[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘నీ రాక.. నీ పోక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీవు వస్తావు
నా శూన్యతలో ఒక సందడిని
ఈ స్తబ్ధతలో ఒక చలనాన్ని తెస్తావు
అల్లరి పిల్లగాలిలాంటి నీరాక
ఎదిగి ఎదిగి ఝంఝామారుతమై
చిందరవందర చేస్తుంది
ఈ ఇంటినంతా.. నా ఒంటినంతా
ఎన్ని మాటల సెలయేళ్ళు
గలగలలతో ప్రవహించిపోతాయో
ఎన్ని నవ్వుల పువ్వులు
పరవశంతో పరిమళించిపోతాయో
క్షణాలు క్షణాలుగా
కాలం కరిగి కరిగి కనుమరుగవుతుంటే
వదలలేక వదలలేక నేనుంటే
వద్దు వద్దని నేనంటుంటే
నిర్దయగా నన్ను వదిలేసి
నీదారిన నీవు వెళతావు
కొన్ని అనుభూతులను నాకు ఇచ్చేసి
కొన్ని అనుభవాలను నీతో వెంటేసుకుని
నీ కౌగిలింతల్లో కరిగి నీరైన నేను
నీవులేని శూన్యతలో ఘనీభవిస్తున్నాను
నీ ముద్దు మురిపాలలో మునిగిపోయిన నేను
నిట్టూర్పుల వేడి ఆవిరుల్లో తేలిపోతున్నాను
ఇపుడంతా ఖాళీయే
ఈ గదితోపాటు, నా మది కూడా
చిందరవందరగా పడివున్న నీ జ్ఞాపకాలను
ఒకటొకటిగా ఏరుకుంటూ
మెల్లమెల్లగా సర్దుకుంటున్నాను
నా లోపల కూడా!.. నా వెలుపల కూడా!!
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.