదేరావు” అని ప్రశ్నించాడు. అతడి వొళ్ళు నలుపు. మొహం మోటు. గొంతు కరుకు.

“అట్లా బయట గాలికి తిరిగేందుకు పోతున్నా. లోపల ఉబ్బరంగా ఉన్నది. నిద్రపట్టడం లేదు”

“ఊ..” అంటూ అతడు తల అడ్డంగా ఊపాడు.

“ఇది బయట తిరిగే సమయం కాదు. అన్నీ మూసేశారు. అర్ధరాత్రి అవుతోంది. వీధిదీపాలు కూడా లేవు. ఊరికి కొత్తవాడివి భయం లేకుండా రాత్రివేళ తిరగటమేమిటి..?”

నేను జవాబు చెప్పకుండా ఓసారి భుజాలేగురేసి ఊరుకున్నాను.

“బయటికొద్దు. రూముకు పోయి బుద్ధిగా పడుకో”

అతని మాటలు పట్టించుకోలేదు.“తొందరగా వచ్చేస్తా” అనేసి వీధిమెట్లు దిగి చీకటిలో కలిసిపోయాను.

చీకటివల్ల కొద్దిసేపు పరిసరాలు సరిగా కనిపించలేదు. ముందుకు నడుస్తూ తడబడ్డాను. ఒకచోట ఆగి సిగరెట్ వెలిగించుకుని తిరిగి నడక సాగించాను. అప్పుడే నల్లమబ్బుల వెనుక దాక్కున్న చంద్రుడు హఠాత్తుగా బయటి కొచ్చాడు. అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి,

బీటలువారిన వీధిలోని పురాతన గోడలు వెన్నెలకాంతి పరుచుకొని కొంత స్పష్టత పొందినయి. అప్పటిదాకా చీకట్లో వున్న కళ్లకి వెన్నెలొచ్చి వెలుగులు నింపింది. ఆ వాతావరణం, నిశ్శబ్దమైన రాత్రి, తెలియని పరిసరాల్లో ఒంటరిగా నడవడం కొంత జంకుగానే ఉన్నది.

పెద్దగా గాలి వీచడం మొదలైంది. అక్కడక్కడ రాకాసి బల్లుల్లా నిలబడివున్న చింతచెట్లు కొమ్మలను కదుపుతూ చప్పుడు చేస్తున్నాయి. కొత్తజీవాన్ని నింపుతున్న గాలిని గుండెల నిండా పీల్చుకున్నాను. గాలి కెరటాలుగా వీస్తూ.. చెట్ల కొమ్మలు నృత్యాలు చేస్తూ.. ఆకులు తలలూపుతూ.. క్రిమి కీటకాల వివిధ వింత శబ్దాలతో ఆ రాత్రి లయబద్ధమైన సంగీతాన్ని ఆలపిస్తున్నది.

తలెత్తి ఆకాశం వంక చూశాను. మబ్బుల దుప్పట్లు తొలగించుకున్న చుక్కలు తమతమ స్థానాల్లో కొలువుదీరి కూర్చున్నాయి. విశ్వాంతరాలం ఊహకందని విలక్షణ సంకేతాలతో కూడిన అనంతమైన వ్యవస్థ. ప్రాణికోటి నడుమ సాగిపోయే నిరంతర సంభాషణ. చర్యలు, ప్రతిచర్యలు, ప్రకృతి పరవశం, నక్షత్రాల మిణుకు మిణుకులు, జీవాల లయబద్ధ ధ్వనులు అన్నీ ఆ సంభాషణ నుండి జారిపడి చెల్లాచెదురైన నిశ్శబ్దాలు, పదబంధాలేనని భావించాను. అందులో నేను కేవలం ఒక అక్షరం మాత్రమే అనిపించింది.

అయితే పూర్తి పదబంధం ఏమై వుంటది..? ఆ పదాన్ని ఎవరు పలుకుతారు..? ఎవరితో పలుకుతారు..?

తలాతోకా లేని ఆలోచనలను చెదరగొడుతూ చివరిదాకా కాలిన సిగరెట్ తీసి పక్కకు విసిరికొట్టాను. మెరుస్తూ వెళ్ళి నేలనుతాకి వెలుగు ముద్దల్ని వెదజల్లి ఆరిపోయింది. చాలాసేపు అట్లాగే మెల్లగా నడుస్తూ ఒక గమ్యం లేకుండా ముందుకు సాగాను. నాలో జంకు పోయింది. మనసేకాదు, నా పెదాలు కూడా సంతోషంగా నాతో సంభాషిస్తుంటే ఏదో చెప్పలేని స్వేచ్చ.. భద్రత ఫీలయ్యాను.

ఆకాశం నక్షత్రాల కళ్ళను అలంకరించుకున్న ఉద్యానవనం మాదిరి ఉన్నది. ఒక వీధి మలుపు తిరుగుతుండగా నా వెనుకాల ఓ ఇంటి తలుపు తెరుచుకొని మళ్ళా మూసిన చప్పుడైంది. చప్పున వెనుదిరిగి చూశాను. ఏమీ లేదు. అంతా మామూలుగా వున్నది. కొద్ది నిముషాల తర్వాత నా వెనుక ఎవరో నడిచివస్తున్న బూట్ల చప్పుడు. వెనుదిరిగి చూడదల్చుకోలేదు. అడుగుల చప్పుడు నాకు మరింత దగ్గరైంది.

ఇంత రాత్రి ఎవరు..? మసక వెన్నెల్లో ఏదో నీడ అస్పష్టంగా కన్పిస్తోంది. తల తిప్పి చూడాలనిపించింది. కానీ భయమేసి మెడ తిప్పడానికి జంకాను. పరుగెత్తి అక్కడి నుంచి పారిపోవాలనుకున్నా. కానీ కాళ్ళు భూమిలో పాతుకున్నట్టు ఒక్కడుగు వెయ్యలేక పోయాను.

హఠాత్తుగా వెనుక వస్తున్న ఆకారం దాడి చేస్తున్నట్టు అనిపించి ఆగాను. నేను తప్పించుకునే ప్రయత్నం చేసేలోగానే నావీపులో కత్తి మొన గుచ్చుకున్నది. ఆ వెంటనే కత్తికన్నా పదునైన బొంగురు స్వరం గద్దించింది: “కదలొద్దు మిస్టర్..! లేదంటే కత్తి నీ వీపులోంచి దూరి పొట్ట నుంచి బయటికొస్తుంది”

భయంతో వొణికాను. అంగుళం కూడా కదలకుండా వుండి బలహీనమైన గొంతుకతో “ఎవరు నువ్వు..? నీకేం కావాలి..?” అడిగాను.

“నేనెవరో నీకు అనవసరం. పిచ్చివేషాలు వెయ్యకుండా చెప్పినట్టు చేయి”

“ఇంతకూ నీకేం కావాలి..?”

“నాకు నీ రెండు కళ్ళు కావాలి”

“నా కళ్ళు కావాలా..? ఏం చేసుకుంటావు కళ్ళతో..?”

“ఆ సంగతి నీకెందుకు..? నాకు నీ కళ్ళు కావాలి. నీ రెండు కనుగుడ్లు కత్తితో పెరికి పట్టుకొనిపోతా” కోపంగా అన్నాడు ఆగంతకుడు. కానీ కోపం వెనుక అతని స్వరంలో నాకేదో కొంత దిగులు ధ్వనించింది.

“కళ్లు పీకుతావా.. ఏం మాట్లాడుతున్నావు? చూడు.. నా జేబులో కొంత డబ్బున్నది. మరీ పెద్ద మొత్తం కాదు. కానీ ఫరవాలేదు ఎక్కువే వున్నది. అదంతా ఇచ్చేస్తాను. తీసుకపో. దయచేసి నన్ను చంపొద్దు” ప్రాధేయపడ్డాను.

“భయపడకు మిస్టర్! నేను నిన్ను చంపను. కేవలం నాకు నీ కనుగుడ్లు కావాలి. వాటిని తీసుకపోతాను”

“అసలు నీకు నా కళ్ళు ఎందుకు? ఏం చేసుకుంటావు వాటితో?” అడిగాను.

“నా ప్రియురాలు కోరింది. నేనెంతో ప్రేమించే ఆమెకు కానుకగా ఇవ్వాలి” అతడు చెప్పాడు.

“నీ ప్రియురాలి కోరికనా? ఇదేమి కోరిక..? ఎవరైనా కోరుతారా అట్లా..?

“ఆమె తనకు నీలి కళ్ళు అమర్చిన బొకే కావాలన్నది. ఆమె ఏది కోరినా నేను కాదనలేను. అందుకే నీలి కళ్లకోసం వెతుకుతున్నా. చుట్టుపక్కల ఎన్నోచోట్ల తిరిగాను. నీలి కళ్ళు దొరకడం కష్టంగా వుంది”

“అయితే నా కళ్ళు నీకేవిధంగానూ ఉపయోగపడవు. ఎందుకంటే నా కళ్ళు నీలం కాదు. గోధుమ వర్ణంలో వుంటాయి” గబగబా చెప్పేశాను.

“నేనేం మూర్ఖున్ని కాదు మిస్టర్.. నువు చెప్పింది నమ్మడానికి. నన్ను మాయచేద్దామని అనుకోకు. నీవి నీలి కళ్ళేనని నాకు తెలుసు”

“ప్లీజ్! నీకింకా ఏమైనా కావాలంటే అడుగు. అంతేగాని సాటిమనిషి కళ్ళు పీకి గుడ్డివాణ్ని చేయడం దారుణం. అది మానవత్వం కాదు.”

“అనవసర నీతి బోధలు చేయకు. నాకు నీ కళ్ళు కావాలంతే” ఆగంతకుడు కఠినంగా అన్నాడు.

నేను మొండి ధైర్యంతో అతనివైపు తిరిగాను. అతడు పొట్టిగా వున్నాడు. పెద్ద బలంగానూ లేడు. నేను ప్రతిఘటించి తోసేస్తే పడిపోయేలా వున్నాడు. కానీ అతని చేతిలో వున్న పొడవాటి కత్తి నన్ను గుచ్చుకుంటోంది. అతడు తలమీద టోపీ కిందకు లాగి పెట్టుకున్నాడు. అందుకని ముఖం సరిగా కనిపించలేదు. కత్తి మాత్రం వెన్నెల్లో బాగా కనిపిస్తున్నది.

“నేను నీ కళ్ళను ఒకసారి చూడాలి” అతడు గద్దించినట్టు అన్నాడు.

అగ్గిపుల్ల వెలిగించి నా ముఖానికి దగ్గరగా పట్టుకున్నాను. వెలుగు అంత దగ్గరగా ప్రసరించడంతో నా కళ్ళు చూడలేక సగం మూసుకున్నయి. అతడో చేత్తో నా కనురెప్పలని విశాలం చేసి పరీక్షగా చూశాడు. బాగా పొట్టి గనుక సరిగా చూడలేక మునిగాళ్ల మీద నిలబడుతూ ఇంకొంచెం తీక్షణంగా చూశాడు. అగ్గిపుల్ల చివరి వరకూ కాలి నావేళ్లను చుర్రుమనిపించింది. అగ్గిపుల్ల పడేశాను. రెండు క్షణాల తర్వాత అన్నాను: “ఇప్పటికైనా నమ్ముతావా నావి నీలి కళ్ళు కావని..?”

“తెలివిగా తప్పించుకుందామనుకోకు. కత్తి పొట్టలో దింపేస్తాను జాగ్రత్త” కర్కశంగా అరిచాడు

“మరోసారి చూద్దాం. ఇంకో అగ్గిపుల్ల గియ్యి ”

తప్పలేదు. మరో అగ్గిపుల్ల గీసి నా కళ్ళకు దగ్గరగా ఉంచాను. అతడీసారి నా భుజం పట్టుకొని గట్టిగా నొక్కుతూ “ఇంకా బాగా కిందికి వొంగి నిలబడు” అని ఆజ్ఞాపించాడు. నేను వంగాను. అతడు చేత్తో నా జుట్టు గట్టిగా పట్టుకొని మెడ విరిగేటట్లు తల వెనక్కి వంచాడు. నా మొహంలోకి తీక్షణంగా చూశాడు. కత్తి కొస మెల్లగా పైకి జరుపుతూ నా కంటి రెప్పల దాకా తెచ్చాడు. భయంతో కంపించిపోతూ కళ్ళు గట్టిగా మూసుకున్నాను. “రేయ్.. కళ్ళు మూస్తావేం.. తెరవరా..” అతడు అరిచాడు. బలవంతంగా కంటి రెప్పల్ని పైకెత్తాను. నిప్పుసెగ కనుబొమ్మల్ని కాల్చింది. ఓర్చుకుంటూ అలాగే ఉన్నాను. హఠాత్తుగా ఆగంతకుడు నన్నొదిలేశాడు.

“నిజమే..! నీవి నీలి కళ్ళు కాదు. పో.. వెళ్లిపో..” అంటూ గాలిలో అదృశ్యమైనట్టు ఒక్క క్షణంలో కనిపించకుండా పోయాడు. విపరీతమైన ఆశ్చర్యం, దాని వెంబడే ఒళ్లు గగుర్పొడిచే భయంతో బిక్కచచ్చి పోయాను. అచేతనుడినై అక్కడే గోడకు ఆనుకొని కొద్దిసేపు మోకాళ్ళ మీద కూర్చుండిపోయాను. చేతుల్లో తల పట్టుకొని నిశబ్ద చీకటిలో మరింత నిశ్శబ్దంగా వుండిపోయాను. లేచి నిలబడాలనుకుని లేవలేక తడబడ్డాను. మళ్ళా మళ్ళా ప్రయత్నించి చివరికి లేచాను. భయం సునామీలా కమ్మేసింది. అంతరాత్రి నిర్మానుష్యమైన ఆ ఊరి వీధుల్లో దిక్కుతోచకుండా చాలాసేపు పరిగెత్తాను. చివరికి ఎప్పటికో లాడ్జికి చేరుకున్నా. లాడ్జి ఓనర్ ఇంకా తలుపు దగ్గర బెంచి మీద కూర్చొని వున్నాడు. అతని వంక చూడకుండానే విసురుగా లోపలికి నడిచాను. మర్నాడు పొద్దున్నే ఆ ఊరొదిలి వెళ్లిపోయాను.

మూలరచన: ఆక్టేవియా పాజ్ (మెక్సికో)

అనుసృజన: ఎ.యం.అయోధ్యారెడ్డి


ఆక్టేవియా పాజ్ పరిచయం

ప్రసిద్ధ లాటిన్ అమెరిన్ రచయిత, ఇరవయో శతాబ్ది మెక్సికో సాహిత్య సాంస్కృతిక మేధావిగా కీర్తించబడిన ఆక్టేవియా పాజ్ మెక్సికో దేశస్థుడు. కవి, రచయిత, తత్వవేత్త, దౌత్యవేత్త అయిన పాజ్ ప్రపంచ సాహితిలో చెరగని ముద్ర.1914 మార్చిలో మెక్సికో సిటీలో రాజకీయ నేపధ్య కుటుంబంలో జన్మించారు. పాజ్ తండ్రి ఎమిలియానో జపాటా వద్ద సహాయకునిగా పనిచేశాడు. జపాటా ఓటమి, హత్య తర్వాత పాజ్ కుటుంబం అమెరికాకు పారిపోయి తలదాచుకొని కొన్నాళ్ళ తర్వాత స్వదేశానికొచ్చింది. చిన్నప్పుడే తాతగారి దగ్గరున్న గ్రంథాలయంలో ఆయనకి పుస్తకాలతో, సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. అక్కడే మెక్సికన్, యూరోపియన్ సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకున్నారు. కొన్నాళ్ళకి లా చదివాడు కానీ డిగ్రీ తీసుకోలేదు. తొలుత లిదశలో జర్నలిస్టుగా, సాహిత్య పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. ఫాసిస్టు వ్యతికరేక రచయితల కూటమిలో చేరి, ‘టాలర్’ అనే పత్రికను స్థాపించి నడిపారు. ఈ పత్రిక ద్వారా మెక్సికోలో ఎందరో నూతన రచయితలను ప్రోత్సహించారు.

చిన్నతనంలోనే నెరుడా ప్రోత్సాహంతో కవితా రచన ప్రారంభించి, జీవితకాలంలో వివిధ ప్రక్రియల్లో అసంఖ్యాకంగా రచనలు చేశారు. తన పదిహేడోయేట తొలి కవితా సంపుటి “వైల్డ్ మూన్” ప్రచురితమైంది.

పాజ్ తొలినాళ్ళలో మార్క్సిజం, తర్వాత సర్రియలిస్టు కవి ఆంద్రే బ్రిటన్ ప్రభావంతో అధివాస్తవికత, ఆస్తిత్వవాద ప్రయోగాలు చేశారు. తదనంతర కాలంలో హిందూ, బౌద్ధ ఫిలాసఫీ పట్ల ఆకర్షితుడయ్యారు. రాఫెల్అల్బెర్టి, పాబ్లోనెరుడా, సీజర్ వాలెహో, లూయీస్ బోర్జెస్, ఆల్బర్ట్ కాముస్ తదితర లెజెండరీ రచయితలు ఆయనకి సన్నిహిత మిత్రులు.

1962లో భారతదేశానికి మెక్సికో రాయబారిగా నియమితులు కావడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇండియాలో నివసించిన (1962-68) కాలం వ్యక్తిగతంగానూ, రచయితగానూ తనకు గొప్ప మేలు చేసిందని పాజ్ పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఈకాలం కవిగా, వ్యక్తిగా ఎదగడానికి ఊతమిచ్చిన దశగా అభిప్రాయపడ్డారు. ‘ది గ్రమేరియన్ మంకీ’, ‘ఈస్టర్న్ స్లోప్’, ‘ఇన్ ద లైట్ ఆఫ్ ఇండియా’ తదితర రచనలన్నీ పాజ్ ఇండియాలో ఉన్నప్పుడు చేసినవే. ఆయన 1968లో మెక్సికోలో ఒలంపిక్ క్రీడల నిర్వహణకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై మారణకాండకు పాల్పడిన ప్రభుత్వచర్యకు నిరసనగా రాయబారి పదవి నుంచి వైదొలిగారు. అనంతరం సాహిత్య, పరిశోధన రంగాలే సర్వస్వంగా సాగారు.

సాహిత్యం, కళలు, రాజకీయాలు, చరిత్ర, శృంగారం, పెయింటింగ్ వంటి విభాగాల్లో పలు విమర్శ గ్రంథాలు రాశారు. ‘హెడ్స్ ఆర్ టేల్స్?’, ‘ఫ్రీడం ఆన్ పెరోల్’, ‘సన్ స్టోన్’, ‘సాలమందర్’, ‘ఈస్ట్ స్లోప్’ కవిత్వసంపుటాలు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టాయి. సాహిత్యంలో అనేక అంతర్జాతీయ అవార్డులు పొందారు. జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి బహుమతి, మెక్సికో జాతీయ అవార్డు, న్యూస్టడ్, జెరూసలేం బహుమతి, ఇటలీ ప్రీమియో మోన్డెలో, ఆల్ఫెన్సోరియెస్, మిగుల్ డి.సెర్వెంటిస్ అవార్డు, గోల్డ్ఈగల్, అలెక్సిస్ డి.టోక్వెవిల్లి పురస్కారాలు పాజ్ కీర్తికిరీటాల్లో ప్రధానమైనవి.

1990లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. మెక్సికో దేశం నుంచి నోబెల్ పొందిన ఏకైక రచయితగా ఆయన రికార్డు సాధించారు. పాజ్ తమ జీవితకాలంలో ముప్పయి కవితా సంకలనాలు, పాతిక వ్యాస సంకలనాలు వెలువరించారు. వీటిల్లో ఎక్కువ గ్రంథాలు ప్రపంచభాషల్లోకి వెళ్ళాయి. డజనుకుపైగా వర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.

పాజ్ సుదీర్ఘ సృజన కాలంలో కేవలం రెండే చిన్న కథలు రాయడం విచిత్రమే. కళాఖండాలు అనదగ్గ వీటిల్లో ఒకటి “మై లైఫ్ విత్ ది వేవ్” కాగా, రెండవదైన “ది బ్లూ బొకే” కథకు ఇది తెలుగు అనువాదం.

Exit mobile version