Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీ నవ్వులో!..

[శ్రీ శిరిప్రసాద్ రచించిన ‘నీ నవ్వులో!..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

నువ్వు నవ్విన ప్రతిసారీ
నీలో కనిపిస్తుంది ఏదో కొత్తదనం!

ఓ సారి చందమామ
నా వైపు చూసి నవ్వినట్టు!

ఓ సారి సాయంత్ర తార
నా భుజాలపై వాలినట్టు!

ఓ సారి నీలాకాశం
నన్ను కౌగిలిలోకి తీసుకున్నట్టు!

ఓ సారి అందమైన ప్రకృతి
నన్ను చుట్టు ముట్టేసినట్టు!

ఓ సారి దూరపు కొండలు
నన్ను రమ్మంటున్నట్టు!

ఓ సారి కోకిల
నా చెవిలో ఏదో రాగం ఊదినట్టు!

ఓ సారి విసురైన జలపాతం
నన్ను నిలబెట్టి తడిపేసినట్టు!

ఓ సారి అందాల హరివిల్లు
నాకు గొడుగు పట్టినట్టు!

ఓ సారి మావి చిగురు
నాకు పులపుల్లని రుచి చూపినట్టు!

ఓ సారి నీ బుగ్గల్లాంటి యాపిళ్ళు
నా గొంతులోకి తియ్యదనాన్ని దించినట్టు!

ఓ సారి తుట్టెలో నించి
చిక్కటి తేనె జాలువారుతున్నట్టు!
నా చూపులకి సంకెళ్ళు వేస్తున్నట్టు!
నా హృదయాన్ని ముద్దాడుతున్నట్టు!
నన్ను నీలో ఐక్యం చేసుకుంటున్నట్టు!

Exit mobile version