[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘నీ లోపలి పిలగాడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చెరువుల నీళ్ళు చెరువెనుకబడ్డాయి
ఇది ఆఖరి అంకం
ఇదే చివరి రాగం
అని తలపోస్తున్ననీ లోపల
ఓ పిలగాడున్నాడు
భూమి పొరల్లో నీళ్ళ ప్రవాహమున్నట్టు
మబ్బు అంచుల్లో మంచు ముత్యాలున్నట్టు
విచ్చుకుంటున్న పువ్వులో సువాసన దాగున్నట్టు
నీ మనసు మడతల్లో వాడు కేరింతలు కొడుతున్నాడు
వాడిని చూడు
వాడితో ఒకసారి ఆడు
‘ఉంగా ఉంగా’ అంటూ
నీకు కొత్త భాషను నేర్పుతాడు
‘పాకుతూ అంబాడుతూ’
నీకు కొత్త నడక నేర్పుతాడు
తన బోసి పెదాలతో ముద్దులు పెడతాడు
లేత పాదాలతో గుండెలమీద తన్ని
నీ లోపల దాగున్న ప్రేమను తట్టి లేపుతాడు
చిలుక పలుకులతో
నీలో కొత్త కవితను పుట్టిస్తాడు
మిత్రమా!
నీ ముడుతలు పడ్డ ముఖాన్ని
అద్దంలో చూడటం మానేసి
నీ లోపలి పిలగాన్ని చూడు
చివరి క్షణాల్లోనూ
నీకు చిగురించాలనే ఆశ పుడుతుంది
కొత్తగా మొలకెత్తే సత్తువొస్తుంది
వాడే నీ లోపలి పిలగాడే
నవ్వుతూ నవ్విస్తూ
దారి చూపిస్తూ
‘తీరం’ చేరుస్తాడు
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత