[వాణిశ్రీ నైనాల గారు రచించిన ‘నీ నిఘంటువు చూడాలి..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
నువ్వు నాకెంతో..
నీకు చెప్పుకోవాలనుకునప్పుడల్లా
మాటరాని మౌనం
పెదవుల మాటున
మత్తుగా ఒత్తిగిలుతుంది..
ఒత్తిడి చిత్తడిలో
నా మాటల కత్తి ఏదో
సర్రున దూసుకొచ్చి
సరాసరి చెక్కుకట్టిన
నీ మునుపటి గాయంలో
దిగబడుతుంది..
నిన్ను పొందిన దివ్యానుభూతిని
నీ కళ్ళ ముందుంచాలనుకుంటాను
గుండెలోని ఊట
కన్నుల్లో కులుకుతున్నా
కనురెప్పల మాటునే
దాన్ని ఆపుతుంటా..
నాకు చేసిన వెలుతులేవో
కలత మడుల్లోంచీ వెతికితెచ్చి
నీ మనసు లోతుల్లో
మళ్ళీ మళ్ళీ నాటుతుంటా..
సాయంసంధ్య వెలుగులో
వెలిసిన సాదా చీరైనా
నిన్నల్లుకుని వెలిగిపోతుందన్న
నా గుండెలోని తీయని భావనను
వెలికి తీయలేను కానీ
పట్టుచీరకు కట్టుబానిసవనే
లోకోక్తి ఒరనించి
లోకువ బాకొకటి తేకువతో నూరుతాను..
ఏదో సాధించే కొద్దీ
ఏ లక్ష్యాల కోసమో తపించే కొద్దీ
అహంతో అద్వైతినైపోతాను..
పలుకాల్సినదేదో
పలుకులై పోతుంది..
నిగ్రహపర్వం బ్రద్దలై
నిప్పులపర్వతమౌతుంది..
నువ్వే బడిలో చేరావో!
ఏ పుస్తకాలు చదువుకున్నావో!
నా ఆగ్రహాలకు అనుగ్రహాలను
ఎలా సమీకరిస్తావో!
నీలా నేనూ నన్ను నిరూపించుకోవాలంటే
నీ నిఘంటువు ఒక్కసారైనా చూడాలి
మౌనాన్ని కూడా మమతగా మార్చే
పదాల భాష్యాలను పలుకరించాలి
నేనికనైనా..
మిగిలిన కొంచెం ఈ నన్నైనా
నిన్నుగా మార్చుకోవాలి..