[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన తెలికిచెర్ల విజయలక్ష్మి గారి ‘నీ తోడు ఎన్నడు వీడకు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
స్కూల్, ఆవరణంతా కోలాహలంగా ఉంది. సీనియర్ టీచర్స్ కోసం ముందు వరుసలు ఏర్పాటు చేశారు. వేదికపై, చక్కని స్వరంతో స్కూల్ వంద సంవత్సరాల చరిత్ర మైక్‌లో వినిపిస్తోంది
ఎవ్వరితోనూ సంబంధం లేనట్టు ముందు వరుసలో కూర్చున్నాడు రామం. అదే, స్కూల్లో చాలా సంవత్సరాలు టీచర్‌గా పని చేసి రిటైరైన అతనికి, ఇష్టం లేకున్నా.. సహ ఉద్యోగుల మాటను కాదనలేక, రాక తప్పలేదు.
“మాస్టారూ..!” అనే పిలుపుతో పరిచయం వున్నస్వరంలా వినిపిస్తుంటే పరికించి చూస్తూ..
“ఎవరూ..?” అన్నాడు.
“నేను, పద్మా టీచర్ని!” అంటూ నవ్వుతున్న ఆమెని చూస్తుంటే ఏదో అలజడి. ఏమనాలో అర్థంకాక మౌనంగా ఆమెనే చూస్తూ వుండిపోయాడు.
“మాస్టారూ, మీరు నన్ను మర్చిపోయారా?” అంది పద్మ.
“ఆ చిరునవ్వును ఎలా మరచిపోగలను!” అంటున్న రామం మాటలకు..
“ఉద్యోగ విరమణతో సమయం గడవక నేను రాసిన పుస్తకాలు ఇవి. వీలైనప్పుడు చదవండీ!” అంటూ రెండు పుస్తకాలను ఇచ్చింది పద్మ.
“తప్పకుండా చదువుతాను!” అన్నాడు రామం.
“చదవడం పూర్తి అయ్యాక, పుస్తకాలపై మీ అభిప్రాయం చెప్పాలి! పుస్తకంలోనే నా ఫోన్ నంబర్ వుంది!” అంటూ వెళుతున్న పద్మని చూస్తూ నిట్టూర్చిన మనసు, గతం వైపు పరుగులు తీసింది.
***
పదవతరగతి క్లాస్ రూమ్‌కి చేరుకున్న రామం, పద్య నియమాలు యతి, ప్రాసల గురించి అనర్గళంగా తెలుగు పాఠం చెప్తున్న యువతిని చూస్తూ నిలబడడ్డాడు. ఆమె బ్లాక్ బోర్డ్ మీద రాసి చెప్తుంటే.. పొడవాటి ఆమె జడ లయబద్ధంగా కదులుతోంది. అజంతా శిల్పంలా వున్న ఆమెనే తదేకంగా చూస్తూ.. ‘తెలుగు భాష అంత అందంగా వుంది. ఇంతకీ ఎవరీమే?’ అనుకుంటూ పాఠాన్ని వింటూ వుండి పోయాడు. మాస్టారుని చూసిన విద్యార్థులు..
“మేడం, సమయం అయిపోయింది. సర్ వచ్చేశారు!” అని ఆమెకు గుర్తు చేస్తే..
“అయ్యో, మన్నించండి! పాఠంలో లీనమైపోయాను!” అంటూ నొచ్చుకుంది. పరిచయాల అన్నంతరం, ఆమె కొత్తగా వచ్చిన తెలుగు టీచర్ అని తెలిసింది.
ఆమె గురించి ప్రిన్సిపల్ చెప్తూ చనువుగా..
“పద్మా టీచర్ మీవాళ్ళేనట. ఇద్దరూ టీచర్స్ అయితే ఆర్థికంగా జీవితం బాగుంటుంది. వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడమంటావా?” అనే మాటతో, తన పెళ్ళికై నాన్న పడే ఆరాటపడటం గుర్తువచ్చి..
“ముందు నాన్నగారికి ఒక్కమాట చెప్తాను. నాన్న సరే అంటే, అప్పుడు వాళ్ళతో మాట్లాడండీ!” అన్నాడు మొహమాటంగా.
ప్రిన్సిపల్ గారు, ఇరువైపులా తానే అయి పెళ్ళి మాటలు మొదలుపెట్టారు. మాటలు ముందుకి వెళ్లేయి. అన్నివిధాలా బాగుంది, ఇక జాతకాలు కలవడమే ఆలస్యం అనుకున్నారంతా!
పద్మ ఎదురైనప్పుడు, కనురెప్పలు చెప్పే ఊసులు, పెదవుల కదలికతో పలకరింపుల అనుభూతి కలుగుతుంటే మనసు అలజడికి లోనయ్యేది.
ఎప్పుడైనా పద్మతో మాట్లాడాలని అనిపించైనా.. ఏమైనా అనుకుంటుందేమో అనే మొహమాటంతో చిరునవ్వుతో సరిపెట్టుకునేవాడు.
జాతక ఫలితాల కోసం ఎదురుచూస్తూ స్కూల్ నించి ఇంటికి చేరుకున్నాడు రామం. కోవెల పంతులు గారితో కూర్చుని మాట్లాడుతున్న తండ్రిని చూసి.. ‘జాతకాల విషయమే అయి వుంటుంది!’ అనుకోగానే మనసు పరవళ్ళు తొక్కింది.
“రామూ..!” అంటూ తండ్రి పిలిచిన పిలుపుకు వెంటనే తండ్రి వద్దకు చేరుకుని..
“చెప్పండి నాన్నగారూ!” అన్నాడు సంతోషాన్ని కనబడనియ్యకుండా.
“అదే, ఆ టీచరు పద్మ జాతకంలో దోషాలు ఎక్కువగా వున్నాయట. ఆ సంబంధం, మనకు సరిబడదని మీ ప్రిన్సిపల్ కి చెప్పు!” అంటున్న తండ్రి మాటలతో ఎత్తైన కొండమీద నించి కిందకు పడిన భావన కలిగింది. కాసేపు నిశబ్దంగా ఉండిపోయిన రామం..
“మరొకసారి ఇంకెవరికైనా చూపిస్తే..!” అన్నాడు సంశయంగా.
“ముగ్గురికి చూపించేను. ముగ్గురూ వద్దనే చెప్పారు” అంటున్న తండ్రిని నిర్వికారంగా చూస్తూ చాలాసేపు వుండిపోయాడు.
***
గతం ఆలోచనల నించీ బయపడిన రామం, పుస్తకం మీద ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి..
“పద్మా, నాకొక సహాయం చేస్తావా?” అన్నాడు.
“చెప్పండి, మాస్టారూ..!” అంది పద్మ.
“నా జీవితాన్ని కథగా రాయగలవా?” అన్నాడు.
“తప్పకుండా! మీ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలని మెసేజ్ చెయ్యండి, రాస్తాను!” అంది.
“సరే, క్లుప్తంగా పంపిస్తాను!” అంటూ తల్లితండ్రులతో, భార్యతో తన అనుబంధం, జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల్ని మెసేజ్ రూపంలో పంపించి, ఫోన్ చేసి..
“ఈ కథకు, ముగింపు ‘ఎప్పుడు ఎలా చనిపోతాడో వేచి చూద్దాం!’ అంటూ పాఠకులకు వదలకుండా మంచి ముగింపు ఇవ్వండి!”
“మీరు, పంపిన సంఘటనలకు, మధ్యలో దవనం, మరువం చేర్చి అందమైన పువ్వుల మాలగా కూర్చి మంచి ముగింపుతో.. మీకు అందించటానికి ప్రయత్నిస్తాను!” అంటూ వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ ‘కథ ఎప్పుడు తన చేతికి వస్తుందా!’ అని ఎదురు చూస్తున్నాడు రామం.
సరిగ్గా, నెల తరువాత కొరియర్లో కొన్ని కాగితాలు వచ్చేయి. విప్పి, చదువుతుంటే.. అది, పద్మ రాసిన కథ అని అర్థమై.. కళ్ళు, అక్షరాల వెంట పరుగులు తీసాయి.
***
“అమ్మా, రేపు అన్నంతో పాటూ పకోడీ పెడితేనే స్కూల్‌కి వెళతాను!” అంటూ పుస్తకాలను ఒక మూలకు విసిరి కొట్టిన కొడుకుని..
“ఎందుకురా, అంత కోపంగా ఉన్నావు?” అంటూ బుజ్జగించటానికి ప్రయత్నించింది, జయ.
“ఒట్టి, ఆవకాయ మజ్జిగ అన్నంతో పంపించేస్తున్నావు. నా స్నేహితులు రోజూ కూరలు తెచ్చుకుంటారు. నువ్వు అస్సలు కూర చెయ్యడమే మానేశావు!” అంటూ ఏడుస్తున్న కొడుకుని ఓదార్చటానికి శక్తిలేకపోయినా, లేని ఓపిక తెచ్చుకుంటూ..
“రేపు, బంగాళాదుంపల వేపుడు చేసి పెడతాలే! అలకలు చాలించు!” అంటూ కొడుకుని బుజ్జగించిందా తల్లి.
ప్రాణం, ఎందుకో నీరసంగా ఉంటోంది జయకు. ఇంట్లో పనులు చెయ్యడం చాలా కష్టంగా ఉంది. భర్త, ఊళ్ళో వున్నా సహాయమేమీ ఉండదు.. మనిషి కనిపిస్తుంటే ధైర్యంగా అనిపిస్తుంది అంతే.
“సన్నగా అయిపోయావమ్మా!” అని పక్కింటి బామ్మగారు అంటూ ఉంటే..
“నీరసం, తప్ప అనారోగ్యం ఏమీ లేదు బామ్మగారూ!” అనడమైతే అన్నాది కానీ.. ఎందుకో మరి చేతులూ కాళ్ళూ విపరీతంగా పీకుతున్నాయని బాధపడుతూ..
“రామూ, కాళ్ళు తొక్కరా!” అని ఎప్పుడైనా బతిమాలితే..
“ఒక, రూపాయి ఇస్తే పడతాను!” అంటూ బేరంపెట్టి, డబ్బులు పుచ్చుకుని తుర్రున పారిపోతున్న కొడుకుని చూసి నవ్వుకునేదా తల్లి.
పిడికెడు, మెతుకులు లోపలకు పోవటంలేదు. చప్పటి, మజ్జిగ తాగినా వాంతి వచ్చినట్టే ఉంటోంది. ఒకసారి, మంచి డాక్టర్ కి చూపించుకోవాలి అనుకుంటూనే.. ఒకరోజు గుండె నొప్పితో.. విలవిలా కొట్టుకుని ప్రాణం వదిలింది జయ.
రామం, బాల్యావస్థ నించీ బయటపడక ముందే తల్లి చనిపోయింది. అతిముద్దుగా చూసే తల్లి ఒక్కసారిగా దూరమయ్యేసరికి, ఆ పసిప్రాణం తట్టుకోలేక పోయింది.
గంభీరంగా ఉండే నాన్నను చూస్తే భయం వేసేది. అమ్మ, గాజుల శబ్దం వినిపిస్తే బాగుండును. లయబద్ధంగా.. మోగే అమ్మకాలి మువ్వల శబ్దం మరి వినిపించదా? ఏదో గొంతుకు అడ్డం పడ్డట్టు బాధ, నిశబ్దంగా అయిపోయిన ఇల్లు భయంకరంగా అనిపిస్తోంది రామంకి.
“మీ వాడు, ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు!” అంటూ పక్కవాళ్లు పేపర్లో నంబర్ చూసి చెప్తే.. మౌనంగా తలాడించిన నాన్నతో సంతోషం ఎలా పంచుకోవాలి? అమ్మ వుంటే ఎంత బాగుండును అనుకుంటూ.. కాళ్ళల్లో తలపెట్టుకుని ఏడుస్తున్న కొడుకుని, దగ్గరకు తీసుకున్న నాన్న స్పర్శ కాస్త ఓదార్పుని ఇచ్చింది ఆ పసివాడికి.
కొడుకు ఒంటరితనం చూడలేక పేదింటి పిల్లని పెళ్ళి చేసుకున్నాడు రామం తండ్రి. ఏ విషయంలో కూడా చిన్న పొరపాటు కూడా రానిచ్చేది కాదు రామం పినతల్లి. తల్లితో గంటలు గంటలు కబుర్లు చెప్పే రామం, పిన్నితో అవసరానికి మించి ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయేవాడు. చదువు పూర్తి అయింది. లెక్కల మాస్టరుగా జాయినయ్యేడు.
ధర్మపత్ని, జానకి ప్రవేశంతో జీవితం రంగుల మయమైంది. సంగీతంమంటే జానకికి ప్రాణం. మాటలన్నీ పాటలుగా కూర్చి సందడి చేసేది. గంభీరంగా వుండే మావగారిని కూడా నవ్వించేది. రోజులు, సంతోషంగా గడుస్తున్నాయి. ఒక చిన్న ప్రాణం కోసం, అందరూ ఎదురు చూస్తున్నారు. మనవలని చూడకుండానే రామం తండ్రి కన్ను మూసాడు. తండ్రి చనిపోయిన కొద్దిరోజులకే పిన్ని కాలం చేసింది. రిటైర్ అయిన కొద్ది నెలలకే ధర్మపత్ని జానకి చనిపోవడంతో మరీ ఒంటరివాడయ్యాడు. టీవి చూసి విసుగు పుట్టేది. ఎక్కువ సమయం పార్క్‌లో గడపడానికి ఇష్టపడేవాడు.
ఆస్తిని, ఎవరికి ఇస్తాడో అని ఎదురు చూసే.. అయిన వాళ్ళున్నారు. ఒక్కడివే ఉన్నావు. ఏమైనా అవసరం పడితే కబురుచెయ్యమనే వాళ్ళు, కరువయ్యారు. తోచక, ఎవరి గుమ్మానికైనా వెళితే మొక్కుబడి పలకరింపులే కానీ.. ఆప్యాయత కరువైంది.
***
‘అదేంటీ, సగంలో ఆపేసింది. ఇంకా పూర్తికాలేదు కామోసు. ఇంతకీ ముగింపు ఎలా ఇస్తుందో?’ అనుకుంటూ గేట్ తీసుకుని లోపలకు వస్తున్న పద్మా టీచర్ ని ఆశ్చర్యంగా చూస్తుంటే..
“మీ కథకు ముగింపు, రాయాలని వచ్చాను!” అంటూ తనతోపాటు వచ్చిన అబ్బాయిని, కూర్చొమ్మని కుర్చీ చూపించింది.
ఆ అబ్బాయిని చూస్తూ..
“మీ మనవడా?” అన్నాడు.
“నా కొడుకు!” అంటున్న పద్మను చూస్తూ..
‘మరీ ఇంతాలస్యమా?’ అనుకున్నాడు.
“మీ కథ రాసిన విధానం నచ్చిందా?” అంటున్న పద్మ మాటలకు సంతోషంగా..
“ఇప్పుడే నువ్వు పంపిన కాగితాలు చదువుతూ ఉండిపోయాను. ముగింపు ఏం చేస్తావు?” అన్నాడు సందిగ్ధంగా.
“ముందు, నా కథ వినండి!” అంటున్న పద్మ మాటలు వినటానికి సిద్ధంగా కూర్చున్నాడు రామం.
“మనిద్దరికీ, పెళ్ళి చెయ్యాలనే ప్రిన్సిపల్ గారి ప్రయత్నం ఫలించలేదు. అమ్మాయి జాతకం బాగులేదంటూ చాలా సంబంధాలు వెనక్కిపోయాయి. ప్రతీసారీ ఇదేమాట వినాలంటే విసుగ్గా వుండేది. నా గురించి బెంగతో అమ్మా, నాన్న కాలం చేసారు. ఎవరి సానుభూతి ఇష్టంలేక దూరంగా ట్రాన్సఫర్ చేయించుకున్నాను.
రిటైర్ అయ్యేక, పిల్లల్ని పెంచుకుందామని అనాథాశ్రమానికి వెళ్ళేను. అక్కడ, ఆరోగ్యంగా ఉండే పిల్లలు తక్కువ. వికలాంగులే ఎక్కువగా ఉన్నారు. నాకెందుకో, ఒక వికలాంగుడైన పిల్లవాడికి మంచి జీవితం ఇస్తే.. బాగుండును అనిపించింది. ఇదిగో, వీడిని తెచ్చుకున్నాను. ఇప్పుడు పదేళ్ళవాడు. వీడికి మూగ చెవుడు. ఏం చెప్తానో అర్థమయ్యేది కాదు. లక్షరూపాయలు ఖర్చుపెట్టి మంచి హియరింగ్ ఎయిడ్ కొన్నాను. మాటలు విపిస్తుంటే అర్థం చేసుకుంటూ నాకు సహాయం చేస్తున్నాడు.
స్కూల్‌కి పంపిస్తున్నాను. అక్షరాలను రాయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పని నాకెంతో తృప్తినిచ్చింది.
మీకభ్యంతరం లేకపోతే నాదో చిన్న సలహా. ఒంటరిగా ఉన్నానని బాధపడే కన్నా.. ఏదైనా అవకరంతో బాధపడే ఒక పిల్లనో పిల్లడినో తెచ్చుకుని మంచి జీవితాన్ని ఇయ్యటానికి ప్రయత్నించండి. డబ్బు సమస్య ఎలాగూ లేదు. ఇదే, మీ కథకు నేను ఇయ్యాలనుకున్న ముగింపు. మీకు, నచ్చితే చెప్పండి సర్!” అంటున్న పద్మ ఉన్నతమైన సంస్కారానికి సంతోషిస్తూ..
“ఏకాకిని అంటూ కుమిలిపోతున్న సమయంలో మంచి సలహా ఇచ్చావు. ఒక దివ్యాంగుడైన బాలుడిని తీసుకువచ్చి మంచి జీవితం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా సంకల్పం మధ్యలో నాకేదైనా అనారోగ్యం సంభవిస్తే నీ సహాయం వుంటుందా?” అన్నాడు సంశయంగా.
“తప్పకుండా, నా సహాయం మీకు ఎప్పుడూ వుంటుంది!” అంటున్న పద్మ మాటలు వింటూ ఆ మానవ శిల్పాన్ని చూస్తూ వుండిపోయాడు రామం.