[‘నీడ’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం – హేమా పట్టణశెట్టి.]
అమ్మ దుప్పటి జరిపి నన్ను లేపినప్పుడు ఉదయం 6:00 అయిందని అర్థం. మెలకువ వచ్చినప్పటికీ ‘ఆఁ’, ‘ఊఁ’ అంటూ ఒంటినిండా దుప్పటి లాక్కుని కళ్ళు మూసుకుని పక్కకు తిరుగుతూ ఉండటంలోనే ఎంతో హాయి! భావాలు కూడా వెచ్చబడుతాయి.
కలలోని అతను పక్కనే ఉన్నట్లు.. అమ్మ కల అయినట్లు.. ఏదో అయోమయం; అయినా స్పష్టం. అన్నీ అనుభవిస్తున్నప్పుడే అమ్మ మళ్ళీ పిలుస్తుంది.
గబుక్కున లేచి రూము నుంచి వస్తుండగా నాన్న మాటలు. కాదు, తిట్లు. తొందరగా లేవటం గురించి ఒక లెక్చర్. సరే, అన్నిటినీ వినీవిననట్లు తెల్లవారుజామున నా పనులు, ఇంటి పనులు కొన్ని తీర్చుకొని మళ్ళీ రూముకు వస్తే నాటకంలోని ఒక అంకం ముగించి గ్రీన్ రూమ్‌కు వచ్చినట్టు అనిపిస్తుంది.
ఏదైనా చదవాలనుకున్నప్పుడు అతను గుర్తుకొచ్చి, ఇప్పుడు ఈ సమయంలో అతను కూడా ఒక అంకం ముగించి ఉండొచ్చని, అనుకొని ఇద్దరమూ ఒకే నాటకం చేయడానికి వస్తుండగా.. నా ఆలోచన ఎక్కడో దారి తప్పడం తెలిసింది.
మేమిద్దరం కలిసి చేసింది నాటకమెలా అయింది..?
– ఇలా అధికాధికంగా పిచ్చిపిచ్చిగా ఆలోచించడమంటే ఉసిరికాయ తిని నీరు తాగినట్టే.
దుప్పటి మడిచిపెట్టి, నిన్న రాత్రి అతనికి రాసిన ఉత్తరాన్ని పరుపు కింది నుంచి తీసి, అంతా సరిగ్గా ఉందా లేదా అని పరీక్షించి, ఎవరి చేతికి దొరకలేదని నిర్ధారణ చేసుకొని నోటుబుక్కులో పెట్టాను.
అమ్మ స్నానం చేయమని అక్కకు చెబుతుండడం వినిపించింది. ఇక ప్రతిరోజులాగే నేనూ ఆమె నుంచి చెప్పించుకుని ఆలస్యం చేసి తిట్టించుకోకూడదని బట్టలు తీసుకొని స్నానాల గదిలో దూరితే ఏదో సంతృప్తి! నెమ్మదిగా ఒక్కొక్క చెంబు నీళ్ళు పోసుకొని ఆ అనుభూతిని అనుభవిస్తుంటే అదే ఆనందం. బకెట్లో నీళ్ళు అయిపోయినప్పుడు మాత్రమే విసుగు, ఇక బట్టలు వేసుకోవాలి కదా – అని!
“ఏమిటే, మూడు గంటలు స్నానం చేయడం. హడావుడి, తొందర అన్నది వినొద్దు. ఇలా అయితే రేపు అత్తగారి ఇంట్లో బాగా అనుభవించాల్సి వస్తుంది”- అని కాన్పుకు వచ్చిన అక్క అంది.
ఆమె మాటలకన్నా ఆమె పొట్ట వైపు చూడడం నా లక్ష్యం అయినప్పటికీ, ఆరోజు రాద్ధాంతం చేయడానికి మనస్కరించక వంటింట్లోకి వెళ్ళాను. గడియారం పది గంటలు కొట్టడం వినిపిస్తుంది. మరో గంటలో కాలేజీలో ఉండాలి.
గబగబా తినేటప్పుడు, “ఎంతసేపు అలా నగ్నంగా ఉండటం.. అసహ్యం” నా హడావుడి స్నానాన్ని గురించి అంటూ, ఆమె మూతి విరచడం గుర్తుకొచ్చి నవ్వొచ్చింది.
అతనికి నచ్చిన నెమిలి రంగు చీర కట్టుకోవాలని చేతిలోకి తీసుకున్నాను. అందులో అందంగా కనిపిస్తానని అక్క చెప్పినప్పుడు అమ్మ కోపంతో చిటపటలాడటం గుర్తుకొచ్చి, అమ్మ చెప్పినట్టే తెల్లచీర కట్టుకున్నాను.
***
క్లాస్‌కు రాగానే “ఈరోజు సార్ లీవ్ పెట్టారండి” అని పళ్ళికిలించినవాడి మీద కోపం వచ్చంది. అతను నాకే చెప్పినప్పటికీ నా పక్కన ఉన్న అమ్మాయి “థాంక్స్” అంది. అసభ్యంగా అనిపించింది – కుర్రవాడు చెప్పినందుకో- పళ్ళికిలించినందుకో – ఆమె జవాబు ఇచ్చినందుకో- అర్థం కాదు.
ఏం చేయాలి? లైబ్రరీకి వెళితే కనీసం అతన్ని కలవచ్చని వెళ్ళాను. అతను కనిపించలేదు. అతనే రాసిచ్చిన టైం టేబుల్ తీసి చూశాను. పన్నెండు గంటలకు క్లాసు ఉంది.
ఇక లేడీస్ రూముకు వెళ్లడానికి విసుగేసింది. అక్కడ కేవలం, చీరలు, గాజులు, చెప్పుల విషయాలు. ప్రతి ఒక్కదాని క్వాలిటీ, రేటు చెప్పటంలో అలసిపోతాం. బ్యాడ్మింటన్ హాల్‌కైనా వెళ్ళాలి. చాలా రోజుల నుంచీ వెళ్ళలేదు. ఎలాగూ ఇప్పుడు ‘లేడీస్ టైం’ అని వెళ్ళాను. ఒక్క అమ్మాయి కూడా అక్కడ ఉండదు.
ఎవరో అబ్బాయిలు ఆడుతున్నారు. గేమ్ పూర్తవుతుంది. ఇక నేను బయటికి రావాలి. అంతలో ఒకడు రాకెట్ నా వైపు చాపి “ఆడతారా?” అని కళ్ళు విప్పార్చుకొని చూస్తాడు.
‘లేదు’ అని అరిచి రాకెట్ లాక్కొని అతని ముఖాన్ని బాదాలని అనిపిస్తుంది. అయితే మౌనంగా చేయి ముందుకు చాపాను.
“బెట్ గేమ్! బెట్ గేమ్!”
నలుగురైదుగురు కుర్రవాళ్ళు కేకలు వేస్తారు. నెట్‌కు అవతల ఉన్నవాడు దగ్గరికి వచ్చి “బెట్ గేమా?” అని అడిగాడు.
నేను “ఊహూఁ” అనటంలో, నా పార్టనర్ “అవునండి, ఎస్.కే.టి” అని అనటం వినిపించనే లేదు.
ఆట మొదలైంది. నా మొదటి సర్వీసెస్ తప్పింది. ఎవడో ‘సర్వీస్’ అని వదురుతాడు. కోపంతో గట్టిగా రాకెట్ విసిరి షాట్ కొట్టాను. ‘సర్వీస్’ అని అరిచి అవమానించడానికి ప్రయత్నించినవాడిని షటిల్‌గా మార్చుకొని కొట్టినట్టు – సంతోషం వేస్తుంది.
‘బెస్ట్ ఆఫ్ త్రీ’ వల్ల ఆట మాదైంది. రాకెట్ పెట్టి పుస్తకాలు తీసుకొని బయలుదేరాను.
“ఏమండి, ఎస్.కే.టీ.కి రారేమండి?”
“మీరు రాకపోతే ఎలాగండి?”
“ఎందుకండి పార్ట్‌నర్, రారేమండి?”
ఇక చెయ్యి పట్టుకుని లాగుతారేమో అనిపించి, ‘పార్ట్‌నర్’ అనే శబ్దం ముళ్ళుగా గుచ్చుకొని, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందని అనిపించింది. ఈ కుర్రవాళ్ళతో ఆడటమే తప్పు.. అనిపించింది. మౌనంగా వాళ్ళతో పాటు అడుగులు వేశాను.
ఒళ్ళంతా చెమటలు.. అతను పక్కనుండాల్సింది.
నా క్లాస్ అమ్మాయిలు ఎదురుపడతారు. చూసి చూడనట్టు వెళతారు. నేను కుర్రవాళ్ళతో వెళుతున్నందుకే అన్నది అర్థమై వారి అనవసరమైన ప్రవర్తన విచిత్రం అనిపించింది.
చాయ్ తాగేటప్పుడు మాట్లాడుతూ, ‘స్వాములోళ్ళు’ అని నన్ను సంబోధించినవాడిని ఆపి –
“మేము ‘స్వాములోళ్ళ’ మని మీకు ఎవరు చెప్పారు?”
“మరి మీ ఫ్యామిలీ పేరు చివర మఠ్స్ అని ఉంది కదా”
– ఎలా పట్టుకున్నానో చూడు అనేలా పక్కనున్నవాడిని చూశాడు.
“అవును, అది నన్ను పెంచినవారి ఇంటి పేరు.. అయితే నేను వారి కూతుర్ని కాను. కనీసం వారి కులానికి చెందినదాన్ని కాను”
– నా మాటలు స్పష్టంగా, తడబడకుండా వచ్చాయి.
అందరూ తెల్లబోతూ నా వైపు చూశారు. నాకు నవ్వొచ్చింది. సంతోషమూ వేసింది.
“సారీ, మీకు చెడ్డగా అనిపించిందేమో?” అని అన్నాడు.
వాడి పాడు ముఖం చూడలేక నవ్వేశాను. వాళ్ళందరి ముఖాలపై మరింతగా మూర్ఖత్వం పరుచుకుంది.
“మీరు వచ్చినందుకు థాంక్స్ అండి”
“నేనే చెప్పాల్సింది”
– అంటూ వాచీ చూశాను. పన్నెండు ముప్పయి. ఇంగ్లీష్ క్లాస్ అయితే తప్పింది. ఇప్పుడేం చేయాలి? ఆఁ! పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌ను కలవాలి. మొన్నటి డిబేట్‌కు పాయింట్స్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాలి.
***
డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళగానే, “ఓ! హలో రండి రండి.. మీ డిబేట్ రిజల్ట్ నిన్ననే తెలిసింది..”
-ఒకే గుక్కలో ప్రొఫెసర్ గారి మాటలు.
“మీకు థాంక్స్ చెప్పడానికి వచ్చాను. పోయినసారి ప్రైజ్ వచ్చిన దానికన్నా ఇప్పుడు బాగా మాట్లాడానని నాకు అనిపించింది..”
“ఓహ్, దట్ ఇస్ గుడ్. వాట్ యు ఫీల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్”
ఏమి చెప్పాలో తోచక, వెంటనే బయటికి రావటం సరైనదని అనిపించి, అక్కడే గోడకు వేసిన గత సంవత్సరపు గ్రూప్ ఫోటో చూస్తూ నిల్చున్నాను.
“అన్నట్లు మీరు అథ్లెటిక్స్‌లోనూ పార్టిసిపేట్ చేశారు కదా? ఏమిటది, హర్డిల్స్‌లో కదా, మీరు ఫస్ట్ వచ్చింది.. నేను చూశాను. యూ ఆర్ లుకింగ్ స్మార్ట్ ఇన్ షార్ట్స్..”
నోట్లోని దంతాలన్నీ కనిపిస్తాయి. ఇతనికి జ్ఞానదంతమే రాలేదే? వచ్చింటే ఏదైవుండాలి?
– గుర్తించడానికి చూశాను. అసహ్యం వేస్తుంది. నా ముఖంలో ఆ భావం కనిపిస్తుందని మళ్ళీ ఫోటో చూడటంలో లేని తన్మయత్వాన్ని లాక్కొని వచ్చాను.
ఇలా కాంప్లిమెంట్స్ విన్నప్పుడు మిగతా అమ్మాయిల్లా ‘థాంక్స్’ చెప్పటానికి, చిరునవ్వు నవ్వటానికి నాకు రాదు? ఎందుకు? ఎందుకు చెప్పకూడదు?
“వెళ్తాను సార్” చిన్న అమ్మాయిలా చెప్పాను.
“ఇప్పుడు క్లాస్ ఉందా? ఆఁ మళ్ళీ వస్తుండండి.. మీరు రావటానికి డిబేటే ఉండాలనేమీ లేదు.. హి..హి.. అన్నట్టు ఇంకేమైనా స్పెషల్?”
పిచ్చితనం మితిమీరిందనిపించింది. అతని వయస్సును అంచనా వేశాను. యాభైకి దగ్గర ఉండాలి. చెంప చెళ్ళుమనిపించి అతని పొజిషను, స్టేటస్ గురించి తెలియజెప్పాలని అనిపించింది.
అయినా.. “నథింగ్ సార్” అని సభ్యతగల అమ్మాయిలా మౌనంగా బయటికి వచ్చాను.
మొన్న ఈ ప్రొఫెసర్ దగ్గరికి నేను వెళ్ళినట్టు తెలిసి ఆ అమ్మాయిలు “ఆ లొడంగ్ బుడంగ్ మాస్టర్ దగ్గరికి?” అని నవ్వటం, నాకేమీ అర్థం కాక నేను ఆ అమ్మాయిల పట్ల విసుగుపడిన దానికి కారణం ఇప్పుడు తెలిసింది.
“పార్టీ.. నిన్న ఎంత బాగా దూకారు కదా”
“ఏయ్, ఆమెనెందుకు నమ్ముతావు, అలా ఎగురుతూ పోయేది ఆమెనే”
ధ్వని వచ్చిన వైపు కోపంగా చూడాలని అనిపించినా నిండుగా కొంగు కప్పుకోవటం నిర్ధారించుకొని ముందుకు నడిచాను.
***
సైకాలజీ క్లాస్‌కు మిగిలిన ముగ్గురు అమ్మాయిలు రాలేదని తెలిసినప్పుడు హాయిగా అనిపించింది.
ఫ్రాయిడ్ లిబిడో కాంప్లెక్స్!.. విచిత్రం. ఈడిపస్ తన తల్లినే వివాహం చేసుకున్నాడట, ఆమెతో పడుకున్నాడట, అలాంటి అసహజమనిపించే సహజ ఉహనే ఈడిపస్ కాంప్లెక్స్. చిన్నపిల్లవాడు తల్లి చంటి పాలు తాగేటప్పుడు కూడా ఈ కాంప్లెక్స్ ప్రభావం ఉంటుందట!
ఇక ఇలెక్ట్రా తన తండ్రితో తన సంసారం చేసింది. దాన్నే ఇలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. కూతురు తండ్రి తొడ ఎక్కడం, అతనితో తిరగడం, కాలం గడపడం అతిగా కోరుకోవటానికే ఈ కాంప్లెక్స్ కారణమట!
ఎంతటి సిగ్గుమాలిన వాదం! పాడు మనిషి, అన్నిటికి సెక్స్‌నే ముందుకు తెస్తాడు ఈ ఫ్రాయిడ్. ఏ స్వప్నం చూసినా దానికి అసంతృప్తమైన సెక్స్ మూలమట!
‘కల’ అనగానే గుర్తుకొచ్చింది. మొన్న అతను ఏమి చెప్పాడు..
“నువ్వు ఇప్పుడు రెండు మూడు రోజులుగా నిరంతరం నా కలలో వచ్చి ఏమేమో చేశావో ఎలా చెప్పాలి? దాన్నంత ప్రాక్టికల్‌గా చేసి చూపించాల్సిందే?”
ఏమేమి చేశారు.. కావాలి.. నేను?
..గట్టిగా కౌగిలించుకొని ఉండాలి.. తల ముందరి భాగాన్ని నిమిరివుండాలి.. నుదురును, కళ్ళను చుంబించి ఉండాలి.. పెదవులను..? నా ఎదకు.. ఊఁ.. నడుము చుట్టి పట్టుకొని వుండాలి ఛీ! నేనెంత దిగజారుతున్నాను కదా. అసహ్యం.. ఇలా ఆలోచించకూడదు.
ఫ్రాయిడ్ చెప్పిన దాంట్లో కొన్నిసార్లు లోతైన అర్థం కనిపిస్తుంది. అవును, ఇదంతా అనివార్యమేమో. దాహం వేసినప్పుడు నీళ్లు తాగేలా, ఆకలి వేసినప్పుడు ఆహారం తినేలా, పరీక్ష ఉన్న రోజే ప్రశ్నాపత్రాలకు జవాబులు రాసేలా, దేహం కోరినప్పుడే, సాధ్యమైనప్పుడు, సాధ్యం చేసుకొని దాని ఆకలిని తీర్చాలి.
మొన్న ‘ద హిస్టరీ ఆఫ్ సెక్సువల్ కస్టమ్స్’ పుస్తకాన్ని మరిచిపోయి నాన్న టేబుల్ మీద పెట్టాను. దాన్ని చూసిన నాన్న ఎంతగా తిట్టాడో. ఇష్టం వచ్చినట్లు పాడు మాటలన్నీ వాడాడు. నా స్నేహితులు వాత్సాయన కామ సూత్రాలు, ప్రేమ శాస్త్రం మొదలైనవన్నీ దొంగతనంగా చదవడం తెలిస్తే నాన్న నన్ను కాలేజీ మానిపిస్తాడు.
వీళ్ళంతా దానికి ఇంతగా ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారో తెలియదు. లేత వయసును దాటిన నేను కూడా వాటన్నిటినీ అర్థం చేసుకోవడం తప్పా? మనశ్శరీరాలు పెరిగినట్టల్లా కోరికలు పెరుగుతాయి, అలా అనిపించడం సహజం. లేకపోతే అది లోపం. మరి దానికి ఉపచారం కావాలి. ఇదంతా తెలిసేలా చెప్పాలి, ఎలా?
అందరూ మనఃశాస్త్రాన్ని చదవాలనే నియమం ఉంటే ఎంత బాగుండేది!
కుర్రవాళ్ళంతా నవ్వడంతో ఎందుకో అర్థంకాక కలవరపడతాను. కుదటపడటానికి ఒక నిమిషం అవసరమవుతుంది.
అసందర్భంగా, అకారణంగా, నవ్య సాహిత్యాన్ని తెగడి, నవ్యసాహితీపరులకు ప్రేమ, కామం, నగ్నత్వం, మట్టి వాసన ఇవి తప్ప రాయటానికి వేరే ఏమీ లేవని ఆరోపించే ప్రొఫెసర్ల ధోరణి చప్పున ఆగిపోయి, ఒక్కసారిగా నెమ్మదిగా, నాలుక కరుచుకున్నట్టు చేసి,
“ఓ! హియర్ ఇస్ హీరేమఠ్. షి మే ఫీల్ బ్యాడ్, ఇఫ్ ఐ సే సో” అంటారు.
వినోదంగా అనిపిస్తుంది. నేను నవ్య సాహిత్యానికి భక్తురాలిని అనేలా వీళ్ళు మాట్లాడడానికి కారణమేమో! వీళ్ళు ఇలాగే.. సమస్త సంతోషానికి, వికారానికి, కామాన్నే ముఖ్యంగా చేసి, మూలం అనిపించి విశ్లేషించే ఫ్రాయిడ్ ‘కామాన్నే’ భూతద్దంలో చూసి, వివరించి వర్ణించే వీళ్ళ తీరుకు ఆశ్చర్యం అనిపిస్తుంది, జాలి వేస్తుంది.
గంట కొట్టడం విని ఊపిరి తీసుకోవటం సులభమైనట్టు అనిపిస్తుంది. పుస్తకాలను గుండెలకు హత్తుకొని లేస్తుండగా పక్కన వచ్చి నిలుచున్న కుర్రవాడు –
“ఈ రోజు మీరు చాలా మూడీగా క్లాస్‌లో ఉన్నారు కదా. అయన ఆ ఏమీ కానట్టు కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని చూడండి, మీ చిత్రాన్ని గీశాను..”
అతను ఎదురుగా పెట్టిన నోట్‌బుక్ చూశాను. అవును నేనే! అందంగా ఉందనిపించింది. ఆ కుర్రవాడి వైపు చూశాను. పళ్ళికిలించాడు. అతడి ఒక్కొక్క దంతాన్ని పీకి చేతిలో పెట్టి, ‘క్లాసులో చేసే పని ఇది కాదు’ అని బుద్ధి చెప్పాలనిపిస్తుంది. అయితే చెప్పను.
మరోసారి చిత్రాన్ని చూసి, ‘బాగా గీశారు అయితే క్లాసులో ఇలాంటివన్నీ చేయకూడదు కదా” అని చెప్పి, అతను మాట్లాడడానికి నోరు తెరవడానికి ముందే బయటికి వచ్చేసాను.
***
సంస్కృతం క్లాసులో ఒక కుర్రవాడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక మేడం తడబడటం చూసి నవ్వొచ్చింది. నేనూ లెక్చరర్ కావాలి. ఎలాంటి ప్రశ్న అయినప్పటికీ జవాబు ఇచ్చి, మళ్లీ నేనే ప్రశ్న అడిగి కుర్రవాళ్ళను ‘బెబ్బెబె’ అనేలా చేయాలని అనిపిస్తుంది.
శకుంతల.. వాసవదత్త.. మాళవిక.. చంద్రముఖి.. కమల ముఖులు.. దొండకాయలాంటి పెదవులు, సంపెంగలాంటి ముక్కు, చంచలమైన నేత్రాలు, ఇంద్రధనస్సులాంటి కనుబొమ్మలు, కుంభకుచద్వయాలు, సఘన జఘనం, ఒకటా రెండా.. అసహ్యం వేస్తుంది.
పక్కనున్న అమ్మాయిలు నోట్ బుక్‌లో మేడం గురించి విమర్సిస్తూ రాసి ఒకరికొకరు ఇచ్చుకుంటుంటారు. అది చూసి విసిగేస్తుంది.
***
బయటికి వచ్చినప్పుడు అతను క్లాస్ ముగించి బయటకు వస్తుండటం కనిపించింది.
అతన్ని చూపించి ఒక అమ్మాయి –
“అదిగో ఆయన చూడండి, మా అన్న ఫ్రెండ్. చాలా తెలివైనవారు. చాలా చక్కగా మాట్లాడుతారు, నాకు బాగా నచ్చుతారు..”
సిగ్గులేనిది! నాకు కోపం వస్తుంది. అయినా మౌనంగా ఉంటాను.
గేట్ దగ్గర వచ్చిన అతను, “చాయ్ తాగి వెళ్దామా, నీకు ఆలస్యం అవుతుందా?”
“నేను ఎన్నిసార్లు చెప్పాను, ఈ ప్రశ్న అడగద్దని”
“అలా కాదు, ఇంట్లో అనవసరంగా లేనిపోని గొడవ జరగకూడదు కదా”
అతని శ్రద్ధ, అవగాహన, సామాజిక ప్రజ్ఞ, బాధ్యతల పట్ల నాకు లోలోపల సంతోషం వేసినా ముఖంలో విసుగు తొంగి చూస్తుంది.
చాయ్ తాగి అతను మళ్లీ కాలేజీకి వెళ్తున్నట్టు చెప్పి వెళ్లి వెళ్ళగానే నేను ఒక్కదాన్నే బస్ స్టాప్ వచ్చి నిలుచున్నాను.
ఉరుము.. మెరుపు.. వర్షం రావడం కచ్చితం.
“ఒక పీరియడ్ తప్పినా ఫర్వాలేదు, తొందరగా రా, సాయంత్రం వర్షం చెప్పిరాదు”
– అని అమ్మ చెప్పింది గుర్తొస్తుండగా వర్షపు చినుకులు రావడం మొదలైంది. పూర్తిగా తడిచిపోయాను. తడిచిపోయినప్పుడల్లా ఎలాగో ఎలాగో అనిపిస్తుంది. అతను తోడుగా ఉండాల్సింది. ఏదైనా జరిగివుండాల్సింది.
బట్టలన్నీ ఒంటికి అంటుకునేంతలో ఆకాశం శుభ్రమవుతుంది.
అతను తన మిత్రులతో ఇంటికి బయలుదేరడం చూసి ఒక్కసారిగా నా దుస్తులన్నీ ఆరిపోయినట్టు అనిపిస్తుంది.
దూరం బస్సు రావటం కనిపించింది. డోర్ దగ్గర కుర్రవాళ్ళు వేలాడుతున్నారు. మొత్తానికి నేను ఎలాగో లోపలికి దూరాను. మధ్యలో బ్రేక్ వేసినప్పుడు వెనుక నిలుచున్నవాడు కావాలనే నా మీద పడ్డారు. పైగా ‘సారీ’ అని నోరంతా తెరిచి నవ్వుతాడు. పక్కనున్న అమ్మాయిలు ముసిముసిగా నవ్వి నోటికి కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు.
భుజం నొప్పెడుతుంది. ఆ కుర్రవాడిని వదిలి ఈ అమ్మాయిని చీల్చి తినాలన్నంత రోషం వస్తుంది. ఏమీ కాలేదు అన్నట్టు మౌనంగా నిలబడతాను.
***
“నీకు ఎన్ని సార్లు చెప్పాలి? రోజు ఇదే పాట అయింది. ఇంకెప్పుడు నువ్వు నా మాటలు వినడం నేర్చుకుంటావు.. పెళ్లి అయ్యింటే ఇప్పటికి..” అమ్మ తర్వాతి మాటలు వినిపించనప్పటికీ అది ఏమిటో నాకు తెలుస్తుంది. ప్రతిసారి పెళ్లి విషయంలో నేను కోప్పడను. ఆమె కలవరం పట్ల జాలి వేస్తుంది.
అవును, ఇక మీద అన్ని వదిలి కేవలం ఈమే మాట వినాలి. అంతా అబద్ధం, అమ్మ మాత్రమే నిజం!
బట్టలు మార్చుకుంటుండగా అమ్మ తెచ్చిన చాయ్ రుచి చూశాను. పోయిన వారం చూడటానికి వచ్చినవాడికి నేను నచ్చానని అమ్మ చెప్పింది. నోరంతా చేదు, ఒక్కసారిగా అంతా వాంతి చేసుకోవాలనిపిస్తుంది.
పెరట్లోకి వెళ్ళాను. ఎక్కడ చూసినా నీళ్ళు. నా స్థలంలోకి వెళ్లి చెట్టు కాండాన్ని పట్టుకొని నిలబడ్డాను. అతని మాటలను నెమరు వేసుకుంటాను.. ఎన్నో ప్రశ్నలే జవాబులు కావడం మరింత అందం!
ఉత్తరంలోని వాక్యాలను తలుచుకొని అనుభూతి చెందుతాను. నిన్న రాత్రి అతనికి రాసిన ఉత్తరం నా నోట్‌బుక్‌లోనే ఉండిపోవటం చప్పున గుర్తొస్తుంది.
గబుక్కున నా రూమ్‌లోకి వచ్చి అన్ని నోట్‌బుక్‌లను తిరగేసి చివరికి ఒక దానిలో పెట్టిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాను. చదివాను.
ఎందుకో అమ్మ జ్ఞాపకం..
ఇకపై ఇలా రాయకూడదు. అతనితో కేవలం ఫ్రెండ్లీగా ఉండాలని అనుకున్నాను.
చేతిలోని ఉత్తరం చింపి గాలిలోకి విసిరాను.
చీకటి పడింది
లోపలికి వచ్చాను.
దేవుడి ముందు దీపం వెలిగించమని అమ్మ చెప్పింది.
కాళ్ళుచేతులు కడుక్కోవడానికి స్నానాలు గదికి వెళ్ళాను. మొదట్లో ఇదంతా వ్యతిరేకిస్తున్న నేను ఇప్పుడు దానికీ అర్థం కనిపించక పుల్ల గీరుతాను. ఏదో సంతోషం అనిపిస్తుంది.
నా గదికి వచ్చి లైట్ వేశాను. మళ్ళీ అతని జ్ఞాపకం.. అతను చెప్పాడు-
“ప్రతిరోజు లైట్ వేసేటప్పుడు, ఆర్పేటప్పుడు, పక్క మీద కూర్చున్నప్పుడు నిన్ను తలుచుకుంటాను. నువ్వు దీపం.. నువ్వు పక్క.. నువ్వు..”
అతను ఇంకా చాలా చెబుతాడు. నాకూ అతనిలా అన్నీ చెప్పడానికి వస్తే..
నెమ్మదిగా పక్కను సమీపిస్తున్నట్టే సహజమవుతాను.
చీకటిని అవుతాను.
దీపాన్ని అవుతాను.
కన్నడ మూలం: హేమా పట్టణశెట్టి
అనువాదం: రంగనాథ రామచంద్రరావు